Previous Page Next Page 
చెక్ పేజి 11


    ఎదురుగ్గా వస్తున్న ఒకతనికి దగ్గరగా వెళ్ళి "గీర్వాణీ ఇల్లెక్కడ?" అని ప్రశ్నించాను.

 

    "ఎవరూ? పడమర నుంచి వచ్చి మా రామచంద్రయ్యను కట్టుకుందే ఆమె ఇల్లా?" రాగాలు తీస్తూ అడిగాడు.

 

    అవునన్నట్టు తల వూపాను.

 

    చేయి చూపించాడు.

 

    కరెంట్ లేనట్టుంది. చిన్న కిరోసిన్ దీపాలు రాత్రికి వేలాడుతున్న ఎర్ర రాళ్ళ జుమికీల్లా వున్నాయి.

 

    ఇంట్లో అడుగుపెట్టిన నన్ను చూసి గీర్వాణి పడిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కౌగిలించుకున్నంత పని చేసింది. సూట్కేసును నా చేతుల్లోంచి తీసుకుని ఇంట్లో కెళ్ళి పెట్టింది. పేరు పేరునా ఊర్లో వాళ్ళందర్నీ అడిగింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి పోయింది.

 

    నన్ను చూసి కాబోలు మా బావ వచ్చాడు. పలకరింపులయ్యాక బట్టలు మార్చుకున్నా.

 

    ఇంటి ముందర మంచం వేశారు.

 

    దానిమీద కూర్చుని నేనూ, మా బావ మాటల్లో పడ్డాం.

 

    జాతర కాబట్టి ఇల్లంతా సున్నం కొట్టారు. అందుకే కొత్త వాసనేస్తోంది. ఆరు బయట పేడతో అలికి పిండి ముగ్గులు పెట్టడంవల్ల ముత్యాలను ఆరబెట్టినట్టుంది.

 

    "రారా మదన్! అలా వూరు చూసొద్దాం" అని బావ నన్ను లేవదీశాడు.

 

    ఇద్దరం బయట పడ్డాం.

 

    "ఇంతకీ ఎలా వచ్చావ్? మల్లాం వరకు బస్సుందనుకో. అక్కడి నుంచి ఎలా వచ్చావ్? వస్తున్నట్టు లెటర్ రాసుంటే బండి పంపేవాళ్ళం కదా" నిష్ఠూరం పోయాడు బావ.

 

    "లేదు బావా! ఆఖరి క్షణంలో బయల్దేరడం వల్ల లెటర్ రాయలేకపోయాను. మల్లానికి వచ్చాకే సమస్య ఎదురైంది. అయితే అదృష్టం బావుండి ఈ ఊరి బండ్లోనే వచ్చాను."

 

    "మొత్తానికి నువ్వు నక్కతోక తొక్కచ్చావ్. అందుకే ఆయన బండ్లో రాగలిగావు."

 

    "ఎవరాయన ?"

 

    "ఆయన పేరు భుజంగం. మనకు బంధువు. డబ్బున్న వాళ్ళకు బంధుత్వాలు గుర్తుండవు. నీకు వరసకు చిన్నాన్న అవుతాడు."

 

    "ఏమిటి బావా ఆయన గొప్ప ?"

 

    ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా వుంది నాకు.

 

    "ఆయన ఈ ఊరికి రాజు. ఒక విధంగా చెప్పాలంటే మన బంధువుల్లో బహుశా బాగా డబ్బున్నవాడు ఆయనే. ఆయనకు తెలియకుండా ఇక్కడున్న ఏ చెట్టూ ఆకును కదపదు. సెలయేరు పారదు. గాలి అడుగు తీసి అడుగేయదు. కడకు పసిపిల్లలు రొమ్ము కుడవరు" అని పాయింటల్ గా చెప్పాడు బావ.

 

    "ఏం చేస్తుంటారాయన?"

 

    "ఏమీ చేయడు. సముద్రం పక్కనున్న దాదాపు అయిదు వందల ఎకరాలు ఆయనవే. అందులోని సరుగుడు చెట్ల వల్లే లక్షల ఆదాయం వస్తుంది. ఇక అడవి కాంట్రాక్టు ఆయనదే. అందులోని ఫలసాయం అంతా ఆయనదే. భార్యలేదు. అయిదేళ్ళ క్రితం చచ్చిపోయింది. ఒక్కతే కూతురు."

 

    నేను చూసింది ఆమెనేనన్నమాట.

 

    మేం ఊరు దాటాం. తూర్పున అన్నీ గుడిసెలే. దాదాపు వేయి దాకా వుంటాయి. అప్పుడే వంట ప్రారంభించినట్టున్నారు. తెల్లటి పొగ ఆ ప్రాంతమంతా మబ్బుల్లా కమ్ముకుని వుంది.

 

    "అదీ ఊరేనా?" అడిగాను.

 

    "కాదు మదన్. యానాది సెంటర్. అక్కడ యానాదులుంటారు. వాళ్ళంతా భుజంగం సరుగుడు చెట్లలో, అడవిలో పనులు చేసుకుంటూ వుంటారు. తీరిక దొరికితే చేపలు పడుతుంటారు" చెప్పాడు బావ.

 

    యానాది సెంటర్ కీ, ఊరికీ మధ్య చిన్న పాక వుంది.

 

    "ఏరా కల్లు తాగుతావా?" ఆప్యాయంగా అడిగాడు బావ.

 

    "ఒద్దు బావా! అలవాటు లేదు."

 

    "సీమ సరుకైతేనే మీ స్టూడెంట్లకు ఆనేది. ఇది మరో ప్రపంచంరా బాబూ. ఇక్కడ ఇది తప్ప దొరకదు."

 

    "అదేం కాదు బావా! నాకు అలవాటు లేదు."

 

    బావ పాకలోకి వెళ్ళి కల్లు తాగొచ్చాడు.  

 

    "ఇక్కడ ఏం తోచదురా. అందుకే సాయంకాలమైతే రెండు ముంతలు తాగి పడుకుంటూ వుంటాం. ఇక్కడే వుంది? ఓ సినిమానా! ఓ షికారా!" ఆ విధంగా తను కల్లు తాగడాన్ని సమర్ధించుకున్నాడు బావ.

 

    ఇద్దరం తిరిగి ఊర్లోకి బయల్దేరాం.

 

    బాగా చీకటైపోయింది.

 

    "మీ ఊరికి కరెంటు లేదా బావా?"

 

    "మా ఊరికి కరెంటా!" పగలబడి నవ్వాడు బావ. బలవంతాన నవ్వును అణుచుకుని "యానాదుల్లో చాలా మందికి కరెంట్ అంటే ఏమిటో కూడా తెలీదు. ఈ ఊర్లో ముప్పాతిక భాగం మంది తారు రోడ్డును చూడలేదంటే నమ్ముతావా? సినిమా చూడని వాళ్ళు వేయిమంది పైగానే వుంటారు. మిగిలిన వాళ్ళు ఏ సంవత్సరానికో, ఆర్నెల్లకో మల్లాంలో సినిమా చూస్తారు. కుర్రకారు ఫరవాలేదనుకో. నెలకొకసారైనా మల్లాం వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడో మూడేళ్ళ క్రితం ఓసారి భుజంగం కారులో ఈ వూరికి వచ్చాడు. అప్పటి నుంచి పెట్రోల్ పొగ ఈ గ్రామ ఛాయలకు రాలేదు. రామారావునూ, నాగేశ్వరరావునూ, కృష్ణనూ గుర్తు పట్టలేరు. ఏదో అలా బతికేస్తున్నాం" చెప్పాడు. ఆ గొంతులో ఈ బతుకుపట్ల చాలా నిరుత్సాహమే కనిపించింది నాకు.

 

    ఆ ఊర్లో వుండడం చాలా విధాలుగా ఇబ్బందే.

 

    "రైతులు చాలా తక్కువ మందే వున్నారనుకుంటాను."

 

    "అవునురా. ఈ ఊర్లో ఎవరుంటారు? భుజంగంలా ఆదాయం వున్నా పరవాలేదు. ఆయనలా ప్రతి వారం మద్రాసు వెళ్ళి రావడానికి పైసలెక్కడివి? ఏదో ఆ పొలంలో పండింది తిండికే సరిపోతుంది. ఈ ఊర్లో వుండి జీవితం మీద మమకారమే చచ్చిపోయిందనుకో. ఒకప్పుడు మనవాళ్ళు ఎక్కువమందే వుండేవారు. అయితే ఈ దరిద్రం కొంపల్లో వుండలేక తలో దిక్కూ వెళ్లిపోయారు. మేమూ మీ ఊరి పక్కనున్న కుమ్మరపల్లి వచ్చేయాలనుకుంటున్నాం."

 

    "అదే బెస్ట్ బావా. అడవిలో ఎలా బతుకుతాం?" ఒక రోజుకే నాకు ఏదోలా వుంటే సంవత్సరాల తరబడి ఆ ఊర్లో ఎలా వుండడం?

 

    మేము ఇంటికి చేరుకున్న అరగంటకు డప్పుల శబ్దం విన్పించింది.

 

    ఆ రాత్రిలో ఆ శబ్దం నాకు భయం పుట్టించింది.

 

    "జాతర మొదలైంది. రేపు రాత్రి వరకు నీకు కాలక్షేపం లేరా" అంది గీర్వాణి. నేను ఎక్కడ ఉదయానికి ప్రయాణం కడతానోనని తన అనుమానం.

 

    "ఎంత బోరు కొట్టినా ఎల్లుండి వరకు వుంటాను లేవే" అన్నాను ఆమె మాటల్లోని భావం గ్రహించి.

 Previous Page Next Page