ఆ సంగతి తెలిసిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయాడు మరిడేశ్వరరావు.
తక్షణం హిందూరావుకి డెత్ సెంటెన్స్ ఇచ్చేశాడు.
తన కొడుక్కి, తన ఎనిమీ గ్యాంగు లీడరయిన దుర్గేష్ కూతురు రాధకి పెళ్ళి చేసినవాడు తన కొడుకు చావుకి పరోక్షంగా కారణమైనవాడు అయిన హిందూరావు బతికి ఉండడానికి వీల్లేదు.
హిందూరావు చచ్చితీరాలి.
అతను ఎక్కడ కనపడితే అక్కడ చంపెయ్యాలి. అతని కోసం వెయ్యికళ్ళతో వెతుకుతుండాలి.
అది అతని ఆర్డర్.
ఆ ఆర్డర్ గురించి తెలిసీ తెలియగానే హిందూరావు ఊరొదిలి పారిపోయాడు.
మళ్ళీ ఇన్నాళ్ళకు ఇక్కడ కనబడ్డాడు.
సన్నగా ఒణకడం మొదలుపెట్టాడు గఫార్. తన బ్యాడ్ లక్. తను హిందూరావుని చూడలేదు. తన దృష్టంతా పాప మీదే ఉంది.
బాడీగార్డు యాది మాత్రం అలర్టుగా హిందూరావుని చూశాడు.
మెల్లగా అన్నాడు మరిడేశ్వరరావు.
"పాపం పాపని చూస్తే గుండె నీరయిపోయింది కదూ గఫార్?"
గఫార్ కళ్ళలో ప్రాణభయం కనబడింది. అది చూసి అనునయంగా అన్నాడు మరిడేశ్వరరావు.
"ఆ మాత్రం మానవత్వం ఉండకుండా ఎక్కడికి పోతుందిలే! మనం మాత్రం మనుషులం కాదా ఏమిటి? అవునా గఫార్?"
అది వినగానే గఫార్ మొహంలో రిలీఫ్ కనబడింది.
తక్షణం చక్ మని మెరిసింది మరిడేశ్వరరావు చేతిలో చాకు.
మరుక్షణంలో గఫార్ గొంతు అడ్డంగా చీలిపోయింది.
రెండు చేతులూ గొంతు దగ్గర పట్టుకుని అటూ ఇటూ తూలి దభేలుమని కుప్పకూలిపోయాడు గఫార్.
ఒకసారి గఫార్ వేపు చూసి తర్వాత హిందూరావు దగ్గరకు నడిచాడు మరిడేశ్వరరావు.
అతని వెనకే వెళ్ళారు యాది, సత్యనారాయణ్.
హిందూరావు నీలుక్కుపోయినట్టు నిలుచుని వున్నాడు. అతని చేతిలో నిశ్చలంగా వుంది పాప.
"నువ్వు హిందూరావ్! అవునా?" అన్నాడు మరిడేశ్వరరావు.
అవునన్నట్లు తల పంకించాడు హిందూరావు. తర్వాత నెమ్మదిగా అన్నాడు-
"మీరు మరిడేశ్వరరావు...."
"చచ్చిపోయిన రాజు తండ్రిని" అన్నాడు మరిడేశ్వరరావు ఆరోపణగా. అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో హిందూరావుపట్ల అపరిమితమైన ద్వేషం కనబడింది.
"నీవు అప్పుడు తప్పించుకు పారిపోయావ్, ఇప్పుడెక్కడికి పోతావ్ భే!" అన్నాడు పరుషంగా.
"నేను పారిపోయానా? నాకలాంటి అలవాటు లేదే!" అన్నాడు హిందూరావు.
"నేను చంపేస్తానని తెలిసినా పారిపోకుండా ఉండడానికి నువ్వేం తురుంఖానువా?"
"నేను తురుంఖానుని కాకపోవచ్చు. కాని నేను బ్లాక్ క్యాట్ కమెండోని. వి.ఐ.పి. సెక్యూరిటీ వింగ్! భయమన్నది మనకు తెలీదు" అన్నాడు హిందూరావు ఒక్క అంగుళం కూడా కదలకుండా.
"బ్లాక్ క్యాట్ కమెండో" అన్న మాట వినగానే హిందూరావు వేపు విస్మయంగా చూశాడు మరిడేశ్వరరావు.
"నువ్వు వూళ్ళో పూజారివి! కమెండో ఎందుకవుతావు."
"పౌరోహిత్యంలోకి రాకముందు పూర్వాశ్రమంలో బ్లాక్ క్యాట్ కమెండోని. ఫోర్సెన్ లో నుంచి బయటికి వచ్చేశాక కొన్నాళ్ళపాటు పురోహితుడిని. దానిలోనూ తృప్తి దొరకక సర్వం త్యజించి సన్యసించాలని హిమాలయాలకు వెళ్ళాను. సాధూ సంత్ లతో కలసి తిరిగాను. అతి భయంకరుడని పేరున్న ఒక అఘోరీ సాధుని వెదుకుతూ దేశమంతా తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. అంతేగానీ ఎవరికీ భయపడి పారిపోలేదు."
అఘోరీ సాధు అనగానే అపరిమితమైన ఆశ్చర్యం కనబడింది మరిడేశ్వరరావు మొహంలో.
అఘోరీ సాధువుల గురించి అతను విన్నాడు. అఘోరీ సాధువులు నరమాంస భక్షకులు. మనిషి రక్తం తాగుతారు. అవసరమైతే విచక్షణ లేకుండా ఏదైనా తింటారు. చివరికి మలమూత్రాదులు కూడా. స్మశానాల్లో వుంటారు. దిగంబరంగా తిరుగుతారు మండుతున్న చితిమీదే వండుకుంటారు. మొగమనిషి శవాన్ని పట్టుకుని దాని కళ్ళ పైభాగం నుంచి కపాలాన్ని కోసేసి ఆ కపాలంలోనే తింటారు. తాగుతారు. దానితోనే అవసరమైనప్పుడు భిక్షాటన చేస్తారు. దానితోనే మంత్రతంత్రాలు జరుపుతారు.
అలాంటి అఘోరీ సాధువులతో తనకీ అవసరం వుంది. తనూ వెదుకుతున్నాడు.
తాత్కాలికంగా హిందూరావు మీద పగని పక్కకి నెట్టాడు మరిడేశ్వరరావు.
"అఘోరీ సాధు నీకు కనబడ్డాడా?" అన్నాడు నెమ్మదిగా.
"అడిగో నీ వెనకే నిలబడి వున్నాడు" అన్నాడు హిందూరావు.
అతి ఘోరమైన పద్దతిలో జీవితం సాగించే అఘోరీ సాధువు అక్కడే ఉన్నాడని హిందూరావు అనగానే, గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు మరిడేశ్వరరావు.
కానీ అఘోరీ సాధువు లేడు అక్కడ.
తన బాడీగార్డు యాది మాత్రం అలర్టుగా నిలబడి వున్నాడు.
ఉగ్రంగా హిందూరావు వైపు చూశాడు మరిడేశ్వరరావు.
"ఏం! నాటకాలాడుతున్నావా?"
"క్షణం క్రితం ఇక్కడే ఉన్నాడు అఘోరీ సాధూ! అంతలోనే అదృశ్యం అయిపోయాడు" అన్నాడు హిందూరావు స్థిరంగా.
అపనమ్మకం కనబడింది మరిడేశ్వరరావు మొహంలో.
అది చూసి అన్నాడు హిందూరావు.
"అఘోరీకి అద్భుత సక్తులు ఉంటాయనేగా అతన్ని చూడాలనుకుంటోందీ! ఆయన శక్తులు ప్రదర్శిస్తుంటే నమ్మకపోతే ఎలా?"
కఠినంగా అన్నాడు మరిడేశ్వరరావు.
"నా కళ్ళతో నేను చూడాలి."
మరిడేశ్వరరావుకేమీ సమాధానం చెప్పకుండా, తన చేతిలో నిశ్చలంగా, నిర్జీవంగా ఉన్న పాపవైపు నిర్వేదంగా చూశాడు హిందూరావు. తర్వాత తల పంకించి, "సెంటిమెంట్లకు ఇది సమయం కాదు" అనుకుంటూ, పాప శవాన్ని తల్లి శవం ప్రక్కన పడుకోబెట్టి, అక్కడ నుంచి కదలబోయాడు.
మొరటుగా అతని భుజమ్మీద చెయ్యేసి నిలేశాడు మరిడేశ్వరరావు. ఒక్కొక్క అక్షరం ఒత్తొత్తి పలుకుతూ అన్నాడు-
"అఘోరీని చూపించకపోతే నీ అంతు చూస్తా!"
సూటిగా మరిడేశ్వరరావు మొహంలోకి చూశాడు హిందూరావు. "నీ ఖర్మ!" అన్నట్లు తల పంకించి ముందుకు దారితీశాడు.
తన డ్రైవర్ సత్యనారాయణ్ కు సైగచేసి, దగ్గరికి పిలిచాడు మరిడేశ్వరరావు. సత్యనారాయణ్ చెవిలో రహస్యంగా ఏదో చెప్పి పంపించేసి, తను హిందూరావు వెనక నడిచాడు. అతన్ని అనుసరించాడు బాడీగార్డు యాది.
వాళ్ళని కొంతదూరం వెళ్ళనిచ్చి గఫార్ శవాన్ని కార్లో వేసుకున్నాడు సత్యనారాయణ్. కారు స్టార్ట్ చేశాడు అక్కడికి దగ్గర్లోనే ఒక మసీదు ఉంది. మసీదు దగ్గర గఫార్ శవాన్ని పడేశాడు సత్యనారాయణ్. తర్వాత కారుని అతివేగంగా నడుపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పది నిమిషాలు అలా ప్రయాణం చేశాక, ఒక షాపు ముందు ఆగి, అక్కడి నుంచి నలుగురికి నాలుగు ఫోన్ కాల్స్ చేసి, సంకేత పదాలతో ఒక సందేశం అందించాడు.
* * * *
అఘోరీని వెతుకుతూ ముందుకు వెళ్తున్న హిందూరావు మనసు ఉద్వేగంగా ఉంది.
అఘోరీకి అద్భుత శక్తులు ఉన్నాయని, అష్టసిద్ధులు ఉన్నాయని కర్ణాకర్ణిగా విన్నాడు తను.
తను సర్వసంగ పరిత్యాగి! తన కోసం తనేమీ కోరడు!
కానీ తనకి ఒక సంకల్పం ఉంది! మహా సంకల్పం!
అది తీరాలంటే అమానుష శక్తులున్న అఘోరీ లాంటివాడి అండ కావాలి.
తన సంకల్పం నెరవేరడానికి సాయం చేయగల తాకత్తు ఉన్నవాడిని వెతుకుతూ ఎంతోమంది సాధువులనీ, సంయాసులనీ కలిశాడు తను.
అలా తిరగటంలో ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన విశేషాలు తెలుసుకున్నాడు.
చకచకా నడుస్తూనే సాధువుల గురించీ, సన్యాసుల గురించీ తను తెలుసుకున్న వివరాలు నెమరేసుకోవడం మొదలెట్టాడు హిందూరావు.
సాధువులని వాళ్ళ వేషధారణనిబట్టీ, వాళ్ళు పెట్టుకునే బొట్టును బట్టీ వాళ్ళు సాధువుల్లో ఏ తెగకి చెందినవాళ్లో తేలిగ్గా చెప్పెయ్యొచ్చు! నాగ సాధువులు అసలు బట్టలు వేసుకోరు! పూర్తి దిగంబరంగా ఉంటారు.
శరీరం మీద పెరిగే కేశాలని గురించి వాళ్ళకి గట్టి నియమాలు ఉంటాయి. కేశాలని గురించి రెండు రకాల నియమాలు పాటిస్తారు వాళ్ళు. శరీరం మీద కేశాలు పెరిగే ఐదు చోట్లా కేశాలని పెరగనివ్వడం ఒక పద్ధతి. లేదా ప్రతి వెంట్రుకనీ క్షవరం చేసి నున్నగా ఉంచుకోవడం రెండో పద్ధతి.
సాధువులు దీక్ష తీసుకునే విధానం విచిత్రంగా ఉంటుంది. సన్యాసులలో కొత్తగా చేరే వ్యక్తి తనకు సన్యాసం మీద ఎంత గురి ఉందో రుజువు చెయ్యాలి. నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తానని ప్రమాణం చెయ్యాలి.
తర్వాత నదిలో మూడు మునకలు వేసి, పవిత్రస్నానం చేస్తారు. అప్పటిదాకా వంటిని అంటుకుని ఉన్న పాత బట్టలని నదిలో పారేస్తారు. కొత్తబట్టలు వేసుకోవడంతో వాళ్ళకి కొత్త జీవితం మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్ళు పిండితో నలభై ఎనిమిది పిండాలు చేసి, పిండప్రదానం చేస్తారు. పితృదేవతలని పూజిస్తారు.