Previous Page Next Page 
ఉషోదయం పేజి 13

    నారాయణమూర్తిగారు కాగితాలు చేతిలోకి తీసుకుని కూతురి ఆవేశానికి చిరునవ్వు నవ్వారు.
    "డాడీ! ఈ అప్పులు తీసుకుని ఎగ్గొట్టినవారి ఆస్తులు ప్రభుత్వం, బ్యాంకు వారు ఎందుకు జప్తు చేయరు! ఆ అధికారం ప్రభుత్వానికి లేదా! ఈ విషయంలో కోర్టులు కూడా ఏమీ చెయ్యలేవా! ఇందులో నలభై కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన పెద్దమనిషికి పెద్దహోటల్సు, క్లబ్బులు వున్నాయి. అవన్నీ సీజ్ చేసి వేలం వేసి జనం డబ్బులుఇప్పించవచ్చు గదా" ఆవేశంగా అంది నీరద.
    "ఇవన్నీ జరగడం మనం అనుకున్నంత సులువు కాదమ్మా... కోర్టుకెక్కినా పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. న్యాయనిర్ణయాలు ఏళ్ళతరబడి సాగుతుంటాయి. అంతదూరం రాకముందే రాజకీయ నాయకుల జోక్యాలు వుంటాయి. ప్రభుత్వం ఓ కమిటీ వేసి చేతులు దులుపుకుంటుంది. ఆ కమిటీలు తమ తీర్పులు చెప్పడానికి ఏళ్ళతరబడి టైము తీసుకుంటాయి. ఈలోగా కొందరు డీఫాల్టర్లు దేశాలు విడిచి విదేశాల్లో నిక్షేపంలా బతుకుతుంటారు. కొంతమంది కంటితుడుపుగా ఏ కొద్దిమొత్తమో అప్పు చెల్లగొట్టి వాయిదాల మీద మిగతాది ఇస్తామంటారు. ఒకటి రెండు వాయిదాలు తర్వాత కాలదోషం పట్టిస్తాయి మిగతా వాయిదాలు. సమస్య పాతబడిపోగానే జనంలో ఓ నిర్లిప్తత వచ్చేస్తుంది. ఇదీ మామూలుగా జరిగే తంతు!"
    "అందుకే డాడీ! మనం వదలకుండా ప్రతివారం ఈ కథలు ప్రచురించి జనం ముందుకు తెచ్చి ఈ సమస్యని ప్రజలు మర్చిపోకుండా చెయ్యాలి...."
    "నేను ఇది ఓసారి చదివాక కంపోజింగ్ కి ఇవ్వచ్చు. ఏ ఇంటర్వ్యూలోననా బాధితులు చెప్పినదానిలో నిజానిజాలు రూఢీ చేసుకున్నాకే ప్రచురుణ జరగాలి. లేకపోతే మనం చిక్కుల్లో ఇరుక్కుంటాం. తరువాత ఆవేశంలో మన స్వంతభావాలు వలు వరించొద్దు. బాధితుల మాటల్లోనే చెప్పండి... ప్రచురించే ముందు ఈ జాగ్రత్తలు అన్నీ సరిచూసుకోవాలి" అనుభవంతో తలపండిన నారాయణమూర్తిగారు చెప్పారు.
    "అలాగే డాడీ! ఈ వ్యాసానికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించుదాం" అంది నీరద.
    "ఆల్ ద బెస్ట్ నీరూ..." అన్నారాయన కూతురి చేయిపట్టుకుని.
                                                * * *
    జ్వరం తగ్గి అన్నం తిన్న మర్నాడు రవీంద్ర ఆఫీసుకి వెళ్ళాడు. ముందురోజు అతనికి అన్నీ టేబుల్ మీద అమర్చి ఆఫీసుకి వెళ్ళిపోయింది సునీత.
    రవీంద్ర ఆఫీసుకి రాగానే రంజని దూకుడుగా అతని గదిలోకి వచ్చింది. కోపంగా, నిష్టూరంగా చూసింది అతనివంక.... "రవీ! నీవుకూడా ఆరోజు నన్నంత అవమానిస్తావనుకోలేదు. నీభార్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి నన్నే వెళ్ళిపొమ్మంటావా!" మొహం ఎర్రబర్చుకుని అంది.
    ఇంకా పూర్తిగా కోలుకుని రవీంద్ర కి అసలే నీరసంగా వుందేమో రంజని వచ్చీరాంగానే కుశలమన్నా అడక్కుండా అలా నిలేయడం నచ్చలేదు. "అసలు నిన్నెవరు రమ్మన్నారక్కడికి? నేను వద్దని ప్రత్యేకంగా చెబితే ఎందుకు వచ్చావు? ఏ భార్యన్నా భర్త లవర్ వస్తే ఎదురెళ్ళి ఆహ్వానించదు, సునీతలాగే ప్రవర్తిస్తుంది" తనూ కోపంగా అన్నాడు.
    రంజని మొహం మరింత ఎర్రబడింది. "అంతేలే, ఏం చేసినా నీ పెళ్ళామే నీకు ఎక్కువ. తన తరుపున కాకపోతే నా తరుపున మాట్లాడతావా... నాదే తప్పు. మనసుండబట్టక ఎలా వున్నవో అని చూడ్డానికి రావడం" ఉక్రోషంగా అంది.
    చిరాగ్గా చూశాడు రవీంద్ర. "ప్లీజ్ రంజనీ! వెళ్ళు. నాతో వాదన పెట్టుకోకు. నాకు చాలా నీరసంగా వుంది. ముఖ్యమైన కాగితాలూ అవీ సంతకాలు పెట్టి ఇంటికెళ్ళిపోతాను. ఈ గొడవ ఇంతటితో ఆపేయ్."
    "ఏం మాట్లాడుతున్నావు! ఏదో అంతా నాదే తప్పన్నట్టు ప్రవర్తిస్తున్నావు. సారీ చెప్తావని, సునీతకి బుద్ధి చెప్తావని ఆశిస్తే, ఇదా నీవు అనేది! నీ పెళ్ళాం అంటే అంత ప్రేమ వున్నప్పుడు ఆవిడేం చేసినా కరెక్ట్ అనేవాడివి... నాతో నీకేమిటి, నావెంట ఎందుకు పడ్డావు" ఏడుపు ముంచుకురాగా అంది.
    "బుద్ధిలేక... బుద్ధి గడ్డితిని... తీరి కూర్చోలేక తగిలించుకున్నాను ఈ లంపటం" రెచ్చిపోతూ అన్నాడు. రంజని ధోరణి అతనికి చిరాకు పుట్టించింది. జ్వరంతో వున్నప్పుడు సునీత తనని నిర్లక్ష్యం చేయకుండా, తమ మధ్య బంధం అంతరించినా భర్తగా, పిల్లల తండ్రిగా మానవతాధోరణితో తనకి సేవచేయ్యడం, ఇటు రంజని పరిస్థితిని అర్థం చేసుకోకుండా, కనీసం ఎలా వున్నావు అనైనా అడగకుండా నిలేసి మాట్లాడడంతో ఓ విధమైన అపరాధభావం అతన్ని చుట్టుముట్టింది.
    "అంతే... అంతే... మీ మగాళ్ళకి విశ్వాసం వుండదు. అందేవరకు అర్రులు చాచి వెంటబడి ప్రేమ ఒలకబోస్తారు. నాలుగురోజులు మోజు తీరగానే పెళ్ళాం పిల్లలే గుర్తుకు వస్తారు. నాకే బుద్ధి లేదు. కావాల్సిందే నాకిలా..." ఏడుస్తూ వెళ్ళిపోయింది.
    రవీంద్ర చిరాగ్గా, నీరసంగా తలపట్టుకుని టేబిల్ మీదకి ఒరిగాడు.
                                                * * *
    ప్రకాష్ కోర్టునించి ధుమధుమలాడుతూ ఇంటికి వచ్చాడు. కొడుకుచేత హోమ్ వర్క్ చేయిస్తున్న శారదని చూడగానే "నీకసలు ఇంట్లో ఏం జరుగుతోందో తెలుస్తోందా! ఎంతసేపూ నీ కోర్టుకేసులు తప్ప" ఎగిరిపడ్డాడు.
    శారద ఆశ్చర్యంగా చూస్తూ "ఏమైంది, ఏమిటీ కోపం..." అంది అసహనంగా.
    రాహుల్ తలదించుకున్నాడు.
    ప్రకాష్ కోపంగా "నీ కొడుకు నీకేం చెప్పలేదా... ఏరా మీ అమ్మకి చెప్పలేదా నీవు" కొడుకువంక తీక్షణంగా చూశాడు.
    శారద వింతగా రాహుల్ వంక చూసి "ఏం జరిగింది రాహుల్... మీ నాన్న ఏం అంటున్నారు?" అంది.
    రాహుల్ ఇద్దరివంకా బెరుకుగా చూశాడు.
    "ఇంట్లో తల్లివి పిల్లాడి సంగతి చూసుకోవాల్సిన బాధ్యత నీది. వాడసలు ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడా లేదా, వాడి ప్రవర్తన అదీ సరిగా వుందా లేదా అన్నది పట్టించుకునే తీరిక తమరికి లేదా!" హేళనగా అన్నాడు.                    

 

 Previous Page Next Page