టైమ్ పదకొండు అవుతుండగా గదిలోంచి 'సునీతా' అన్న పిలుపు వినిపించింది.
మాత్రవల్ల జ్వరం కాస్త తగ్గినట్టుంది. లోపలకి వెళ్ళగానే కళ్ళు విప్పి సునీతని చూసి "బాత్ రూమ్ కి వెళ్ళాలని లేచాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నీరసంగా వుంది. ఏదన్నా తాగడానికి...."
"ముందు లేచి పళ్ళు తోముకోండి. బ్రెడ్, పాలు ఇస్తాను. నేను పట్టుకుంటాను వెళ్ళండి.." అంటూ అతన్ని లేపి చేయిపట్టుకుని బాత్ రూము దగ్గిరికి తీసికెళ్ళింది. ఓ కుర్చీ వాష్ బేసిన్ ముందు వేసి పేస్ట్ వేసి బ్రష్ చేతికిచ్చి "మీరు కానీండి టిఫిన్ పట్టుకొస్తాను" అంది. రవీంద్ర మొహం కడుక్కుని నీరసంగా వచ్చి మంచంమీద కూర్చున్నాడు.
ఓ ప్లేట్ లో బ్రెడ్ స్లైసులు, పాలు పట్టుకొచ్చింది.
వికారంగా మొహంపెట్టి "బ్రెడ్ వద్దు. తినాలని లేదు.... పాలు చాలు" అన్నాడు.
"అలా కాదు. ఖాళీ కడుపుతో వికారంగా వుంటుంది. నీరసం ఎక్కువవుతుంది. ఎలాగొలాగా తినాలి" అంది.
"అబ్బ సునీతా! రాత్రంతా ఎంత జ్వరం అనుకున్నావు... తల బద్దలైపోయింది. ఒళ్ళంతా నొప్పులు..."
"లేపకపోయారా.... మందిచ్చేదాన్నిగదా..." అంది.
"లేచి పిలవాలన్నా లేవలేకపోయాను" ఓ రెండు ముక్కలు బలవంతంగా తిని, పాలెలాగో తాగి మళ్ళీ వాలిపోయాడు.
"పడుకోండి, ఇంకోసారి టెంపరేచర్ చూసి తగ్గకపోతే డాక్టరు దగ్గిరకెడదాం" అంటూ ఖాళీకప్పు తీసుకెళ్ళింది.
తను లంచ్ తిని రవీంద్ర కి జావ కాచి గదిలోకి పట్టుకొచ్చింది.
ఆమె లోపలికి రాగానే సెల్ లో మాట్లాడుతున్న రవీంద్ర సెల్ ఆఫ్ చేసి "ఆఫీసుకి రాలేనని చెప్పాను" అన్నాడు సంజాయిషీ ఇస్తున్నట్టు.
"నేను ఇంతకుముందే చెప్పాను" అంది ముభావంగా సునీత. ఆమెకి తెలుసు అతను రంజనికి జ్వరం గురించి చెప్పడానికి ఫోన్ చేసి వుంటాడని. ఏం జరగనట్టే అతని కివ్వాల్సిన మందు ఇచ్చి, జావతాగిన గిన్నె పట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది.
సాయంత్రం పిల్లలచేత హోమ్ వర్క్ చేయిస్తుంటే కాలింగ్ బెల్ విని గౌతమ్ పరిగెత్తి తలుపు తీశాడు. బయట రంజనిని చూసి మొహం ఇబ్బందిగా పెట్టి "మమ్మీ, మమ్మీ" అంటూ పిలిచాడు.
గౌతమ్ కి ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గొడవలు అంతా తెలియకపోయినా అప్పుడప్పుడు విన్న మాటలవల్ల రంజని కారణంగానే ఇంట్లో గొడవలన్నది కాస్త అర్థం అయింది.
"ఎవరు గౌతమ్?" అంటూ గుమ్మం దగ్గిరకొచ్చిన సునీత, రంజనిని చూసి అవాక్కయింది. అంత ధైర్యంగా రవీంద్రకోసం ఇంటికే వస్తుందని ఎదురుచూడని ఆమెకి కోపం ముంచుకొచ్చింది. మొహం అదోలా పెట్టి ఆమె ఎవరో తెలియనట్లే "ఎవరు కావాలి...??" అంది కటువుగా.
"రవీంద్రకోసం వచ్చాను.... అతనికి జ్వరం అని తెలిసి చూడాలని వచ్చాను" చాలా నిబ్బరంగా, సునీతతో తనకేమిటి అన్నట్టు నిర్లక్ష్యంగా అంది.
ఆ పొగరు, నిర్లక్ష్యం, నిర్లజ్జతనం చూసి సునీతకి మరికాస్త తిక్కరేగింది. "రవీంద్రని ఇక్కడ చూడడం కుదరదు. పద గౌతమ్, హోంవర్క్ ఫినిష్ చెయ్...." అంటూ తలుపువేసి వెనుదిరిగింది.
మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది.
సునీత లెక్కచెయ్యనట్టు డైనింగ్ టేబిల్ దగ్గిరికి వెళ్ళింది.
ఆపకుండా కానింగ్ బెల్ మోగుతూంటే పిల్లలు తల్లివంక ప్రశ్నార్థకంగా చూశారు.
సునీత విసురుగా లేచి తలుపుతీసి "ఇంటిముందు ఏమిటీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు? చదువుకున్నదానివి కాబోలు మేనర్స్ లేకుండా మమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నావు. మరోసారి బెల్ కొడితే బాగుండదు పరిణామం" చాలా కఠినంగా అంది.
నేను రవీంద్రని చూడాలి. చూసిగాని వెళ్ళను. అతను నా కాబోయే భర్త. అతన్ని చూడడానికి వీలులేదని చెప్పే అధికారం నీకులేదు."
"అతను నీకు కాబోయే భర్తేమో కాని అతనింకా నా భర్తే. ఇది నా ఇల్లు. నా ఇంటికి నా అనుమతి లేకుండా వచ్చే అవకాశం నీకు లేదు. గెట్ లాస్ట్."
ఇంట్లో జరుగుతున్న గొడవ రవీంద్ర చెవిని బడింది. కాస్త జ్వరం, నీరసం తగ్గిన అతను కుతూహలంగా లేచి బయటికి వచ్చాడు గదిలోంచి. గుమ్మం ముందు రంజనిని చూసి అతను తెల్లబోయాడు. రవీంద్రని చూడగానే రంజని ముందుకు రాబోతూ "రవీ! నీకు ఒంట్లో బాగాలేదని చూడాలని వస్తే ఈ సునీత చూడు, ఎంత ఇన్సల్ట్ చేస్తోందో లోపలికి రానీయకుండా" కంప్లైం ట్ చేస్తూ అంది.
సునీత గుమ్మానికి చేయి అడ్డుపెట్టి అలాగే నిల్చుంది.
రవీంద్ర పాలిపోయిన మొహంతో "ప్లీజ్ రంజనీ! ఇక్కడనించి వెళ్ళిపో, రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు? ప్లీజ్! వెళ్ళు. అనవసరంగా గొడవ వద్దు. సీన్స్ క్రియేట్ చేయకు" కఠినంగా అని లోపలోకి వెళ్ళిపోయాడు.
రంజని నల్లగుడ్డ మొహంతో పెదవి కొరుక్కుంటూ సునీతవంక మింగేసేట్టు చూసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది.
లోపలికొచ్చిన సునీతని చూసి రవీంద్ర "ఇంటికొచ్చిన వాళ్ళని మరీ అంత అమర్యాద చేయక్కరలేదు" అన్నాడు.
"ప్లీజ్! ఈ విషయం గురించి మాట్లాడడం నాకిష్టం లేదు. దయచేసి మీరెళ్ళి పడుకోండి" అంటూ పుస్తకం చేతిలోకి తీసుకుంది.
* * *
"డాడీ, ఈ ఆర్టికల్ మీరు చదివి ఓ.కే. చేస్తే కంపోజింగ్ కి పంపిస్తాను. ఎల్లుండి ఆదివారం ఇష్యూనుండి సీరియల్ గా ఈ వ్యాసాలు ప్రచురించడానికి సిద్ధం చేస్తున్నాం నేను, శ్రీనివాస్. డాడీ! నిజంగా ఒక్కొక్క డిపాజిటర్ల కథలు వింటుంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడుస్తారు, ఎలా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. మనం ఏం చెయ్యాలి, ఓ పత్రికాధిపతులుగా నిజానిజాలు పబ్లిక్ ముందు ఉంచడం మన కనీస కర్తవ్యం. వారి సమస్యలని మనం తీర్చలేకపోయినా ఇదీ సమస్య... మీరేం అంటారు, మీరేం చేస్తారు? జనం చేతుల్లోనే వుంది నిర్ణయాధికారం అని ప్రజలకి చెప్పడం పత్రిక వంతు.
లక్షలు కాదు కోట్ల కోట్ల అప్పులు తీసుకుని బాకీలు బ్యాంక్ కి చెల్లించకుండా విలాసవంతంగా జీవితం గడపుతున్న అలాంటి పెద్దమనుషుల గుట్టు రట్టు చేయడమే మన ధ్యేయం! అలాంటి పెద్ద మనుషులు ఈ కథలు చదివాకన్నా మానవత్వం మేల్కొని వాళ్లు కట్టాల్సిన బాకీలు కడితే ఈ డిపాజిటర్లకి కొంతలో కొంతైనా న్యాయం జరుగుతుంది గదా...." ఆవేశంగా అంది నీరద.