Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 11


    హిందూ సడన్ గా లేచి వడివడిగా బయటకెళ్ళిపోయింది.

    ఆమె చేతిలో చిల్లిగవ్వలేదు. పైగా కడుపులో ఆకలి, కాళ్ళలో నిస్సత్తువ, అయినా తనకు తెలిసిన డాక్టర్స్ ని కల్సుకునేందుకు బలవంతాన పరుగెడుతోంది.

    గుడిసెంతా చీకటి పర్చుకుంది.

    మోకాళ్ళ మధ్య తలవంచుకుని ఆలోచిస్తున్నాడు తిమ్మడు.

    "తిమ్మడు..." అంటూ హీనస్వరం ఆ చీకట్లో వినిపించింది. తిమ్మడు ఆమె దగ్గరకు వెళ్ళాడు.

    అస్పష్టంగా ఏవో మాటలు ఆమె గొంతు నుంచి వస్తున్నాయి.

    అప్పటివరకూ నిర్లిప్తంగా, నిస్తేజంగా మిగిలిపోయిన తిమ్మడు ఆ చీకట్లోనే వెతికి బుడ్డీదీపం వెలిగించి ఆమె దగ్గరకు వచ్చాడు.

    అప్పుడు చూసాడామె ముఖాన్ని. శుష్కించి, పాలిపోయినట్లున్న ఆమె ముఖంలో జీవం ఎక్కడా లేదు. కళ్ళు తేలిపోతున్నాయి. తెల్లగుడ్డు కనిపిస్తోంది. పెదాలు ఎండిపోయి దేనికోసమో ఆరాటపడుతున్నట్లు కనిపిస్తున్నాయి.

    ఆమెనా స్థితిలో చూసిన తిమ్మడికి గుండె చిక్కబట్టినట్లయింది.

    ఆమెకు బాగా దగ్గరకు జరిగి ఏమిటన్నట్లు చూశాడు.

    "సిద్ధప్ప... సిద్ధ..."

    ఆమె బాధ అర్ధమయింది తిమ్మడికి. అప్పటికి వచ్చింది సిద్ధప్ప గురించిన ఆలోచన.

    ఆమె పెదవులింకా నీరసంగా కదులుతున్నాయి కాని మాటలు పైకి రావటం లేదు. అలా కాసేపు ప్రయత్నించి, ప్రయత్నించి విఫలమయింది.

    ఏం చేయలేనని తెలిసినా, ఏదో ఒకటి చేయకుండా చేతులు ముడుచుకు కూర్చోవటం బాధగా వుంది తిమ్మడికి.

    తమ అసమర్ధతను వెక్కిరిస్తూ ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోబోతోంది.

    నిస్సహాయంగా చూడటం తప్ప, ఏం చేయలేకపోతున్నాడు.

    హిందూ వెళ్ళిన గంటకు ఒక యువకుడ్ని వెంటబెట్టుకుని హడావుడిగా వచ్చింది.

    అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని కొద్ది క్షణాలకే వదిలేసాడు నిస్పృహగా.


                      *    *    *    *


    బంజారా గార్డెన్ రెస్టారెంట్ లో కూర్చున్నారు ప్రియాంక, బోస్. వాళ్ళు అక్కడికి వచ్చి అప్పటికే రెండు గంటలయింది.

    బోస్ ఏదో అడగాలని ప్రయత్నిస్తున్నాడు రెండు గంటలనుంచి. వెండి వెన్నెల్లో కుర్చీలో ఆ వైపుకి తిరిగి కూర్చున్న ప్రియాంక ప్రొఫైల్ బోస్ కి పిచ్చెక్కిస్తోంది.

    ఉండుండి వీస్తున్న చల్లని గాలికి ఆమె పొడవాటి జుత్తుతోపాటు పల్చని పైట చెంగు కూడా అల్లల్లాడుతోంది.

    మెర్క్యూరిక్ లైట్ల కాంతిలో మెరుస్తున్న ఆమె నున్నని భుజాలవైపు అప్పుడప్పుడూ చూస్తున్నాడు.

    "ప్రియాంక!" మెల్లగా పిల్చాడు బోస్.

    ఏమిటన్నట్లు తమాషాగా కనురెప్పల్ని కదిలించింది.

    అతని పెదాలు తడారిపోతున్నాయి.

    అతను టెన్షన్ ఫీలవటం, సిగ్గుపడటం, ఇబ్బందిపడటం అంతా గమనిస్తూనే వుంది. అయినా కావాలనే తనకేమీ తెలియనట్లుగా కూర్చుంది.

    "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కిష్టమైతే..." ఆపైన బోస్ కి మాటలు రాలేదు. ఆశగా ఆమె వైపే చూస్తున్నాడు.

    ఓ నిమిషం ప్రియాంక ఏం మాట్లాడలేదు.

    బోస్ ఆమె మౌనాన్ని అంగీకారంగా అర్ధం చేసుకున్నాడు.

    "ఎంతగా ప్రేమిస్తున్నావ్?" ఆసక్తిని కనబర్చుతూ అడిగింది.

    "ప్రాణం ఇచ్చేంతగా" నిజాయితీగా అన్నాడు బోస్.

    "ఇదే విషయాన్ని రేపు కాలేజీలో అందరి ముందు చెప్పాలి."

    "తప్పకుండా, నువ్వేం చేయమంటే అదే చేస్తాను..."

    "ఓ.కె! మరి వెళ్దామా?" లేచి నిలబడింది ప్రియాంక.


                      *    *    *    *


    ఆ రాత్రంతా శవం దగ్గిరే నిద్ర లేకుండా కూర్చున్నారు తిమ్మడు, హిందూ.

    మరుసటి రోజు ఉదయానికి కూడా సిద్ధప్ప జాడలేదు.

    "శవాన్ని ఇంకెక్కువసేపు వుంచటం మంచిదికాదు-" హిందూ బాధపడుతూ అంది.

    తిమ్మడు ఆమెవైపు ప్రశ్నార్ధకంగా చూసాడు.

    ఆ చూపుల్లో ఎలా అన్న ప్రశ్న కనపడి, తల వంచుకుంది.

    ఐదు నిమిషాల నిశ్శబ్దం తర్వాత తిమ్మడు ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా లేచాడు.

    చకచక అక్కడున్న పాత బుట్టల్ని, గోనెసంచుల్ని దగ్గరకు చేర్చి శవాన్ని ఒక మూటలా చుట్టాడు. మూలగా వున్న ఒక కుండను హిందూకి అందించాడు.

    అతనేం చేయబోతున్నాడో హిందూకి అర్ధం కావటం లేదు.

    ఆ మూటను తేలిగ్గా భుజానికి ఎత్తుకున్నాడు. హిందూని రమ్మన్నట్లుగా చూస్తూ బయటకు నడిచాడు.

    తిమ్మడి చూపులు ఇక్కడ లేవు. అర్ధరాత్రి స్మశానాల్లో నిర్వికారంగా కదిలిపోయే అపర శివుడేమో అన్న భ్రాంతి.

    అలా అరగంటపాటున నడిచి ఊరికి దూరంగా వున్న మామిడి తోపులోకి నడిచి ఓ చోట ఆ మూటను దింపాడు. హిందూ చేతిలో వున్న కుండను తీసుకొని దూరంగా వున్న వాగు దగ్గరకెళ్ళి నీళ్ళు తెచ్చాడు.

    హిందూకి అర్ధమయింది తిమ్మడేం చేయబోతున్నాడో.

    ఆ మూటను విప్పదీశాడు. చుట్టుప్రక్కల పడున్న ఎండుకొమ్మల్ని విరగదీసాడు. వాటిని క్రింద వరుసగా పేర్చి ఆ శవాన్ని దానిమీద పరుండబెట్టి చుట్టూ, పైన ఆ కట్టెల్ని పేర్చాడు. నీళ్ళకుండను భుజానకెత్తుకుని మూడుసార్లు గుండ్రంగా తిరిగి, దాన్ని నేల విడిచాడు.

    జేబులోంచి అగ్గిపెట్టె బయటకు తీసి, దగ్గరగా వెళ్లి ఓసారి కట్టెల గుట్టవైపు చూసాడు.
   
    ఒక కన్నీటి చుక్క తిమ్మడ్ని వెక్కిరిస్తూ నిశ్శబ్దంగా రాలిపడింది.

    ఆ దృశ్యాన్ని చూస్తున్న హిందూకి దుఃఖం ఆగలేదు. అగ్గిపుల్ల అంటించాడు. భగ్గున మింటికెగసాయి మంటలు.


                      *    *    *    *


    ఉదయం పదిగంటల సమయం.

    హిందూ పిట్టగోడమీంచి పక్కింటిలోని కార్ గ్యారేజ్ వైపు చూస్తోంది. సరిగ్గా పది-ఐదుకి గ్యారేజ్ తలుపులు తెరుచుకున్నాయి.

    హిందూ వెంటనే రెండు అంగల్లో తమ గదిముందుకొచ్చి "కమాన్ హరియప్" అంది.

    ఆ మరుక్షణం సైంటిస్ట్, ఇంజనీర్ వీధిలోకి దూసుకుపోయారు. ఆ వెనుకే హిందూ కూడా పరిగెత్తడం ప్రారంభించింది.

    సరిగ్గా ఐదు నిమిషాలకి ఆ వీధి మలుపులో కాపు కాసారా ముగ్గురు.

    ప్రియాంక ఎక్కిన కారు బయలుదేరింది.

    వేగంగా వస్తున్న కారువైపే చూస్తున్నారా ముగ్గురూ.

    సరిగ్గా టర్నింగ్ దగ్గర కారు స్లో అయింది.

    ఛెంగున కారుకి అడ్డంగా రోడ్డుమీదకు దూకారు సైంటిస్ట్, ఇంజనీర్.

    హఠాత్తుగా అడ్డొచ్చిన వార్ని చూసి చికాకుపడుతూ కారాపింది.

    అప్పటికే హిందూ కారు దగ్గరకు పరుగెత్తుకొచ్చి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చుంది.

    ప్రియాంక కోపంగా చూసింది హిందూవైపు.

    "కోపంగా తర్వాత చూద్దూగాని, ముందు కారు నేను చెప్పిన వైపు పోనివ్వు..." అంటూ చేతిలో వున్న చాకును బయటకు తీసి చూపించింది.

    "చంపుతావా?" హేళనగా అంది ప్రియాంక.

    "ఛా... ఛా... నిన్ను చంపాను. నీ పొగరును చంపుతాను. కమాన్ రైట్ కి తిప్పు" అంది హిందూ కోపంగా.

    "నేను పోనివ్వను. ఏం చేస్తావ్...?" మొండిగా అంది ప్రియాంక.

    "ఇది చేస్తాను" అంటూ మెత్తని ఖరీదైన కుషన్ సీట్ ని చర్రున మధ్యకు కోసింది.

    అలా చేస్తుందని వూహించని ప్రియాంక కంగారు పడిపోయింది. తనకు ఎంతో ఇష్టమైన కారు డోర్ మీద ఆయిల్ మరక పడితేనే డ్రైవర్ ని వుద్యోగం లోంచి తీసేయించింది. అంత అపురూపంగా చూసుకొనే కారు సీటు నిర్ధాక్షిణ్యంగా కోసేసింది.

    "ఏం చేస్తానో చూసావుగా, పోనివ్వు" గద్దించి అంది హిందూ.

    ఆమెకిప్పుడు మోసగింపబడిన తిమ్మడే కనిపిస్తున్నాడు.

    మారు మాట్లాడకుండా కారును ముందుకు పోనిచ్చింది. హిందూ ఇచ్చిన డైరెక్షన్స్ లో నడిచిన కారు పావుగంటకు ఒక మురికి వీధిలోకి మళ్ళింది.

    ఆ వీధిని చూడగానే ప్రియాంక ముఖం చిట్లించింది.

    హిందూ ఉద్దేశమేమిటో ప్రియాంకకు అర్ధంకావటం లేదు. మురికి కాలువలు వీధిలోకే ప్రవహిస్తున్నాయి.

    హిందూ ఆ వీధి చివర వరకు ఓసారి తన దృష్టిని సారించింది. ఆ వీధిలో ఎక్కడా చిన్నపిల్లలు కనిపించలేదు. సంతృప్తిగా తలపంకించి, "కారుని స్పీడ్ గా పోనివ్వు" అంది దురుసుగా.

    క్షణాల్లో కారు స్పీడందుకుంది.

    చూస్తుండగానే నాలుగైదు కోళ్ళు, బాతులు కారు కింద పడి చనిపోయాయి. అది చూసిన జనాలు గోలచేస్తూ కారెంట పడ్డారు. కొద్దిదూరం ప్రయాణించారు. దారిలేక కారును ఆపక తప్పలేదు. వెనుక పరిగెత్తుకొస్తున్న జనం దగ్గరయ్యేలోపే హిందూ కారులోంచి దిగి "నీకు సరైన శాస్తి ఇప్పుడే జరుగుతుంది. రెడీగా వుండు. గుడ్ బై" అంటూ వేగంగా వెళ్ళిపోయింది.


                      *    *    *    *


    "సిద్ధప్ప తల్లి చనిపోతేనే అంత బాధపడుతున్నావ్. మరి నేను చనిపోతే...? అదీ జరుగుతుంది. నీలాంటి కొడుకుల్ని కన్న తల్లులకు సుఖం వుండదు. శ్రమ విలువ తెలియని నీలాంటి సోమరులు, చదువు సంధ్యలు అబ్బని నీలాంటి మూర్ఖుల్ని కన్నందుకు నాలాంటి తల్లులే కాదు, ఈ దేశమే అధోగతి పాలవుతుంది. నిన్ను చదివించాలని ప్రయత్నించాను. చదువుకోలేదు సరికదా, మాస్టార్ ని చావగొట్టి వచ్చావ్. ఏ పనిలో చేర్పించినా పట్టుమని నాలుగురోజులు పనిచేయలేదు. చెట్టంత మనిషివయ్యావ్. తల్లి సంపాదన మీద బతకటానికి నీకు సిగ్గనిపించటం లేదూ? బాగుపడాలన్నా, పైకి రావాలన్నా చదువుసంధ్యలే అక్కర్లేదు. చిత్తశుద్ధి, శ్రమించడం, పట్టుదల వుంటే చాలు. అవి లేవు నీకు. మనిషి జన్మెత్తినందుకు సిగ్గుండాలి.

    ఒక ఆడపిల్ల చేతిలో మోసగింపబడ్డావ్... ఛీ... ఛీ...." అంటూ వాసమ్మ బయటకెళ్ళిపోయింది.

    తిమ్మడు మౌనంగా కూర్చున్నాడు.

    అతనికిప్పుడు కళ్ళముందు మోసం చేసిన ప్రియాంకే కనిపిస్తోంది. అప్రయత్నంగా అతని పళ్ళు ఒరుసుకున్నాయి. విసురుగా లేచి నించున్నాడు.


                      *    *    *    *

    ఒక్కసారిగా మీదపడిన ఆ జనం నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రియాంకకు అర్ధంకాలేదు.

    డబ్బులు పారేసి వాళ్ళ నోరు మూయించాలనుకుంది. పర్స్ చేతిలోకి తీసుకుని జిప్ లాగి చూసి ఆశ్చర్యపోయింది. అందులో డబ్బులు లేవు. ఓ తెల్లకాగితం వుంది. దాన్ని బయటకు తీసింది. ఏదో రాసుంది అందులో.

    ఆశ్చర్యపోతూ విప్పదీసింది.

    "మనిషి ప్రాణం విలువ నీకు తెలియదు. ఎందుకంటే నీ దృష్టిలో మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే. అందుకే నీకీ శిక్ష. నీ పర్సులో డబ్బులన్నీ నేను తీసుకెళుతున్నాను. ఇప్పుడు నువ్వు వాళ్ళ నష్టానికి తగిన పైకం చెల్లించందే వాళ్ళు కదలనివ్వరు. పాపం నీ ప్రాణానికి ప్రాణమైన కారు నిమిషంలో ఏమవుతుందో... గుడ్ బై. ఇది టైప్ చేసిన లెటర్. సాక్ష్యానికి పనికిరాదు పాపం!"

 Previous Page Next Page