ప్రేమబంధం విచిత్రమైంది. అనూహ్యమైంది. కారణాలు ఎరుగనిది. ఒకరికోసం మరొకరు ప్రాణం సైతం అర్పింపగల త్యాగాన్ని కల్పింపగలది. పక్షుల్లో ఇలాంటి ప్రేమబంధం కన్పించింది వాల్మీకికి. ఈ పక్షుల్లో వున్నలాంటి బంధం మనష్యులకేర్పడితే, కుటుంబం, తద్వారా సమాజం, శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతుందని ఆశించి వుంటాడు. అందువల్ల కుటుంబ బంధాన్ని ఘనిష్టము, పటిష్టము చేయడానికి రామాయణ రచన చేసి వుంటాడు.
పక్షుల్లో ఒకటి పడిపోతే, దాని విరహాన్ని భరించలేక మరొకపక్షి ఏడ్చింది. ఇది వాల్మీకికి అకస్మాత్తుగా కన్పించిన ఒక సంఘటన. మరొక వైపు అతను అనునిత్యం చూస్తూవుండిన మానవ కుటుంబం కన్పించింది. దశరథుని కుటుంబాన్ని తీసుకుంటే, అతనికి ముఖ్యంగా వున్నది ముగ్గురు భార్యలే ఐనా, అంతఃపురంలో అనేకమంది ఆడవాళ్లున్నారు. వాల్మీకి ముగ్గురినే తన పాత్రలుగా తీసుకున్నాడు. ఈ ముగ్గురిలో వున్న ఈర్ష్యా, ద్వేషాలు ఒక కుటుంబాన్ని కాల్చి, బూడిద చేయగలిగేంతటివి. కైక తన కొడుకు రాజు కావాలనుకుంటుంది. ఆమెకు ఇతరమేమి కన్పించదు. అంతా గుడ్డి, అంధకారం. కౌసల్య తన కొడుకూ రాజు కావాలనుకుంటుంది. దశరథునికి రాముడంటే యిష్టం. అతడు రాముణ్ణే రాజును చేయాలనుకున్నాడు. ఈ కుటుంబంలో ఒకరికి ఒకరికి పడదు. అందరికి స్వార్థమే. ఈ కుటుంబం నాశనం కావడానికి అన్ని అవకాశాలూ వున్నాయి. ఈ కుటుంబం నాశనం కావడం సహించలేడు వాల్మీకి. ఈ కుటుంబం సంకేతం మాత్రమే. అన్ని కుటుంబాలు అంతే. కుటుంబాన్ని రక్షించడానికి ఒక రాముడ్ని, ఒక సీతను, ఒక భరతుణ్ని, ఒక లక్ష్మణుణ్ణి సృష్టించాడు వాల్మీకి.
ఈ పాత్రలులేని దశరథుని కుటుంబాన్ని ఒకసారి ఆలోచిద్దాం. అప్పుడు రాముడేం చేసేవాడు? రాజ్యం కోసం దశరథుణ్ణి చంపేవాడు. అంతమాట అన్నాడు లక్ష్మణుడు.
"ప్రోత్సాహితో2 యం కైకేయ్యా సదుష్టో యదినఃపితా
అమిత్ర భూతో నిస్సజ్ఞ్గ వధ్యతాం బధ్యతా మపి."
దశరథుడు మన తండ్రి. కైకచే ప్రోత్సహింప బడినవాడై దుష్టుడైవాడు. శత్రువువంటి వాడైనాడు. కాన అతనిని చంపుదాం లేదా బంధిదాం అని అన్నాడు లక్ష్మణుడు.
రాముడు రాజ్యకాంక్షతో అంతపని చేసేవాడు. అలాచేసిన చక్రవర్తులెందరో వున్నారు. కాని రాముడలా చేయలేదు. రాముడలా చేసి వుంటే, భరతుడు రాముని మీదకు యుద్దానికి దిగేవాడు. తనకు రాజ్యం కావాలని. లక్ష్మణుడు, శతృఘ్నుడు మాత్రం ఎందుకూరుకుంటారు? ఆ విధంగా కుటుంబం విచ్చిన్నమై చెట్టుకొకరు, గుట్టకొకరు అయి వుండేవారు.
ఇలాకాకుండా చేయడానికి వాల్మీకి ఆ కుటుంబంలో ప్రేమాంకురాన్ని ప్రవేశబెట్టాడు. దశరథుడంటే రామునికి ఎనలేని ప్రేమ. రాముడంటే దశరథునికీ అంతే. ఈ విషయాన్ని చాలా సుందరంగా చెప్పాడు. వాల్మీకి ప్రేమ విచిత్రమైంది. అది ఏ త్యాగానికైనా వెనుదీయదు. ఢామను ఫితియస్ కథలో తన మిత్రునికోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్దపడతాడు వేరొక మిత్రుడు. ఇది త్యాగానికి పరాకాష్ఠ. మునికి ప్రాణంకంటే తీయనైంది లేదుగా. రాముడు తండ్రిపైన వున్న అపార అభిమానం వల్ల రాజ్యాన్ని త్యజించాడు. అలాంటి త్యాగంలో ఆనందం ఉంది. దేశభక్తుడు ఉరికంబానికెక్కినా, ఆనందంతో ప్రాణాలు విడుస్తాడు. అది ప్రేమలో ఉన్న మహత్తు.
ఇక లక్ష్మణుని విషయాన్ని తీసుకుంటే అతనిది సోదరప్రేమ. అతడు దైవాన్ని సైతం ధిక్కరించాడు. దైవాన్నే బలంతో గెలుస్తానన్నాడు. దశరథుణ్ణి వధించి రామునికి పట్టం కడ్తానన్నాడు. కాని, అన్నమాట విన్నాడు. శాంతించాడు, సోదరుని మాటకు కట్టుబడ్డాడు. అన్నతో అడవులకు వస్తానన్నాడు.
"కథ హి ధేను వత్సం గచ్ఛన్తం నానుగచ్ఛతి?"
దూడవెంట ఆవు పోకుండుట సంభవమగునా? కాన నేను సహితం నీతో అడవులకు రాగలను.
లక్ష్మణుడు రాముణ్ణి మాతృ సమానుడు అంటున్నాడు. తల్లి విషయంలో ఎంత భక్తి వుంటుందో, అంత భక్తిని రాముని విషయంలో కన్పరుస్తున్నాడు. లక్ష్మణుణ్ణి అడవులకు వెళ్లమని ఎవరూ బలవంతం చేయలేదు. రాముడు రమ్మనలేదు. వారించాడు, ఐనా అన్నవెంట లక్ష్మణుడు అడవులకు వెళ్లాడు. అతణ్ణి లాక్కుపోయింది ప్రేమానుబంధమే తప్ప, మరేమికాదు.
"ధను రాదాయ నశరం ఖనిత్ర పిటకాధరఃI
అగ్రతస్తే గమిష్యామి పన్థాన మనుదర్శయన్II"
నేను ధనుర్బాణములు దాల్చి గునపము, చిన్నగంప మున్నగునవి తీసికకొని మార్గం చూపుచు ముందు నడుస్తా అన్నాడు లక్ష్మణుడు.
రామునికి సకల పరిచర్యలు చేయటానికి సేవకుడై అడవికి వెళ్లాడు. ఇది స్వచ్ఛందసేవ. వాస్తవానికి మనమంతా, మన కుటుంబాలకు సేవచేస్తూనే వున్నాము. మనం ఎవరు బలవంతం చేయకుండానే ఇటువంటి సేవలు చేస్తున్నాం. మనం పెంచుకున్న అనుబంధాలు అలాంటివి. అనుబంధాలు - ఆత్మీయత లేని మానవ జీవనం వుంటుందా?
ఇక భరతుడు తనకు సంక్రమించిన రాజ్యాన్ని రామునికివ్వడానికి సిద్ధపడ్డాడు. అదొక త్యాగం.
సీత వాస్తవంగా రామాయణానికి కథానాయక. సీత కథనే చెబుతున్నానన్నాడు వాల్మీకి. సీత విషయంలో వాల్మీకికి ఎనలేని అనురాగం. అతడు సీతపాత్రకిచ్చినంత ప్రాధాన్యత మరేప్రేతకిచ్చినట్లు కన్పించదు. రాముడు లేకుండ అచ్చం సీతతోనే ఒక కాండకు కాండనే నడిపించాడు. దానికి సుందరకాండ అని పేరు పెట్టాడు. సీతను అంత గొప్పపాత్రగా అంత ఉదాత్తంగా చిత్రీకరించడానికి కారణం లేకపోలేదు. ఆనాటి స్త్రీలు తమ యిష్టంవచ్చినప్పుడు భర్తలను వదిలివేసేట్లుగా కన్పిస్తున్నారు.
"సత్వయా నావమ స్తత్యః పుత్రః ప్రవాజితో మమతవ దైవత మస్త్వేష నిర్దన స్సధనో2పితీ"
అడవులకు పంపబడిన నా పుత్రుని నీవు అవమానించవలదు. ఇతడు దరిద్రుడైనను, ధనికుడైనను నీకు భర్తకదా! అని కౌసల్య సీతతో చెప్పింది.
అంటే స్త్రీలు దరిద్రులైన భర్తను లక్ష్యం చేసేవారు కాదని అర్థమవుతుంది.
కైక తల్లిని భర్త ఊరకే వదిలేశాడు. కారణం పెద్దదేం కాదు. అతనికి తెలిసిన చీమల భాషకు సంబంధించిన రహస్యం ఆమెకు చెప్పలేదు. అంతే -
తార భర్త చనిపోగానే సుగ్రీవునికి భార్యయిపోతుంది.
ఇది ఒక స్త్రీల విషయంలోనే కాదు పుఋషుని విషయంలోను అంతే. భార్యను భర్త, భర్తను భార్య, వదిలివేయడం సర్వసాధారణంగా వున్నట్లు కన్పిస్తున్నది.
రాముడు సీతను వదిలేశానంటాడు. "యథేచ్ఛగా వెళ్లిపొమ్ము. లక్ష్మణుని వద్దగాని, భరతునివద్దగాని, సుగ్రీవుని వద్దగాని, విభీషణుని వద్దగాని ఉండి ఆత్మపోషణ చేసుకో." అంటాడు.