కొద్దిక్షణాల వరకు ఇద్దరి మధ్య మాటలు పెగలలేదు.
ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో, ఎవరివల్ల వచ్చిందో? ఆ యిద్దరికీ తెలుసు.
తెలిసినా ఏమీ చేయలేని వయోభారం ఆయనది. ఎధయిఉనా చేసేందుకు అడుగడుగునా అడ్డుపడే నిరాశా, నిస్ప్రుహల్ని అడ్డుకోలేని నిస్సహాయత ఇతనిది.
కొద్దిక్షణాలకు తేరుకున్న మాధుర్ తండ్రిని తీసుకుని మౌనంగా తల్లి దగ్గరకు బయలుదేరాడు.
సరిగ్గా అదే సమయానికి కనబడ్డ ప్రతివాడ్ని విచక్షణారహితంగా కొట్టి వ్యాన్స్ లోకి కుక్కేస్తున్నారు పోలీసులు.
అలాంటి పరిస్థితుల్లో రోడ్ దాటుతుండగా చిక్కుకుపోయారు తండ్రీ కొడుకులు.
అంతే... ఆ మరుక్షణం వ్యాన్స్ పోలీస్ స్టేషన్ కేసి దూసుకుపోయాయి. అప్పుడు ఏది చెప్పినా, ఎంత వివరణ యిచ్చినా విచక్షణా జ్ఞానం లేనివాళ్ళకు అవి వినిపించవు.
ఆ వృద్దుడు తమకు పట్టిన దుర్గతిని చింతిస్తుంటే, మాధుర్ తనలో పేరుకుపోయిన నిరాశా, నిస్పృహల్ని వదిలించుకునే స్థయిర్యాన్ని కూడా గట్టుకుంటున్నాడు.
మరో పావుగంటకు తండ్రీ కొడుకులు పోలీస్ స్టేషన్ యిరుకు గదిలోకి నిర్ధక్షిణ్యంగా నెట్టివేయబడ్డారు.
మరో అరగంటకు వచ్చిందామె.
"వస్తూనే" అందరికి దేహశుద్ది చేయండి బాగా- మరోసారి ఆ దొంగతనాలు జరగవు" అంటూ ఆర్డర్స్ పాస్ చేసి గదుల్లోకి తోయబడ్డ బడుగు జీవుల్ని చూస్తూ ముందుకు సాగింది దర్పంగా.
అలా వెళుతూ వెళుతూ నెంబర్ మూడు దగ్గర చటుక్కున ఆగిపోయి పరిశీలనగా లోపలకు చూసింది.
అప్పుడామె పెదవులపై చిరుదరహాసం కదలాడిందో క్షణం!
"చివరకు దొంగతనాలక్కూడా సిద్దపడ్డారా?"
అవమాన భారంతో తలవంచుకు కూర్చున్న తండ్రీ కొడుకులు బాగా తెలుసుకున్న కంఠం వినిపించడంతో ఇద్దరూ ఒకేసారి తలెత్తి ఆమెవేపు చూసి నిర్ఘాంతపోయారు.
అప్పుడు అంతకు ముందామె అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుని ఆమె వేపు చీత్కారంగా చూశారు.
"గొప్ప మేధావివి గదా...? తిండికి లేక చివరకు దొంగతనానికి సిద్దపడ్డావా?" ఆమె కావాలనే అంది కసిగా.
"అధికారమిప్పుడు గుడ్డిదాని చేతిలో ఇరుక్కుని సిగ్గుపడుతోంది. అహంకారం ఇప్పుడు ఆడదాన్నని మరచిపోయిన రాక్షసి చేతిలో ఆనందిస్తోంది. విచక్షణా జ్ఞానం కోల్పోయిన మీ వ్యవస్థకు ప్రతి ఒక్కరు దోషిగానే కనిపిస్తారు. ప్రతి ఒక్కర్ని జైల్లోకి నెడతారు. అందుకు సిగ్గుపడాల్సింది మేం కాదు మీరు...."
ఆవేశంగా మాట్లాడుతున్న మాధుర్ కేసి ఆ సెల్ లోని తోటి ఖైదీలు ఆశ్చర్యపోయి చూస్తున్నారు.
మాధుర్ మాటలకి ఆమె తోకతొక్కిన త్రాచులా కస్సుమని లేచింది.
"ఇంత జరిగినా పొగరేమాత్రం తగ్గలేదు" ఆమె కోపంగా అంది.
"పొగరు నీది- పౌరుషం నాది. ఆత్మవంచన నీది- ఆత్మాభిమానం నాది."
"చేతిలో చిల్లిగవ్వ లేకుంటేనే యింత ఎగిరిపడుతున్నావు... వుంటే?"
ఒక పోలీస్ అధికారిణిని అంత ధైర్యంగా ఎదిరిస్తున్న మాధుర్ అక్కడున్న అందరికీ ప్రశ్నయిపోయాడు.
అసలయినా అంత పెద్ద పోలీసాఫీసరయి వుండి ఆమె మాత్రం అంతసేపు ఆ ఖైదీతో సంబాషణ కొనసాగించడం కూడా వారికి వింతగానే వుంది.
"పిచ్చిదానా.....ఐయామ్ స్టార్టింగ్ విత్ హేవింగ్, డబ్బులో పుట్టి, ఆ డబ్బులో పెరిగిన నాకు డబ్బు కొత్త కాదు. నీకు.... నీకు కొత్త ఆ డబ్బు నీకు వింత డబ్బు. బ్రతికి చెడ్డవాళ్ళకి- చెడి బ్రతికిన వాళ్ళకు మధ్య సంస్కార స్థాయిలో చాలా తేడా వుంటుంది అయినా నీతో యింతసేపు మాట్లాడటం నాకనవసరం, నీ డ్యూటీ పూర్తయిపోయింది. మేం నిర్దోషులమా, కాదా అన్నది తేల్చవలసింది న్యాయస్థానం. నువ్వు కాదు. విల్ యూ ప్లీజ్ గెట్ వే ఫ్రమ్ హియర్ ఫర్ ది సేక్ ఆఫ్ ది పూర్ పీపుల్."
ఆమె అహంమీద చావుదెబ్బ కొట్టినట్టయింది.
ఆ పోలీస్ స్టేషన్ని, ఆ సెల్స్ ని, చివరకు అక్కడున్న ప్రాణంలేని కటకటాల్ని, గోడల్ని కూడా గజగజలాడించగల తనను పూచికపుల్ల క్రింద తీసిపడేయడం ఆమెకు పిచ్చికోపం తెప్పించింది. అప్పటివరకు ఆమెలో ఏ మూలో దాగివున్న కొద్దిపాటి విచక్షణాజ్ఞానం నశించిపోయి "బీట్ దెమ్ ఐసే" అంది ప్రక్కనున్న కానిస్టేబుల్స్ నుద్దేశించి.
అంతే! అప్పటికప్పుడు లాకప్ తలుపులు తెరుచుకోవడం, ఖైదీలపై పోలీసులు విరుచుకుపడడం క్షణాల్లో జరిగిపోయింది.
అప్పుడు వాళ్ళు పెట్టే ఆర్తనాదాలునాలుగు వీధుల వరకు వినిపించసాగాయి.
మాధుర్ లోని పగ, ప్రతీకారం, పట్టుదల అప్పుడు.... సరిగ్గా లాఠీ దెబ్బలు తన వంటిమీద పడ్డప్పుడు- తన తండ్రి దెబ్బల్ని కూడా తనే భరిస్తున్నప్పుడు నిద్రలేచాయి.
మరో మూడుగంటల కాలం కరిగిపోయింది.
ఖైదీల మూలుగులే ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి.
సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఓ కారొచ్చి స్టేషన్ ముందాగింది.
ఇక్కడ రెండో నెంబర్ లాకప్ లో-
"వదిన వెళ్ళిపోయిందా బాబు?" మాధుర్ తండ్రి ప్రశ్న వినిపించినా పట్టించుకోనట్టుండిపోయాడు.
"చెప్పవేం బాబు.... వెళ్ళిపోయిందా?"
"ఇంత చేసినా ఆమె నాకేమవుతుందో వరస చెప్పి మరీ అడుగుతున్నావా నాన్నా?"
"ఎంత జరిగినా ప్రమీల నాకు కోడలు కాకపోతుందా? నీకు వదిన కాకుండా పోతుందా? నీ అన్నకు భార్య కాకుండా పోతుందా?"
తండ్రి మంచితనం మాధుర్ కి బాగా తెలిసుండడంతో మరేం రెట్టించక వెళ్ళిపోయిందన్నట్టు తలూపాడు.
"మాధుర్ ని నేను కలవాలి" ఆమె ఆజ్ఞాపిస్తున్నట్టు ఆర్డరేసి చేయించుకునేలా అడిగింది ఆ పోలీస్ ని.
ఆ పోలీసు ఒకింత కంగారుపడ్డాడు.
ఆమెను పలుకుబడివున్న గొప్పింటి కూతురుగానో, తన పై అధికారుల్ని బాగా ఎరిగున్న హైసొసైటీ లేడీగానో భావించి "అలాగే కలుద్దురుగాని- కానీ ఆ మాధుర్ ఎవరు? ఎక్కడున్నారని కలుస్తారు మేడమ్...? లోపల వెయ్యిమంది చిల్లర దొంగలున్నారు..."
"నేను గుర్తుపట్టగలను- నన్ను తీసుకెళ్ళు లోపలకు" అంది శాసిస్తున్నట్లుగానే.
అతను వినయంగా తలూపి తన వెనుకే రమ్మన్నట్లు సంజ్ఞ చేసి గదులవేపు నడవసాగాడు.
ఆవిడెవరో తెలీకుండానే అతనిలో ఒక రకమయిన గౌరవం, గగుర్పాటు కలిగాయి. ఆమెలో హుందాతనాన్ని చూసి, రెండో లాకప్ దగ్గరవుతూనే ఆమె ఠక్కున ఆగిపోయింది.
తలవంచుకుని రెండు మోకాళ్ళమధ్య నుంచి నేలకేసి చూస్తున్న మాధుర్ ని ఆమె గుర్తించింది.
ఆ గదినిండా మనుష్యులు... పుట్టపగిలి అందులోని చీమలన్నీ గుట్టలుగా కనిపించినట్లు టెన్ ఇంటూ ట్వంటీ గదిలో కిటకిటలాడుతూ జనాలు-
వాళ్ళందరి మధ్య ఒంటరిగా, తనొక్కడే ఆ గదిలో వున్నట్లుగా వున్నాడు మాధుర్.
ఆమె కటకటాల దగ్గరకి నడిచి రెండు చేతులతో ఇనుప చువ్వల్ని సుతారంగా పట్టుకుని "హలో..." అంది.
మాధుర్ కి వినిపించలేదు ముందుగా.
ఆమె మరోమారు "హలో..." అంది కొంచెం హెచ్చుస్థాయిలో.
అప్పటికే ఆ లాకప్ లో వున్న వాళ్ళంతా విస్తుపోయి ఆమెకేసే చూస్తున్నారు.
అతనప్పుడు తలెత్తి చూసి ఓ క్షణం తను కళ్ళను తానే నమ్మలేక పోయాడు.