ఊరుకోలేక "అదేమిటి మంచం పక్కగావుంటే గదిలోచోటువుంటుందని అలా సర్దాను." ఏదో అనబోయాను.
ఆయన ఆ మాటలు విననట్టు తువ్వాలు పట్టుకుని బాత్ రూములోకి వెళ్ళారు.
చెళ్ళున కొట్టినట్టు అవమానం పొందాను. అప్పటికి నా మనస్థితి మీరూహించండి.
స్నానం చేసి లుంగీ, షర్టు వేసుకుని, తలదువ్వుకున్నారు. ఆ గదిలో వెన కేమనిషీ లేనట్టు అదంతా చేశారు. కుర్చీలో కూర్చుని అంతా గమనిస్తూనేవున్నాను. ఫేన్ వేసుకుని మంచంమీద పడుకుని కళ్ళు మూసుకున్నారు. ప్రయాణం బడలిక తోడు పదిగంటలయిందేమో అప్పటికే నాకూ నిద్రవస్తూంది.
ఆయన మంచంమీద పడుకున్నారు. నేనెక్కడ పడుకోవాలి? అత్తవారింట్లో అందరి మధ్య ఆయన వాళ్ళవాళ్ళు ఏం అనుకుంటారోనని అలా ప్రవర్తించినా మేమిద్దరం స్వేచ్చగా మా యింట్లోకి రాగానే ఆయన మారుతారని సరదాగా ప్రతీ కొత్త జమ్తలా వుంటారని ఏమూలో నాలో మిగిలిన ఆశకాస్త ఆయన ముభావత చూడగానే అణిగిపోయింది.
అవమానంతో నా హృదయం మండింది. కాని మొదటిరోజే ఆయనతో తగవుపెట్టుకుని ఏం సాధించగలను. ఈ భర్తని ఈ సంసారాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నాది. ఆయన్ని అనుగుణంగామార్చుకోవడంలో చాకచక్యం కనపరచుకోవాలిగాని సంసారాన్ని మరింత నరకంలో పడేసుకోకూడదు అన్న వివేకం నా ఆవేశాన్ని మందలించింది.
సిగ్గువిడిచి ఆయన దగ్గిరికి వెళ్ళి ప్రక్కన కూర్చుని "ఏమిటలా వున్నారు. ఇదంతా నామీద కోపమేనా?" అన్నాను లాలనగా.
ఆయన నా చేయి తోసేసి విసురుగా అటు తిరిగి పోయారు. "బావుందీ కోపం. నేనేం చేశానని యిలా సాధిస్తారు. ఇంటికొచ్చిన మొదటి రోజు యిలాగేనా భార్యని ఆహ్వానించేది" నిష్టూరంగా అన్నాను.
ఆయన తల ఊపలేదు పలకలేదు.
"నా తెప్పేమిటో చెప్పి సాధించండి. అంతేగాని యిదంతా నాకేం బాగోలేదు. మొదటిరోజునించీ ఏమిటో గొడవలు మనమధ్య"
ఆయన చివుక్కున యిటు తిరిగారు. తీక్షణంగా "నాకూ బాగులేదు. నీ వరస నీ పొగరు తగ్గితే తప్ప మన కాపురం యిలాగే ఏడుస్తుంది" అన్నారు కటువుగా.
కోపంవస్తున్నా ఆపుకుని "అంత అపరాధం నేనేం చేశాను. నా పొగరు ఏమి చూశారు?" శాంతంగా అడిగేను.
"ఇంకా ఏం చూడాలి. మూడు రోజులలోనే యిలా ప్రవర్తించినదానివి..." ఏదో అంటున్నారు ఆవేశంగా.
"అంటే ఎలా ప్రవర్తించాను. స్పష్టంగా చెప్పండి" సూటిగా అడిగాను.
"నోటితో చెప్పాలా? అడుగడుగునా నీ అహంకారం నా దగ్గిరా మావాళ్ళ దగ్గిరా చూపించావు. అదంతా సహించి నీ కొంగు పట్టుకు తిరిగే చవటదద్దమ్మని కానని గ్రహించు. నీవాడించినట్లు ఆడి మావాళ్ళకిదూరం అవుతానని మాత్రం అపోహపడకు. ఎవరి హద్దుల్లో వారుండాలి అని గుర్తించి మసలుకో. నీ అతితెలివి నా దగ్గిర కాదు. అంత మాట పడని దానివి, స్త్రీ స్వాతంత్ర్యాలు వగైరా ఉద్దేశాలుంటే పెళ్ళి చేసుకోక పోవలసింది. అలా యిష్టం లేకపోతే నీవు మీ యింటికి వెళ్ళచ్చు" ఆవేశంగా, తీక్షణంగా, పరుషంగా ఆయన అన్న మాటలకి జవాబు ఏం చెప్పగలను?
భార్య అంటే అణిగి మణిగి పడివుండాల్సిందేనని ఆయనంత స్పష్టంగా చెపుతున్నాక, అలా పడివుండక గత్యంతరం లేదన్న సంగతి తెలుస్తుండగా యింక నోరు విప్పి నేను చెప్పేది, చెప్పుకునేది ఏముంటుంది. గొంతుకు ఏదో అడ్డు పడినట్లు గుటకమింగాను.
నేను కట్టుకున్న ఆశా సౌధాలు కళ్ళముందు కూలిపోతున్నట్టు దిగాలుపడి పోయాను. నామౌనం, జవాబు చెప్పలేని నిస్సహాయత చూసి ఆయన గెలిచినట్లు గర్వంగా చూశారు. నా ఓటమిని అంగీకరించలేక బలవంతాన పొంగేకన్నీటిని లోపలికి పంపేసాను. పక్కమీదనించి లేచి కింద నాపరుపు పరుచుకుని వ్రాలిపోయాను.
ఆయన నా చెయ్యి పట్టుకులాగి "యేం మాట్లాడవు ఇక ముందుసరిగా ప్రవర్తిస్తానని చెప్పు." అంటూ నా పక్కమీదకి వచ్చారు.
జవాబు నా కళ్ళు చెప్పాయి. ఎంత ప్రయత్నించినా ఆగని నా ఓటమిని ఆయనకి పట్టిచ్చాయి.
"ఎందుకా యేడుపు ఈ బుద్ధి ముందే వుంటే ఇంత గొడవ ఎందుకు జరుగుతుంది? ఊఁ - చాల్లే- ఊఁ అంటే ఏడుపు ముందుంటుంది మీ ఆడవాళ్ళకి. చాలు ఊరుకో. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు" అంటూ కొంగుతో కన్నీరు వత్తి కౌగిలిలోకి లాక్కున్నారు.
"ఏం చేశాను? నా నేరం ఏమిటి? దేనికి నేను క్షమాపణ చెప్పాలి?" అని ఎలుగెత్తి అడగాలనిపించినా నా నోటిని మూసుకున్నాను. గట్టిగా పళ్ళు బిగించాను. పెదాలు చిట్లాయి.
ఆక్రమించుకుంటున్న ఆయన స్పర్శకి పులకింత గాదు కలిగింది. తిరస్కారం, ఏహ్యత! ఇదంతా నేను తప్పు చేసి సహించడం లేదు. గత్యంతరం లేక అన్న సంగతి ఆయనకి ఎలా తెలుస్తుంది? నా మనసు ఆక్రోశించింది.
* * *
"డాక్టర్ గారూ! ప్రేమ లేనిచోట సెక్స్ ఎంత నరకమో అనుభవిస్తే గాని అర్ధం కాదు. ఆయన ప్రేమకి నేను నోచుకోలేదు. ప్రతి సంఘటన, ప్రతి చర్య, ప్రతి క్షణం, ప్రతి రోజు ఆయనమీద నాకు తిరస్కారాన్ని, ఏహ్యతని పెంచాయి తప్ప ప్రేమని, గౌరవాన్ని పెంచలేదు. మా యిద్దరి మధ్య అనురక్తి, అనురాగం లేవు. ఆయన పురుషుడు కనక సెక్సుకే ప్రాధాన్యత యిస్తారు. కనక ఆయనకీ కావల్సింది నా శరీరం తప్ప మనసు కాదు. కనక నాతో ఆయన ఐహికంగా ఎలావున్నా, దైహికంగా సంతృప్తిపడి వుండవచ్చు. కాని స్త్రీని నేను. ఆడది సెక్స్ కి పురుషుడిలా అత్యంత ప్రాధాన్యత ఇవ్వదు. ప్రేమలేని సెక్సుతో స్త్రీ సంతృప్తి పడలేదు. సంతృప్తిపడకపోవడం అటుంచి అలాంటి సెక్స్ ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. కాని పురుషుడు ఆమె ఇష్టాఇష్టాలకి విలువ యీయడు. అతన్ని ప్రతిఘటించే శక్తి, అంత మానసిక, శారీరక బలం స్త్రీకి లేవు. అంచేత మనసులో అసహ్యించుకుంటూ, కళ్ళుమూసుకు ఒళ్ళు వప్పగించడం మినహా ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు! నా స్థితి అంతే! ఆయన కోరినపుడు అదికూడా యివ్వకపోతే ఇంక ఆ కాపురం ఆమాత్రం కూడ నిలబడదన్న నిజం గుర్తించి, కళ్ళు మూసుకుని, మనసు చంపుకుని, వళ్ళు అప్పగించేదాన్ని. ఆ రోజునించి ఈరోజువరకు అంతే. ఆ కాసేపు మాత్రమే ఆయన ప్రసన్నంగా కనపడేవారు.