సరిగ్గా అదే మానసిక స్థితిలో ఉంది భానూ.
ఆమెకు హఠాత్తుగా మరో ఆలోచన వచ్చింది.
'షాక్ తగులుతుంది. భద్రంగా ఉండమని తన కూతుర్ని హెచ్చరిస్తోంది కొత్త మమ్మీ!
తను నిజంగానే షాక్ తగిలి చనిపోతే ఎలా ఉంటుంది? షాకయిపోతారా అందరూ?
చాలా బాగుంటుంది ఈ చావు! ఉరికంటే ఉత్తేజకరంగా, విషం కంటే విశేషంగా ఉంటుంది.
'షాక్!' అవును!
వెంటనే లేచి పెన్ను పేపరూ తీసుకుంది భానురేఖ. తను ఎక్కడికెళ్ళిపోయిందో నాన్నగారికి తెలియకపోతే ఎలా? ఉత్తరం రాయడం మొదలెట్టింది.
"నాన్నగారికి,
నమస్కారాలు.
మీరు ఊరినుంచి వచ్చేసరికి నేను వెళ్ళిపోయి ఉంటాను - అమ్మ దగ్గరికి. మీ పనులన్నీ అయిపోయాక, వీలు చిక్కితే మీరూ రండి! మీరు చాలా బిజీగా ఉన్నారు. వెంటనే రాలేకపోయారు అని అమ్మతో చెబుతాను. అమ్మకి అర్థం అవుతుంది. మీరు బాధపడవద్దు.
నాన్నా! మన ముగ్గురం కలిసి ఉన్నప్పుడు ఈ ఇల్లే నాకు స్వర్గంలా ఉండేది.
మళ్ళీ స్వర్గంలోనే మనం ముగ్గురం కలుసుకుని కలిసి ఉందాం.
మీకోసం ఎదురు చూస్తూంటాం మేము.
లవ్,
భానూ
ఆ రోజు అన్నం తిననేలేదు భానూ.
ఆమె అంటేనే మండిపడిపోతున్న విలాసిని తినమని బలవంతం చెయ్యలేదు. పింకీని తీసుకుని ఎక్కడికో వెళ్ళిందామె.
ఇంట్లో ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక లేచి నిలుచుంది భానురేఖ. మనసెంతో తేలిగ్గా, హాయిగా వుంది తనకు. తన బొమ్మని ఎత్తుకుంది.
ఈ బొమ్మ కూడా తనతోబాటు దేముడి దగ్గరి కొచ్చెయ్యాలి! అంతేగానీ అమ్మ పోయిన తర్వాత తను ఏడ్చినట్లు ఇది తనకోసం ఏడవకూడదు.
ఎలక్ట్రిక్ ఐరను వైరుకి లూజ్ కనెక్షన్ ఉంది. దాన్ని పింకీ పట్టుకోబోతేనే తిట్టింది వాళ్ళమ్మ. ఆ ప్లగ్గులో కూడా లూజ్ కనెక్షన్ ఉంది.
ప్లగ్గుని సాకెట్ లో పెట్టింది భానూ.
చెయ్యి ముందుకి జాచింది.
మరుక్షణంలో వైర్ ని తాకింది ఆమె నాజూకయిన చెయ్యి.
అప్పుడు ఆమె పెట్టిన ఆర్తనాదం ఆ ప్రేమ్ నగర్ అపార్ట్ మెంట్స్ లోని ప్రతి మనిషి ఒళ్ళూ జలదరించేలా చేసింది.
ఇందాకటి సంఘటన నుంచే ఇంకా తేరుకోలేదు జనం! మళ్ళీ ఇప్పుడు ఇది!
మళ్ళీ ఏమయింది?
దబదబదబ అడుగుల చప్పుడు. అందరూ నాలుగో అంతస్తు చేరుకొని భానురేఖ వాళ్ళ అపార్ట్ మెంట్ ముందు గుమిగూడారు.
మధుకర్ కాలే మాత్రం అందరికంటే ముందు చొరవగా లోపలికెళ్ళిపోయాడు.
అక్కడ -
విరుచుకు నేలమీద పడిపోయి ఉంది భానురేఖ. కుడిచెయ్యి కమిలినట్లుగా అయిపోయింది. చేతిలో వైరు. ఎడమ చేతిలో ఒక ఉత్తరం.
జరిగినదేమిటో అర్థం చేసుకోగలిగాడు మధుకర్ కాలే.
షాక్ తగిలి పడిపోయి వుంది అమ్మాయి. వెంటనే అతను పరిగెత్తి, సాకెట్లో నుంచి ప్లగ్ లాగేశాడు. ఫోన్ ఎత్తి డాక్టర్ కి రింగ్ చేశాడు.
ఆమె తల్లీ తండ్రీ ఎవరూ ఇంట్లో లేరు కాబట్టి, ఏమన్నా జరిగితే తమ మీదకు వస్తుందని భయపడ్డారు ఎవరికి వాళ్ళు. అందుకని పోలీసులకి కూడా ఫోన్ చేశాడు కాలే.
పోలీసులు వచ్చిన తర్వాత అరగంటకు ఇల్లు చేరింది విలాసిని. ఖాకీ యూనిఫారాలని చూడగానే ఆమెకు గుండె జారిపోయినట్లనిపించింది.
వెంటనే విజయవాడలో ఉన్న తన భర్తకు ఎస్.టి.డి. చేసి ఏడుపుతో మూసుకుపోతున్న గొంతుతో జరిగింది అంతా చెప్పింది.
తక్షణం బయలుదేరి వచ్చేస్తాననీ, ధైర్యంగా ఉండమనీ, ఫ్యామిలీ డాక్టర్ ని పిలిపించమనీ చెప్పాడు రఘురాం.
మెదడు మొద్దుబారి పోయినట్లు చాలాసేపు అలాగే కూర్చుని ఉండిపోయి, తర్వాత టాప్ రాంకింగ్ పోలీస్ ఆఫీసర్లకి కొందరికి ఫోన్ చెయ్యడం మొదలెట్టాడు.
ఇక్కడ -
వణుకుతూ ఒక సోఫాలో కూర్చుండి పోయింది విలాసిని. భయంతో కడుపులో తిప్పుతున్నట్లు వుంది ఆమెకు. సిగ్గుతో తల కొట్టేసినట్లు వుంది. ఫ్యామిలీ డాక్టరు వచ్చి భానురేఖని అటెండ్ అవుతున్నాడు. పోలీసు ఇన్ స్పెక్టర్ భానురేఖ చేతిలోని సూసైడ్ నోట్ ని చదివి విలాసినికి అందించాడు.
ఈ గందరగోళాన్నంతా తను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చూస్తోంది పింకీ.
భానురేఖకి షాక్ బాగా తగిలిందనీ, కానీ ప్రాణానికి ముప్పు లేదనీ చెప్పాడు ఫ్యామిలీ డాక్టర్.
అప్పుడు మొదటిసారిగా గుండెలనిండా గాలి పీల్చుకుంది విలాసిని. అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న జనం అంతా అక్కడే ఉన్నారు. పరామర్శలు, కుతూహలంతో కూడిన ప్రశ్నలూ, వ్యంగ్యంతో కూడిన కామెంట్లూ.