Previous Page Next Page 
రుధిర మందారం పేజి 11

    "తప్పదు. నే వచ్చి పావు గంట అయింది. బాలింతరాలి స్నానంలా ఎంతకీ నీ స్నానం కాందే! అంత జిడ్డు బంక పట్టుకున్నాయా? పైగా పాటలు పద్యాలు. ఇంక లాభం లేదని పిలవటానికి వచ్చాను. ఇంక వచ్చేయి" అర్జున్ అన్నాడు.
    "నాయనా అర్జునా! ఉన్నపళంగా రమ్మంటావా?"
    "నేనేం ఆడపిల్లను కాను. నీవు ఎలా వచ్చినకు ధర్మ దర్శనం ఫ్రీగా అయిందని తలచి ఆనందిస్తాను."
    "పాపం ఆశ చాలానే వుంది"
    "కబుర్లతో కాలం గడిపి నన్ను ఫూల్ చేయలేవు గాని తొందరగా వచ్చేయి. నే వెళుతున్నాను."      
    "వెళ్ళు"
    "సరీగ అయిదు నిమిషాలు చూస్తాను. బాత్ రూమ్ లోంచి వూడి పడక పోయావా నా శాల్తీ మాయం కావటం ఖాయం"
    అర్జున్ వెళుతున్నట్లు వాడి బూట్ల తాలూకా అడుగుల చప్పుడు వినిపించింది.
    చక చక స్నానం కానిచ్చాను.
    అయిదోనిమిషం పూర్తికాక ముందే బాత్ రూమ్ లోంచి బయటికి వచ్చాను.
                                           9
    "కడిగిన ముత్యంలా వున్నావు" అర్జున్ నవ్వుతూ అన్నాడు.
    "ఇంకా నయం, నున్నగా తోమిన రాచ్చిప్పలా వున్నావు అనలేదు"
    "నీలాంటి అందగాడిని రాచ్చిప్పలతోను కంచు చెంబుల తోను పోల్చటం నాకు చాతగాదు"
    "అర్ధమైంది, అర్జునా! నీ రాకకి కారణం బెద్ది! అది చెప్పు" అర్జున్ పక్కనే కూర్చుని అడిగాను.
    "ఎబ్బే కారణం ఏదీలేదు. మనం కల్సుకుని చాలా రోజులైంది కదా! నీవు వచ్చావని తెలిసింది. కాసేపు బాత్ చీత్ ఆడదామని వచ్చాను."
    అర్జున్ మాట నేను నమ్మలేదు. విషయం చెప్పటానికి మొహమాట పడుతున్నాడని గ్రహించాను.
    "చల్లకొచ్చి ముంతని దాచినట్లు...అబద్ధం ఆడినా అతికినట్లు..."
    "చాలు ఇలా వరసపెట్టి వందమాటలైనా చెవుతావు." అర్జున్ వారిస్తూ అన్నాడు.
    "అయితే నా వూహ కరెక్టు, యామై కరెక్టు?"
    "రెండూ ఒకటే రెండూ కరెక్టు."
    "అయితే విషయం చెప్పు."
    అర్జున్ మాట్లాడలేదు. తలకాయ వంచుకున్నాడు.
    "లాభంలేదు అర్జున్! నీ జాబ్ కి నీ ప్రవర్తనకి చాలా బేధం వుంది. మళ్ళీ ఏం సమస్య నీ నెత్తిన పడింది?"
    అర్జున్ వెంటనే మాట్లాడలేదు.
    నా పేరు విజయ్ కృష్ణ నేను అటు ప్రభుత్వం తరపున స్పెషల్ సి.ఐ.డి. ని. ఇటు ఖాళీగా వున్నప్పుడు స్వయంగా కొన్ని కేసులు చేపడుతుంటాను. నన్ను తెలిసిన బహుకొద్ది మంది, ఎంత తిన్నా తరగని ఆస్తి వుండటంవల్ల సరదాగా తోచక ప్రవేటు డిటెక్టివ్ పని చేస్తుంటానని అనుకుంటుంటారు. నేను రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తుంటానని నాకు మాత్రమే తెలిసిన నిజం. నా వాళ్ళు అనుకున్న మరో పదిమందికి మాత్రం ఈ విషయం తెలుసు.
    కృష్ణార్జున్ నా ప్రాణస్నేహితుడు. కలిసి చదివాం, మా వుద్యోగాలు కూడా దగ్గర దగ్గర సంబంధం కలవి. అర్జున్ పోలీసు ఇన్ స్పెక్టర్. నేను సి.ఐ.డి. ని. మా స్నేహం మా ఉద్యోగం మా పేర్లలో ముందు చివర కలిసిన కృష్ణ శబ్దం. మేము ఒకే తల్లి పిల్లలం కాకపోయినా అలాగే మెలుగుతున్నాం. అర్జున్ కి ఏదైనా సమస్య వస్తే నా దగ్గరకు వస్తాడు. ఇప్పుడు అలాగే వచ్చాడని అర్ధమైంది.
    "ఆలశ్యం అమృతం..."
    "వద్దు చెప్పేస్తాను. దిక్కుమాలిన సామెతలతో నా మాడు బొప్పి కట్టించకు." అర్జున్ నా మాటలకి అడ్డు వస్తూ అన్నాడు.
    "గుడ్."
    "నేచెప్పేది విని నవ్వకు!"
    "విషయం హాస్యమా, సీరియస్సా?"
    "సీరియస్."
    "అయితే నవ్వును."
    "వాడిపేరు రాగేశ్వర్. పెద్ద బందిపోటు యెన్నో హత్యలు చేశాడు. ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిని హత్య చేశాడు. ఆ మర్నాడు వజ్రాల వ్యాపారిని దోచుకుని మధ్యప్రదేశ్ నుంచి జెండా ఎత్తేశాడు. ప్రస్తుతం వాడు వంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. వాడి రూపు రేఖలు, గుర్తులు వివరంగా తెలుసుగాని వాడిని ఫోటో తీయలేక పోయారు. ఆ రాగేశ్వర్ గాడు ఈ దరిదాపుల్లో చేరినట్లు గట్టివార్త వచ్చింది. అతనిని పట్టుకోమని పైనించి ఆర్డర్స్ వచ్చాయి. సందులు గొందులు చెట్లు చేమలు అన్నీ గాలించాం. వాడిక్కడ వున్నట్లు చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఈమాట పైకి తెలియజేశాను. 
    అయిదు రోజుల క్రితం మాజీ ఎం. ఎల్. ఏ. చాముండయ్యని ఎవరో హత్య చేశారు. ఈ హత్య చేసిన విధానం బట్టి ఈ చేసింది రాగేశ్వర్ ఈ చుట్టు పక్కలే వున్నట్టు అర్ధం చేసుకోవచ్చు. రాగేశ్వర్ ఈ చుట్టూ పక్కలే వున్నట్టు అర్ధం చేసుకోవచ్చు. రాగేశ్వర్ ఆచూకీ పట్టి వీలయితే వాడిని బంధించాలి. లేకపోతే మనం అనగా నేను మన్య ప్రాంతాలకి బదిలీ కావటం ఖాయం." అన్నాడు అర్జున్. 
    "ఐ. సీ. పైనుంచి బాణాలు వచ్చాయన్న మాట?"
    "ఎస్, గడువు వారం రోజులు ఇచ్చారు. ఇంకా వాడు ఇక్కడే తచ్చాడు తుంటాడేమిటి, యే మారుమూల ప్రదేశానికో ఎప్పుడో వుడాయించి వుంటాడు."
    "అలా అని ఆధారం ఏమిటి?"
    "మూల మూలగా గాలించాను."
    "అందుకే దొరకలేదు."
    "అదేమిటి?" తెల్లబోతూ అడిగాడు అర్జున్.
    "రాగేశ్వర్ మనస్తత్వం నాకు తెలుసు!" అన్నాను.
    "యెలా!"
    "చాలా కాలం క్రితం పాత కేసులో విషయంలే, రాగేశ్వర్ ముందుగా నీ మనస్తత్వం నీ పరిశోధన తీరుతెన్నులు తెలుసుకుని ఆపై రంగంలో దిగి వుంటాడు. తనకోసం నీవు ఎక్కడెక్కడ గాలించేది ఎలా వలపన్నేది తెలుసు కాబట్టి నీవు గాలించిన ప్రదేశంలో దాగి వుంటాడు. పోలీసు స్టేషను దగ్గరగా ప్రతిరోజూ నీకు కనిపించే విధంగా ఆ మార్గంలో బిచ్చగాడి వేషంలో అడుక్కుంటూ దాక్కున్నాడనుకో ఆశ్చర్యంలేదు!"

 Previous Page Next Page