"మీరలా ఏదిపడితే అది ముట్టుకుని చూడకూడదు. అనుమానాస్పదంగా తోచిన వాటిని చూసి పోలీసు రిపోర్టు ఇవ్వాలిగానీ, మీ చేతులతో టచ్ చేయకూడదు. నేరస్థుడి వేలిముద్రలు కాక, మీ వేలి ముద్రలు కూడా వాటిమీద పడతాయి. అది పరిశోధనకు అంతరాయం కలిగిస్తుంది" అని బబిత కొన్ని సూచనలు ఇచ్చింది.
లాల్ చంద్ అన్నింటికీ తలవూపాడు.
అక్కడ వున్న వాళ్ళంతా బబితని, బబిత మాటలని, వింతగా చూస్తూ, వింటూ ఫ్రీగా ఆనందం పొందారు.
మరికొన్ని ప్రశ్నలు అడిగి, కొన్ని సూచనలు ఇచ్చి బబిత అక్కడినుంచి వెళ్ళిపోయింది.
లాల్ చంద్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడు.
7
"మావయ్యా! ఓ! మావయ్యా!"
స్నానం చేసి అప్పుడే బాత్ రూమ్ లోంచి బయటకి వచ్చిన ఛటర్జీ. వచ్చేస్తున్నా! వచ్చేస్తున్నా!" అంటూ హడావుడిగా డైనింగ్ హాల్ లోకి వచ్చాడు.
"కంగారేమీ లేదు మావయ్యా! నెమ్మదిగా కూర్చో! ఇప్పుడే తయారయ్యింది కాఫీ!" అంటూ కెటిల్ లోంచి రెండు కప్పుల్లోకి కాఫీ వంచాడు మనోజ్.
"ఎందుకు అంత గట్టిగా కేకలుపెట్టావ్? ఏమయిందో అని ఆదరా బాదరాగా వచ్చేశాను. ఇక్కడికి వచ్చి చూస్తే కాఫీ అయింది!" ఛటర్జీ నవ్వుతూ అని కప్పు సాసరు చేతిలోకి తీసుకున్నాడు.
"బాత్ రూమ్ లో వున్నావేమోనని గట్టిగా పిలిచాను మావయ్యా!" మనోజ్ వేడి కాఫీని నెమ్మదిగా సిప్ చేస్తూ అన్నాడు.
"అదికాదులే మనోజ్. మీ పోలీస్ బుద్దే అంత. ప్రతిదానికీ కంగారు పడతారు. మమ్మల్ని కంగారు పెడతారు." ఛటర్జీ అన్నాడు నవ్వుతూ.
"మా డిపార్టుమెంట్ గురించి నీకు తెలియదు మావయ్యా! మేం ఏదయినా కేసు వస్తే కంగారు పడతామని, పరుగెత్తి పరిశోధన చేస్తామని ఎవరూ అనుకోరు. ఆఖరికి దినపత్రికల వాళ్ళు కూడా మా గురించి ఏమని రాస్తారో తెలుసా? "ఫలానా కేసు విషయంలో పోలీసువాళ్ళు విచారిస్తున్నారు....అని రాయడంలో వారి వుద్దేశమేమిటో తెలుసా? మేము కేసు పరిశోధించం. వూరికినే కూచుని విచారిస్తున్నాం అని."
"కాఫీ చాలా బాగా చేశావు మనోజ్! నీకెందుకు శ్రమంటే వినకపోతివి. అయినా కాఫీ బాగుంది. కాబట్టి క్షమించేస్తున్నాను. షాలినీకి కూడా కాఫీ అంటే చాలా యిష్టం. 'ఏటానిక్ ఇవ్వని శక్తిని వుత్సాహాన్నీ ఓ కప్పు వేడివేడి కాఫీ మాత్రమే ఇస్తుంది" అని అంటూంటూంది. నీలాగే కాఫీ పిచ్చి ఎక్కువ...." ఛటర్జీ కూతుర్ని గురించి చెబుతూ వుండిపోయాడు.
షాలిని చదువు గురించి మధ్యమధ్య ప్రశ్నలు వేస్తున్నాడు మనోజ్.
ఇద్దరూ కబుర్లుచెప్పుకుంటూ కాఫీ తాగడం ముగించారు.
"నువ్వు డ్యూటీలో ఎప్పుడు చేరతావ్?" ఛటర్జీ అడిగాడు.
"రేపు!" చెప్పాడు మనోజ్.
"రేపేనా?"
"అవును రేపే! శలవులేదు. అసలు ఈవూరు వచ్చిన వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంది. మా మంచి మావయ్యతో కబుర్లు చెప్పుకుంటూ వుందామని ఈ ఒక్కరోజే ఆగాను."
"చేసేది పోలీసు ఉద్యోగం. మాటలు మటుకు ఏమీ మారలేదు."
మనోజ్ నవ్వి ఊరుకున్నాడు.
కొద్దిసేపు ఇద్దరూ షాలిని గురించి కబుర్లు చెప్పుకున్నారు.
నువ్వు వచ్చినట్లు ఈరోజే షాలినికి లెటర్ రాస్తాను. నువ్వు కూడా ఏమైనా నాలుగు ముక్కలు రాస్తావా?" ఛటర్జీ అడిగాడు.
"అవసరంలేదు మావయ్యా! నేనీ ఊరు వచ్చే ముందురోజే లెటర్ రాసి బయలుదేరాను. ఈ తఫాకి నువ్వే లెటర్ రాయి షాలినీకి. నెక్ట్స్ టైమ్ నేను రాస్తాను" అంటూ కుర్చీలోంచి లేచాడు మనోజ్.
"నాకు పోలీసులూ కేసులూ భలే సరదా! ఏదైనా కేసు వస్తే నాకు చెబుతావు కదూ!" ఛటర్జీ చిన్నపిల్లాడిలా ఉత్సాహపడుతూ అడిగాడు.
"కేసు స్వరూపం చెప్పటమేకాదు. ఎలా పరిశోధన చేసేది కూడా చెబుతాను. షాలిని వచ్చిన దాకా ఇంక నీకు నేనే కదా కాలక్షేపం!" అన్నాడు మనోజ్.
"నిజమే అన్నట్లు తలవూపాడు ఛటర్జీ.
8
"కామాక్షీ! కామాక్షీ!"
పాండురంగం భార్యని జబ్బమీద చెయ్యివేసి కుదుపుతూ పిలిచాడు.
కామాక్షి లేవలేదు.
అప్పటికి రెండు మూడుసార్లు భార్యను పిలిచిన పాండురంగం తన అనుమానం నివృత్తి చేసుకోడానికి ఆమెను కదుపుతూ మరీ పిలిచాడు.
మంచి నిద్రలో వున్న కామాక్షి లేవలేదు.
దొంగనిద్రకి, నిజంనిద్రకి భేదం తెలిసిపోతూనే వుంటుంది. కామాక్షి నిజంగానే గాఢనిద్రపోతూ వుంది.
కామాక్షిది దొంగనిద్ర కాదని గ్రహించిన పాండురంగం తృప్తిపడి మంచం మీదినుంచీ లేచాడు.
కామాక్షి తనని అనుమానిస్తున్నట్లు....తను చెప్పేది శ్రద్ధగా వింటున్నది గానీ అవి నిజమని నమ్మనట్లు పాండురంగం గ్రహించాడు.
వస్తుతః కామాక్షి, రోజూ మామూలుగా నిద్రపోదు, బాగా అలసిపోయిన దానిలాగా బాగా గాఢనిద్రపోతుంది. అంత బాగా నిద్రపోయే కామాక్షిని, బాగా తెలివి తప్పేలా నిద్రపుచ్చాలంటే రెండు నిద్రమాత్రలు ఇస్తేచాలు. ప్రతిరోజూ నిద్రమాత్రలు ఇవ్వాలంటే కష్టంకానీ, తను బయటికి వెళ్ళాలనుకున్నరోజు నిద్రమాత్రలు ఇస్తే ఫరవాలేదు కదా!
రోజూ కామాక్షి నిద్రపోయేముందు గ్లాసు మంచినీళ్ళు తాగి పడుకుంటుంది.
పాండురంగంకి అలాంటి అలవాట్లు ఏమీ లేవు.
ప్రతిరోజూ రాత్రిళ్ళు గ్లాసుతో నీళ్ళు తెచ్చుకుని దానిమీద మూతపెట్టుకుని పడుకోబోతూ ఆ గ్లాసెడు నీళ్ళు తాగుతుంది.
భార్య అలవాటు తెలిసిన పాండురంగంకి మంచినీళ్ళ గ్లాసులో రెండు నిద్రమాత్రలు వెయ్యటం, పెద్ద కష్టమైన పనేమీ కాదు. అతను ఆపని చాలా తేలికగా చెయ్యగలుగుతున్నాడు.
మంచం దిగిన పాండురంగం లుంగీవిప్పి వంకెనపెట్టి, ప్యాంటు, షర్ట్ ధరించాడు. ఒకసారి జేబులో తడుముకున్నాడు. భార్యవైపు మరోసారి చూసి, ఆ గదిలోంచి నెమ్మదిగా బయటికి వచ్చాడు. తలుపులు దగ్గరగావేసి అక్కడే పావుగంట నిలుచున్నాడు.
ఒకవేళ కామాక్షి దొంగనిద్ర నటిస్తుంటే తను బయటకి వచ్చిన కొద్దిసేపటికి కామాక్షికూడా బయటకి వచ్చి చూస్తుంది. ఆ....ఆ ముందుచూపుతో పాండురంగం గదిముందు పావుగంటసేపు ఆగాడు.