లాంజ్ కి ఒకవైపు గోడకి బదులు అద్దాలే ఉన్నాయి. ఆ అద్దాలలో నుంచి కనబడుతోంది, ముప్ఫయ్ అయిదుకోట్ల రూపాయలు విలువచేసే ఎయిర్ బస్. రెండంతస్థుల ఇల్లంతా ఉంది అది.
పాసెంజర్స్ విమానం ఎక్కడానికి ఇంకా పిలుపు రాలేదు. టేకాఫ్ కి ఇంకా టైం వుంది. అంతా అక్కడ వున్న కుర్చీలలో కూర్చుని వున్నారు.
అక్కడే వున్న కూలర్ లో నీళ్ళు తాగడానికి లేచాడు శతృఘ్న. గ్లాసులోకి నీళ్ళు పట్టుకుంటూ ఉండగా -
అతని చేతినెవరో గట్టిగా పట్టుకున్నారు.
గుండె ఆగినట్లయింది శతృఘ్నకి. చివుక్కున వెనక్కి తిరిగాడు.
తొమ్మిదేళ్ళ పాప తెలివిగా కనబడుతోంది. పెద్ద పెద్ద కళ్ళు, బాబ్ చేసిన జుట్టు, గులాబిరంగు ఫ్రాక్.
"అంకుల్! నాకు కూడా నీళ్ళు కావాలి"
తన చేతులు వణుకుతున్నాయని అప్పుడు గ్రహించాడు శతృఘ్న. వణికే చేతులని అదుపులోకి తెచ్చుకుంటూ, నీళ్ళగ్లాసు పాపకి అందించాడు.
గ్లాసుని రెండు చేతులతో పట్టుకుని గటగట తాగింది పాప.
"థాంక్స్ అంకుల్! నా పేరు స్మిత! మరి నీ పేరో?"
కాస్త ఆలోచించి, "షాట్ గన్!" అన్నాడు నవ్వు తెచ్చుకుంటూ.
ఆశ్చర్యంగా చూసింది స్మిత.
"నువ్వు జోక్ చేస్తున్నావు అవునా? సరే! నీ సీటు నెంబరెంత?"
టిక్కెట్టు చూసి చెప్పాడు శతృఘ్న.
"అరె భలే తమాషా! నా నెంబరు చూశారా! సరిగ్గా నీ సీటుకి వెనక సీటే అవుతుంది. నాది విండో సీటు అన్నమాట!"
ఆ అమ్మాయి వంక పరీక్షగా చూశాడు శతృఘ్న.
"నువ్విదివరకు ఎయిర్ జర్నీ చేశావా పాపా?"
"ఓ! బోలెడన్నిసార్లు! మరి మా డాడీకి ఢిల్లీలో ఉద్యోగం! మమ్మీకేమో హైదరాబాద్ లో ఉద్యోగం! మరి ఎయిర్ జర్నీ ఎందుకు చెయ్యనూ? అంకుల్! ఇవాళ నేను ఒక్కదాన్నే ఢిల్లీ వెళుతున్నా? మమ్మీ ఇక్కడ ఎయిర్ పోర్టుకొచ్చింది నాకేం భయం! ఓన్ లీ టూ అవర్స్ జర్నీ! నో?" అంటూ వెళ్ళి కుర్చీలో కూర్చుని తన హాండు బ్యాగుని కాళ్ళమధ్యకు లాక్కుని భద్రంగా పట్టుకుంది స్మిత.
ఆ అమ్మాయి వైపే కొద్ది క్షణాలు చూస్తూ ఉండిపోయి, తర్వాత గటగట రెండు గ్లాసుల నీళ్ళు త్రాగాడు శతృఘ్న.
స్పీకర్ అనౌన్స్ మెంటు వినబడుతోంది. "యువర్ అటెన్షన్ ప్లీజ్! హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే విమానం ఫ్లయిట్ నెంబరు 1.సి. సో అండ్ సో...ప్రయాణానికి సిద్ధంగా ఉన్నది, ప్రయాణికులు ఎయిర్ బస్ విమానంలో ఎక్కాలని కోరుతున్నాము. థాంక్యూ?"
శతృఘ్నా, ఇక్బాల్, విక్టరు ముగ్గురూ విడివిడిగా లాంజ్ ఎంట్రన్స్ గేటుదాటి విశాలంగా ఎకరాల మేర వ్యాపించి ఉన్న స్థలంలోకి నడిచారు. నేలంతా నున్నగా సిమెంటు చేసి ఉంది. అక్కడ 'బే'లో ఎయిర్ బస్ విమానమూ, దానికంటే కొంచెం చిన్నదయిన బోయింగ్ 737 విమానమూ నిలబడి ఉన్నాయి. ఈ రెండు జెట్ విమానాల కంటే చిన్నదయిన ఆవ్రో విమానం ఒకటి కొంచెం దూరంలో నిలబడి ఉంది. ఫాన్లలాంటి ప్రొపెల్లర్ లు గాలిని కోస్తూవుంటే, ముందుకు వెళ్ళే పాత మోడల్ విమానం అది. పెద్దవాళ్ళమధ్య చిన్నపిల్లలాగా నిలబడి ఉంది. దాన్లో కేవలం తొమ్మిది సీట్లే ఉంటాయి. ఎయిర్ బస్ తో పోలిస్తే తూనీగలాగా ఉంటుంది అది.
జెయింట్ సైజు సోడియం ఆర్క్ లైట్లు విమానాశ్రయమంతటా పసుపురంగు కాంతిని పరుస్తున్నాయి.
టెర్మినల్ బిల్డింగుకి కొన్ని గజాల దూరంలో ఆగివుంది విమానం. మెట్లు అమర్చిన ట్రక్కు ఒకటి తలుపు దగ్గరగా నిలిచి వుంది.
విమానాన్ని సమీపించి తల ఎత్తి చూశాడు శతృఘ్న. విమానం రెక్క చాలా ఎత్తుగా ఉంది. అంతకంటే ఎత్తులో వుంది పైలట్లు కూర్చునే కాక పిట్. ఆ విండోలో నుంచి అసంఖ్యాకమైన డయల్సు కనబడుతున్నాయి.
ఇంత బరువున్న ఈ విమానం, ఇంతమంది ప్రయాణీకులనీ, ఇంత సామానునీ మోసుకుంటూ, గాలిలో అంత ఎత్తున, అంత వేగంగా ప్రయాణం చేస్తుందని తలచుకోవడానికే ఆశ్చర్యంగా వుంటుంది.
ఈ విమానం తన కంట్రోలులోకి వస్తుంది ఇంకో అరగంటలో!
మెట్ల దగ్గర నిలుచున్న తనకి బోర్డింగు పాసులు ఇచ్చి, అతని చింపి ఇచ్చిన కౌంటర్ ఫాయిల్స్ దగ్గర పెట్టుకుని విమానం ఎక్కారు శతృఘ్నా, ఇక్బాల్, విక్టర్ వివేకానంద్.
ఎయిర్ పోర్టులోనే పనిచేసే ఒకమ్మాయి స్మితని తీసుకొచ్చి విమానం ఎక్కించింది.
విమానం లోపల దంతంతో చేసినట్లుంది డెకార్. చిన్న సినిమా థియేటరంత పెద్దదిగా కనపడుతోంది అది. లోపలికెళ్ళగానే సన్నటి సువాసన వచ్చింది. తగ్గు స్థాయిలో శ్రావ్యమయిన సంగీతం స్పీకర్లలో నుంచి వినబడుతోంది లైట్లతో ప్రకాశవంతంగా ఉంది పాసెంజెర్స్ కేబిన్.
ఈలోగా -
లాంజ్ లో, రెస్టారెంటులో ఉన్న స్పీకర్లలోనుంచి వినబడుతోంది అనౌన్స్ మెంటు.
"ఢిల్లీ వెళ్ళే పాసెంజర్ మిస్టర్ జి.కృష్ణ కుమార్ వెంటనే సెక్యూరిటీలో రిపోర్టు చెయ్యాలి. ఢిల్లీ వెళ్ళే విమానం టేకాఫ్ కి సిద్ధంగా ఉంది."
ఆ జి.కృష్ణకుమార్ టిక్కెట్టు మీద ఢిల్లీ వెళ్ళవలసి వున్న రాజేందర్ ఇంకా ఎయిర్ పోర్టుకి రెండు కిలోమీటర్ల దూరంలో వున్నాడు.
"త్వరగా పోనీ!" అని హెచ్చరిస్తున్నాడు అతను టాక్సీ డ్రైవరుని. డ్రయివరు యాక్సిలేటరుని తొక్కిపట్టాడు.