"ఈజిట్!"
"అలా అని బిచ్చగాళ్ళని పట్టుకునేవు." నవ్వుతూ అన్నాను.
"పోరా నీకంతా హాస్యమే!" నా భుజం చరుస్తూ అన్నాడు అర్జున్.
"చూడు అర్జునా! నీకు రవంత గీతోపదేశం చేస్తాను. మన తెలుగు నవలలు తెలుగు సినిమాలు, పోలీసు డిపార్టుమెంటుని నర్స్ లని పరమ చాతగాని వాళ్ళుగా కొండకచో హాస్యగాళ్ళుగా కొజ్జా గాళ్ళుగా చిత్రీకరించి ఆయా డిపార్టుమెంట్లని చిత్రవధకి గురిచేస్తుంటాయి. ఇహ వాస్తవానికి వస్తే ఓ బందిపోటు దొంగ సన్యాసి వేషంలో పారిపోతుంటే మీ వాళ్ళే పట్టుకోవటం జరిగింది. దాంతో ప్రతి వూళ్ళో సన్యాసినులని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిగారు సన్యాసి వేషంలో సంసారపక్ష వేషంలో అన్నింటా మెప్పించటంతో ఎం.ఎల్.ఏలు ప్రతి సన్యాసి కళ్ళూ పట్టుకున్నారట అలాగే రాగేశ్వర్ బిచ్చగాడి వేషంలో వుంటాడేమో, అని నే చెప్పిన మాటని వేదవాక్యంగా భావించి బిచ్చగాళ్ళందరినీ అత్తారిళ్ళకు పంపించకు."
"భావించకు గురుదేవా! కాని...ఆ రాగేశ్వర్ నిజంగానే బిచ్చగాడి వేషంలో వుంటే?"
"అయింది నే అన్నంత పనీ అయింది. తెలుగు నవలలు, తెలుగు సినిమాలు..."
"పోరా" అంటూ నా భుజంమీద చరిచాడు.
"ఈ పాడు అలవాటు ఎప్పటినుంచి!" వీపు తడుముకుంటూ అన్నాను.
అర్జున్ నవ్వి వూరుకున్నాడు.
కొద్దిసేపు ఇరువరం కబుర్లు చెప్పుకున్నాము. నాయక్ వచ్చి టిఫెన్ తయారయిందని చెప్పటంతో కాఫీ టిఫెన్ కానిచ్చాము.
నాలుగురోజులపాటు మరోరకంగా రాగేశ్వర్ గురించి గాలిస్తానని అప్పటికీ పట్టుబడకపోతే నా సాయంకావాలని కోరి అర్జున్ వెళ్ళిపోయాడు.
"నాయర్! తలుపువేసుకో అలా ఓగంట బైటికివెళ్ళి వస్తాను" డ్రస్ అయింతరువాత నాయర్ తో చెప్పి రాయల్ మీద బైలుదేరాను.
నాయర్ కి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. నమ్మకమైనవాడు. తెలివిగలవాడు. అనవసర విషయంలో తలదూర్చడు. చాలా మితభాషి. అద్భుతంగా వంటచేస్తాడు. నేను పరిశోధన మొత్తం ఒక్కోసారి నెలలతరబడి ఇల్లువదిలి వెళ్ళాల్సి వుంటుంది. నాయర్ ఇల్లు కనిపెట్టి వుంటాడు. పెళ్ళయిన వారానికే భార్య పోయింది. ఇంక యీ జన్మలో పెళ్ళి మాట తలపెట్టనని ఘోరప్రతిజ్ఞ చేశాడు. నాయర్ కి సర్వం నేనే.
ఆలోచిస్తూ మెయిన్ బజారు వచ్చాను.
అప్పుడే రవి ఫాన్సీషాపు మెట్లు ఎక్కుతున్న ఓ సుందరి రూపం నన్నెంతో ఆకర్షించింది.
రాయల్ ముందుకెళ్ళమని మొరాయించింది.
రాయల్ దిగాను.
సరీగ రెండునిమిషాలు ఆగి రవి ఫాన్సీషాపులో అడుగుపెట్టాను.
10
ఆ సుందరి షాపులో రకరకాల గాజులని చూస్తున్నది.
సుందరి ఆరడుగుల దూరాన నుంచుని వెరైటీ టార్చులైట్స్ ని చూస్తున్నాను నేను.
ఆ సుందరి వ్యానిటీ బ్యాగ్ తెరిచి లావుగా కంకణంలా వున్న గాజుని తీసింది. గోల్డుకలర్ మీద ముదురు నీలం చుక్కలు వున్నాయి.
"ఇదేసైజు ఈ రకంవి వుంటే చూపించండి" గాజు చూపిస్తూ అడిగింది ఆమె.
"ఏది ఇలాయివ్వండి చూస్తాను." అని ఆ గాజు తీసుకుని అటూ ఇటూ తిప్పిచూసి "ఇలాంటివి ఓల్డు ఫామస్ అయాయి. లోపల వున్నాయేమో చూసివస్తాను" అని పక్క రూమ్ లోకి వెళ్ళాడు.
ఆమె తల తిప్పి చూసింది.
లిప్తపాటు ఆమె చూపుల్లో నాచూపులు కలిశాయి. ఆమె తడబడింది. వెంటనే ముఖం తిప్పేసుకుంది.
"ఇలాంటిరకం లేవమ్మా!" అంటూ అతను గాజుతీసుకుని వచ్చాడు.
"అయితే మరొకరకంవి వద్దులే. మా ఆంటీ ఈ రకం అయితేనే తెమ్మంది."
"ఇది ఓల్డురకం ఎక్కడా దొరక్కపోవచ్చు."
"ఓల్డ్ యీజ్ గోల్డు. ట్రైచేస్తాను" అని ఆమె వ్యాధి టీబ్యాగ్ లో గాజుని వేసి జీప్ మూసి ఓసారి నన్ను తీక్షణంగా చూసి బైటికి వెళ్ళింది.
ఆమె వెనుకనే నేనూ బైటికి వెళితే షాపువాడికి నేను బేవర్స్ రకం అనుకుంటాడు. మరో నాలుగురకాలు పరీక్ష చేసి ఈ రకంవి కావని చెప్పి బైటకొచ్చేస్తే సరిపోతుంది అనుకున్నాను.
"వెరైటీ అంటే ఇవికాదు. జపాన్ నుంచి దిగుమతి అవుతున్నాయి. చాలా ఫవర్ ఫుల్ కాంతికి తోడు మీటలు నొక్కితే ఒక్కో కలర్ కూడా వెలుగుతుంది" చిన్న అబద్ధం ఆడాను.
"అలాంటివి మాదగ్గర లేవుసార్! బహుశా స్మగ్లింగ్ షాపుల్లోను, పేవ్ మెంటుమీద బండిలోను దొరకవచ్చు" అన్నాడు అతను.
"ఎవరిపిచ్చి వారికానందం. మా తమ్ముడు ఎక్కడో చూశాడట. అలాంటిదే కావాలని మరీమరీ చెప్పాడు" అని షాపులోంచి బైటికి వచ్చాను.
సుందరికోసం నలువైపులా చూశాను.
కనుచూపు మేరలో ఎక్కడా కానరాలేదు.
ఉన్నట్లుండి నా మనసులో ప్లాష్ బల్బు వెలిగింది.
సుందరికి ఏ రకం గాజులూ అక్కరలేదు. వాళ్ళ ఆంటీకి కావాల్సిన వకరకం గాజు కోసం వచ్చింది. ఆలాంటప్పుడు ముందే బ్యాగ్ లోంచి గాజు తీసి "ఇలాంటివే కావాలి వున్నాయా!" అని అడగవచ్చు కదా! కాసేపు గాజులన్నీ కెలికి అప్పుడు బ్యాగ్ లోంచి గాజు తీసింది. పోనీ ఆషాపులో అతను ఆ గాజుని కళ్ళతో చూశాడు కదా! లోపలికి వెళ్ళి గాజులు చూసి వచ్చి వున్నాయో లేవో చెప్పొచ్చు కదా! గాజుని తీసుకువెళ్ళి చూడాలా! ఇందులో ఏదైనా కధా కమామిషూ లేదు కదా!