Previous Page Next Page 
జనవరి 5 పేజి 11

   

      చిలికి చిలికి గాలి వానయ్యింది. అది అలాగే కొనసాగితే ఎక్కడకు వెళ్తుంది.
   
    తాత్కాలికంగా అంతకు ముందు షాప్ దగ్గర జరిగిన గొడవని మర్చిపోయారా నలుగురు.
   
    కాని అచ్యుత్ మర్చిపోలేదు. మర్చిపోడు కూడా .. అందుకే పదిమంది అనుచరుల్ని వెంటేసుకుని, రకరకాల మారణాయుధాలతో అరుణా చలం ఇంటికేసి బయలుదేరాడు.
   
    "అక్కర్లేదు - ఆలోచించటం అన్నది నిర్ణయం తీసుకోవటానికి ముందుండే దశ. అదెప్పుడో దాటేశాను. ఇక ఏ మాత్రం ఆలోచించను. ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను" మేఖల మొండిగా అంది.
   
    జీవితం ఎటు తీసుకువెళితే అటు వెళుతూ, జీవితాన్ని దొర్లించుకుంటూ, నైతిక విలువల్ని, ఆత్మాభిమానాన్ని, మడిచి చంకనెట్టుకొని మర్మయోగుల్లా బ్రతికేస్తున్న కోట్లాది జనం మధ్యనే మేఖల లాంటి యువతి వుందా...అరుణాచలం ఒక తండ్రిలా కాక ఒక వేదాంతిలా యోచిస్తున్నాడు మేఖల గురించి.
   
    "అయితే తక్షణమే బయలుదేరు. నీవు సంపాదించుకున్న పూచిక పుల్ల కూడా మా దగ్గర వుండటం భావ్యం కాదు. తక్షణమే లోపలకు వెళ్ళి నీ కష్టార్జితాన్ని మాత్రమే నీతో తీసుకు వెళ్ళేందుకు సిద్దం చేసుకో ఎంతో ఆలోచించే యీ నిర్ణయం తీసుకున్నానని నువ్వన్నప్పుడే మరిక తాత్సారం, వాగ్వివాదం ఎందుకు?" అంది ఆదిలక్ష్మి కోపంగా.
   
    తల్లి మాటలు పూర్తవుతుండగానే విసురుగా తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది మేఖల.
   
    ఇప్పుడా హాల్లో ముగ్గురే మిగిలిపోయారు.
   
    అప్పుడక్కడ పేరుకున్న నిశ్శబ్దం ఆ ముగ్గురికీ ప్రాణాంతకంగా తోచింది.
   
    వెళ్ళిన మరు నిముషంలోనే ఒక సూట్ కేసు తో బయటకు వచ్చింది మేఖల.
   
    "మీ ఇంట్లో నాకు సంబంధించిన పూచిక పుల్ల కూడా లేదు. అలాగే నా వెంట మీకు సంబంధించిన సంపదల వాసన కూడా లేదు" అంది అవే చివరి మాటలన్నట్లుగా.
   
    "మరెందుకు ఆలస్యం? బయలుదేరు" అంది ఆదిలక్ష్మి అనీజీగా కదలాడుతూ.
   
    "వస్తాను నాన్నగారూ!" అంది మేఖల తండ్రి వేపు చూసి.
   
    ఆయన ఆవేదనగా కూతురివైపు చూశాడు. తండ్రి చూపుల్ని ఎక్కువ సేపు ఎదుర్కోలేని మేఖల చటుక్కున తల తిప్పి తమ్ముడు వేపు చూస్తూ "వస్తాను తమ్ముడూ" అంది.
   
    అప్పుడామె కంఠంలో ధ్వనించిన జీరను ఆ ముగ్గురూ పసిగట్టారు.
   
    ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. అందరి గుండెలు బరువెక్కిపోయాయి.
   
    మేఖల ఒక్కో అడుగు వేస్తూ ద్వారబంధం వేపు సాగింది.
   
    అరుణాచలానికి, అభిరామ్ కి గుండెలు చిక్కబట్టినట్లయింది.
   
    ఆవేశం ఆత్మసౌందర్యానికి నిదర్శనం.
   
    కోపం నిజాయితీకి ప్రతిరూపం.
   
    ఉద్వేగం ఆత్మాభిమానానికి మరో పేరు.
   
    ఎప్పటి కెయ్యది నెయ్యమో అని యోచించే తత్వం కాదు మేఖలది.
   
    అందుకే ఆమెలోని ఆవేశం ఆమె ఆత్మ సౌందర్యాన్ని, కోపం, నిజాయితీని, ఉద్వేగం ఆత్మాభిమానాన్ని ప్రతిఫలిస్తుంటాయి.
   
    మరో అడుగు వేస్తే మేఖల ఆ ఇంటి నుంచి శాశ్వతంగా దూరమై పోతుందనగా ఆదిలక్ష్మి తిరిగి నోరు తెరిచింది.
   
    "రెక్కలొచ్చిన పక్షి గూటిని వదిలేసి వెళ్తోందే గాని, గూటిలోని మరో గువ్వ బాధ్యతను తప్పించుకుందేం? బాధ్యతంటే భయమా? వెరపా?" వెటకారంగా ప్రశ్నించింది ఆదిలక్ష్మి.
   
    ఆ ఇంటినుంచి ఆఖరి అడుగు వేయబోతున్న మేఖల పట్టరాని కోపంతో, ఆశ్చర్యంతో వెనుతిరిగి చూసింది తల్లివేపు.
   
    ఆదిలక్ష్మి అంటున్న ఆ కొత్త బాధ్యతేమిటో ఆ ముగ్గురికీ అర్ధం కాలేదు.
   
    ఆలోచనల్నుంచి ముందుగా తేరుకున్న మేఖల తానున్న చోటునించి అంగుళం కూడా కదలకుండా, తల మాత్రం వెనక్కి త్రిప్పి ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా "అలాంటి వెరపు నాకు లేదు. భయం అంతకన్నా లేదు. నువ్వే చెప్పు, నీకన్నీ విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయిగా..." అంది మేఖల.
   
    "ఉన్న ఆస్తీపాస్తులన్నీ ఊడ్చి నీకు చదువు చెప్పించాము. నీ రౌడీ తమ్ముడికేం మిగల్చలేదు. ఈ మధ్య రౌడీతనం కూడా నేర్చుకున్నట్లున్నాడు. రేపు నువ్వు లేనప్పుడు నాకేం దాచారని మమ్మల్ని నిలదీస్తే...? అసలే రౌడీ...ఆ తరువాత గూండా అవుతాడు... వాడు నీకు మాత్రమే మాట వింటాడు. కన్నామని, వాడికి జన్మనిచ్చామని, పెంచామని గౌరవం మామీద వాడికే మాత్రం లేదు.
   
    అప్పుడు రిక్తహస్తాలతో మిగిలి వున్న మేము వాడికేం ఇవ్వగలం యివ్వనప్పుడు మా మీద దౌర్జన్యం చెయ్యకుండా వూరుకుంటాడా?"
   
    ఆదిలక్ష్మి ఏ ఉద్దేశాన్ని మనస్సులో పెట్టుకొని ఆ వివాదాన్ని రేపిందో ఆ ముగ్గురికీ అర్ధంకాలేదు.
   
    "అందుకే.....వాడ్నీ నీతో తీసుకెళ్ళు వాడి బాధ్యత నీవు తీసుకో వాడికి చదువే చెప్పిస్తావో, గూండాతనమే నేర్పిస్తావో....బతుకుతెరువు చూపిస్తావో...అది నువ్వు తేల్చవలసిన విషయం.
   
    ఉంటే మేము తింటాం. లేదా పస్తులుండి చస్తాం. వాడి బాధ్యతను మాత్రం మేము తీసుకోము. ఆ అవసరం మాకు లేదు" తెగేసినట్లుగా అంది ఆదిలక్ష్మి.
   
    ముగ్గురూ ఆదిలక్ష్మి చెప్పింది విని స్థాణువులయి పోయారు. కొద్ది క్షణాల వరకు వాళ్ళకు నోటంట మాటరాలేదు. ఆమె మనస్తత్వమేమిటో ఆమెను కట్టుకొని రెండున్నర దశాబ్దాలుగా ఆమెతో సంసారం చేస్తున్న అరుణాచలం, ఇరవై నాలుగు సంవత్సరాలుగా మేఖల, ఇరవై రెండు సంవత్సరాలుగా అభిరామ్ ఆమె కన్నబిడ్డలుగా పెరిగినా అర్ధం చేసుకోలేక పోయారు.
   
    ముందుగా తేరుకున్న మేఖల "ఈ బాధ్యతాకు అసలు వెరవను. వెరవకపోగా ఆనందంగా యీ బాద్యతను నా మీదకు ఎత్తుకుంటాను. నేను లేని యీ ఇంట్లో తమ్ముడెలా నెగ్గుకురాగలడని నాకూ నిజానికి భయంగానే వుంది. కోపంలోనయినా కొన్ని మంచి పనుల్నే చేస్తుంటావు నువ్వు నీ పెంపకంలో ఒక లక్ష్యమేదీ లేనట్లు పెరిగినా, తమ్ముడ్ని నేను నలుగురూ మెచ్చేలా తీర్చిదిద్దుతాను" అంది పట్టుదలగా.
   
    అభిరామ్ కి కూడా అక్కలేని ఇంట్లో తను కూడా వుండలేనేమోనని తనలో తానే భావించాడు.
   
    "ఇంటికి పెద్దదానివిగా పుట్టినందుకు బాధ్యతను ఒప్పుకుని పెద్దరికాన్ని చూపించుకున్నావు. శెభాష్! ఇక బయలుదేరండి. క్షణం కూడా మీరీ ఊరిలో వుండటానికి నేనొప్పుకొను" అంది ఆదిలక్ష్మి సీరియస్ గా తన బిడ్డలా కేసి చూస్తూ.
   
    ఉక్రోషం ముంచుకొచ్చిన అభిరామ్ ఆవేశంగా మేఖల వైపు నడిచాడు.
   
    లోపల కన్న తల్లిదండ్రులు....
   
    ద్వారబంధం దాటుతూ వారి కన్న బిడ్డలు!
   
    "బాధ్యతలు తెలీని కన్నబిడ్డల్ని వాటిని తెలుసుకొనేందుకు తల్లి దండ్రులు కొంత డబ్బిచ్చి మీ బ్రతుకు మీరు బ్రతకండని చెప్పడం విన్నాను. కొడుకు యింటికి పెద్దవాడయితే నీ తరువాత వాళ్ళనేం చేయాలని నిలదీయటాన్ని చూశాను.
   
    కాని ఇలా ఇంటికి పెద్ద సంతానంగా ఆడపిల్ల పుట్టినా, నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటటాన్ని, గెంటేస్తూ చిన్న వాళ్ళను, అందునా మగపిల్ల వాడిని బాధ్యతగా అంటగట్టడం నేనెక్కడా, ఎప్పుడూ వినలేదు- చూడలేదు" తనలో తనే అనుకుంటున్నట్లుగా అరుణాచలం అన్న ఆ మాటలు అందరికీ వినిపించాయి.
   
    అయినా ఎవరేం మాట్లాడలేదు.
   
    ఒక్కక్షణం లోపలకు చూసిన మేఖల ఆ మరుక్షణం బయటకు విసురుగా వెళ్ళిపోతూ చటుక్కున అభిరామ్ చేతిని తన చేతిలోకి తీసుకుంది.
   
    చూస్తుండగానే ఆ యిద్దరూ బయటకు వెళ్ళటం, అప్పుడే అటుగా ఖాళీగా వెళుతున్న ఆటోని ఆపటం, అందులో ఎక్కి ముందుకు సాగిపోవటం అంతా క్షణాల్లో సాగిపోయింది.
   
    అప్పటి వరకు ఆందోళనగా ఆటే చూస్తున్న ఆదిలక్ష్మి చటుక్కున తేరుకుని "త్వరగా బయటకు వెళదాం పదండి. ఎందుకు? ఏమిటి? లాంటి మీ అనుమానాలను సమాధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తాను" అంటూ చటుక్కున కిటికీలో వున్న తాళం కప్పను అందుకొని భర్త చేతిని పట్టుకొని బరబరా లాక్కొంటూ బయటకు తీసుకెళ్ళి, వెంటనే ఇంటికి తాళంవేసి తిరిగి భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ వేగంగా ఎదురింటిలోకి దూసుకు పోయింది.
   
    అరుణాచలానికి భార్య చేష్టలు వింతగా అనిపించాయి. ఎదురింటిలోకి వెళ్ళగానే అరుణాచలాన్ని ఆ ఇంటి మధ్య హాల్లో వదిలేసి, తాను మాత్రం లోపలకు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో ఏదో మాట్లాడి తిరిగి మధ్యహాల్లోకి వచ్చి భర్తను తనతో రమ్మన్నట్లుగా సైగచేస్తూ వీధి వేపున్న గదిలోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోమంది.

 Previous Page Next Page