Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 12

   
    ఇదంతా అయేప్పటికి రాత్రి పదకొండు అయింది.    
    చీకట్లో చిందులాట అర్దరాత్రి అంకమ్మ శివాలని పెద్దలంటుంటారు, అలా వుంది వారి పద్దతి.    
    అందరూ పడుకోటానికి లేచారు.    
    విమానంలోంచి క్రిందపడి దొరికిన సూట్  కేసులు బ్యాగ్ లు వీరి కోసం కొత్త గా నిర్మించిన గుడిసెలో చేర్చారు.    
    ఏ గుడిసెల్లోనూ దీపాలు లేవు. కొద్దిగా వెన్నెలుంది. అయితే ఆ వెన్నెల చెట్లలోంచి నేలమీదకు పడటంలేదు.    
    నెగళ్ళ దగ్గర మంటతాలూకు వెలుతురుంది. మిగతా అంతా చీకటి మసగ మసగ్గా వెలుతురు నీడలు కనిపిస్తూ వుంది.  
    వాళ్ళ నాయకుడిని నేలమీద వున్న పెద్ద గుడిసెలోకి తీసుకెళ్ళారు.    
    అందరూ వాళ్ళవాళ్ళ చెట్లమీద నివాసాల్లోకి వెళ్ళారు.    
    బొబ్బూ, బప్పూలు, చెట్టుపైన కొత్తగా నిర్మించిన ఇంటినిచూపి వెళ్ళి పడుకోమని సౌంజ్ఞ చేసిచెప్పారు.    
    "నీవు పడుకో కమల్! నేను ఆ చెట్టుమీద పడుకోను." అంది గోమతి.    
    "చెట్టుమీద నివాసం అనిభయమా! చీకటంటే భయమా" అంది కీర్తి.    
    "రెండూ కాదు."    
    "మరి...!"    
    "మనిద్దరం ఆ చిన్న గుడిసెలో రాత్రంతా ఎలా పడుకుంటాం?"    
    "అందరూ పడుకోవటంలా అలాగే మనిద్దరం పడుకుందాం."    
    కీర్తి వైపు కనుబొమలు ముడేసి చురుక్కుమనిచూసింది గోమతి.    
    "గోమతీ" మృదువుగా పిలిచింది కీర్తి.    
    "ఊ." కోపం దిగమింగుతూ ఊ కొట్టింది గోమతి.    
    "గోమతీ మనం ఇక్కడఎన్నాళ్లుండాలో తెలియదు. అర్ధం చేసుకుని మంచిగా మెలుగుదాం. ఒకరు పైనఒకరు కింద పడుకుంటామంటే వీళ్ళకి అర్ధంకాదు. అలా చెయ్యనివ్వరు కూడా. భార్యాభార్తలకున్న సేఫ్ టి విడి వాళ్ళకు వుండదు. మనం కల్సి జీవించటం మనకే మంచిది. నీకు నేనేం కాదనినీవు కన్యవని తెలిస్తే వీళ్ళల్లో ఎవరైనా నిన్ను బలవంతానతనదాన్ని చేసుకోవచ్చు."    
    "బాబోయ్" అంది గోమతి.    
    "నీ యిష్టం ఏంచేద్దాం" అమాయకంగా కావాలని అడిగింది కీర్తి.    
    "నాకు భయంగా వుంది. నువ్వేచెప్పు కమల్ ఏంచేద్దాము?"ఏదేదో వూహించుకుని అప్పుడే భయపడి పోయింది గోమతి.    
    "నా వల్ల నీకే ప్రమాదం లేదు. హాయిగా నిద్రపోదాం పద" అంది కీర్తి.    
    "అంతేనా?"    
    "అంతే."    
    "నీ ఇష్టం."    
    కీర్తి నవ్వుకుని వాళ్ళవైపు తిరిగి సౌంజ్ఞ చేసింది. తను కాలినెప్పితో ఎక్కలేదని గోమతికి చెట్టేక్కటం చేతకాదని వాళ్ళు వెంటనే అర్ధం చేసుకున్నారు.    
    బొబ్బూ, బప్పూలు అమాంతం ఇద్దరిని ఎత్తుకుని చెట్టేక్కారు, గుడిసెలో విడిచారు.    
    గుడిసె లోపలంతా చీకటిగా వుంది.    
    లోపల ఎంత విశాలముందో తడిమి చూసుకుని కీర్తి పడుకుంది గోమతిని పడుకోమంది.    
    పడుకోటం ఇష్టంలేక "నాకు నిద్రరావటం లేదు" అంది గోమతి.    
    "నమ్మదగ్గ మాటేనా గోమతి!"    
    జవాబివ్వకుండ మాట మార్చేసింది గోమతి.    
    "కాలినొప్పి ఎలా వుంది కమల్!"    
    "వాళ్ళు పూసిన పసరువల్ల కాలు మొద్దుబారిపోయింది నెప్పి తెలియటం లేదు. జ్వరం మాత్రం కొద్దిగా వుంది. గోమతీ! నిద్రరాక తప్పదు, పడుకోక తప్పదు నీకేం పరవాలేదు హాయిగా పడుకో"    
    "నిద్రవస్తే పడుకుంటాను. నీవు నిద్రపో కమల్!"    
    "అబద్దమాడవద్దు గోమతీ! నిద్రవస్తున్నది అయినా మొండిగా కూర్చున్నావు. అన్నింటికి అపార్ధం చేసుకొని మొండితనం పోతే నేను చెడ్డవాడిగా ప్రవర్తిస్తాను ఆపై నీ ఇష్టం" కావాలని కఠినంగా అంది కీర్తి.    
    గోమతి మారుమాట్లాడలేదు. వదిగి ముడుచుకు పడుకుంది.    
    క్రింద పరచిన గడ్డి మెత్తగానే వుంది. అయినా ఇద్దరికీ నిద్రరాలేదు. ఎవరి దోవన వారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.    
    కీర్తి నిద్రపోయిందని గోమతి, గోమతి నిద్రపోయిందని కీర్తి అనుకున్నారు.    
    కీర్తి ఎన్నోసార్లు ప్రమాదంలో ఇరుక్కోటం ధైర్యంగా బైటకి రావటం జరిగింది. కష్టానికి నష్టానికి కళ్ళ నీరు పెట్టుకోటం కీర్తి చేసే పనికి, మనస్తత్వానికి విరుద్దం.    
    కీర్తి నిద్ర పోయిందనుకున్న గోమతి హృదయంలో బరువంతా దిగేటట్లు ఏడవటం మొదలు పెట్టింది. వినపడితే కీర్తి లేస్తుందని గట్టిగా నోరు నొక్కుకుంది అయినా ఎక్కిళ్ళు వినపడుతూనే వున్నాయి.    
    చటుక్కున గోమతి చెయ్యి పట్టుకుంది కీర్తి ఆగలేక పోయింది.

 Previous Page Next Page