Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 11

    సూరిబాబు కళ్ళు ఆనందంతో మెరిసాయి.

    "నా మాటలు శ్రద్ధగా వింటానని అంటున్నందుకు సంతోషం. అమ్మాయిగారు తండ్రిమాట కాదని మనకోసం ఇల్లు వదలి వచ్చారు అంతవరకు బాగానే వుంది. మనతోపాటు సమ్మెలో పాల్గొంటున్నారు అదీ బాగానే వుంది. కాని యజమాని దిగిరాలేదు మన కోర్కెలు తీరనూలేదు...

    "దానికి అమ్మాయిగారేం చేస్తారు?" వాళ్ళల్లో ఒకతను లేచి మరీ అడిగాడు.

    "అమ్మాయిగారు ఏమీ చేయరు. ఎందుకంటే అబ్బ కూతురు కలిసి ఆడేది నాటకం కాబట్టి...మనలో చాలా మందికి చదువులేదు. వేరే తెలివిలేదు. వేరే సంపాదన లేదు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి...తండ్రితో పోట్లాడి అమ్మాయిగారు బయటికి వచ్చి మనమధ్య కూర్చున్నారని మనం జాలితో కరిగి నీరయి సమ్మె విరమిస్తామని... వాళ్ళో గొప్ప ఆలోచనతో ఈ నాటకం ఆడారు.

    ఎప్పుడయినా ఎక్కడయినా పెద్దింటి బిడ్డలంటే యజమాని కొడుకు బీదవాళ్ళకోసం ఇల్లు విడిచి బయటికి రావటం వుందా! ఎక్కడా లేదు. నాలుగు డబ్బులు చేసుకోటానికి సినిమాల్లో ఇలాంటివి చూపిస్తారు. ఆ సినిమాలు మనం చూసి అలా జరిగితే ఎంత బాగుంటుంది! అనుకుంటాం గాని అలా ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు.

    అలాంటిది__

    ఒక ఆడకూతురు యజమానికి వున్న ఒక్కగానొక్క ఆడపిల్ల తండ్రితో మన కోసం పోట్లాడి ఇల్లు విడిచి వచ్చింది అంటే నాటకంగాక మరేమిటి? కూతురు బయటికి వచ్చేసిందని మన యజమాని ఏమన్నా దిగులుపడ్డాడా! అదేంలేదు. చుట్టతాగినంత తాపీగా కూర్చున్నాడు. కన్నతల్లి కూడా చూడటానికి రాలేదు. అంటే ఇదంతా వాళ్ళు ముగ్గురూ కలిసి ఆడుతున్న నాటకం అనేకదా!

    "మీలో ఒక మనిషిని" అంటూ అమ్మాయిగారు వచ్చేసింది. మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఆడకూతుళ్ళలాగా వుండొచ్చుకదా! మధ్యలో అమ్మాయిగారంటూ ఈ పిలుపెందుకు? నన్ను గారు అని పిలవొద్దని చెప్పొచ్చు కదా! చెప్పదు. ఎందుకంటే గారు అని పిలిపించుకోటం సంతోషం కాబట్టి...తన గౌరవం పోదుకాబట్టి...

    గారు సంగతి గౌరవం సంగతి వదిలేద్దాం. మనం గంజి తాగుతుంటే తను జబారునుంచి అన్నీ ఖరీదయినవి తెప్పించుకొని తింటున్నది. అడిగినవాళ్ళకి, అడుక్కున్నవాళ్ళకి గొప్పగ అన్నీ కొనిపెడుతున్నది. బంగారుగాజు అమ్మి కొనిపెడుతున్నదని ఒక వార్త. బంగారుగాజు ఎవరికోసం అమ్మింది? మనందరి కోసమా! కాదు. తన కోసం తన అవసరాల కోసం.

    ఆ డబ్బు అయిపోతే వంటిమీద నున్నది మరొక బంగారు వస్తువు అమ్ముతుంది డబ్బులు వస్తాయి. హాయిగా అన్నీ వేసుకుని కడుపార భుజిస్తుంది. తనని పొగిడించుకోటానికి ఆ పక్కనున్న వాళ్ళకి కాస్త పారేస్తుంది. జరిగినన్ని రోజులు జరుగుతాయి. ఆ తర్వాత కూడా దిగులులేదు. డబ్బులు కాసే చెట్టులాంటి తండ్రి వున్నాడు. ఓ రోజు కడుపుకాలితే జై పరమేశ్వరా అని తండ్రి దగ్గరకెళ్ళి వాలుతుంది.

    చివరికి వాళ్ళూ వాళ్ళూ బాగానే వుంటారు. ఆకలితో మాడి చచ్చేది మనమూ మనమూను. ఆ పిల్ల మనతో కలిసి జీవించటానికి వచ్చింది మన కష్టసుఖాలలో పాలు పంచుకోవటానికి వచ్చింది. అలా అని ఆ పిల్ల చెప్పింది. మనము నమ్మాము. మన గూడానికి వచ్చిన ఆ ఆడకూతుర్ని అడిగి చూడండి మన కుర్రాళ్ళలో ఓ కుర్రాడిని పెళ్ళాడుతుందేమో!

    "నేను మీ మనిషిని అయినప్పుడు మీ వాడలోని కుర్రాడినిగాక వేరేవాడిని యెందుకు పెళ్ళాడుతాను! నేను తలుచుకుంటే నన్ను పెళ్ళాడటానికి లక్షాధికారులు, కోటీశ్వరులు కోటిమంది వస్తారు. ధనవంతుడయిన భర్త నాకు అక్కరలేదు. గుణవంతుడయిన భర్త నాకు కావాలి. మంచి గుణాలవాళ్ళు మీలోనే వుంటారు. మీలో వాడిని చూసి పెళ్ళాడతాను..."

    ఈమాట అమ్మాయిగారి నోటంట వచ్చిననాడు మనం అమ్మాయిగారిని నమ్మొచ్చు. ఇదంతా నాటకం కాదని నమ్మొచ్చు. మీలో యెవరికయినా దమ్ముంటే అడిగి చూడండి. అడగటంవల్ల అమ్మాయిగారి గుణం తెలుస్తుందిగాని అగౌరవం ఏమీ కలగదు. మరో మాట...అమ్మాయిగారు మన గూడెంలో వాడిని పెళ్ళాడితే ముందు ముందు ఆస్తీ అంతా అమ్మాయిగారిది అవుతుంది ఎలాగూ అందరం అమ్మాయిగారిది మంచి హృదయం, దయగల తల్లి అనుకుంటున్నాము కాబట్టి ఆస్తినంతా అందరికీ పంచవచ్చు.       

    అప్పుడు...

    మనందరికి కూడు గుడ్డ నీడ అంటే రోటీ కపడ ఔర్ మకాన్ అన్ని దక్కుతాయి. అనగ మనందరం ఇతర దేశస్తులలాగ సర్వసమానంగా వుంటాము. బీద గొప్ప అనే తారతమ్యం వుండదు. నేచెప్పింది ఆలోచించండి_బాగా ఆలోచించండి. ఇదే సరయిన సమయం అమ్మాయిగారు నిజమైన మనిషో, నాటకాల మనిషో తెలిసిపోతుంది. నిజం తెలుసుకుంటే మన మనసులు తేలికవుతాయి...

    సూరిబాబు ఛోటా రాజకీయ నాయకుడిలా సరిగ్గా అరగంటసేపు కంఠస్వరం పెంచి చేతులు ఊపుకుంటూ ఆవేశంగా బాగా అర్ధమయేలా వాళ్ళలో ఆశలు పెంచుతూ మాట్లాడాడు.

    మంచికన్నా చెడ్డ తొందరగా వ్యాపిస్తుంది. కడివెడు పాలల్లో ఒక విషంచుక్క చాలు పాలు విరగటానికి.

    సూరిబాబు వాళ్ళ మనసుల్లో విషబీజం నాటాడు. అది అప్పటికప్పుడే మొలకెత్తింది. ఇక అది మహావృక్షమై ఊడలుదిగి వూరంతా పరుచుకోవటం ఒక్కటే మిగిలింది.

    తలొక ఇల్లు
   
    కొందరి ఆలోచనలు.

    కూడుగుడ్డ

    మరికొందరి ఆలోచనలు

    అమ్మాయిగారిని పెళ్ళాడితే!

    ఇది వయసులో వున్న అబ్బాయిల ఆలోచనలు!

    ఆశగా ఆబగా అందరిలో సాగుతున్నాయి.

    వాళ్ళల్లో కాస్త వివేకంగల వారి ఆలోచనలు మాత్రం వేరేవిధంగా సాగుతున్నాయి.

    "సూరిబాబు చెప్పింది ఆలోచించదగిందే అలా అని అనుమానించటం మంచిదికాదు .సూరిబాబు సరయినవాడా! ఉత్తలొల్లి గాడు. కబుర్లు చెప్పంగానే సరిపోదు కదా?"

    "అమ్మాయిగారు చూస్తే అమాయకంగా మాదొడ్డ గుణం కలదానిలా వుంది. కార్మికురాల్ని మోసపుచ్చటానికి ఇంత పెద్ద నాటకం ఆడుతుందా? ఆడదు ఆ అవసరం యేమిటి?"

    "లోతుగ ఆలోచిస్తే గతంలో అయ్యగారు ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. ఈ తఫాయే ఇంత మొండిగా పట్టినపట్టు విడవకుండా వుంది. ఎందుకున్నారో యిలా"

    "అయ్యగారు ఎన్నోసార్లు వర్కర్లకి ఆపదలొస్తే ఆదుకోలేదా! ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకునేవారు కూడా కాదు. ఈ తఫాయే యిట్టా పంతంగా వుంది."

    మంచివాళ్ళు మంచిగా ఆలోచించారు. ఆశపోతులు పేరాశపోతూ ఆలోచించారు. కోటలో పాగా వేద్దామనుకున్నవాళ్ళు వూహల ఉచ్చుతాళ్ళు అల్లుతూ ఆలోచించారు.

    మొత్తానికి

    సూరిబాబు పథకం చాలావరకు సక్సెస్ అయింది.

    సూరిబాబుకి కావల్సింది ఇదే!

 Previous Page Next Page