Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 11


                                                మాన్ ఈటర్

అడవి అక్కడ చిక్కబడుతోంది. జిమ్ కార్బెట్, ప్రమాదాన్ని ముందుగానే సూచించే 'సిక్స్ త్ సెన్స్' తనకి ఉందని నమ్మేవాడు.
మూఢాచారాలని నమ్మకపోయినా, తనకి సంబంధించినంతవరకూ సిక్స్ త్ సెన్స్ అనేది ఉందని చాలాసార్లు అనుభవమయింది సందీప్ కి. దానివల్లే అతను అనేకసార్లు ప్రాణాలు దక్కించుకోగలిగాడు కూడా.
ఇప్పుడూ అలాగే అనిపించింది అతనికి. జీవు తాలూకు రియల్ వ్యూ మిర్రర్ లోకి చూశాడు.
చాకుతో తలమీదకి ఉరకడానికి సిద్ధంగా ఉన్నాడు భూతాలరాజు. అతని కళ్ళలో ద్వేషం కనబడుతోంది.
తన శరీరాన్ని సిద్ధంగా ఉంచి, జీపుని బొంగరంలా వెనక్కి టర్న్ చేశాడు సందీప్. ఆ విసురికి భూతాలరాజు ఎగిరి కిందపడిపోయాడు. అతని చేతిలోని చాకు దూరంగా పడిపోయింది.
నిదానంగా జీపు దిగాడు సందీప్. కొబ్బరితాడు చుట్టవిప్పి, భూతాలరాజు చేతులు బిగించి కట్టేశాడు. కసిగా బూటుకాలితో అతన్ని పొర్లిస్తూ "ఈ ఒక్కరోజులో రెండుసార్లు నా మీద హత్యాప్రయత్నం చేశావు. మూడుసార్లు తప్పించుకు పారిపోవడానికి చూశావు. ఇది నీకు లాస్ట్ వార్నింగ్! ఈసారి ఇలాంటి వెర్రివేషాలు వేశావంటే, 'అసలు ఎందుకు పుట్టానా' అని నువ్వు కుమిలి కుమిలిపోయేంత ఘోరంగా బుద్ధి చెబుతాను జాగ్రత్త !" అన్నాడు.
విషం కక్కుతూ చూశాడు భూతాలరాజు.
రాజుని ఎత్తి జీపులో పడేశాడు సందీప్. కొంచెం దూరంలో చిన్న కొలను కనబడింది. జీపులోని వాటర్ క్యాన్ తీసుకొని, నీళ్ళవైపు నడిచాడు.
అడవిలో ప్రవేశించాక. 'ఎంత చిత్రమైనది, ఎంత అద్భుతమైనది ఈ సృష్టి!' అని సంభ్రమం కలిగించే వింతలు ఎన్నో కనబడుతుంటాయి.
వాటర్ క్యాన్ లో నీళ్ళు ముంచడానికి వంగిన సందీప్ కి అలాంటి చిత్రమే ఒకటి కనబడింది. నీళ్ళలో పూసిన పువ్వులాగా ఒకేచోట నిశ్చలంగా తేలుతూ ఉండే ఆ జంతువు పేరు సీ అనెమోన్. చేపలు దాని ఆహారం. దాని శరీరం చుట్టూ వేళ్ళలాంటి టెంటకిల్సు ఉంటాయి. ఆ టెంటకిల్స్ కొనలలో సన్నటి దారాల వంటివి ఉంటాయి. చేప దగ్గరికి రాగానే, టెంటకిల్స్ తో పట్టుకొని, ఆ దారాలను చేప శరీరంలోకి షూట్ చేస్తుంది. చేప శరీరంలోకి చొచ్చుకు పోగానే ఆ దారపు కొనలు బాంబుల్లాగా పేలి, ఒక విషాన్ని విడుదల చేస్తాయి. చేప చనిపోతుంది.
ఈ చిత్రాన్ని నిర్నిమేషంగా చూస్తున్నాడు సందీప్.
మళ్ళీ హఠాత్తుగా అతని మనసు ప్రమాదాన్ని శంకించింది.
మళ్ళీ భూతాలరాజేనా ?
వెనక్కి తిరిగి చూశాడు.
 ఎవరూ లేరు. కాని ఆకుల మధ్య స్పల్పమైన కదలిక. అంతలోనే అంతా నిశ్చలం.
వాటర్ క్యాన్ చేతిలో పట్టుకుని, ఆ ప్రాంతమంతా పరీక్షగా చూశాడు సందీప్. కాళ్ళకింద ఇసక తడితడిగా వుంది. నీటి అంచుదాకా తన అడుగుజాడలు కనపడుతున్నాయి. వాటిమీద సూపర్ ఇంపోజ్ చేసినట్లు - ఏమిటవి ?
ఒంగి చూశాడు.
పెద్దపులి పంజా గుర్తులు !
అంటే - తాను వాగుని సమీపించి, నీళ్ళు పడుతూ ఉన్నప్పుడు పెద్దపులి చడీ చప్పుడూ కాకుండా వెనకనుంచీ వచ్చిందన్నమాట! బహుశా ఇది పెద్దపులి అలవాటుగా నీళ్ళు తాగే ప్రదేశం అయి ఉండవచ్చు. చివరి క్షణంలో తనని గమనించి, వెనుదిరిగి వెళ్ళిపోయిందా పులి ?
 సాధారణంగా పులి మనిషిని చూస్తే తప్పుకొని వెళ్ళిపోతుంది. చంపదు. మనిషి పెద్దపులికి సహజమైన ఆహారం కాదు.
కుతూహలంగా, పులి పంజా గుర్తులవైపు చూశాడు సందీప్. పంజా గుర్తులని బట్టే పులి తాలూకు వివరాలు చాలా సేకరించవచ్చు.
 పరిశీలనగా చూసిన తర్వాత, ఆ పులి ఆడదనీ, వయసులో ఉన్నదనీ, దాని ముందుకాళ్ళలో కుడికాలుకి ఏదో లోపం వున్నదనీ గ్రహించాడు.

 Previous Page Next Page