Previous Page Next Page 
మైదానం పేజి 11


    చివరికి అన్నయ్యకి కొడుకు పుట్టాడని విన్నప్పుడైనా నాకేమీ సంచలనం కలగలేదు. పూర్వమే అయితే నా హృదయం యెన్ని ఉత్సవాల వాసనలతో గంతులువేసి వుండును! ఆ క్షుద్ర జీవితమంతా జ్ఞాపకం వొచ్చి ఆ తోచక పోవడమూ, మర్యాదలూ, లాంఛనాలూ, నిష్టూరాలూ- అన్నీ తలుచుకుని, ఆ నరకం నుంచి, అల్పత్వం నుంచి, క్షుద్రత్వం నుంచి ఒక్క మంత్రంతో, ఒక బలమైన ఊపుతో యీ సుందర లోకంలోకి లాక్కొచ్చిన నా అమీర్ని తలుచుకుని కృతజ్ఞతతో ఆనందంతో తల్లడిల్లి పోయినాను. ఎంత గొప్ప సౌఖ్యంలో వున్నా, అది త్వరలోనే అలవాటై సాధారణ మయిపోతుంది. మామయ్యవంటివాడు వొచ్చినా, అదృష్టాన్ని జ్ఞాపకం చేసిందాకా!
    అమీర్ని లాలించాలని అవసరమయిన కోర్కె కలిగింది. ఈ మామయ్యని పోనీ, కాని మామయ్యని నేనెందుకు లక్ష్యపెట్టాలి! అతనెవరు? నేనెవరు? ఈ మామయ్య మూలానా నేను పోగొట్టుకొన్న నిమిషాలు యీ అనంతకాలంలో మళ్ళీ నాకెక్కడ దొరుకుతాయి? ఆవలించే అమీర్ దగ్గిరిగా జరిగి, అతని భుజంమీద చేతులేసుకుని ఆనుకుని కూచున్నాను. మా కొండ వెనకనించి తదియ చంద్రుడు కనబడకుండానే కాంతి నెగజిమ్ముతున్నాడు. సముద్రానికీ, చంద్రుడికీ సంబంధముందంటారే అలాంటిదే వెన్నెలకీ నా రక్తానికీ వుంది. చంద్రోదయంలో వెన్నెల ఇంకా విజృంభించకముందే నా రక్తం పొంగుతుంది. వెడదామని అమీర్ నా చేతిని లాగుతున్నాడు. పాపం, ఒకే మూకుట్లో అమీర్ తో నేను అన్నంతినే దృశ్యం భరించలేక తలతిప్పుకుని పుణ్యశ్లోకాలు చదువుకునే మామయ్యతో.
    "మేము వెడుతున్నాము. నువ్విక్కడే నిద్రపోతావు కదూ మామయ్యా!" అన్నాను.
    "ఇక్కడా? మీరిక్కడికి వెడతారు."
    ఆ కంఠం వినితీరాలి.
    "అలా పోతాము."
    "తొరగా రా" అంటున్నాడు అమీర్.
    "నేను వెడతాను, రైలెన్నింటికి?"
    నేను నవ్వాను.
    "రైలు సంగతి మాకెందుకూ?"
    "పోనీ నన్ను ఊళ్ళో వొదిలిపెడుదురూ!"
    "అమీర్ యిప్పుడు రాడు. నేను రానివ్వను. ఇవ్వాళ్టికి యిక్కడే మామయ్యా! నువ్వు. ఆ మూల గోనిపట్ట వుంది. దాన్ని పరచుకుని పడుకో. దోమలు లేవులే."
    "ఏమీ భయం లేదు కద!"
    "అప్పుడప్పుడూ ఒకటి రెండు పాములూ, ఒకటి రెండు తోడేళ్ళూ వొస్తుంటాయి" అన్నాడు అమీర్.
    అమీర్ మళ్ళీ తెలుగు మాటాడాడు. ఎన్నాళ్ళయింది విని! నా తెలుగు తురకగా మారిందన్నాడు మామయ్య.
    "రావు మామయ్యా! అమీర్ మాటలకేం?"
    మేము బయలుదేరాం, మామయ్య గొణుక్కుంటున్నాడు.
    "నీకు మామయ్య అయితే, నాకేమౌతాడు?"
    "తురకాడికి నీకేమౌతాడు? నీ మొహం!"
    "అది కాదు, నీ పెనిమిటిని నేనైతే-"
    "నువ్వు నా పెనిమిటివైతే, యింకా నీతో వుండవొచ్చానా?"
    చంప చెళ్ళుమంది.
    "చెపుదూ! తమాషా చేస్తాను."
    "బాబాయి."
    "బాబాయిగారూ శలవు. బతికివుంటే రేపు పొద్దున్న చూసుకుందాం. తమరు కనపడక ఎముకలు మాత్రమే వుంటే నమాజ్ చేసి పాతేస్తాం. తురక స్వర్గం చూద్దురుగాని!"
    ఇద్దరమూ నవ్వుతో పరిగెత్తికెళ్ళాం. కొంచెం దూరం పోగానే నాకు జాలేసింది. పాపం నిజంగా మామయ్య భయపడుతున్నాడేమో! ఇదివరకంతా నేను తనదాన్ని లాగు అధికారం చేసిన మామయ్యకి యెట్లా వుంటుంది- నేను అమీర్ భుజంమీద చెయ్యేసి వెళ్ళిపోతూవుంటే! వెనక్కి వెళ్ళేటప్పటికి మామయ్య గుడిశంతా వెతుక్కుంటున్నాడు.
    "మామయ్యా! నువ్వేం భయపడకు? ఊరికే దడిపించాడు అమీర్. బహుశా రెండు మూడు గంటలవేళ వొచ్చేస్తావేమో?"
    "పోనీ వుండకూడదుటే! ఎక్కడికి వెడతారీ అర్థరాత్రి! ఏదన్నా పురుగూ...."
    నాకు నవ్వొచ్చింది.
    "ఇంకా ఇంటి దగ్గిర వున్నట్టే, నా బాధ్యత తీసుకుంటున్నావా!"
    "ఇదిగో చూడు. మళ్ళీ నీతో మాట్లాడ్డానికి వీలుంటుందో లేదో! నా మాట విని యింటికి వొచ్చెయ్యి. ఈ పాడుబతుకు...."
    "మామయ్యా అదేమీ లాభంలేదు. నాకోసం నువ్వేమీ దిగులుపడకు"
    "నువ్వు చేసిన యీ ఘనకార్యాన్ని చూసి నువ్వే గర్వపడడం నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. ఇదంతా గొప్ప ప్రేమ అని గావును నీ ఉద్దేశ్యం! ప్రేమ!"
    "ప్రేమా! పశువులు-కుక్కలన్నానయం. నీతీ జాతీ విచక్షణలు లేక, కళ్లు కమ్మి, వొళ్ళు కొవ్వి, ఇట్లా బట్టలు విప్పుకొని యీ అడవుల్లో పరుగెత్తుతూ సిగ్గువిడిచి...."
    "ఇది ప్రేమా! కామం. వొళ్ళు తెలీని పశుకామం....మదపిచ్చి."
    ఇంకేమిటో అన్నాడు.
    "చాలు మామయ్య!"
    అని పరుగెత్తుతూ వెనక్కి తిరిగి చూశాను. ఎదిగిన ఆడది పరిగెత్తడమేమిటి? పొగరు! దీని చెంపలు వాయించేందుకు వీలైతే బావుండుననే చూపుతో మామయ్య నుంచుని వున్నాడు వెన్నెల్లో.
    పొద్దున్నే మామయ్య వెళ్ళేప్పుడు అమీర్!
    "బాబాయిగారూ! యింకా మీ వూళ్ళో వున్న తాతలూ అత్తలూ వొస్తారేమో! మిమ్మల్నంటే బాబాయిగారని వూరుకున్నానుగాని, యింకెవరన్నా వొచ్చారా ఇక్కడే పాతేస్తానని చెప్పండి" అన్నాడు.

 Previous Page Next Page