'కో ఈ హఁస్ రహా హై'
'కోఈ రో రహా హై'
ఒక మనిషి బ్రిడ్జిమీద నడుస్తూ జేబులోని చిల్లర డబ్బులు బిచ్చగాడి కిచ్చేస్తాడు:, రిస్టువాచీని ఎదురుగుండా వస్తూన్న నర్సు కిచ్చేస్తాడు:, కోటు తీసి నీళ్ళలో పడవేస్తాడు:, దాని వెనుకనే నీళ్ళలో పడిపోతాడు.
ఒక మనిషి వ్యాపారం పారం కొనుక్కొంటాడు:, వాడిచేతుల్లో రూపాయల చెట్లు మొలుస్తాయి. అవి బ్యాంకుల్లో బంగారపు గుడ్లు పెడతాయి:, వాటిలోంచి కన్నీరు సొనగా కారుతుంది.
ఒక మనిషి మైలురాయి దగ్గర మౌనంగా కూర్చుంటాడు:, అనుక్షణం ఎవరో వస్తూన్నట్టు నిరీక్షిస్తాడు:, బస్సులు లెక్కపెడుతూ బటానీ గింజలు తింటూ వుంటాడు:, మేఘాన్ని చూస్తూ కాలాన్ని మరిచిపోతాడు.
ఒక మనిషి నిచ్చెనలు మోసుకుంటూ తిరుగుతాడు. సంచీలో బాతుగుడ్లూ వాడూనూ:, గోడకి నిచ్చెన చేరవేస్తాడు:, నిచ్చెన ఎక్కి బాతుగుడ్డు ఆకాశం మీదికి విసురుతాడు:, అంత ఎత్తు బంగారానికి హరిశ్చంద్రుణ్ణి కొనుక్కొన్న ఆసామీ వీడే.
ఒక మనిషి రంధ్రాల్ని అన్వేషిస్తాడు:, వాటి సైజుల్లో భేదం ఉంటుంది.
ఒక మనిషి అరాజకాన్ని అమ్మజూపుతాడు:, దీర్ఘబాహువుల్తో దేన్నో దేవుతున్నట్లే వుంటాడు:, యువకుల హృదయ రక్త కాసారాల్లో దొరకే గజనిమ్మపళ్ళు తప్ప మరేమీ తినడు:, అదైనా రోజుకి ఒకసారి మాత్రం.
ఒక మనిషి కాంభోజరాగం పాడుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూంటాడు:, వాడి దగ్గర ఒక విపంచి కూడా ఉందన్న సంగతి యిక్కడ జ్ఞాపకం చెయ్యకపోవడం అనవసరం:, ఆ వేళల్లో ఆలపించే రాగాల్ని శాసించడానికే ఆ వేళ్ళు:, వాటి స్పర్శకి నక్షత్రాలు అంటుకుంటాయి:, చంద్రుడిలో సరస్సులు సలసల కాగుతాయి:, నా గుండెల్లో చలికాలం చివురు తొడిగి సీతాకోకచిలకతో పెళ్ళి మాటలు ప్రారంభిస్తుంది.
ఒక మనిషి కర్పూరం:, కళ్ళకీ:, సింధూరం చెక్కులకి రాసుకుంటాడు:, పూసుకుంటాడు:, వాడొక కవి:, రహస్య భాషలో అందుకున్న సందేశాలని వ్యాఖ్యానం చేస్తూ విమానశాఖలో పనిచేస్తాడు:, బజారు ధరలు పడిపోతూండడానికి వాడే గొప్ప కారణం.
ఒక మనిషి రుద్రాక్ష తావళాలు మెడలో వేసుకొని జపం చేస్తూ వుంటాడు:, బొజ్జతో ఆలోచిస్తాడు:, వాడి ముందు కొబ్బరి కాయలు కొట్టొద్దు మొర్రో అని నేను మొత్తుకోవడం వల్ల ప్రయోజనం లేదని తెలిస్తే మాత్రం ప్రయోజనమేమిటి?
ఒక మనిషి ఒక్కత్తెనే ప్రేమిస్తాడు:, ఆమె చచ్చిపోతుంది:, తరువాత కథ తెరమీద చూడండి.
ఒక మనిషిని ఉరితీసేస్తారు. వాడి చావుతో శాంతిని కొనుక్కుంటుంది సంఘం:, న్యాయశాస్త్రం తృప్తిగా నిట్టూరుస్తుంది:, వాడి నెత్తురు చిందినచోట ప్రతి సాయంత్రం చెప్పడానికి ఇష్టంలేనంత గర్వం ఆ మానవుడికి.
ఒక మనిషి ఉపన్యాసాలిచ్చి గొప్పవాడవుతాడు:, ఒక మనిషి చిత్తుగా తాగేసి బీదవాడవుతాడు:, ఒకడు దొడ్డమ్మ దగ్గర కానీ తీసుకొని గలిపడగ కొనుక్కుంటాడు:, ఇంకొకడు దాన్ని లాక్కొంటాడు.
ఒక మనిషి పరారీ అయిపోతాడు. వొకడు పూనాకి పోతాడు:, ఒకడు పెళ్ళాడేస్తాడు:, ఒకడు పడుక్కుంటాడు:, మరొకడు కునికిపాట్లు పడతాడు:, ఇంకొకడు బాతాఖానీ కొడతాడు:, ఒకడి ఏడుపుకి నవ్వొస్తుంది:, ఒకడి నవ్వు ఏడుపు తెప్పిస్తుంది:, ఉదాహరణలతో సహా ఇది నేను ఋజువు చెయ్యగలను.
అండజ భీము డండడడ డండడ డండడ డండ డండ డండండడ డండ డండ డడ డండడ డండడ డండ డండ... స్వామీ దీని కంతమెప్పుడు? శిష్యా! ఇది అనంతం.
-శ్రావణి గద్య, పద్య వ్యాసావళి చతుర్థ వార్షికోత్సవ సంచిక, సాహిత్య మండలి - 6.5.1943