Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 12

    పావుగంట గడిచిపోయినా, కామాక్షి బయటకి రాలేదు. కాబట్టి. ఇంకా భయంలేదు అనుకున్న పాండురంగం నెమ్మదిగా అక్కడినుంచీ సాగి, పెరటి వాకిలి తలుపులు తీసుకుని వీధిలోకి వచ్చాడు.

    అప్పుడు సమయం రాత్రి పన్నెండూ నలభై.

    మరీ గాఢాంధకారం కాకపోయినా అంతటా చీకటిగానే వుంది.

    ఇరవై నిముషాల తరువాత.

    పాండురంగం చిన్న సందులోకి ప్రవేశించాడు. ఆ సందు అంతా నిర్మానుష్యంగా ఉంది.

    సందు చివరిదాకా వెళ్ళి ఓ యింటిముందు ఆగాడు పాండురంగం.

    ఆ యింటి తలుపులు తాళంవేసి వున్నాయి. పాంటుకున్న ఎడమవైపు జేబులోకి చెయ్యిపోనిచ్చి చిన్న తాళంచెవి బయటకి తీశాడు. తాళంతీసి లోపలికి వెళ్ళాడు. వెంటనే తలుపులు మూశాడు.

    లోపలికి వెళ్ళిన పాండురంగం లోపల వుండి ఏం చేస్తున్నాడన్నది పాండురంగానికే తెలియాలి. లోపల పదినిముషాలకన్నా ఎక్కువసేపు గడపలేదు. మళ్ళీ బయటకి వచ్చాడు. యధాప్రకారం తాళంవేసి తాళంచెవి జేబులో వేసుకున్నాడు. 

    మళ్ళీ రోడ్డు ఎక్కాడు పాండురంగం.

    ఇప్పుడు అతని చేతులు ఖాళీగాలేవు. కాయితంలో చుట్టబడిన ఏదో వస్తువు అతని చేతిలో వుంది.

    ముందు జాగ్రత్తగా అన్నట్లు మరొకసారి పరిసరాలు పరికించి చూసి, అనుమానాస్పదంగా ఏదీ కానరాక పోవటంతో తృప్తిచెంది తను వెళ్ళవలసిన చోటుకి బయలుదేరాడు.

    ఈతఫా అతను కొంతదూరం వెళ్ళి తరువాత, రిక్షాను పిలుచుకున్నాడు. రిక్షా ఎక్కి పావుగంట ప్రయాణించాడు. పావుగంట తరువాత రిక్షా ఆపుకుని అక్కడ దిగి పది నిముషాలు నడిచి ఓ వీధిలోకి ప్రవేశించాడు.

    తను చెయ్యవలసిన పని, తను వెళ్ళవలసిన ఇల్లు ముందుగానే ఆలోచించి పెట్టుకున్నాడు కాబట్టి .... పాండురంగం ఏమీ త్రొట్టుపాటు పడకుండా సరాసరి ఆ వీధిలో వున్న ఆ యింటి కాంపౌండులోకి ప్రవేశించాడు.

    ఆ కాంపౌండులో రకరకాల పూలచెట్లు వున్నాయి. పూలకుండీలుకూడా చాలా వున్నాయి. ఒక్కసారి అంతటా కలయజూసి తను చేయవలసిన పనిని చాలా చక్కగా కామ్ గా చేయసాగాడు. అయితే ఆ సమయంలో కసితో నలిగిపోతూంది. అతని మనస్సు తనమీద తనకే కసి, సాటి మనుషులమీద కసి, ఈ ప్రపంచం మీదే కసి.

    తను చేస్తూన్న పని చాలా తప్పుపని, సరదాకయ్యేది, అవసరానికయ్యేది. ఇలాంటి పనులు చెయ్యకూడదని పాండురంగంకి తెలుసు. అయినా అతను తెలిసి చేస్తున్నాడు.

    తెలిసిచేసే వాడికి చెప్పేదెవరూ లేరు.

    పని పూర్తికాంగానే, తృప్తిచెంది చేతులు శుభ్రంగా తుడిచేసుకుని చేతులు వూపుకుంటూ ఆ కాంపౌండులోంచి బయటకి వచ్చేశాడు.

    వెనుతిరిగి చూడకుండా ముందుకి సాగాడు.

    ఈ తఫా కూడా పాండురంగం, కొంతదూరం నడిచి కొంతదూరం రిక్షా ఎక్కి, అక్కడెక్కడో దిగి, కాళ్ళీడ్చుకుంటూ నడిచి చుట్టూ తిరిగి ఇల్లు చేరుకున్నాడు.

    ఎప్పటిలాగా కాకుండా ఈ తఫా పాండురంగం గంట ముందే యిల్లు చేరాడు.

    పాండురంగం తన యింటికి వచ్చేసరికి కామాక్షి గాఢనిద్రపోతూ వుంది. అది చూసి తృప్తిపడి డ్రస్సు మార్చుకుని ప్రక్కమీదకి చేరాడు.

    మరికొద్దిసేపట్లోనే గాఢనిద్రలోకి జారుకున్నాడు.

    నాలుగున్నర సమయంలో ఎందుకో మెలకువ వచ్చింది కామాక్షికి వులిక్కిపడి కళ్ళు తెరిచింది.

    తను ఎందుకు వులిక్కిపడిందో తన కెందుకు చటుక్కున మెలకువ వచ్చిందో కామాక్షికి క్షణకాలం అర్ధమవలేదు.

    భర్తసంగతి గుర్తుకు రాగానే, చటుక్కున తల తిప్పి చూసింది. గాఢనిద్రలో వున్న భర్తను చూడంగానే కామాక్షి మనస్సు తృప్తిపడింది. మాంచి నిద్రపోయి లేచిందేమో కామాక్షికి మళ్ళీ నిద్రరాలేదు. భర్త గురించీ ఆలోచిస్తూ పడుకుంది.

    ఆయన ఎంత మంచివారు!" అలవాటులేని పని అయినా మీరు రిక్షా తొక్కడం ఏమిటి? నాలుగు రోజులు ఆగండి. ఇలా రాత్రిళ్ళు దొంగచాటుగా రిక్షా తొక్కేపనే వుండదు. పగలే ఇంకా రెండు షాపుల్లో పని దొరకకపోదు" అని తను చెప్పిందో లేదో, ఆయన విన్నారు.

    మొదట రెండుమూడుసార్లు మాత్రం తనని బ్రతిమలాడి కోపగించుకొని చూశారు. రిక్షా తొక్కేపని చెయ్యటం తనకి ఇష్టంలేక, ససేమిరా మీ మాట విననని మొండిగా కూర్చుంది. చివరికి ఆయన దిగిరాక తప్పలేదు. ఈ విషయంలో తనే గెలిచింది. మెత్తగా చెబితే వినరుగదా!

    "మీరు రిక్షా తొక్కడంలేదు. మీరేదో కాని పని చేస్తున్నారు. మీ మీద నాకేదో అనుమానంగా వుంది." అని నిష్టూరంగా తను మాటలు అనబట్టి, ఆయన అప్పుడు తగ్గారు మంచిగా చెబితే వినలేదు. వినలేదు కాబట్టే ఆయన మనస్సు బాధపడేలా అనవలసి వచ్చింది.

    ఆయనకి తనంటే చాలా ఇష్టం. తనేమన్నా పట్టించుకోరు. పట్టించుకోరు కాబట్టే చెప్పిన మాట చక్కగా విన్నారు....అలా ఆలోచిస్తూ వుంటే కామాక్షికి మళ్ళీ నిద్రరాలేదు.

    గత జీవితం గురించి, ఇప్పటి జీవితం గురించి, జరగబోయే రోజుల గురించీ అలా ఆలోచిస్తూ వుండంగానే తెల్లవారిపోయింది.  

    కామాక్షి మంచంమీంచి లేచి బయటకి వెళ్ళింది. కామాక్షికి భర్తమీద అనుమానం అంటూ రాలేదు గానీ. ఇప్పుడు కూడా అనుమానించటానికి ఓ ఆధారం వుంది.

    ప్రతిరోజూ అయిదు అయిదున్నరకల్లా ముందుగా పాండురంగం నిద్రలేచి, కామాక్షిని నిద్రలేపుతాడు.

    కానీ, ఇప్పుడు, మధ్యలో ఒక్కోరోజు పాండురంగం గాఢనిద్రలో వుండి కామాక్షిని నిద్రలేపటం లేదు!

    ఆ ఉదయం ఆరున్నరకి పాండురంగం కాఫీ త్రాగుతుండగా "మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయేమిటి? రాత్రి సరీగా నిద్రపట్టలేదా?" అడిగింది కామాక్షి.

    పాండురంగం ఉలిక్కిపడ్డాడు. ఉలికిపాటుని కప్పిపుచ్చుకుంటూ. "రాత్రి బాగా నిద్ర పట్టిందే!" అన్నాడు.

    "మరి కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయ్?" కామాక్షి అడిగింది.

    వెల్లుల్లి కారం గుర్తుకు వచ్చింది పాండురంగంకి. నిన్న వెల్లుల్లి కారం బాగుందని రెండు ముద్దలు ఎక్కువ కలుపుకుని తిన్నాను. బాగా వేడిచేసింది. అందువల్ల కళ్ళు ఎర్రగా ఉండి ఉంటాయ్!" అంటూ బొంకాడు.

    కామాక్షి భర్త మాటలు నమ్మింది.

 Previous Page Next Page