ఈ దేశంలో భార్యల నమ్మకాలే, చాలామంది భర్తలకి శ్రీరామరక్ష.
కామాక్షి నమ్మింది. పాండురంగం రక్షింపబడ్డాడు.
10
"నాకు వంద రూపాయలు కావాలి!"
అక్కడున్న అందరినీ కలయజూస్తూ, మూడోసారి కూడా బోసుబాబు అదే మాటని తీవ్రంగా పలికాడు.
ఎవరికి వారు తమని కాదన్నట్లు ఎవరూ మాట్లాడలేదు.
అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతే, ఇదిగో ఈ కొత్త సోఫాని ఈ క్షణమే బ్లేడుతో పరపరా చింపేస్తాను! ఇది అసలే కొత్తసోఫా, దీని ఖరీదు ఆరువందలు. ఈ సోఫాని, నేను పాడుచేసిన తరువాత మీరు దీన్ని మళ్ళీ బాగుచేయించాలంటే మూడువందలకి తక్కువ ఎవరూ తీసుకోరు. నాకు వందరూపాలు ఇస్తారా? లేక ఆరువందల్ని తగలబెట్టుకుని, మూడువందలు ఖర్చు చేసుకుంటారా?" బోసుబాబు, తన మాటలకి తిరుగులేదన్నట్లుగా తీక్షణంగా చూస్తూ, తీవ్రంగా అన్నాడు.
"నీవు అడిగిన వందరూపాయలు మేమివ్వం అని ఎవరమూ అనలేదు కదా!" లక్ష్మణమూర్తి అన్నాడు.
"బంగారం లాంటి సోఫా! దాన్ని చించీ పోగులుబెట్టే బదులు నువ్వు వెళ్ళి అమ్ముకున్నా ఆఫ్ రేట్ వస్తుంది. నీకు కావలసిన వందా కాక ఇంకా రెండువందలు మిగులుతాయి, ఆ రెండువందలూ పెడితే రెండు కుర్చీలన్నా వస్తాయి. ఆ పని చెయ్యి!" సామాజ్యలక్ష్మి తనేదో తెలివిగా మాట్లాడుతున్నానను కొంటూ వ్యంగ్యంగా అంది.
"నీకింత కోపం పనికిరాదురా అబ్బాయ్!" అంది కల్యాణమ్మ.
"సంపాయించటం చేతకాకపోయినా, మనంతటి వాడయ్యాడే వాడిని ఏమీ అనకు!" జగన్నాధం అన్నాడు.
అక్కడున్న వాళ్ళల్లో ఒక సుమిత్ర మాత్రం అన్నగారిని వెనకేసుకు వస్తూ అన్నయ్య అడిగింది ఒక్క వందరూపాయలు ఈ ఒక్కసారికి ఇచ్చేస్తే పోలేదా! ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టనంటున్నావు వందరూపాయలు దేనికి? ఏం చేస్తాం? అన్ని ఇన్ని ప్రశ్నలు వెయ్యకపోతే, ఎక్కడైనా అప్పుచేశావా? ఎవరికైనా ఇవ్వాలా? లేక ఏదైనా చిన్న బిజినెస్ చేద్దామా అని అనుకుంటున్నావా?" అని నెమ్మదిగా అడగవచ్చు కదా!" అంది సుమిత్ర.
"ఏది మళ్ళీ చెప్పు?" లక్ష్మణమూర్తి అన్నాడు.
ఇదే మాటలు మళ్ళీ అంది సుమిత్ర.
"వంద రూపాయలు పెట్టుబడితో పెట్టే బిజినెస్ ఈ కరువు కాలంలో నాకేమీ కనిపించటంలేదు. ఇక బుట్టలో వేరుశనగ కాయలు పోసుకుని పార్కుల వెంబడి తిరుగుతూ "వేడి వేడి పల్లీలు" అంటూ అమ్ముకోవాల్సిందే" లక్ష్మణమూర్తి అన్నాడు.
"పల్లీలు అమ్మినా తప్పులేదు, పచ్చి మిరపకాయలు అమ్మినా తప్పులేదు. విషయమేమిటో చెబితే ఇంతగోల ఉండదు కదా! నాకు అవసరం వందరూపాయలు ఇవ్వండి నాకు పని వుంది వందరూపాయలు ఇవ్వండి అంటూ అరిగిపోయిన రికార్డులా ఒకే మాట అయితే ఎలా? కారణం చెప్పి అడిగితే మాకు అర్ధమవుతుంది" జగన్నాధం అన్నాడు.
"అడుక్కునేవాడు ఎప్పుడూ, "మాతాకవళం తల్లీ!" అనో "పదిపైసలు దానం చెయ్యండి బాబయ్యా" అనో నేను అవిటి వెధవని, పనిచేసుకుంటానికి అసమర్ధుడిని నన్ను కూర్చోపెట్టి తిండిపెట్టే వాళ్ళు లేరు ఆకలితో కడుపులో పేగులు మెలేస్తున్నాయ్" అంటూ ముష్టివాడు కూడా ఇంత పొడుగున ఏకరువు పెట్టడు.
ఈ దేశంలో పుట్టినందుకు. నేను చదివిన చదువుకీ నాకు వచ్చిన ఉద్యోగం ఇలా అడుక్కోటమే. నేను కాస్టిలీ బిచ్చగాడినే నాకు వందరూపాయలు కావాలి ఇస్తారా ? ఇవ్వరా? "ఎస్" ఆర్ "నో" ఏదో ఒకటి చెప్పండి!" బోసుబాబు ఉగ్రనరసింహావతారం ఎత్తి అడిగాడు.
"అమ్మ అయినా అడగందే ఎలా అన్నం పెడుతుందిరా?" అన్నది కల్యాణమ్మ.
"ఈ కాలం అమ్మలకి పెట్టే ఓపికలేదులే! అడిగే ఓపిక కూడా వీళ్ళకి లేక, పిల్లలు కూడా తామే పెట్టుకుని తింటున్నారు." తల్లి ప్రశ్నకి వెంటనే జవాబిచ్చేశాడు బోసుబాబు.
'ఎస్' అంటే ఏగోలా వుండదని మాకు తెలుసు. "నో అంటేనే కదా ఎక్కడలేని చిక్కూ వచ్చేది. మాచేత 'నో' అనిపించుకుని గోలగోల చేసేబదులు విషయమేమిటో చెప్పి, తేలికగా వందరూపాయలూ తీసికి వెళ్ళచ్చు కదా! పెద్దవాళ్ళం అడిగితే తప్పేమిటిరా ?" జగన్నాధం అడిగాడు.
"మళ్ళీ మొదలు" ఆమాట అని బోసుబాబు మౌనం వహించాడు.
ఒక్కక్షణం ఎవరో ఆలోచనల్లో వాళ్ళు వుండిపోయారు.
అరగంట క్రితం.
బోసుబాబు హడావుడిగా బయటనుండి వచ్చాడు. వస్తూనే. "అర్జంటుగా నాకు ఒక వందరూపాయలు కావాలి" అన్నాడు.
ఏదేనా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టటానికేమో అనుకుని, "ఏ ఉద్యోగానికి అప్లికేషన్ పెడుతున్నావ్?" అని అడిగారు ఆ యింట్లోవాళ్లు.
"మనకోసం ఇక్కడ ఉద్యోగాలు కాచుకుని కూర్చుని లేవు. అప్లికేషన్ కయితే ఫలానా దానికి అని చెప్పేవాడిని. నాకు అవసరం పడింది. వందరూపాయలు కావాలని అడుగుతున్నాను అంతవరకే" తనూ అంతవరకే చెబుతూ.
దాంతో ఇంట్లోవాళ్ళకి వళ్లు మండింది. "వంద అవసరమేమిటో" ఇంట్లోవాళ్ళు రాబట్టాలని, "విషయం చెప్పకుండా వందరూపాయలు తీసుకోవాలని" బోసుబాబు సరిగ్గా పావుగంట నుండీ హోరాహోరీ వాదులాడుకుంటున్నారు.
"బోసుబాబు సంగతి ఇంట్లో అందరికీ తెలిసిందే. వందరూపాయలు ఇవ్వకపోతే, ఈ రాత్రికో, ఇప్పుడో ఈ సోఫా అంతు చూస్తాడని తెలుసు. నిక్షేపంలాంటి సోఫా ఆరువందలు ఖరీదుగల సోఫా, చేతులారా నాశనం చేసుకోవటంకన్నా బోసుబాబు అడిగిన వందరూపాయలు ఇవ్వటమే బెటర్ అని అందరికీ తెలుసు.
ఇలా బెదిరింపులకి లెక్కజేస్తే, ఇవాళ వంద అడిగినవాడు రేపు వెయ్యి అడగవచ్చు. ఇప్పటికే అడపా దడపా పాతికా పరకా అడిగి తీసుకెడుతున్నాడు. ఇంట్లోవాళ్ళ భయం అది.
బోసుబాబు వందరూపాయలు అవసరమేమిటో ఎలానూ చెప్పదలచుకోలేదు. చెప్పవలసి వచ్చినా అబద్ధమే చెప్పేవాడు. ఇంట్లోవాళ్ల పట్టుదల చూస్తుంటే ఆ అబద్ధం కూడా చెప్పబుద్ధికాక మరింత పట్టుదల ఏర్పడింది.
"సరేరా! ఈ తఫాకి వందరూపాయలు ఇస్తాను. ఇచ్చిన తరువాత అయినా, ఆ వంద అవసరం ఎందుకు వచ్చిందో చెబుతావా?" జగన్నాధం అడిగాడు.
"చెప్పను!" తెగేసినట్లుగా జవాబు చెప్పాడు బోసుబాబు.
"నీకింత పట్టుదల దేనికి? చెప్పకూడని పనేదయినా చెయ్యటానికి అవసరం అయిందా వందరూపాయలు"
"కాదు!"
"మరి చెప్పటానికి ఏమొచ్చింది?"
"కొన్నిటికి కొన్ని కారణాలు వుంటాయి. కొన్ని పనులు చేయవలసి వస్తుంది. నిజం చెప్పనంత మాత్రాన తప్పు పని అని ఎందుకనుకోవాలి.