అది ప్రతిరోజూ జరిగే కార్యక్రమమే....ఆ విషయం అక్కడ పనిచేసే సిబ్బందికి తెలిసినా, దాని పర్యవసానమేమిటన్నదే వారి మెదళ్ళలో సస్పెన్స్ గా గూడు కట్టుకుని వుంటుంది.
అయినా చైర్ పర్సన్ మేటర్స్ లో తల దూర్చటం, ఆసక్తి చూపించటం ఉద్యోగానికే ఎసరు తెస్తుందని ఎవరికీ వారే ఏమీ తెలీనట్లు పని ముగించుకుని వెళ్ళిపోయారు.
* * * *
"ప్లీజ్ కమ్....మిస్టర్ మనోహర్" అంది మాయ హస్కీగా.
ఆమె కంఠం సహజంగానే మత్తుగా మరెంతో గమ్మత్తుగా వుంటుంది. భావావేశం ప్రతి మాటలోనూ, అలవోకగా, అవశ్యంగా తొంగి చూస్తుంటుంది. అంతటి భావోద్వేగం గుండె లోతుల్లోంచి వచ్చే మాటలకిగాని వుండదు.
ఎందుకిలా ఆమె నా వెంట పడుతోంది? తన నుంచి ఏం ఆశిస్తోంది?
మాయ కోట్లకు అధిపతి.
తనీమె దగ్గర బతుకుదెరువుకోసం వచ్చినవాడు.
తనకు ఈమె ఎప్పుడూ అర్ధంకాలేదు....ఇకపై కాదేమో కూడా.
"ఏం ఆలోచించావ్.....?" అడిగిందామె.
"దేని గురించి...." ఏమీ తెలీనట్లే, అంతకుముందేమీ జరగనట్లే అడిగాడు మనోహర్.
ముగ్ధమనోహారంగా నవ్విందామె.
తెరలు.....తెరలుగా...అలలు....అలలుగా....
"ఎవరికయినా బెటర్ చాయిస్ లభించే అవకాశం వున్నప్పుడు, మనసుకి నచ్చని మనిషితో ఎందుకు జీవితాన్ని ముడి వేసుకోవాలి?"
సూటిగా మనోహర్ ముఖంలోకి చూస్తూ అడిగింది మాయ.
ఆమె వేసే ఏ ప్రశ్నకీ తన దగ్గర సమాధానం లేదు.
అంతర్లీనంగా వుందేమో.....ఉన్నా, దానికి సరిపడ భాష-అది వ్యక్తీకరించే నేర్పు తనకి లేదు.
"హలో..." అంది మాయ చిలిపిగా.
ఒకసారి తలెత్తి చూశాడు మనోహర్.
మాయ ఎప్పుడు చూసినా ఫ్రిజ్ లోంచి తీసిన ఏపిల్ పండులా ఫ్రెష్ గా వుంటుంది. ఎన్నిగంటలు వర్క్ చేసినా, మరెంతో శ్రమకు లోనైనా, దాని తాలూకూ అలసట ఆమె మొహంలో కనిపించదు.
మనసు అలసటకు లోనుకాకపోతే, మనిషి కూడా అలసటకు లోనుకారనే ఆరోగ్య సూత్రం ఈమెపట్ల అక్షరాలా నిజమనిపిస్తుంది.
భాస్వరం లాంటి ఆడపిల్ల.....ప్రేమ తడిలో వున్నంతవరకే ప్రశాంతంగా వుండి, దానిలోంచి బయటకు పడగానే భగ్గున మండే ఉద్వేగపు లక్షణాలు మన బాస్ లో పుష్కలంగా వున్నాయనే తన కొలీగ్ దుర్గా ప్రసాద్ మాటలు నిజమేననిపిస్తుంటాయి.
చక్కని విశాలమైన నుదురు.
ఆ నుదురు మీదకు పిల్లగాలికి జలపాతంలా ముందుకు దూకే పొడవాటి కురులు.
నెలవంకల్లాంటి కనులు.
సంపెంగ మొగ్గలాంటి నాసిక.
ఉషోదయపు మంచులో తడిసిన గులాబీ రేకుల్లా మెరిసే బుల్లి పెదవులు.
నవ్వితే సొట్టలుపడే చెక్కిళ్ళు.
కొండ నాలుకని మరపించే సొట్టపడిన చుబుకం.
ఇండియన్ ఉమెన్ ఏవరేజ్ హైట్ ని క్రాస్ చేసి పైకెదిగిన ఈమెలో గొప్ప గొప్ప ఆకర్షణలు, అందాలు అంతర్లీనంగా దాగివున్నాయనిపిస్తుంది.
పల్చటి మంచి గంథం రంగులో చూడగానే సినిమా స్టారా?
హెలీపెయిడ్ మోడలా? మిస్ వరల్డ్ పోటీలకెళ్ళే స్టన్నింగ్ బ్యూటీనా? అనిపించేలా చూచరుల్ని స్వాప్నికుల్ని చేసే అపురూప సౌందర్యవతి.
చాలా ఏవరేజ్ గా ఏ ప్రత్యేకతలు లేకుండా కనిపించే తన మీద ఈమెకు దృష్టి ఏమిటి?
స్త్రీ మనసేకాదు, అభిరుచులు కూడా సప్త మహాసముద్రాలంత లోతుగా వుంటాయేమో....?
"ప్రేమ వివాహాలు, ఆదర్శ వివాహాలు, ఆర్ధిక వివాహాలు, అవసర వివాహాలు, అనవసర వివాహాలు, గ్లామర్ వివాహాలు, కాంటాక్ట్ వివాహాలు వీటిలో ఏదిష్టం నీకు....?" అడిగింది మాయ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేని మనోహర్ ఒక్కక్షణం తలదించుకున్నాడు.
"ప్లీజ్.....సమాధానం చెప్పవా?" మార్దవంగా అడిగింది మాయ.
"మీ వేవ్ లెంగ్త్ తో సరిపోయే వ్యక్తిని చూసుకొని అతనితో జీవితము కొనసాగించడం మంచిదేమొ ఆలోచించగూడడూ...?" నసుగుతున్నట్లుగా అన్నాడు మనోహర్.
ఒక్కక్షణం విస్మయంగా చూసింది మాయ.
"ప్రపంచంలో కెల్లా మొట్ట మొదట నేను అసహ్యించుకునేది ఆత్మవంచనని, బ్లడీ హిపోక్రటిక్ సొసైటీ. ఐ హేట్ ఇట్. మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్....లాంటి ఊహాజనితాలను మాగ్నిఫైయింగ్ గ్లాస్ తో చూడటం నాకిష్టంలేదు. ఎంతచెడ్డవాడికయినా, మరెంత దుర్మార్గుడికయినా, అతనికంటూ ఒక వ్యక్తిత్వం వుండాలి. అలాగే వ్యక్తిగతం మీద నాకు విపరీతమైన విశ్వాసం, గౌరవం వున్నాయి.
ఇంకొకరి ఇష్టానికీ, వేరెవరో మెచ్చుకోలుకీ, మనమెందుకు బతకాలి అన్నదే నా సిద్ధాంతం. స్క్రిప్ట్ లో లేని సీనిక్ ఆర్డర్ లా ఒక మనిషి జీవితం వుండకూడదు" ఒక్కక్షణం ఆగింది మాయ.
"భావాలు, భావుకత, ఉద్వేగాలు, ఉద్రేకం ఎంతమందికైనా వుండవచ్చు. వ్యక్తం చేయడం మాత్రం అతికొద్దిమందికే సాధ్యమేమోననిపిస్తుంది.
నువ్వంటే నాకిష్టం. నువ్వంటే ప్రాణం. నువ్వేనా సర్వస్వం. నువ్వు నాకు కావాలి. నిన్ను సొంతం చేసుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. ఎంతకయినా తెగిస్తాను. ఈ నా అభిప్రాయంలో ఎప్పటికీ మార్పు రాదు, రాబోదు. నన్ను ప్రేమించటానికి, పెళ్ళి చేసుకోవటానికి నీకున్న అభ్యంతరం ఏమిటి? నేనందంగా లేనా? ఎగ్జోటిక్ గా కనిపించనా? నా శరీర సౌష్టవం బాగాలేదా? నా ఒంపుసొంపులో వంకరేమయినా వుందా? కనుముక్కు తీరులో తేడా వుందా?" గుక్క తిప్పుకోకుండా అడిగింది మాయాదేవి.