పార్వతిముఖం లిప్తపాటున నల్లబడి తిరిగి మామూలు అయింది.
"ఆయన ఆమాట అంటే నీవేమన్నావ్ కృష్ణా?" పార్వతి గంభీరంగా అడిగింది.
"భూమ్మీద నూకలున్నాయికాబట్టి బతికిపోయాడు. నవ్వుతూనే అంటించాను. "నక్కజిత్తులవారి తోకలు కోయటానికి మా అమ్మలాంటి వారు నూటికొకరయినా పుట్టాలి. లేకపోతే యీ మగజాతి ఆగడాలకు అంతు వుండదు. నాన్నగారిని ఎప్పుడు చూచారండీ? మీలాంటి సహృదయుల పొడ ఆయనకు బొత్తిగా గిట్టదే, మీకు ఆయనకూ దీస్తీ అయిందంటే అర్ధం మీరు......నేననుకుంటునట్లు సహృద__ పోనీలెండి నాఅభిప్రాయంతో అనేమిటి? అరే__లేస్తున్నారు వెళతారా? మాటలతో ఆలశ్యం అయిపోయినట్లుంది" అన్నాను. అంతే మహానుభావుడు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు." పెద్దపెట్టున నవ్వుతూ ముగించాడు కృష్ణ. వృద్ధజంబూకం వెళ్ళేటప్పుడు ముఖకవళికలు గుర్తొచ్చాయి.
కృష్ణ స్వరంమార్చి యాక్షను చేసి చెపుతుంటే పార్వతికి నవ్వు వచ్చింది.
"పోనీలేరా కృష్ణా! నన్నపార్ధం చేసుకున్నవారిలో మరోమనిషి. అంతేనా?" అంది పార్వతి. కృష్ణ చెప్పింది తేలికగా తీసిపారేసి.
"నువ్వేమంటున్నావో ,నీ మనసులో వుందేమిటో అర్ధంచేసుకోటం నాతరంకావటంలేదమ్మా? ఎదుటి మనిషి చిన్న మాట అంటే, చిన్న పొరపాటు చేస్తే వారు తప్పు ఒప్పుకొనేదాకా వదలవే. యీ నక్క యిన్ని మాటలంటే చీమ కుట్టినట్లయినా లేదా? అన్నయ్య అత్తవారి తరపువారూ అంతే. పిల్లి మీద పెట్టి బల్లి మీదపెట్టి ఏదో ఒకటి అనటమే. అన్నయ్య అత్తగారికయితే కొమ్ములొక్కటే తక్కువ. ఎందుకు పడాలి అనవసరం మాటలు?"
"కృష్ణా! నీకు ఆవేశం ఎక్కువ లోకులు ఏదో అన్నారని ఎదురు తిరిగి అంటే చాటుగా అనుకుంటారు. మనం చేసేదేంలేదు. వదిన ఒక్కతే మనపిల్ల అదృష్టంకొద్దీ మంచిపిల్ల దొరికింది. మనలో కలిసిపోయింది. అంతేచాలు. నాసంగతి అంటావ్?......మొదట్లో ఎవరేమంటారో అని కూర్చోటానికి, నుంచోటానికి భయపడ్డాను. అనుభవాలు పాఠాలుకాగా శిలలా మారిపోయాను. చూచేవాళ్ళకు బండరాయిలా కనిపిస్తున్నాను. ఇప్పుడు ఎవరికీ భయపడి తలవంచను కాబట్టి.....ఎవరో ఏదో అంటారని.....అనుకుంటారని భయపడే రోజు ఎప్పుడో పోయింది. అన్నిటికీ నవ్వటం ఒకటే అలవాటయిపోయింది." చిరునవ్వుతో అంది పార్వతి.
"ఏదయినా అంటే నేనవ్వను చావచితకబాత్తాను." ఆవేశంగా అన్నాడు కృష్ణ.
"మరి......ఆ జంబుకాన్ని ఎందుకు వదిలేశావ్? గోల జరిగి అక్కపెళ్ళి చెడిపోతుందనా? అమ్మ ఏమయినా అనుకుంటుందనా? నువ్వెందుకు ఆయన్ని వదిలేశావో, అలాగే మీకోసం నేను లోకులను క్షమించి వదిలేశాను" అదే చిరునవ్వుతో అంది పార్వతి.
"నీతో వాదించటం కష్టం అమ్మా!"
పార్వతి మాట్లాడలేదు. నవ్వి వూరుకుంది.
"నే యింటికి వచ్చేటప్పటికి శకుంతల ఒక్కతే వుంది. అన్నయ్యా, వదిన సినిమాకు వెళ్లారు. వాళ్ళిద్దరూ వెళ్ళకపోతే శకుంతలను కూడా తీసుకెళ్ళకూడదూ?" కాసేపాగి కృష్ణ అన్నాడు.
"కొత్తగాబట్టి జంటగా వెళ్ళాలనివుంటుంది. పొద్దుట సినిమా మాట ఎత్తి శకూని తీసుకెళతానన్నారు. నేనే వద్దన్నాను."
పెళ్ళయి ఏడాదిదాటి రెండో ఏడు సగం పడింది .లోలోపల గొణుక్కుని పైకి "నే అయితే శకూని తీసుకొని కాని వెళ్ళను" అన్నాడు కృష్ణ.
"ఒక్కోసారి నువ్వు మాట్లాడేదానిలో అర్ధం వుండదురా కృష్ణా! ఒకే కోణం నుంచి చూస్తావు" అని వూరుకుంది పార్వతి.
స్నేహితురాలింటికి వెళ్ళిన శకుంతల వచ్చింది. ఏదో మాట్లాడదామని నోరు తెరిచిన కృష్ణ ఠప్పున నోరుమూసుకున్నాడు.
అమ్మా, తమ్ముడు మధ్య దేనిగురించో తీవ్ర సంభాషణ జరిగివుంటుందని శకుంతల, వారి ముఖ కవళికలు చూచి గ్రహించింది. "ఎంతసేపయిందమ్మా వచ్చి?" అని లోపలికి వెళ్ళింది చేతిలోవున్న పుస్తకాలు పెట్టిరావటానికి.
"అలావెళ్లి వస్తానమ్మా?" అని కృష్ణ బైటకు వెళ్లిపోయాడు.
దీపాలు పెట్టే వేళయిందనుకుంటూ కూర్చున్నచోటు నుంచి పార్వతి లేచింది.
10
"రాత్రికి వస్తావా? అక్కడే పడుకుంటావా రఘూ?"
అద్దంముందునుంచుని తలదువ్వుకుంటున్న రఘుణి అడిగింది పార్వతి.
"భోజనాలయ్యేటప్పటికి పది అవుతుంది. రేపు ఆదివారం. ఏకంగా రేపు రాత్రికి వస్తాను. రాధ కిందటిసారి వెళ్లినప్పుడు పదిసార్లు చెప్పింది ఓరోజు వుండేటట్లురమ్మని." క్రాపు దువ్వుకోటం అయింది. పౌడరు రాసుకుంటూ అన్నాడు రఘు.
పార్వతి మాట్లాడలేదు.
"నాతో ఏమన్నా పనివుందా అమ్మా!" అన్నాడు కాసేపు ఆగి తల్లి ఏమీ అనకపోవటం గ్రహించిన రఘు.
"ఉహూ!" ముక్తసరిగా అంది పార్వతి.
టాయిలెట్ అయి వెళ్ళబోతూ__కృష్ణను పెందరాళే యింటికి రమ్మన్నాను. వస్తానన్నాడు. కోడలితో ఏంచెప్పమన్నావ్ అమ్మా?" అని అడిగాడు రఘు.