ఆదరణ
వంటవాడు కూడా తనను తను కళాకారుడను కుంటాడని అలావుద్దీన్ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు తెలిసింది. అతడు తనపేరు రాసి చీటీ పంపించాడు దానిమీద 'ఆటిస్' అని వుంది.
అతడు చక్కగా అలంకరించుకొని వచ్చాడు ఉతికిన తెల్లని ప్యాంటు, తెల్లని షర్టు మామూలు చెప్పులు వేసుకున్నాడు. వెంట్రుకలు అభ్యుదయ కవి వెంట్రుకల్లా కత్తిరించాడు. రూపం చూడగానే మన వర్గం వాడని తెలిసిపోయింది-అంటే అభ్యుదయ వర్గం; తనను పరిచయం చేసుకోకముందే నన్ను పొగడ్డం ప్రారంభించాడు.
'మీ కథలు చదివితే నాలుక తుప్పు వదులుతుంది. ఇతరులు ఏం రాస్తారో గాని చదివితే జీర్ణకోశం చెడిపోతుంది."
నేనేం చేయను? చిరునవ్వు నవ్వాను.
ఇహ అతడు కళను గురించిన నిర్వచనం సాగించాడు.
'కళాకారుడంటె ఏంది? తనను కలలో మాంసమోలె కరిగించాలె. తన నెత్తురున్నదే-దాని ఆఖరిబొట్టు కూడా కల కోసం అర్పించాలె"
'కళాకారుడు కళ అనే మూకుడులో మాడిపోవటానికి తయారుగుండాలె.'
ఒకడు తనను కళాకారుడు అనుకోవడానికి భారత రాజ్యాంగంలోని ఏ పరిచ్చేదమూ అడ్డురాదు. అలాంటప్పుడు నేనేం చేయగలను? మౌనమే భూషణం అనుకున్నాను.
మీరేదైనా "గజల్" రాశారా 'నజమ్' రాయనున్నారా?
'నేనా!' నన్ను నమిలి మింగేట్లు చూశాడు. త్వరలో కవితాకదంబం అచ్చుకానున్న కవికావచ్చు అనుకున్నా.
'నేను బతుకులో ఒక్క కవిత కూడా తయారుచేయలేదండీ! నా ఆట్ వేరే ఉంది.' ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లు నవ్వాడు. అతనిముందు నేను చీమలా కనిపించాను.
"శానరోజుల నుండి పనిలేదండీ ఈ రోజుల్లో కలా పోసకులు లేరు. శానరోజుల నుంచి కలాపోసకుల కోసం వెతుకుతున్నాను. లల్లూ చెప్పాడు మీరు కలాభిమానులని, మీకు శానమంది నవాబులతో సంబంధాలున్నాయన్నాడు"
'లల్లూ ఎవరు?' ఆశ్చర్యంగా అడిగాను.
"అదే వాడే రెడ్ హిల్స్ లో ఇంజనీరున్నడుగదా - అక్కడి వంటమనిషి."
అతన్ని దీక్షగా చూశాను-తాగి ఉన్నాడా అని. నల్లని రంగు, ఎండిన పెదవులు, తాపం గల కళ్లు-రోజూ పొయ్యి మీద కాలే గిన్నెలా ఉన్నాడు.
అతడు నా జవాబు కోసం నిరీక్షించాడు- రెండు మూడు నిముషాలు.
'నేను మీ దగ్గరికెందు కొచ్చిన్నంటే - కలాకారునికే కలాకారుని విలువ తెలుస్తుందని.....'
"మీరు కథ రాశారా? అది అచ్చుకావాలా?" మాటమధ్యలో అందుకున్నాను
'లేదండీ-చెప్పుకుంటినిగా- నా రంగం వేరే-నేను మరో కలాకారున్ని' ఆ తరువాత అతడు కళా సమస్యలు నేడున్న కళా నిరసనను గురించి గంభీరంగా మాట్లాడాడు.
'ఒక పెద్ద కవి ఉన్నాడు. తనను 'ఆటిస్' అనుకుంటాడు. కాని మరో ఆటిస్ ను గౌరవించడండీ. వంటోడు కూడా కలాకారుడైతే నా పద్యాలన్నీ పొయ్యిలో వేసి తగలపెడ్తానంటాడు. విన్నారా? ఈ లోకంలో మూర్ఖులే మిగిలిపోయారు.'
సకల ప్రపంచంలో మిగిలిన ఒకే ఒక "ఆటిస్" కళ్ళు తుడుచుకుంటున్నాడు. కోపంతో అగ్గిబుగ్గి అయిపోతున్నాడు. కన్నీరు నా బలహీనత. కన్నీరు కార్చేవాళ్లను ఊరడించడానికే నేను కథలు రాయడం సాగించాను. అయినా అతణ్ణి ఓదార్చలేకపోయాను.
ఆ రోజుల్లో మా వంటవాడు మమ్మల్ని చాలా సతాయిస్తున్నాడు. అతణ్ణి వెళ్ళగొట్టటం అటుంచి కోప్పడ్డం చాతకావడం లేదు. పనివాళ్లు పది పన్నెండేళ్లుంటే యజమానుల హక్కులన్నీ హరించేస్తారు. అలావుద్దీన్ కనిపించేవరకు మా వంటవానికి బుద్ధి చెప్పాలనిపించింది. అంతేకాక అలావుద్దీన్ మూర్ఖుడేం కాదు, ఆటిస్టు. అతనికి ఆటిస్టు బైజూబావర, ఆటిస్టు గాలిబ్, ఆటిస్టు సూరదాస్ కథలన్నీ తెలుసు.
అలావుద్దీన్ ఎనిమిదో క్లాసు పూర్తిగా పాసైనాడు.తొమ్మిదో క్లాసులో మాత్రం ఇంగ్లీషు, ఉర్దూ, లెక్కల్లో ఫెయిలైనాడు. ఫెయిల్ కావడం తన లోపం కాదంటాడు. మాస్టర్ గారి కోడిపెట్టకు రోగం వచ్చింది. ఆస్పత్రికి తీసికెళ్ళమన్నాడు. అలావుద్దీన్ తీసికెళ్ళలేదు. అందుకోసం ఫెయిలయినాట్ట! ఆ కాస్త తప్పు చేసి ఉండకపోతే అతడు బడిపంతులయి పిల్లలను ముందు కైమా చేసి ఆ తరువాత కవాబుల కింద కాల్చేవాడు.
'కళాకారుడు కావటానికి నిజాయితీ ఉండాల్నండీ! నిజాయితీ గలవాడు నరకాన్ని కూడా దాటొచ్చు' నేనూ తల ఆడించి ఆమోదం తెలపాల్సి వచ్చింది.
అలావుద్దీన్ వంటింట్లో దూరితే కోడిపందాల్లాంటి పోరు మొదలయింది. మా వంటవాడు పోరులో ఓడి, పక్కచుట్ట కట్టసాగాడు. అలావుద్దీన్ కొలువు కోసం రాలేదని, అతణ్ణి నేనోచోట పనికి కుదిరించేముందు కాస్త పని చూడదల్చానని నచ్చచెప్పాను మా వంటమనిషికి. అంతలో అలావుద్దీన్ లోని కలాకారుడు దెబ్బతిన్నాడు. అలిగి మెట్లెక్కి కూర్చున్నాడు.
"పూర్వకాలపు ఆటిస్టులు ఒకరికోసం ఒకరు పానాలిచ్చేవారు. అందుకే కల అంత ఎదిగింది. ఇప్పుడు గుర్రాన్ని గాడిదనూ ఒకే తీరుగా చూస్తున్నారు."
"నోరు ముయ్యవోయ్ కలాకారుడా-నన్ను గుర్రం అన్నావంటే జేలుకు పట్టిస్తా" పొయ్యి ఊదుతూనే కాలు దువ్వాడు వంటమనిషి.
తన వాగుడులో వినలేదు అలావుద్దీన్, మంచిదయింది. వింటే తనను గాడిద అన్నాడని కుస్తీకి దిగేవాడు.
తొలిరోజు అతడు చేపల హల్వా చేస్తానన్నాడు.
'చేపల హల్వా?' నాకు చేపగొంతులో ఇరుకున్నట్టనిపించింది.
'అరే తినైతే చూడండి. వెధవ హల్వాలన్నీ తిని మీ నాలుక తుప్పు పట్టింది. తుప్పు వదులుతుంది.'
"సరే కానివ్వు" ఒప్పుకోక తప్పలేదు.
పొద్దుటినుంచి సాయంత్రందాకా చేపల్ని కడగడంతోనే సరిపోయిందని వంటవాడు సమాచారం అందించాడు. సాయంకాలానికి చక్కగా ముస్తాబయి వచ్చాడు.
'చేపల హల్వా ఇంకా తయారు కాలేదమ్మా!"
'సరే. రాత్రి భోజనం వరకు తయారుచేయి.'
'ఇప్పుడు నేను అటు తిరగటానికి పోతున్న. కలాకారులు సాయంకాలాల్లో పనిచేయరు. మీరు శిత్రంగా కనపడుతున్నారు, సాయంకాలం కూడా చదువుతరు.'
'అయ్యో దేవుడా! నేను కళాకారిణినని ఎప్పుడు చెప్పాను?' చిన్నపిల్లలా మూతి ముడిచాను.
'హి హి హి' అని వెకిలిగా నవ్వాడు. పృథ్వీరాజ్ తనను అనుకరిస్తున్న హాస్యగాణ్ణి చూచి నవ్వినట్లుంది అతని నవ్వు.
రెండోరోజు తొమ్మిది గంటలదాకా నిద్రలేచాడు కాడు. లేచాడా-లేచి కాలాన్ని తిట్టాడు. పొరుగువాళ్ళ గడబిడను నిందించాడు. తరవాత మరోగంట సిగరెట్టు పీల్చాడు. టిఫిన్ చేసి పన్నెండు గంటలకు పొయ్యి దగ్గరికి చేరాడు. రెండోరోజు హల్వా తయారయింది.
అతనిముందు అడ్డం లేకుండా హల్వాను పొగిడాం, పికాసా చిత్రాన్ని చూచి కళాకారుడు కీర్తించినట్లు. వాస్తవానికి హల్వా బావుంది. ఆర్టిస్టు అమ్మా మొగుడైనా చేపకు సంబంధించిన వాసన గాని, రుచిగాని గుర్తించలేడు.
అతి కష్టంమీద అలావుద్దీన్ను ఒక పెద్ద హోటల్లో కొలువుకు పెట్టించాను. జీతం నూటయాభై. పని వంటవాళ్ళమీద పర్యవేక్షణ.
మరుసటిరోజు మళ్లీ అలావుద్దీన్ మా ఇంటికి వచ్చాడు. 'ఆ కొలువు విడిచి వచ్చినమ్మా!' ఎంత ఠీవిగా చెప్పాడంటే అతని మెళ్ళో వీరమాల వేయాలనిపించింది.
"ఏం?" ఆ అర్థం అయింది. హోటల్ మేనేజరు ధనగర్వంతో ఇతనిలోని కళాకారుణ్ణి అనాదరించి ఉంటాడు. 'నాకు మొదలే తెలుసమ్మా! మమ్ము ఆదరించేవాండ్లు నవాబులు మాత్రమే. మా విలువ మరొకరికి తెలియదు.
* * * *