Previous Page Next Page 
ఉషోదయం పేజి 11

    సాయంత్రం మా ఫ్రెండు సుప్రియను పరిచయం చేశాను చూశారుగదా, దానికి ఓ ఉద్యోగం కావాలండి. ప్లీజ్! మీ క్లయింట్స్ కెవరికన్నా కాస్త చెప్పి సాయం చెయ్యాలి" రాత్రి భోజనాలయ్యాక పడకగదిలో వుండగా శారద ప్రకాష్ తో అంది.
    "ఎవరా సుప్రియ.... నేనెప్పుడూ మీ స్నేహితుల పేర్లలో వినలేదే" పుస్తకం లోంచి తలెత్తి  అన్నాడు. ఆరోజు ఎందుకో అతని మూడ్ కాస్త బాగానే వుంది. చిర్రుబుర్రులాడకుండా సౌమ్యంగా అన్నాడు.
    శారద సుప్రియ గురించి ముందునించి చెప్పుకొచ్చింది.
    "ఐసీ, కంప్యూటర్ నాలెడ్జ్ వుందా! బయోడేటా ఇమ్మను చూద్దాం" అన్నాడు. అంతలోనే ఏదో గుర్తుకువచ్చినట్టు మా ఆఫీస్ లో పద్మిని పెళ్ళి చేసుకుంటుందట, ఉద్యోగం మానేస్తాను నెలాఖరువరకు వుంటాను అని చెప్పింది. అలవాటైన అమ్మాయి. మళ్ళీ కొత్త అమ్మాయిని ట్రైన్ చెయ్యాలి అని వర్రీ అవుతున్నాను. నీ ఫ్రెండ్ ని అడుగు మా ఆఫీసులో చేస్తుందేమో" అన్నాడు.
    "ఎందుకు చెయ్యదు! దానికి రిసెప్షనిస్టు ఉద్యోగాల అనుభవం వుంది. ప్రస్తుతానికి దానికి వెంటనే ఉద్యోగం కావాలి, సంతోషంగా ఒప్పుకుంటుంది" అంది శారద చాలా సంతోషంగా.
    "అయితే రేపు బయోడేటా పట్టుకుని ఆఫీసుకొచ్చి కలవమను" అన్నాడు.
    "ఆ.... సునీతకి ఫోనుచేసి చెపుతాను పంపించమని" అంది శారద.
    సుప్రియ.... సుప్రియలో ఏదో ఆకర్షణ వుంది. అందగత్తెకాదుకాని ఆమె కళ్ళు ఆ పెదాల వంపు... మంచిఫిగరు, కొంచెం కొంటెతనం, కొంచె పొగరుతో కూడిన కవ్వింపు నవ్వు, మాగాడిని ఆకర్షించగల సెక్సప్పీలు ఆమెలో వుంది. ఒకసారి చూసిన పురుషుడు మరోసారి ఆమెవైపు దృష్టి తిప్పకుండా వుండలేడు.
    ఆమె రంగు చామనచాయ అయినా మంచి నిగారింపు వుంది. ప్రకాష్ ఆమెని చూసింది కొన్ని క్షణాలైనా లోపలికెళ్ళాక అతని ఆలోచనల్లో ఆమె చోటు చేసుకుంది. అందుకే శారద చెప్తుంటే కుతూహలంగా విన్నాడు. ఉద్యోగం అనగానే తన ఆఫీసులో పెట్టుకునే అవకాశం వున్నందుకు లోలోపల ఒకరకంగా ఆనందం కలిగింది.
                                                * * *
    మర్నాడు, మరింత శ్రద్ధగా అలంకరించుకుని, బయోడేటా పట్టుకుని ఆఫీసుకు వచ్చింది సుప్రియ.... ఆమె బయోడేటాతోపాటు ఆమెనీ నిశితంగా గమనించాడు. డబ్బు కోసం, ఉద్యోగంకోసం , డబ్బు ఇచ్చే విలాసాలకోసం ఏదన్నా చెయ్యగల, ఎంత లెవల్ కన్నా దిగగలదన్న ఓ ఆరాటం, ఆత్రుత ఆ కళ్ళలో కనిపించింది అతనికి.
    "మీరిదివరకు స్కూలులో పనిచేశామంటున్నారు. రిసెప్షనిస్టుగా ఓ చోట చేశారు. ఆఫీసు వర్క్ చెయ్యగలరా మరి. టైపింగ్ వచ్చు, కంప్యూటర్ ఫండమెంటల్స్ తెలుసంటున్నారు. మరి ఈ జాబ్ మీకు సరిపోతుందా?"
    "ఒక నాలుగైదు రోజులు చెపితే నేర్చుకుంటాను" ఆరాటంగా అంది.
    "శారద చెప్పింది మీరు చాలా ఇబ్బందుల్లో వున్నారని. అందుకని తీసుకుంటున్నాను. క్లయింట్స్ తో డీల్ చెయ్యాలి. ఎకౌంట్స్ మెయిన్ టెయిన్ చెయ్యాలి. కేసులు వాయిదాలు అవీ డేట్స్ మెయిన్ టైన్ చెయ్యాలి. పద్మిని ఇంకా పదిరోజులుంటుంది ఇక్కడ. ఈ పది రోజుల్లో ఆమె దగ్గర మీరు పని నేర్చుకోండి."
    "తప్పకుండా నేర్చుకుంటాను. నాకీ అవకాశం ఇవ్వండి ప్లీజ్...."
    "సరే... మరి జీతం...."
    "మీరెంతంటే అంత.. పద్మినిగారికిచ్చినంత.... తగ్గినా ఫర్వాలేదు. నన్ను నేను మెయిన్ టైన్ చేసుకోగలిగిన ఫిగరు చాలు" ఆరాటంగా అంది.
    "సరే, పద్మినికి చెపుతాను. ఆమె దగ్గరికి వెళ్ళండి" పద్మినిని పిలిచి ఆమెని అప్పగించాడు. వెడుతూ వెనుదిరిగి అతనివంక చూసిన చూపు అతని గుండెలకి గురిచూసి బాణం వేసినట్లనిపించింది.
                                                 * * *
    "మమ్మీ... మమ్మీ... డాడీ లేవడంలేదు. మూలుగుతున్నారు... ఒళ్ళంతా వేడిగా వుంది. ఎనిమిదేళ్ళ గౌతమ్ పరిగెత్తి చెప్పాడు. 'గుడ్ మార్నింగ్' చెప్పడానికి వెళ్ళిన గౌతమ్, స్వీటీ ఎంత లేపినా తండ్రి లేకపోవడం, మూలగడం చూసి భయపడి పరిగెత్తి వచ్చారు. సునీత చేస్తున్న పని ఆపి "ఏమిటీ లేవలేదా, మూలుగుతున్నారా" అంది. అప్రయత్నంగానే గబగబా అతని రూమువైపు వెళ్ళింది. ఒళ్ళెరగకుండా పడుకుని వున్న అతన్ని చూసి నుదురుమీద చెయ్యి వేసింది. అబ్బ! జ్వరం బాగా వుంది అనుకుంది.
    స్పర్శకి కళ్ళు విప్పి చూసిన రవీంద్ర "నిన్న రాత్రినించి ఒళ్ళంతా నొప్పులు జ్వరం బాగా వచ్చినట్టుంది" అన్నాడు మూలుగుతూ.
    "రవీ, కాస్త లేచి మొహం కడుక్కురా, కాఫీతో మాత్ర ఇస్తాను" అంది సునీత.
    "ఉహు. లేవలేను. ముందు మాత్ర ఇవ్వు..." అన్నాడు.
    సునీత కాఫీ కలిపి క్రోసిన్ మాత్ర ఒకటి తెచ్చి ఇచ్చి లేపి కూర్చోబెట్టి మాత్ర వేయించి కాఫీ తాగి కూర్చోడానికి ఓపిక లేనట్టు మళ్ళీ వాలిపోయాడు మగతగా... కాఫీ ముందు టెంపరేచర్ చూస్తే పొద్దుటే 102.8 వుందంటే, రాత్రి ఇంకా ఎక్కువ వుండివుండాలి అనుకుని దుప్పటి కప్పి లేచింది.
    పిల్లల్ని తయారుచేసి స్కూలుకి పంపాక ఇంత జ్వరం వున్న మనిషిని ఒంటరిగా ఇంట్లో వదిలి ఆఫీసుకి ఎలా వెళ్ళడం అన్న ప్రశ్న తలెత్తింది. అతనికి జ్వరం వచ్చిందంటే ఓ భార్యలాగే రియాక్ట్ అయి అతనికి కాఫీ, మందు ఇవ్వడం అంటే చాలా సహజంగా తామిద్దరిమధ్యా ఏం జరగనట్టే ఓ భార్య భర్తపట్ల ప్రవర్తించాల్సిన విధంగానే తనకి తెలియకుండానే ప్రవర్తించింది. ఇదేకాబోలు పెళ్ళిలో మహత్యం అనిపించింది.
    రవీంద్రతో మానసికంగా తను విడిపోయినా ఒళ్ళు తెలియకుండా పడున్న అతన్ని వదిలి ఆఫీసుకు వెళ్ళలేకపోయింది. ఈ అనుభవం ఎంత గట్టిది! తను భర్తలాగే కాక తన పిల్లలతండ్రిగా అతనితో వున్న అనుబంధం ఎలా చెరిగిపోతుంది!
    ఈ మగాళ్ళు పిచ్చి వ్యామోహంలో పడి పరస్త్రీల వెంట తాత్కాలికంగా పరిగెత్తవచ్చు కాని.. భార్యా, పిల్లలు అన్న భావం, అనుబంధం వాళ్ళకి మాత్రం వుండవా.... ఏమో.... నిజంగా అలా అనిపిస్తే ఇంత తొందరపాటు పనులు ఎలా చెయ్యగలరు? ఆడదానికేనా అన్ని సెంటిమెంట్స్! కాసేపు ఆలోచించి ఆఫీసుకి ఫోన్ తీసిన స్టాఫ్ తో రవీంద్ర కి జ్వరం, రాలేడని, ఈరోజుకూడా తను జ్వరం వల్ల రావడం కుదరదన్న కబురు చెప్పింది.                                             

 Previous Page Next Page