కొన్ని గంటలు దుర్భరంగా గడిచిన తర్వాత అక్కడికి చేరుకున్నాడు రఘురాం. వచ్చీరాగానే ముందు కూతురి పక్కన కూర్చుని, ఆమె నుదుటిని గాఢంగా చుంబించాడు. ఒక వెచ్చటి కన్నీటి చుక్క అతని కనుకొలకుల్లోంచి జారి భానురేఖ కనురెప్పలని తడిపింది. "భానూ" అన్నాడు కలవరిస్తున్నట్లు.
భానూ పలకలేదు. అసలు స్పృహలో లేదు తను.
కాసేపు అక్కడే కూర్చుని, తర్వాత ఇన్ స్పెక్టర్ దగ్గరికి నడిచాడు రఘురాం.
"దయచేసి అర్థం చేసుకోండి! మా అమ్మాయి అంత తెలివైన పిల్ల కాదు. అవివేకంతో ఏదో చేసేసింది" అన్నాడు బతిమాలుతూ.
సానుభూతిగా తలపంకించాడు ఇన్ స్పెక్టర్.
"అవుననుకోండి! కానీ సూసైడ్ ప్రయత్నం అంటే నేరమే కదా? కేసు బుక్ చెయ్యవలసి వస్తుంది."
"నేను మాట్లాడవలసిన వాళ్ళతో ఇంతకు ముందే మాట్లాడాను. మీరు సైలెంటుగా ఉండిపోతే గొడవేమీ ఉండదు. ఈ ఒక్క సహాయం చెయ్యండి. నాకు చేసే ఫేవర్ కి బదులుగా..." అని జేబులో నుంచి నోట్ల కట్ట తీశాడు రఘురాం. "ఇది ఉంచండి."
నోట్లకట్ట పట్టుకున్న రఘురాం చేతిని నెమ్మదిగా నెట్టేశాడు ఇన్ స్పెక్టరు.
"వద్దు! నేనూ ఒక తండ్రినే!"
"ఏమీ అనుకోకండి! థాంక్స్!"
వాళ్ళిద్దరూ బయటికి వచ్చేసరికి అప్పుడే కళ్ళు తెరుస్తోంది భానురేఖ.
"ఏమ్మాయ్! ఎలా ఉంది?" అన్నాడు ఇన్ స్పెక్టరు.
కళ్ళు పెద్దవి చేసి భయంగా అతని ఖాకీ యూనిఫారం వైపు చూస్తూ ఉండిపోయింది భానురేఖ. తను చనిపోలేదా? ఇంకా బతికే ఉందా? అయ్యో! ఎందుకిలా జరిగింది? అసలు ఆ రోజు కారు యాక్సిడెంటులోనే అమ్మతోబాటు తను కూడా చనిపోయి ఉంటే ఎంత బాగుండేది? అప్పుడు బతికి బయటపడ్డం వల్లనే ఇన్ని కష్టాలు వచ్చాయి తనకి. ఇప్పుడు మళ్ళీ చావకుండా బతికింది. దీనివల్ల ఇంకెన్ని కష్టాలో!"
ఇన్ స్పెక్టరు తర్జనితో ఆమెని బెదిరిస్తున్నట్లు అన్నాడు. "నువ్వు మంచి అమ్మాయివని మీ నాన్నగారు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను. ఈసారి మళ్ళీ ఇలా చేశావంటే ఏం చేస్తానో తెలుసా?"
ఊపిరందనట్లు చూస్తోంది భానురేఖ.
"తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాను రెండేళ్ళపాటు! తెలిసిందా! జాగ్రత్త!"
ఆమె మంచికోసమే చెబుతున్నాడనుకుని అలా మాట్లాడాడు అతను.
కానీ చాలా మోటుగా చెప్పాడు చెప్పవలసిన దానిని.
హతాశురాలయిపోయింది భానురేఖ.
తను మళ్ళీ బతికి బయటపడటమే కాకుండా, ఇంకెప్పుడూ చనిపోయే ప్రయత్నం కూడా చెయ్యకూడదా?
చేస్తే జైల్లో పెడతారా?
అలా అయితే అమ్మ దగ్గరకెళ్ళిపోవడానికి వీల్లేదా? అందరిచేతా ఛీఛీ అనిపించుకుంటూ ఇక్కడే ఉండిపోవాలా? ఎన్నాళ్ళు? ఎన్నేళ్ళు? ఎంత నిరుత్సాహంగా, ఎంత డల్ గా ఉంది ఈ ఆలోచన!
"వింటున్నావా?" అన్నాడు ఇన్ స్పెక్టరు పోలీసు గొంతుతో దబాయిస్తూ.
అస్పష్టంగా పెదిమలు కదిలించింది.
"మర్చిపోకు ఈసారి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేస్తే జైలు శిక్షే! గుర్తుంటుందా?"
నీరసంగా తల ఊపింది భానురేఖ.
పోలీసులు వెళ్ళిపోయారు. చాలా జాగ్రత్తలు చెప్పి డాక్టర్ కూడా వెళ్ళిపోయాడు.
వెంటనే రఘురాం భుజం మీద తలపెట్టి భోరున ఏడవడం మొదలెట్టింది విలాసిని.
"నిజంగానేనండీ! నేనేం తప్పు చెయ్యలేదు. పింకీని కోప్పడినట్లే అప్పుడప్పుడూ భానూని కూడా కోప్పడతానేమో! అంత మాత్రానికే ఇలా...! అమ్మో! ఇంకేమన్నా జరిగివుంటే ఎంత గొడవయిపోయి ఉండేది! ఇప్పటికే పరుగు బజార్న పడిపోయింది! దేవుడు నన్నెందుకిలా శిక్షిస్తున్నాడండీ! మన మీద ఆయనకింత కోపమెందుకు?"
చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్చలంగా ఉండిపోయాడు రఘురాం. తర్వాత మెల్లిగా అన్నాడు. "ఆల్ రైట్! జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. కారణాలు ఏమైనా భానూని సరిగ్గా చూసుకోలేకపోయాం మనం. తనని సరిగ్గా చూసుకోగలిగినవాళ్ళు ఒక్కరే ఉన్నారు."
"ఎవరు?" అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది విలాసిని.
"భానూకి కాబోయే భర్త! అవును! తనకి పెళ్ళి చేసెయ్యడం మంచిది! పెళ్ళయితే భర్తతో కొత్త జీవితం! దానితో మార్పు వస్తుందేమో అమ్మాయిలో!"
తేలిగ్గా నిట్టూర్చింది విలాసిని. భానూకి పెళ్ళవడం తనకూ ఇష్టమే! పైగా తనకూ భారం తగ్గుతుంది. ఈ చికాకులు తగ్గుతాయి. ఒక విధంగా ఇదీ మంచి ఆలోచనే! "పెళ్లి చేసి పంపించేసేదాకా భానూని వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని వుండాలి మనం. బయటికి అస్సలు పోనివ్వకు!" అన్నాడు రఘురాం. సరేనన్నట్లు తల ఊపింది విలాసిని.
భానూకి ఈ మాటలేవీ వినబడటం లేదు. ట్రాన్స్ లో ఉన్నట్లు కప్పువంకే చూస్తోంది. కప్పుకి ఉన్న తెల్లటి పెయింటు అమ్మ కట్టుకునే తెల్లచీరెలా ఉంది. ఫాన్ రెక్కలు మెల్లిగా తిరుగుతుంటే అవి అమ్మ చేతులు జాచినట్లు కనబడి, "రా పైకి రా' అని ఆహ్వానిస్తున్నట్లు ఉన్నాయి.
తనని అందుకోమన్నట్లు చేతులు పైకి ఎత్తింది భానూ.