Previous Page Next Page 
రుధిర మందారం పేజి 13

    "ఒరేయ్, అనుమానం మొగుడూ! నీకీ మధ్య రజ్జు సర్మభ్రాంతి ఎక్కువయింది. నిన్ననే పనేముందిలే. నీవు వెలగబెట్టే జాబ్ అలాంటిది. కోడిగుడ్డు మీద ఈకలు లాగటానికి ప్రయత్నిస్తుంటారు." ఆత్మారాముడు చల్లచల్లగా చివాట్లేశాడు.
    "నిజమేలే." అనుకుంటూ రాయల్ ఎక్కాను. కాని నా అనుమానం పూర్తిగా పోలేదు.
    ఉషారుగా ఇంట్లోంచి బయలుదేరిన నాకు చేదుతిన్నట్లు అనిపించింది. నాలుగు బజార్లు తిరిగాను. పదే పదే అదే అనుమానం. ఏదో అందీ అందనట్లు అనిపిస్తున్నది. "ఈ పరిసర ప్రాంతాలలో ఓ కన్నేసి వుంచాలి. మరోసారి ఆ సుందరి కనపడితే అమీ తుమీ తేల్చాలి" అనుకున్నాను. ఇలా అనుకున్న తర్వాత కాస్త తృప్తి అనిపించింది.
    "ఆ తర్వాత...
    ఎవరినీ కలవకుండా ఇంకా దూరం పోకుండా ఇంటిముఖం పట్టాను.
                                         11
    ఫోను చెవి దగ్గర గీ మంటూ రొద పెట్టింది.
    టైమ్ చూశాను.
    ఒకటి పది.
    అర్దరాత్రి పూట అంకమ్మ శివాలన్నట్లు. నడిరాత్రి ఎక్కడ నుంచి ఫోను వచ్చినట్లు!
    రిసీవర్ అందుకున్నాను. "హలో."
    "నేనురా కృష్ణా!" అర్జున్ స్వరం వినవచ్చింది.
    "ఏ మొచ్చింది కృష్ణా నీకు?" అడిగాను బెడ్ మీంచి లేచి కూర్చుంటూ.
    "గుడ్ న్యూస్. హల్వాలో కాలేశాను."
    "అఘోరించక పోయావ్! అర్ధరాత్రని లేదు అపరాత్రనీ లేదు." కోప్పడ్డాను.
    "సారీరా! నిద్రపోతున్నావా!"
    "లేదు. అద్దం ముందు నుంచుని భరతనాట్యం చేస్తూ ఆనందిస్తున్నాను"
    నేచెప్పింది విని అర్జున్ బూతు జోకు విసిరాడు.
    "ఇడియట్. ముందా మీ డిపార్టుమెంటు తయారు చేసిన జోకులు వెయ్యటం మానెయ్యి. రక్షకులే భక్షకులన్న మాట ముందు పోలీసు డిపార్టుమెంటుకి దక్కింది. మన ప్రియనేత ఇందిరాజీ మరణంతో అంగరక్షకులకి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా అంగాంగ భక్షకుడు అయ్యాడు. అసలు ఈ రక్షక భటులు అంగ రక్షకభటులు వున్నారు. చూశావ్ వీళ్ళని..."
    "పాహిమాం పాహిమాం అర్దరాత్రి మద్దెల దరువులా నిన్ను లేపిన పాపానికి నా తల వాచేలా చివాట్లు పెట్టు అంతేగాని సోదిలోకి కూడా రాకుండా పోయే ప్రతిపక్ష నాయకుడి అసమర్ధ అసందర్భ అయోమయ సుత్తితో నా నెత్తిన మెట్టుకు కృష్ణ ప్రభో!" వాపోతూ అన్నాడు అర్జున్.
    మా యిద్దరి పేర్లలో కృష్ణ వుండటం వల్ల మేము కృష్ణ అని పిలుచుకోము. సంతోషం పట్టలేనప్పుడు మాత్రమే అర్జున్ నన్ను కృష్ణ అంటాడు. నేను అంతే వాడిని కృష్ణ అంటాను. ఫోనులో "నేనురా కృష్ణా!" అని ఎప్పుడైతే అర్జున్ అన్నాడో ఏదో గుడ్ న్యూస్ వినిపిస్తున్నాడని అప్పుడే అనుకున్నాను. వెంటనే నేను కూడా కృష్ణా అన్నాను. అంటే అర్ధం నీవు చెప్పబోయేది విని నేనూ సంతోషిస్తానని.
    "ఏమిటిరా మాట్లాడవ్! ఉన్నావా వూడావా!"
    "ఆలోచిస్తున్నాను."
    "ఏమిటి ఆలోచిస్తున్నది?"
    "జంధ్యాల సుత్తి గురించి."
    "ఇప్పుడెందుకు ఆ విషయం!"
    "ప్రతివాడు మాటకు ముందు సుత్తి ఎత్తటమే."
    "ఓ...అదా...!" పకపక నవ్వాడు అర్జున్.
    "నవ్వటం అయిపోయిందా!"
    "ఆ..."
    "అయితే యింక చెప్పు."
    "రాగేశ్వర్ ని పట్టుకున్నాను."
    "ఈజిట్!"
    "ఎస్. అంతా నీదయ."
    "వెనుకటికో దమయంతి స్వామి వారి దయవల్ల కడుపువచ్చింది అన్నదిట. రాగేశ్వర్ ని నీవు పట్టుకోటం నా దయ ఎలా అవుతుంది?"
    "వారం క్రితం నిన్ను కల్సుకోటానికి వచ్చినప్పుడు రాగేశ్వర్ గురించి నీతో చెప్పాను. నీవు సాధువుల్లోను  బిచ్చగాళ్ళలోను అలాంటి మారువేషంలో వున్నాడేమో అన్నావు కదా!"
    "అయితే ఓ సాధువుగారి జోలెదులిపావన్న మాట! కొంపదీసి రాగేశ్వర్ ని పట్టుకున్నావా లేక ఆ వేషంలో వున్న మన రాష్ట్ర...!"
    "నీకు మరీ వ్యంగ్యం ఎక్కువయిపోయింది."
    "చాతలు అలావున్నాయి మరి సరేలే విషయానికి రా!"
    "తోపుడుబళ్ళమీద పళ్ళు అమ్ముతుంటారు చూడు ఆ వేషంలో వున్నాడు రాగేశ్వర్."
    "వాళ్ళేం వేషాలు వేసుకోరే!"
    "వేసుకోరు. అతి సామాన్యంగా పళ్ళు అమ్ముకునే వాడిలాగా వున్నాడన్నమాట. పోలీస్టేషనుకి దగ్గరలోనే వాడి పళ్ళబండి నిలుపుకున్నాడు. నున్నగా తల గొరికించుకున్నాడు. మీసం లేకుండా చిన్న గడ్డం వుంది. మాసిపోయిన లుంగీ కళ్ళీలాల్చీ ధరించాడు. నల్లగుడ్డు లేకుండా అంతా తెల్ల గుడ్డులావుండే ఆర్టిఫిషిల్ కనుగుడ్డు ఓ కంటికి తగిలించుకున్నాడు. ఈ రూపంలో వున్న రామేశ్వర్ ని చూసి అతనే రాగేశ్వర్ అని ఎవరూ నమ్మరు."

 Previous Page Next Page