"ఏం జరిగింది? ఏమిటి?" అని మీరు నన్ను ప్రశ్నించవద్దు. ఉదయం నించి తిండి త్యాగ సత్యాగ్రహం చేస్తున్నాను. నాకోరిక తీరేదాక...మా బామ్మ "ఊ" అనేదాక నేను ఈ గ్రహం నిగ్రహంగా చేస్తూనే వుంటాను. గాంధీజీ "దండి సత్యాగ్రహం" గురించి గొప్పగ...అదే పనిగ పెద్దలు చెబుతుంటారు_పేపర్లు అదే పనిగ రాస్తుంటాయి. దండి సత్యాగ్రహంలో ఉత్త ఉప్పు మాత్రమే నిషిద్దం. నా తిండి సత్యాగ్రహంలో అలాకాదు ఉప్పుతో పాటు పప్పు...పప్పుతో పాటు తిండి తిప్పలు...చిరుతిండ్లు... బందరులడ్లు... కాకినాడ కాజాలు... సేమ్యా పాయసాలు అన్నిటిని వదిలెయ్యడమన్న మాట.
నేను వాటినన్నిటిని కఠినాతికఠినంగ వదిలేసి నీరసించి... గడ్డిపోచనై నల్లపూసనై చిక్కి శల్యమై గాలిలో తేలిపోతూ వాయువునై అలా అలా పైపైకి మరికాస్త పైకి ఆపైకి అంతే." అంతవరకు చెప్పి "ఈ సుందర సుకుమారి మిమ్మల్ని వదిలిపోయినా నా జ్ఞాపకాల్ని మర్చిపోరు కదే!" విచారంగా అంది.
"ఒసే సుందరి!" బామ్మగారు బాధపడుతూ పిలిచారు.
"మైడియర్ బామ్మా! నాకు ఇప్పటికే ఎంతో నీరసం వచ్చేసింది. కళ్ళవరకు ప్రాణాలొచ్చాయ్. నాలుక పిడచకట్టుకు పోతున్నది... గొంతు ఎండుకు పోతున్నది. కడుపులో మండిపోతున్నది. చివరికి ఇంత పెద్ద శరీరంలో వున్న బుల్లి ప్రాణం గిజగిజా గిలగిలా కొట్టుకులాడి__
"ఒసేయ్...ఒసేయ్! పెద్ద ముండాదాన్ని. ఈ వయసులో నా ప్రాణం తియ్యకే సుందరీ!" బామ్మగారు లబలబలాడుతూ అంది.
"ప్రాణం పోయువాడు తియ్యువాడు ఆపైవాడేనే బామ్మా! అందరం ఎప్పుడో అప్పుడు పోవాల్సిన వాళ్ళమే కదా!" వేదాంత ధోరణిలో చెప్పింది సుందర సుకుమారి.
"ఇదంతా ఏమిటి బామ్మగారు! నాకేమీ అర్థంకావడం లేదు. రిజర్వేషన్ కోసం రైల్వేస్టేషన్ కి వెళ్తూ ఇలా వచ్చాం. ఇక్కడ మీ ఇద్దరి వరసా చూస్తుంటే ఏమిటో అయోమయంగా ఉంది." అంది వందనాదేవి.
"మాక్కూడ అయోమయంగానే ఉంది." చెలులు వంతపాడారు.
"నేపోయింతర్వాత మా బామ్మని మీ ముగ్గురు జాగ్రత్తగా చూసుకుంటామని మాటివ్వండే! మా బామ్మకా వెనకాముందు ఎవరూ లేరు. ముందు నేనే పైకి పోతున్నాను.
"ఆపు" గట్టిగ అరిచింది బామ్మగారు. అదేస్థాయిలో ఉదయం నించి ఇప్పటిదాక జరిగిందేమిటో వివరంగా చెప్పింది బామ్మగారు.
"ఏంటి? మీరు ప్రయాణానికి ఒప్పుకోలేదా!" ఆశ్చర్యంగా అడిగింది ప్రమద.
"మా బామ్మ చాలా మంచిది. నామీదనే పంచప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నది. నేను నోరు తెరచి అడగాలేగాని ఎట్లాంటి కోరికయినా తీరుస్తుంది. నా నోట్లోంచి "ప" అనే అక్షరం రావడం ఆలస్యం పరమాన్నం చేసిపెడుతుంది. "గ" అనే అక్షరం రావడం ఆలస్యం గారెలు చేయడానికి పప్పు నానబోస్తుంది. మా బామ్మలాంటి బామ్మ ఎవరికీ ఉండదు. "బంగారు బామ్మ"అని మీకో పేరు కూడ పెట్టింది. అలాంటి మీరు సుందరి కోర్కె కాదంటమా! ఇంపాజిబుల్ నేన్నమ్మను." అంది రాణి.
"మాటలు వేరు...చేతలు వేరు. కంటికి కనబడుతున్నాయి కదా! అటు బామ్మగారు__ఇటు మనవరాలు గారు__మధ్యలో వంటకాలు. ఇదేదో నిరాహారదీక్ష సత్యాగ్రహం లాంటిది మొదలుపెట్టింది. మనం కూడ సుందరి ప్రీత్యర్థం తిండి నిరాహార దీక్ష చేద్దాం. సుందర్ పక్కనే కూర్చుందాం. బామ్మగారు డౌన్ డౌన్" వందనాదేవి అంది.
ముగ్గురూ కూడ "బామ్మగారు డౌన్ డౌన్" అన్నారు.
"ఆగండాగండి. మీ నలుగురు ఒకటయ్యారు. నేనొక్కదాన్నే ఒకటయ్యాను. సరే మీమాటే కానివ్వండి." బామ్మగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మనవరాలి ప్రయాణానికి.
"బామ్మగారికి జై...బామ్మగారికి జై" అన్నారు నలుగురు.
"మీ కోరిక నేను ఒప్పుకొన్నాను కాబట్టి నా కోరికలని మీరు కాదనకూడదు. అలా కాదంటే ఈ వయసులో నేను దండి సత్యాగ్రహం చేసి ఉప్పుని పూర్తిగ విసర్జిస్తాను. దాంతో నా శరీరంలోని ఉప్పు పూర్తిగా తగ్గిపోయి... బి.పి. పడిపోయి చివరికి నేనే పూర్తిగా కనపడకుండా పోతాను."
"అంత అవసరం లేదే బామ్మా! నీ కోరిక లేమిటో చెప్పు!" ఆ మాట అంటు కొబ్బరి చట్నీ చేతిలోకి తీసుకొంది సుందర సుకుమారి.
"నీవు ఇంటి నుంచి వెళ్ళింది మొదలు రోజుకో ఉత్తరం నాకు అందేలా రాయాలి."
"అలాగే" సుందరి తరపున బామ్మగారికి మాట ఇచ్చింది వందన.
"అదొక్కటే కాదు. నేను చేసి ఇచ్చే పిండివంటలు మొత్తం తీసుకెళ్ళాలి."
ఈ తఫా కూడ "అలాగే" అంది వందన.
"దారులో వాటిని మీరు తినాలి."
ఈ తఫా వందన బదులు సుందర సుకుమారి "అలాగే అలాగే" అంది. అంతేకాదు "ఓస్! ఇవన్నీ చిన్న కోరికలు. రోజుకో లెటర్ రాస్తాను. తిండి తినకపోతే నా శరీరం నా ఆధీనంలో ఉండదు కాబట్టి దారిపొడుగూతా నీవు చేసి ఇచ్చిన నవకాయ పిండివంటలు తింటూనే ఉంటాను. ఫ్రెండ్స్ కి కూడా పెడతాను. సరేనా బామ్మా!" ముద్దుముద్దుగా అంది.
"మీ కోరికకి "సరే" అని ఒక్కసారి తలవొగ్గాను. మరోసారి కూడా "సరే" అంటున్నాను. మీ కాశీయాత్ర సుఖప్రదంగా జరగాలని ఆ సర్వేశ్వరుడిని మనసారా కోరుకుంటున్నాను." బామ్మగారు దొడ్డ హృదయంతో అంది.