Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 11

    "జరిగినదాన్ని మర్చిపోండి. మీరీపని ఎందుకు చేశారో అర్ధం చేసుకోగలను-"
    అదురుతున్న గుండెల్ని అదుపులో పెట్టుకుంటూ అర్ధంచేసుకున్నారు?" అంది.
    "నాతో స్నేహం పెంచుకోవాలని అలా చేశారు అవునా?"
    తలూపింది జ్యోతి. తన మనసులోని భావాల్ని గ్రహించి మృదువుగా మాట్లాడుతున్నందుకు ఆమెకు చాలా ఆనందంగా వున్నది.గుండెలమీద బరువు దిగిపోయినట్లు ఫీలయింది. కృతజ్ఞతనిండిన చూపులతో అతనికళ్ళలోకి చూసింది. అతని ముఖంలో కోపంలేదు. చూపుల్లో చల్లదనం మాటల్లో నెమ్మదితనం ఆమెను అమితంగా ఆకర్షించాయ్.
    కొద్దిసేపటికి కోపతాపాలు మరిచిపోయి మంచి స్నేహితుల్లా కలిసిపోయారు.
    "సదా మీ స్నేహం కావాలనుకుంటున్నాను నాకా వరాన్ని ప్రసాదించగలరా?" అర్ధింపుగా అడిగింది జ్యోతి. లక్షాధికారి అహంభావి అయిన జ్యోతి. అలా జాలిగా అడిగేసరికి శ్రీకర్ హృదయం కొన్ని క్షణాలు గర్వంతో పొంగింది.
    "మీకు ఇష్టమైతే నాకేం అభ్యంతరంలేదు. కానీ ఒక్కషరతు. నా అభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే మాటలుగానీ, సంఘటనలుగానీ జరిగితే నేను ఓర్చుకోలేను.
    "అలాగే! ఇంకెప్పుడూ మీ మనసును నొప్పించకుండా ప్రవర్తిస్తాను" నమ్మకంగా అన్నది.
    "అలా అయితే రేపు మీ యింటికి టీకి వస్తాను" నవ్వాడు శ్రీకర్.
    జ్యోతి ముఖం విప్పారింది. కళ్ళు కొత్త వెలుగుల్ని నింపుకున్నాయ్.
    "థాంక్స్!- తప్పకుండా రండి" నవ్వుతూ సంతోషంగా రమ్మనిచెప్పింది. మరికొద్దిసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. "వస్తానండీ...అని లేచింది జ్యోతి. శ్రీకర్ రోడ్డుదాకా వెళ్ళి ఆటో ఎక్కించి వచ్చాడు.
    "పూర్ గరల్! నా స్నేహంకోసం పరితపిస్తోంది! మనసుమంచిదే కానీ అహం డబ్బున్నదాన్నని గర్వం - ఆ రెండు గుణాలు తొలగిస్తే ఆమెలో వేలెత్తి చూపగల అవలక్షణాలేమీ లేవు. చదువుకూడా ఫరవాలేదు_" అని నవ్వుకున్నాడు శ్రీకర్.
    అక్కడ ఆటోలోవెళుతున్న జ్యోతి_ "వాసవీ! నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నీవలానిందించక పోయినట్లయితే యివ్వాళ శ్రీకర్ తో స్నేహం చేయగలిగి వుండేదాన్ని గాదు. నా కళ్ళు తెరిపించావు రేపు ప్రిన్స్ పాల్ గారి ముందు నిజంచెప్పి క్షమార్పణవేడాలి - అని అనుకుంది.
    యిప్పుడామెకు యెంతో రిలీఫ్ గా, తేలిగ్గా ఉల్లాసంగా వుంది. మధురోహలతో పులకించి పోతూంది! ఆటో కూడా ముందుకు దూసుకు పోతుంది రివ్వున.
                                                                            11
    పకపక నవ్వింది జ్యోతి. నవ్వి నవ్వి అలసిపోయింది. ఆమె గుండెలు ఎగిసెగసిపడుతున్నాయ్. హమ్మయ్య! అంది ఆయాసంగా.
    ఆ కదులుతున్న సౌందర్య కలళికను చూస్తూ వుండిపోయాడు శ్రీకర్. అతనికి జ్యోతిని చూసినప్పుడల్లా ఆశ్చర్యంగా వుంటుంది. అద్భుతంగా వుంటుంది. ఈ సౌందర్యరాశి ఈ రతనాలబొమ్మ ఈలక్షాధికారికొమ్మ తనకింత సన్నిహితంగా ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతాడు.
    "బలే జోకేశావ్ శ్రీ..." అంది ఆమె.
    "ఊ"
    "అవునూ! ఇంతగా నవ్విస్తావే నువ్వు నవ్వవేంటి? చక్రాలాంటికళ్ళు మిలమిలలాడిస్తూ అడిగింది.
    మిఠాయి అమ్మేవాడు వాడు తినడు తెలుసా? అలాగే నవ్వించేవాళ్ళు తాము నవ్వకూడదు. ఆ మాటకొస్తే కొందరు నవ్వలేరు!
    "పాపం కంటికెదురుగా స్వీట్ స్టాల్ వున్నా షుగర్ పేషెంట్ లాగ నన్నమాట!"
    "ఆ అన్నమాటే ఉన్నమాట!"
    "సరేకానీ స్వీటంటే గుర్తుకొచ్చింది. యేమైనా తిందాం!"
    అబ్బ నీకెప్పుడూ తిండిగొడవే! పూర్వజన్మలో బాపనక్కవై వుంటావు! చిలిపిగా అన్నాడు శ్రీకర్.
    అవున్లే అంతా నీలాగే ఉంటే దేశంలో తిండికొరత వుండేది కాదు! బుంగమూతితో అంది జ్యోతి.
    "నీలాంటి వాళ్ళవల్లే దేశంలో తిండికొరత వస్తుందా మరి!"
    మాటకిమాట అనంది అబ్బాయిగారికి తోచదు కదూ!"
    దేనికయినా రియాక్షన్ వుంటేనే హాయిగా వుంటుంది. ఊరకే మొద్దులావుంటే చప్పగా వుండదూ?"
    జ్యోతి అతన్నే తదేకంగా చూసి, చూసి అంది "శ్రీకర్ ఎంత చిత్రంగా వుందో చూడు మన విషయం మొదట నిన్ను లైక్ చేశాను. నువ్వు ప్రవరాఖ్యుడిలాగా భీష్మించుకుని వుండిపోయావు. దాంతో నాయిగో మండి పెట్రేగిపోయింది. నిన్ను అవమానించాలనుకున్నాను, ప్లాన్ చేశాను, సక్సెస్ అయ్యాను. నిన్ను కాలేజీనుంచి సస్పెండ్ చేయించాను. అప్పటికి నాలోని యీగో శాంతించింది!"
    తలూపేడు శ్రీకర్.
    "అదేకదా చిత్రం! ఏ ప్రేమపురాణం చూసినా విన్నా ఏముంది? పోట్లాటలు లేనిది ప్రణయమే లేదుకదా?"
    ఆ మాటలకి నవ్వింది జ్యోతి. "ఇంతకీ నేను థాంక్స్ చెప్పాల్సింది వాసవికి. అదే నాకు బుద్ధి చెప్పకపోయివుంటే నాలో మార్పుని తీసుకుని రాకపోయివుంటే మన మధ్య అగాధం అలాగే వుండేది. బహుశా నీవు నాపై అసహ్యం పెంచుకుని వుండేవాడివి. నేను నిన్ను తిరస్కారంగా చూస్తూ వుండేదాన్నేమో! వాసవికి మనం ఆజన్మాంతం కృతజ్ఞులం!
    "అంతేమరి!" క్లుప్తంగా అన్నాడు శ్రీకర్.
    జ్యోతి అతన్నే చూడసాగింది. "ఏం అందం! దేవుడు ఈ మనిషిని తనకోసమే సృష్టి చేశాడా? ముఖ్యంగా ఆ ముక్కు! వాసవి అన్నట్టు ఆ ముక్కే ముప్పైలక్షలు చేస్తుంది. తన ఐశ్వర్యం, తన సౌందర్యం, తన ఎటికసీ సర్వం ఒక తాసులో పెడితే ఆ ముక్కే మొగ్గుచూపిస్తుందేమో! అతన్ని చూస్తే కొరుక్కుతినాలనిపిస్తుంది! ఆ ఊహ రాగానే ఫక్కున నవ్వేసింది జ్యోతి.
    "ఏం నవ్వుతున్నావు?" విచ్చుకుంటోన్న గులాబీ మొగ్గలాంటి పెదాల్ని చూస్తూ చిరుదరహాసంతో అడిగేడు శ్రీకర్.
    కుంకుమ పువ్వులాంటి అతని పెదాల్నే చూస్తూ వుండిపోయింది జ్యోతి జవాబు చెప్పకుండా.
    జ్యోతీ: మరి వెళదామా?"
    "ఏం?"
    నాకు ట్యూషన్ కి టైం అవుతోంది!
    "నీకు ట్యూషనా?"
    "అవును!"
    "ఎవరిదగ్గర? నేనూ వస్తాను. ఆ మేష్టారు నీకు ట్యూషన్ చెపుతూవుంటే నేను నిన్ను చూస్తూ కూర్చుంటాను. ఖర్చయినా ఆనందంగా వుంటుంది. నెలకి యాభై ఖర్చయినా రోజూ ఓ గంట చూడొచ్చుగా నిన్ను సినిమాకి వెళ్ళి మూడుగంటలు కూర్చుని అందమైన అభిమానమైన హీరోని చూట్టంలామనం. ఇదీ అంతే!" 

 Previous Page Next Page