Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 11


    చేతకాదుకాని, ఇట్లాంటివి, బొమ్మలు గీసి చూపాలనిపిస్తుంది. చిత్రకారులకి తెలుస్తుందనుకుంటాను. ఒక్క చిన్న గీత పెదవి చివర, గడ్డం వొంపులో, కనుకొలికిలో, కొంచెం యిటూ అటూ వంచడం వల్లకాని, చంపాల మీద, కళ్ళపాపలో, ముక్కు యెత్తులో, రంగు చిక్కదనం మార్చడంవల్ల గాని ఒకేబొమ్మ స్వభావంలో యెంత మార్పు చూపించవచ్చో! ఇందువల్లనే యింత గంభీరమూ, ఆశ్చర్యకరమైన విషయాలు గమనించినప్పుడే ఈశ్వరుడే వుంటే అతనెంత పర్ఫెక్టు ఆర్టిస్టు (perfect artist) గొప్ప చిత్రకారుడో, ఎంత కళాశాలి ఐవుంటాడో, అనిపిస్తుంది మళ్ళా కళా లేదు దేవుడూ లేడు. అంతా యీ మనస్సు కల్పించుకున్న ఇంద్రజాలమని తోస్తుంది.
    ఈ మల్లెపూలని సూదికి గుచ్చడం కష్టంగా వుంది. వాటి హృదయాల్లోంచి యీ దారాన్ని లాగుతున్నట్లుగా బాధగా వుంది నాకు. అవి ఇంకా పసివిగా వున్నప్పుడే యీ మొగ్గల్ని కోసి, గుప్పెట్లో పట్టుకొని బుట్టలో అదిమి, వేళ్ళతో లెఖ్కలు పెట్టి యిట్లా గుచ్చి, బాధించినా, ఎండించి, పాడుచేసినా, సాయంత్రమయ్యేసరికి పాపం, అవి వికసించి పరిమళాన్ని లోకంమీద వెదచల్లుతాయి. భత్రుహరి యామంటాడో!
    ఒకరోజు ఒకరు నాకెంతో ఆప్యాయంగా యిచ్చిన మల్లెమొగ్గని వదల్లేక, జేబులో వేసుకుని మరిచిపోయినాను. సాయంత్రం కాలవగట్టు దగ్గిర మల్లెపూలవాసన వేసి చుట్టూ వెతికాను, తోటలో వుందేమోనని. చివరికి నా జేబుని గుర్తుపట్టి, చూస్తే, తెల్లగా పెద్దదిగా విచ్చుకొని నావేళ్ళని పలకరించింది! నా జేబులో మరిచిపోయిన నా మల్లెమొగ్గ! కళ్లంబడి నీళ్లు తిరిగాయి.
    మాట్లాడకుండా కళ్లు తెరుచుకుని చూసే పసిపిల్లలు_ మబ్బుల మధ్య పరుచుకున్న చిక్కని ఆకాశం. యివి తలపుకు వస్తాయి వెనక్కి విరగబడే రేకలతో మొహంమీదకి చూసే మల్లెపూవుని చూస్తే. ఎట్లాగో_ మాటలతో కాదు_ చూపులతో కాదు_ పరిమళంతో కాదు_ ఎట్లానో చెప్పలేను_ యీ ఇంద్రియాలకీ మనసుకీ చాతకాదు.
    ఎప్పుడో ఏ ఒక్క త్వరిత క్షణికంలోనో స్ఫురించి మాయమవుతుంది_ ఆ అనుభవం_ యీ పువ్వుతో ఆత్మసంబంధం కలగచేసుకోడం_ "నేను నువ్వు" అనుకోడం, తెలియజెయ్యడం ఆ మల్లె ఆత్మతో. తక్కినప్పుడా? వుత్త మల్లెపూవులు_ అతిచవక_ శేరు అర్ధనా_ మెళ్ళలో, తలలమీద, పక్కల్లో, కాళ్లక్రింద_ అంతటా మల్లెపూలు, అందరికీ మల్లెపూలు.
    మల్లెపూలు దరించడానికీ, కుక్కని పెంచడానికీ, అధికారం కొందరికే యిస్తే బావుండును, ప్రభుత్వమో, దేవుడో!

                                           * * * *

    నాముందు కొలనులో లేయెరుపు తామరలు మెల్లిగా తెరుచుకుంటున్నాయి. సరిగా సమయానికి యే శక్తి యీ పువ్వుల్ని వికసింపచేస్తుందో ఆశ్చర్యంకాదూ? జంతువులకి మాత్రమే ప్రాణమున్నట్లూ యీ వృక్షాలని యెన్నిటిని చంపినా యేమీ తప్పుకానట్లు మాట్లాడతారు, మాంస భక్షణ చెయ్యని నిర్మలోదరులు! చంపి తినకుండా బతకలేము చెట్లనో మృగాలనో. అనవసరంగా చెట్లని చంపడం, అవసరంగా మృగాలని చంపడం కన్న చాలా పాపమని గుర్తించలేరు. ఎవరో జంతుబలులు జరక్కుండా శాసనం చెయ్యాలనే వాళ్లకి ఎంత దయ జంతువులమీద! పంజరాల్లో_చిలకల్ని వదలమని సత్యాగ్రహం చెయ్యరాదూ? zoo "జూ"లో జంతు ప్రదర్శన శాలల బోనులు విరగతన్నరాదా? సర్కసులకి మనుషుల్ని వెళ్లి చూడవద్దని ప్రచారం చెయ్యరాదూ? బలిపడే జంతువుల రెండు సెకండ్ల బాధకన్న, పెద్దపులులు నాలుగు గజాల బోనుల్లో యావజ్జీవనమూ పడే బాధలో ఎన్నోవంతు? కటికవాడి చేతుల్లో చచ్చే పడుచు అవు బాధకన్న, గోసంరక్షణవాళ్ల ఆత్మలకి స్వర్గం వచ్చేందుకు, ఊరేగింపుల్లో కాళ్ళీడ్చుకుంటూ తిరిగే ముసలి రోగిష్టి ఆవుల బాధ ఎన్నిరెట్లు?
    ఇదంతా తెలీదు. తెలుసుకోరు. అంతా మతం, శాస్త్రాలూ, అన్నిటికన్నా "సెంటిమెంటు" మెదడు చాలామందికి పెట్టడం మరిచిపోతాడు, ఆ చేసే ఆయన.
    హృదయాల్లో నిజమైన దయా స్రవంతి ఉదయమైనప్పుడు జంతుబలుల వైపుకాదు; దిన దినమూ మన ఎదుట జరిగే నరబలులవైపు ప్రవహిస్తుంది.
    జంతువులు నోరులేనివి. చెట్లూ? గొడ్డలి కింద రక్తం కారే చెట్టు, బూట్సుల కింద నలిగే గడ్డి, పువ్వులన్నీ కోసుకుపోతే ఏడ్చే మొక్క వీటిమీద కారుణ్యం లేదా? నోరు లేదు గనకనేనా?
    ఏం తింటున్నాము, ఏం చంపుతున్నామని కాదు ప్రశ్న! హృదయంలో యెంత దయ, యెంత సానుభూతి వుందనేదే ముఖ్యమైన విషయం. ప్రజలని కొరుక్కుతినకపోతే చాలు దయాపరులు!
    పుస్తకాల్లో యీనాటికి కూడా నవకవులు సహితం ఉదయాన తామరలు వికసించడమూ, రాత్రులు కలువలు పుయ్యడమూ, పద్యాలలో వర్ణిస్తూ వున్నారా! అట్లాలేదు, నిజంగా, యీ చెరువుల్లో పువ్వుల్ని చూస్తే. కలువలు పగలు వికసించి లోకంలో కవులనందర్నీ దిఖ్కరిస్తున్నాయి. తామరలు సాయంత్రమైనా వికసించే వుంటున్నాయి, ఖండ కావ్యాల్ని చూసి యేమాత్రమూ భయంలేకుండా, కాని గొప్పగొప్పవారమని విర్రవీగే కవులు యింకా కృతయుగం నాటి వర్ణనల్లో మూలుగుతూ వుంటారు. చకోరాలు, హంసలూ, కలువలూ, గండభేరుండాలు, తంగేటిజున్నులూ, చక్రవాకాలు నవ కవిత్వంనిండా. మతం పేరట యే వికృతమైనా చలామణి ఐనట్టే కవిత్వం పేరట అసందర్భమైనా మెప్పు పొందుతుంది.
    మెల్లిగా తలలు వంచే యీ తామరాల్ని చూస్తే తాయారు జ్ఞాపకం వస్తుంది. ఆమెది గులాబి తామర రేకుల మధ్య వుండే శరీరకాంతి. ఎండ తాకిన తెల్లని మబ్బులమీద గులాబీ కొంచెం యెరుపులోకీ, మళ్ళా తెలుపులోకి మారుతుందే, ఆ మార్దవమే యెండ తాకని స్థలాల ఆమె వంటిమీద కనిపించేది. వేళ్ళు తాకినచోట చప్పున యెర్రబడి చుట్టుపక్కల కొండశిల ఛాయలన్నీ మారేవి. ఎండలో హంపి కొండశిలలకింద లేతనీడలు చేరినట్టే, ఆమె గడ్డం కిందా రొమ్ముకిందా చీకట్లు నిద్రపోయేవి. బొమ్మవంటి ఆ చిన్న దేహం యే గులాబి చలవరాతితోనో ఏ విగ్రహకారుడో చెక్కినట్లుండేది.
    ప్రబంధ కవుల వూహల కెదురుతిరిగి, ఆమె హృదయాన్ని, బ్రహ్మ పాషాణంతోగాక ఆమె శరీరం మార్దవం వలె నవనీత సమానంగానే తయారుచేశాడు.
    ఆపుకోలేని జాలి ఆమెనెన్నో కష్టాల్లోకి దించింది! ఎన్నో కన్నీళ్ళు కార్పించింది ఆమెచాత! ఎంతో నలిగిపోయింది ఆ పసిపాప. ఏ కనికరమూ యెరగని, సౌందర్య లేశాన్ని అపవిత్రం చెయ్యకుండా వదలలేని, పురుషపు గవుల చేతుల్లో, స్వార్ధత తప్ప యే ప్రేమనూ దయనూ యెరగని, యీ పుణ్యసతుల పవిత్రపు నాలుకల మధ్య యెన్నో గాయాలు పడ్డది! సామాన్యులకి ఉచ్ఛరించడానికైనా తగని ఆ హృదయదౌర్భల్యం, ఎదుటివాడి దొంగ బాధని కూడా సహించలేని, మోసాన్ని గుర్తించ తలుచుకోని, ఆ తీవ్ర విశ్వాసం. ఎంతో అపవాదు పడ్డది _ జారత్వం, పశుత్వం, కొవ్వు, ఇక్కడ వ్రాయకూడని పేర్లెన్నో! జాగ్రత్త, అనుమానం, ద్వేషం, ప్రతిష్ట మీది ప్రేమ__యివన్నీ పుణ్య నామాలతో సులభంగా సుఖిస్తున్నాయి యీనాడు కూడా!

 Previous Page Next Page