"చెపుతా రండి. లోపలికి వెడదాం..." సరోజ ఆశ్చర్యపోతూ, సంశయిస్తూనే అతని వెంటనడిచింది. అతను కూర్చోమన్న చోట కూర్చుంది.
"మీరు ఈ ఉద్యోగం దొరకలేదని నిరాశపడకండి- నేను యింకేదన్నా ప్రయత్నించి వేయిస్తాను. అంతవరకు తొందరపడి వెళ్ళిపోకండి. నాకు తెల్సిన పెద్ద ఉద్యోగస్తులున్నారు. ఎక్కడోచోట ఆ మాత్రం దొరకకపోదు. కాస్త ఓపిక పట్టండి. నెలో రెండు నెలల్లో మీరక్కడికి వెళ్ళి ఏం చెయ్యగలరు. ఉద్యోగావకాశాలు యిలాంటి పట్టణాలలో వుంటాయిగాని అక్కడేం దొరుకుతాయి మీకు. యిక్కడ తప్పక ప్రయత్నిద్దాం. ఏదో ఒక ఉద్యోగముచూసే పూచి నాది. అంచేత మీరిప్పుడు ప్రయాణం ఉద్దేశం మానెయండి..."
"ఉండడానికి నాకేం అభ్యంతరం.....కాని అక్కడ అత్తయ్యవాళ్ళు నిరాధారంగా వున్నారు." నేవచ్చేనాటికి నూరు రూపాయలు కూడా లేవు వాళ్ళదగ్గిర - ఆ నూరు రూపాయలు ఎన్నాళ్ళు వస్తాయి నా ఉద్యోగం దొరికేవరకు వాళ్ళ గతి..."
"అదే చెప్పాలని పిలిచాను. రేపే వాళ్ళకి రెండు మూడు వందలు పంపించండి, ఆ డబ్బు నే నిస్తాను. మీరేం అడ్డు చెప్పకండి, మీకు ఉద్యోగం వచ్చాక కావలిస్తే ఆ డబ్బు యిచ్చేద్దురుగాని, అప్పుగా తీసుకోండి, ముందు వాళ్ళకి పంపండి. మీరు ప్రయాణం ఉద్దేశం విరమించుకోండి. ఉద్యోగం తప్పక దొరికేట్టు చేస్తాను నేను..."
"డాక్టరుగారూ, ఉదారతకి కూడా హద్దు వుండాలి. అర్ధ ముండాలి. మీ యీ సహృదయతకి, సహాయానికి నేను తగను. నేను మీకేం అవుతానని నామీద యింత దయ మీకు. పదిరోజుల క్రిందట ముక్కు మొహం ఎరగని మనిషిమీద యింత దయ చూపిస్తే అవతలి మనిషి యీ ఔదార్యాన్ని భరించగలదా! చెప్పండి నా మీద మీకుఎందుకింత జాలి నా బీదరికంమీద సానుభూతా!..."
"కాదు కాదు...మీరు తప్పు అర్ధం చేసుకున్నారు నన్ను...మీరేదో బీదవారు గొప్ప వాడినని కాదు-అలా అయితేలోకంలో ఎందరో మీకంటే బీదవాళ్ళున్నారు..." మీ మీద సానుభూతికంటే, నా స్వార్ధం ఎక్కువ వుంది యిందులో సరోజగారు."
"మీ స్వార్ధమా. నావల్ల మీకేం కావాలి... నేను నాలాంటివాళ్ళు మీకేం చెయ్యగలరు." సరోజ ఆ ఒక్క క్షణంలో ఏదో ఆలోచన తట్టి గాబరాపడ్తూ అంది.
"నాకేం చెయ్యక్కరలేదు...నేను మీనుంచి ఆశించిందల్లా మీరు మా యింట్లో వుండడం మా అమ్మ సంతోషంగా వుండడంకంటే నాకేం కావాలి. మీవల్ల నేనాశించే ఉపకారం యిదే! యిప్పుడు చెప్పండి మీకు సహాయం చేస్తాననడంలో నా స్వార్ధం ఎంతుందో!" నవ్వాడు కృష్ణ మోహన్.
"నామీద యింత దయ చూపించిన ఆమె అంటే యీ పదిరోజులలోనే నాకేదో తెలియని ఆత్మీయత అభిమానం కలిగాయి. ఆవిడకి కష్టం కలిగించడం నాకూ ఇష్టం లేదు. కాని నా బ్రతుకు తెరువు చూసుకోవాలిగదా. అదీ నాకోసం కాదు. నామీద నిస్సహాయంగా ఆధారపడిన అత్తయ్య, మావయ్యకోసం తల్లిలా ఆదరించిన ఆమెని సంతోషపెట్టడంకంటే నాకు కావల్సిందేం వుంది కానీ..."
"మీ సందేహం అల్లా మీ మామయ్యవారి గురించేనా? వారికి ఏ లోటు లేకుండా ఏర్పాటుచేసే పూచి నాది. మీకు ఉద్యోగం వచ్చేవరకు వారి భారం నేను వహిస్తాను. మీరు అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకండి. హేపీగా వుండండి---నేనింత సంపాదిస్తున్నాను. ఈ నా సంపాదనలో ఏ కొంచెమైనా నా తల్లికి ఆనందాన్ని సంతృప్తిని యిస్తే అంతకంటే నాకేం కావాలి---నాకు మిగిలింది మా అమ్మ ఒకర్తే. ఆవిడకోసం నేనేమైనా చేయగలిగితే కొడుకుగా నా ధర్మం నెరవేర్చుకున్నట్టు తృప్తిపడతాను. ఆ సంతృప్తి మీవల్లే దొరకాలి--- నాకీ మాత్రం సహాయం చెయ్యండి. అంతే మిమ్మల్ని కోరేది."
కృష్ణమోహన్ మొహం వంక చూస్తూ అతనికి తల్లి పట్ల వున్న ప్రేమ, భక్తికి సరోజ అభినందించకుండా ఉండలేకపోయింది. ఈ రోజుల్లో కన్నతల్లి కోసం యింత ఆరాటపడే కొడుకున్నాడంటే ఆ తల్లికి అంతకంటే కావల్సిందేం ఉంటుంది! సరోజ కళ్ళల్లో అంగీకారం చూసి "పదండి యింటికి వెడదాం. ఇంక యీ విషయం గురించి విచారించకండి. మీకు ఉద్యోగం చూపించే పూచీనాది. ఉద్యోగం దొరికినా మా యింట్లోనే వుండే షరతు మీదనే ఉద్యోగం చూపిస్తానన్నది మరవకండి - మీ సంపాదన అంతా మీ మామయ్యగారికే పంపండి. మీకు అమ్మ వున్నది అన్నీ చూస్తుంది...ఈ యింటిలో మీరూ మాతో పాటే..."
"థేంక్స్...థేంక్స్...మీరు నామీద చూపించే అభిమానానికి యింతకంటే ఏం చెప్పలేను. చిన్న తెప్ప ఆసరాతో సముద్రంలో ప్రయాణం చేయడానికి వచ్చిన నాకు పెద్దపడవలో ఆశ్రయం యిచ్చారు. ఇంక నాకేం భయం! కన్నతల్లిలా ఆదరించే తల్లి దొరికారు. అమ్మ లేని లోటు తీర్చేందుకు. యింత అదృష్టం నాకు పడ్తుందని అనుకోలేదు." సరోజ గొంతు వణికింది. ఆనందంతోనో, కృతజ్ఞతా భారంతోనో ఆమె కన్నులు చెమర్చాయి.
"డోంట్ బీ సిల్లీ" అన్నాడు మృదువుగా కృష్ణమోహన్ సరోజ వంక అభిమానంగా చూస్తూ.
* * *
"పూలుకోసి తెచ్చావా అమ్మా?" "కృష్ణ లేచి నట్లున్నాడు కాఫీ యిచ్చావా! వంటావిడకి కూరలు చెప్పావా? సింహాచలాన్ని బజారుకి పంపు."
ఉదయం లేచినదగ్గరనుంచి సరస్వతమ్మ సరోజ యిలా దేనికో దానికి పిలుస్తూనే ఉంటుంది యిప్పుడు సరోజ వచ్చిన ఒక నెలరోజులకే ఆ యింటిలో ఒక మనిషిగా, ఆ యింటి ఆడపడుచులా అందరిచేత గౌరవించబడుతుంది. స్వంత కూతురికి చెప్పినట్లే పనులు పురమాయిస్తుంది సరస్వతమ్మ. ఇంచుమించు ఆ ఇంటి అజమాయిషీ అంతా సరోజదే యిపుడు. కావాలని కోరి ఆ బాధ్యత తీసుకుంది సరోజ. సరోజ ఏపనన్నా చేయబోతే ముందు సరస్వతమ్మ "నీ కెందుకమ్మా" అంటూ వారించేది. "మీరు నన్ను కూతురిలా చూసుకుంటున్నారుగాని నేను మిమ్మల్ని తల్లిగా భావించి మీకు సాయపడకూడదా, పనిపాట లేకుండా ఎన్నాళ్ళు తిని కూర్చోగలను మీరలా కూర్చోండి, ఏం చెయ్యాలో ఒకరోజు చెప్పండి నేను అన్నీ చేస్తాను." అంటూ బలవంతంగానే ఆవిడ చేసే పనులు, అజమాయిషీతీసుకుంది సరోజ. సరస్వతమ్మ సంతోషంగా తన బరువు బాధ్యతలు సరోజకి అప్పగించి తృప్తిగా నిట్టూర్చింది.