Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 11

   
    "నీ అందం అలాంటిది." అంది కీర్తి.    
    కీర్తి అన్నదానిలో పూర్తిగా నిజం వుంది గోమతి అందం అపూర్వం.    
    గోమతి తలెత్తి చురుక్కుమని చూసింది కీర్తిని.    
    "అదో విధంగానే చూడమలే భయపడకు. నేనీపక్క నుండగా ప్రమాదం రానీయను. మగ ఈగల్ని వంటిమీద వాలనివ్వను. సరేనా"చిలిపిగా నవ్వుతూ అంది కీర్తి.    
    కీర్తి వైపు కోపంగా చూసి అక్కడి నుంచి లేచివెళ్ళి దూరంగా కూర్చుంది గోమతి.    
    కీర్తి చిన్నగా నవ్వుకుంది.
    
                                      8
    
    నుండా జాతివారు చెట్లమీద నివాసం. కనిపించినంత వరకూ వాళ్ళు రెండొందల పైన జనాభా వున్నారు. పిల్లలు మాత్రం ఇరవై మంది మించిలేరు. వారు ఒక్కో కుటుంబం ఒక్కోచెట్టు నాశ్రయించారు. పెళ్ళికాని ఓ వయసువాళ్ళు మగవాళ్ళు వేరుగా ఆడవారు వేరుగా అయినా జట్టుగా ఒక్కో గుడిసెలో వుంటున్నారు. ఇద్దరుముగ్గురు ఆడపిల్లలుఓ గుడిసెలో వుంటే అలాగే వేరుగా మగపిల్లలుంటున్నారు.    
    కీర్తిని గోమతినిభార్యా భర్తలుగా తలచారు వారు, పెద్దచెట్టుకి ఏడడుగుల ఎత్తు నుంచి కొమ్మలు నరికి ఖాళీ ప్రదేశం చేసి ఎండు కర్రలు గుచ్చుకోకుండా మెత్తని పీచు కింద పరిచారు. ఒక్క రాత్రిళ్ళు నిద్రించటానికి తప్ప పగలంతా భూమీదనే వారి నివాసం పని పాటలు.
    రాత్రయింది.    
    ఉదయం ఇచ్చిన ఆహారమే రాత్రికి ఇచ్చారు. పులిసిన వాసన గల ద్రవ పదార్ధం ఇవ్వబోతే కీర్తి తీసుకోలేదు. అది సారాయి లాంటిదని మత్తునికలిగిస్తుందని వాసనబట్టి గ్రహించుకుంది. తీసుకోమని వాళ్ళూ బలవంతం చేయలేదు.    
    సాయంత్రం ఒకతమాషా జరిగింది. సుండా జాతివారు ఉదయం స్నానం చేయరు. సాయ్నత్రం పూట చేస్తారు. కొంత దూరం నడిస్తే పెద్ద వాగు వస్తుంది. వాగు దగ్గర చెట్లున్నాయి. భార్యాభర్తలు జట్లుగా విడిపోయి స్నానాలు చేస్తారు వాగులో దిగి. అలాగే పెళ్ళికానివారు కొందరు మగవాళ్ళు కొందరు ఆడవాళ్ళు వేరువేరుగా స్నానం చేస్తారు. అది చూసిన కీర్తికి గోమాతికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. బట్టలు విప్పిచేసిన తన రహస్యం బైట పడుతుందని కీర్తి, కమల్ మగవాడు అతనెదుట స్నానం చేయటం ఎలా అని గోమతి భయపడ్డారు. వాగు దగ్గర వారిద్దరినీ విడిచి దూరంగా వెళ్ళికాపలావున్నారు బొప్పూ బప్పులు.    
    "నేను చెట్టు చాటున నుంచుంటాను నువ్వు స్నానం చెయ్యి. అలాగే నీవు చాటుగా నుంచున్నప్పుడు నేనుస్నానం చేస్తాను" అంది కీర్తి.    
    దొంగచాటుగా చూడరాదని ప్రామిస్ చేయించు కుంది గోమతి.    
    "నేను నిన్ను చూస్తే ఫరవాలేదు. నీవు నన్నుచూస్తే నా రహస్యం బైట పడుతుంది." అనుకున్న కీర్తి బయటపడటమంటూ జరిగిననాడు ఏదో కధ అల్లేయవచ్చు అని కూడా అనుకుంది.    
    ఒకరి తర్వాత ఒకరు స్నానం చేశారు. కాలు తడవకుండా వీలయినంత వేగంగా స్నానం చేసింది కీర్తి ముందుగా స్నానం చేసే విషయం తెలియనందున మళ్ళీ అవే గుడ్డలుధరించారు ఇరువురు.    
    అది గుర్తుకొచ్చింది కీర్తికి. ఇహపై ఎలాగో అనుకుంది జరుగుతున్నది చూస్తూ.    
    పెద్ద పెద్ద నెగళ్లు అక్కడక్కడా వేశారు. నెగళ్ల చుట్టూ కొందరు చేరారు.    
    సంతోషంగా ఆ చీకటి వెలుగుల మధ్య ఆటపాటలు మొదలయ్యాయి.    
    కుష్టురోగం నాయకుడిని ఆ సమయంలో బైటకి మోసుకొచ్చారు అనుచరులుగా వున్న మిగతాకుష్టురోగులు.    
    సుండాజాతికి నాయకుడు కావాలంటే తప్పక కుష్టు రోగి అయి వుండాలి. వారి దృష్టిలో వారి దేముడే రూపం అది. బలంగా వున్న సుండాజాతి వారు మూతి వద్ద ముక్కు వద్ద ఆకారం పోయింది. చప్పిడి ముక్కు వికృతంగా వున్న పెద్ద
నోరు, సాగిపోయిన పెదవులు ముఖం చూడగానే లెప్రసీతగ్గిన రోగుల్లా వున్నారు.    
    తినే తిండిలోనో వీచే గాలిలోనో గాని ఇక్కడి తెగవారికి లెప్రసీ తప్పదని, వ్యాధిని బాగు చేసుకునే బదులు గౌరవంగా దాన్ని దేవతా మహిమగా తలచి వృద్ది చేసుకుంటున్నారని కీర్తి గ్రహించింది.    
    కీర్తికి గోమతి అతిధులు కాబట్టి వాళ్ళిద్దరినీ గౌరవంగా తీసుకెళ్ళి కుష్టురోగం నాయకుడి దగ్గరగా కూర్చోపెట్టారు.     
    కీర్తి వాళ్ళను అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నది.    
    గోమతికి వాళ్ళవంక దగ్గరగా చూస్తుంటే కడుపులో తిప్పుతున్నది. ముఖం ప్రక్కకు తిప్పుకుకూర్చుంది.    
    నెగడు చుట్టూ చేరిన అందరూ లయబద్దంగా అడుగులేస్తూ నాట్యం చేస్తున్నారు వాళ్ళకి వాయిద్యాలు లేవు కీచుమని అరుస్తూ పాడుతున్నారు. కొందరు చప్పట్లు చరుస్తున్నారు.    
    వారంతా ఎంత మిత భాషులంటే ఎక్కువ సౌంజ్ఞలు తక్కువ మాటలతో మెలుగుతున్నారు.    
    పాటలు నాట్యము అయిం తరువాత అందరూ ఏకకంఠంతో ఏదో ఉచ్చరించారు.

 Previous Page Next Page