ఈలోగానే, ఇద్దరు బాడీగార్డ్సు కిందికి దిగారు. కాశీని హెలికాప్టర్ లోకి ఎక్కించారు.
కొద్ది నిమిషాల తర్వాత నగరంలో ఉన్న ఓ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు కాశీని.
"ఫుడ్ పాయిజనింగ్" అన్నాడు డాక్టర్ కాశీని టెస్ట్ చేసి.
ఫుడ్ పాయిజనింగ్!
గుండె గుభేలుమన్నట్లు అయింది ఐశ్వర్యకి.
విషం దేన్లో కలిసింది? సాయంత్రం పార్టీ ఎలాగా? కాశీకి స్టమక్ వాష్ చేశారు. చిన్నప్పటి నుంచి పద్ధతిగా పెరిగిన మనిషి కాబట్టి, ఆరోగ్యవంతమైన శరీరం కావడం వల్ల గండం గడిచి బయటపడ్డాడుగానీ... లేకపోతే ఆపాటికి ప్రాణాలు పోయి ఉండేవే.
చాలా ఆందోళనగా ఎంక్వయిరీ మొదలెట్టింది ఐశ్వర్య. ఆ ఆందోళన కాశీ కోసం కాదు. పార్టీ పాడయిపోతుందేమోనని భయం! విషం దేన్లో కలిసింది? ఎలా కలిసింది?
ఓ గంట తర్వాత విషం గురించిన విషయాలు బయటపడ్డాయి. బాలూ సహకారంతో.
అతని కథనం ప్రకారం -
లక్కీ మేడమ్ హెలికాప్టర్ లో చైనీస్ గార్డెన్ నుంచి స్వీటు తీసుకొచ్చి ఈ గార్డెన్ లో దింపింది. అప్పటికే ఒక ఆకతాయి కోతి తోటనంతా అల్లకల్లోలం చేసేస్తోంది. అది కిచెన్ లోకి వెళ్ళి, అక్కడ ఉన్న స్పెషల్ డెసర్ట్ పాకెట్ ఒకటి తీసుకుని పారిపోయింది. అది స్వీటుని సగం తిని, సగం పారేస్తే, కాశీ తెలిసీ తెలియక దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. ఫ్లాట్ గా పడిపోయాడు.
బాంబే నుంచి వచ్చిన స్వీటుని టెస్ట్ కేసుగా ఓ పిట్టకు పెట్టించింది ఐశ్వర్య. అది రెక్కలు అల్లల్లార్చి విలవిల్లాడి అప్పటికప్పుడే ప్రాణాలు వదిలింది.
అప్పటికే అందరూ తోటకి చేరుకున్నారు. ఐశ్వర్య తల్లిగారయిన పార్వతి కళ్ళలో నీటిపొర నిలిచి ఉంది.
కొంచెం దూరంలో నిలబడి ఆమెనే తదేకంగా చూస్తోంది ఐశ్వర్య.
ఆమెకి కొంతసేపటి క్రితం జరిగిన సంఘటన హఠాత్తుగా గుర్తొచ్చింది - తోటలో కొంతమంది రౌడీ వెధవలు తన మీదపడి చంపే ప్రయత్నం చెయ్యడం!
ఆ కాశీ అనేవాడు వాళ్ళను పట్టుకుంటే వాళ్ళు తన తల్లే తనని చంపడానికి పురమాయించిందని చెప్పడం!
గంట గడవకుండానే మళ్ళీ ఈ గండం!...
విషప్రయోగం!
అయితే తన తల్లి... కాదు... తన సవతి తల్లి శ్రీమతి పార్వతిగారే నిజంగా తనని చంపాలని చూస్తోందా?
తన పుట్టినరోజునాడే తనని చంపాలని చూస్తోందా? అది నిజమేనా?
నెమ్మదిగా పార్వతి దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య.
"చాలా థాంక్స్ అమ్మా!" అంది.
"దేవుడికి థాంక్స్ చెప్పు శ్రీ. ఇవాళ లేచిన వేళ మంచిది" అంది పార్వతి, వణుకుతున్న గొంతుతో.
"నా కోసం బాంబే నుంచి అంత స్పెషల్ గా స్వీటు తెప్పించాలని నీకు ఎందుకు అనిపించిందమ్మా? నాతో మాట మాత్రం చెప్పను కూడా లేదే, సైలెంటుగా లక్కీని పంపించావు. తెప్పించావు. నేనంటే నీకు ఎంత ప్రేమ అమ్మా!" అంది నాటకంలో పాత్రధారిణి నాలిక చివర ఉన్న డైలాగులు చెబుతున్నట్లుగా ఉందిగానీ ఆ మాటలు మనసులోనుంచి వచ్చినవి కావు.
ఒక్కసారిగా ఐశ్వర్యని దగ్గరికి తీసుకుని, గుండెలకు గాఢంగా పొదువుకుంది పార్వతి.
మరుక్షణమే అయిష్టంగా ఆమెకి దూరంగా జరిగిపోయింది ఐశ్వర్య.
దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడిపోయింది పార్వతి గుండె.
లక్కీని పక్కకి పిలిచింది ఐశ్వర్య.
"లక్కీ!"
"శ్రీ! ఇవాళ ఎంత దుర్దినం! ఎంతో మంచిరోజు కూడా! నువ్వు బతికి బయటపడ్డావు శ్రీ..."
"బతికి బయటపడ్డది నేనుకాదు. ఆ కొత్త తోటమాలి...బెనా...కాశీ! అతను ఆ స్వీటు తిని ఉండకపోతే, తప్పకుండా దాన్ని నేనే మొదట రుచి చూసి ఉండేదాన్ని. ఫినిష్!"
"టేకిట్ ఈజీ శ్రీ! దిస్ ఈజ్ ఆల్ ఇన్ ద గేమ్! నువ్వు సూపర్ రిచ్ గర్ల్ వి. నీ ఆస్తి మీద ఎందరికో కన్ను. నీ మీద ఇప్పటికే ఫిఫ్టీస్ మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి. దేవుడున్నాడు శ్రీ"
"లేని దేవుణ్ణి లాక్కురాకు.. ఉన్న దెయ్యం సంగతి చూడు!" అంది ఐశ్వర్య పరుషంగా.
"ఎవరు?"
"లక్కీ! నేను చస్తే ఈ ఆస్తి అంతా ఎవరికి పోతుంది?"
"శ్రీ... గాడ్ ఫర్ బిడ్..." అంది లక్కీ అప్ సెట్ అయిపోతూ.