పమిట జారిపోయి వున్న ఆమె వక్షం వైపు చూశాడు జయరాజ్. "నాకూ ఆకలిగానే వుంది భానూ!"
"నిద్ర కూడా వచ్చేస్తోంది అంకుల్!"
"మా ఫ్లాట్ కి రా! అన్నం తినేసి హాయిగా ఇద్దరం పడుకుని నిద్రపోదాం! ఏం?"
దాదాపు తనంత పొడుగు వున్న భాను వైపు ఆకలిగా చూస్తూ, మరింత దగ్గరిగా జరిగాడు అతను.
వెనక్కి జరిగింది భాను. లిఫ్టు గోడ వీపుకి తగిలింది.
"నేను చెప్పినట్లు చెయ్యకపోతే నువ్వు అల్లరి చేస్తున్నావని మీ అమ్మతో చెబుతాను. జాగ్రత్త!"
"వద్దంకుల్! నన్ను పోనివ్వండి అంకుల్!"
"నన్ను అంకుల్ అని పిలవకు! జయరాజ్ అని పిలు" అతని చేతులు ఆమెవైపు రాసాగాయి.
అప్పుడు పెట్టింది భాను పెద్ద కేక! ఆ కేక కలిగించిన శబ్ద తరంగాలకు బయట వున్న గ్రిల్ ఊగిసలాడుతున్నట్లు శబ్దం! నిజానికి ఆ శబ్దం రవిచంద్ర చేస్తున్నాడు. అది జయరాజ్ కి కూడా వినబడింది.
మళ్ళీ మళ్ళీ మళ్ళీ గ్రిల్ మీద కొడుతున్నాడు రవిచంద్ర.
బయట ఎవరో వుండి గమనిస్తున్నారని గ్రహించగానే జయరాజ్ గుండె జారిపోయింది.
భయపడుతూ లిఫ్టు తలుపులు తెరిచాడు.
తలుపులు తెరుచుకోగానే, గబగబ వణికిపోతూ నిలబడి వున్న భానురేఖని మొదట గమనించాడు రవిచంద్ర. ఆమె జాకెట్టు కొద్దిగా చిరిగి వుంది. పమిట పేలికలై వుంది. భయంతో వళ్ళంతా చెమట పట్టేసి వుంది.
జయరాజ్ ని కాలర్ పట్టుకుని లిఫ్టులో నుంచి బయటకు లాగాడు రవి. బలమంతా ఉపయోగించి పిడికిలితో అతని మొహంమీద గుద్దాడు. వెంటనే మరో దెబ్బ! మరో దెబ్బ! జయరాజ్ ముక్కులో నుంచి రక్తం కారడం మొదలెట్టింది.
శాయశక్తులా పెనుగులాడి రవి పట్టు విడిపించుకుని మెట్ల మీదగా పరిగెత్తబోయాడు జయరాజ్.
అదే సమయంలో మెట్లమీద నుంచి మధుకర్ కాలే పరిగెత్తుకు రావడం కనబడింది. అతని వెంట మరికొంతమంది మనుషులు.
జనం జయరాజ్ ని పట్టుకుని చితక తన్నడం మొదలెట్టారు. కాలే రవికి థాంక్స్ చెప్పి భానురేఖని వాళ్ళ ఫ్లాట్ దగ్గరకు తీసుకెళ్ళి విలాసినికి అప్పగించాడు. గొడవేమిటో జరుగుతున్నదని తెలిసి అప్పటికే తలుపు దగ్గరికొచ్చి నిలబడి చూస్తోంది విలాసిని.
జరిగింది తెలియగానే అవమానంతో కందిపోయింది విలాసిని మొహం. అపార్ట్ మెంట్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్న తరువాత తిట్టడం మొదలెట్టింది భానురేఖని.
"నేనేం చెయ్యలేదు మమ్మీ!" అంది భాను, ఏడుపు గొంతుతో.
"ఇంకా ఏం చెయ్యాలి? చేసింది చాలదూ? వయసొచ్చిన పిల్లవి వళ్ళు దగ్గర పెట్టుకుని ఉండొద్దూ? పమిట కూడా సరిగ్గా వేసుకోకుండా తిరుగుతుంటావ్ కాబట్టి పదిమంది కళ్ళూ పడతాయి! అసలు నువ్వొక్కదానివే లిఫ్టు ఎందుకెక్కావ్?"
"ఆడుకుంటున్నాను మమ్మీ!"
"ఆటట! ఆట! ఇన్నేళ్ళొచ్చి ఇంకా గంగిరెద్దులా ఆటలేమిటి? ఈసారి నాతో చెప్పకుండా గడపదాటి చూడు! గరిట కాల్చి వాత బెడతాను!"
గదిలోకి వెళ్ళి పడుకుని ఏడవడం మొదలెట్టింది భానురేఖ.
కాసేపటి తర్వాత స్కూలు నుంచి తిరిగి వచ్చింది పింకీ. వచ్చీరాగానే నడుం మీద చేతులు పెట్టుకు నిలబడి ఆశ్చర్యంగా భానూని చూస్తూ "నిన్ను రేప్ చెయ్యాలని చూశార్టగా!" అంది పెద్ద పేరక్కలా.
కన్నీళ్ళతో తలెత్తి చూసింది భానూ. "రేప్ అంటే?"
నవ్వు మొహం పెట్టింది పింకీ. "అది కూడా తెలియదూ నీకూ? ఇంకేం తెలుసు మరి? పప్పు తిని పడుకోవడం తెలుసా?"
మళ్ళీ ఏడవడం మొదలెట్టింది భానూ.
పింకీ బయటకెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత విలాసిని పింకీని తిట్టడం వినబడింది.
"ఛస్తావ్ రాక్షసీ! ఆ ప్లగ్గుకి లూజ్ కనెక్షన్ ఉంది. యూనిఫారం రేపు నేను ఇస్త్రీ చేసిపెడతాలే! షాక్ తగిలిందంటే మంచినీళ్ళడక్కుండా చచ్చి ఊరుకుంటావ్! నాకు తెలుసు!"
పింకీని తిడుతున్న విలాసిని గొంతులో కోపంకన్నా ఆదుర్దా ఎక్కువ వినబడుతోంది. అల్లరి పిల్ల అయిన తన కూతురు ఏ ప్రమాదంలో ఇరుక్కుంటుందో అన్న ఆరాటం వుంది ఆ గొంతులో.
అది వింటుంటే సన్నగా దిగులేసింది భానురేఖకి. తనని గురించి అలా ఆరాటపడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అసలు?
అమ్మ మాత్రం తనకోసం తహతహలాడిపోయేది. తన చెంప మీద చిన్న కురుపు లేస్తే దానికి ప్లాస్టిక్ అంటించి, అది తగ్గేదాకా మధనపడిపోయేది.
నాన్నగారికీ తానంటే ఇష్టం వుంది. కానీ ఆయన ఎప్పుడూ ఊళ్ళో ఉండరు. తన సంగతి పట్టించుకోరు. ఎప్పుడూ బిజీ బిజీ!
తను చచ్చిపోతే అందరూ ఒక్కసారి తనకోసం గొల్లుమని ఏడుస్తారేమో! నాన్నగారు అన్ని పనులూ కాన్సిల్ చేసుకుని వచ్చేసి తనమీద పడి ముద్దులు పెట్టుకుంటారేమో! ఆ ఆలోచన చాలా తృప్తిని ఇచ్చింది భానురేఖకి.
"నేను చాలా డిస్పరేట్ గా ఉన్నాను. నావైపు చూడండి! నా సంగతి ఇప్పుడయినా పట్టించుకోండి!" అని ప్రపంచానికి తెలియజెయ్యడానికి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారు చాలామంది అంటారు సైకాలజిస్టులు.