Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 11

                                              కాళ్ళా వేళ్ళా పడిన వేయి కళ్ళవాడు

    అది ఒక పుణ్యాశ్రమం. మిధిలకు వెళ్ళే దారిలో ఉంది. అక్కడ ఎప్పుడూ గౌతమ సూత్రాలు వినబడుతూ ఉంటాయి. అది మహర్షి గౌతముల ఆశ్రమం. ఆయన సామాన్యుడు కాడు మాన్యుడు. సమ్మాన్యుడు. అంతే కాదు. ఆయన సాక్షాత్తూ బ్రహ్మఅల్లుడు. ఆ బ్రహ్మ కూతురు అల్లాటి ఇల్లాటి అమ్మాయి కాదు. అందగత్తెలలో అందగత్తె.

    అసలదెలా జరిగిందంటే -

    ఒక రోజు స్వర్గంలో తగాదా వచ్చింది. అందరిలోకి అందగత్తె అన్నాడు. అప్పుడేమో ఇంద్రుడు ఆ మాట నిజమనేశాడు. అంటే కుబేరుడి కుమారుడు నలకూబరుడు అడ్డొచ్చి అదేం కాదు. రంభే చాలా అందగత్తె అందుకే నారీష రంభ అనే సూక్తి పుట్టింది అన్నాడు. దాంతో ఒకరు ప్రమోచనూ, మహర్షి విభాండకుడు ఋష్యు శృంగుని తండ్రి హరిణిని, ఇంకొకరు ఘ్రతాచిని మరొకరు తారను, హేమ, మదాలసను పొగిడి పేర్కొన్నారు.

    ఆపై విశ్వామిత్రుడు
    కన్నులు చేరలం గొలవ గాదగు గౌనర పేద చన్నులా
    కిన్నెర కాయలం గెలుచు కీల్జెడ బారకు మీరు మోముక
    ప్పున్నమ చందమామ యొక పోలిక వాలిక తూపు చూపు నా
    కన్నుల యాన దాని కెనగాన జగాన మొగాన పల్కెదన్

    దాంతో చర్చ ఘాటెక్కి వ్యాసుడు దాశకన్య అందచందాలు వాయువు అంజనీదేవి చారు సౌభాగ్యాలు అలా గలభా రేగి ఎవరి కిష్టమైన స్త్రీ పేర్లు వాళ్ళు చెప్ప సాగారు.

    ఈ గోలంతా ఎందుకని ఇంద్రుడు అందర్నీ కూడగట్టుకొని సాక్షాత్తూ సృష్టికర్త వద్దకే జగడం తీర్చమని వెళ్ళాడు. ఆయన అంతా విని ఒక్కొక్కరికి ఒక్కో లోపం చెప్పి అవేవి లేని అంగనామణిని మదిరాక్షిని సృష్టిస్తానని చెప్పి.

    కుదురై ఒప్పుల కుప్పయై గోరంత నొచ్చంబులే నిదియై
    నొవ్వని జవ్వనంబు గలదై నిద్దంపు టొయ్యారియై
    మదనోజ్జీ వినియై గరాగరికయై మాణిక్య పుంబొమ్మయౌ

    మదిరాక్షిన్ సృజియింతు - అని పంతం పట్టి సృష్టించి ఇచ్చిన సుందరాంగి అహల్య. ఆమెను చూచి అచ్చరలంతా తబ్బిబ్బయ్యారు. దేవతలంతా తబ్బిబ్బు పడ్డారు. మునుల మనస్సు చెదిరింది.

    అయితే ఇంద్రుడి దృష్టీ ఆమెమీద పడింది. ఆమె అతడితో చూపు చూపూ కలిపింది. దాంతో అతడు పేట్రేగి నరుల్లో కిన్నెరుల్లో కింపురుషుల్లో సిద్ధసాధ్యుల్లో ఋషుల్లో ఈమెకు తగినవాడు ఎవరూ లేరు. దేవతల్లోనేనే తగిన వాడ్ని. ఆమెనిచ్చి పెండ్లి చేయి అని అడిగాడు. దానికి బ్రహ్మ పకపక నవ్వి నిన్నే పొగడుకోవడం తగదోయ్ ఇంద్రా! నాకు అల్లుడు కాదగినవాడు. అహల్యకు భర్త కాదగినవాడు గౌతముడు అవి అప్పటికప్పుడు అహల్యను గౌతముడి కిచ్చి పెళ్ళి చేశాడు.

    అహల్య గౌతములు అడవిలో కాపురం పెట్టారు. అలా ఉండగా ఒక రోజు గౌతముడు ఇంట్లో లేని వేళ చూసుకొని వచ్చి ఆశ్రమంలో జొరబడి పాకశాసనుడు ఆ పూరి పాక ముందు నిలబడి ప్రశ్నించాడు. అహల్య పలికింది.

    మాటా మాటా సాగితే సిగ్గు ననేగి నవ్వుచున్ అయితే ఇంద్రుడికి లోపలికి రావడానికి సాహసం చాల్లేదు. ఆ పై ఒక  జగజంత రాయభారం చేసింది. దాంతో ఓ రాత్రి కాచి వీలు చూసుకొని లోపల చొరబడ్డాడు. అదీ గౌతముడి వేషంలో.

    అహల్యకు వచ్చింది ఇంద్రుడని తెలీదు? ఏమో!

    వేకువ స్నానానికి వెళ్ళిన మొగుడు (మగడు) అంతలేనే ఇంట్లోకి వస్తే మగడో మగడి రూపంలో ఉన్న ఇంద్రుడో తెలీదా? ఏమో! ఏమైతేనేం అహల్య మేను పులకించేలా జీవితానందం పొందింది. ఏ రూపంలో నైతేనేం ఇంద్రుడి కోరిక తీరింది. అంతకు ముందు ఇద్దరి మధ్య పసందైన సంభాషణ జరుగుతుంది.

    దాంతో ఆమె నవ్వుతూ నా మగని వేషభాషల నే మిటికి ధరించివచ్చి తెరుంగ జెపుదూ అంటే నీ మగని రూప మౌటుకు పై మాటలు నడవందే పంకజ గంధీ అంటాడు. ఇంద్రుడు నిజానికి ఈ మాటలతో కంటే అంతకు ముందు మాటల్లోనే గడుస్తనాలున్నాయి.

    దేవా! శచీ మనోరమణా! అంటుందామె ఆమె మనస్సుని శరీరాన్ని ఆనందింప చేసే వాడివి అంటూ నర్మగర్భంగా అంటే ఇంద్రుడు అంటాడు. నీదు శోభా విభవం చూడ్డానికి వచ్చానంటాడు. ఇదెంతో అర్ధం ఇముడ్చుకొన్న మాటకదా! తర్వాత వనితా నవమన్మధా! అని సంబోధిస్తుంది.

    దానికి భావజునాన అంటాడు. మన్మధుడి ఆజ్ఞతో అని అర్ధం. మన్మధుడి ఆజ్ఞగా మన్మధ తంత్రానికి వచ్చానని ధ్వనించాడు ఇంద్రుడు. ఆమె చాలు చాలు ఇక వెళ్ళు ఈ మాటలు చాలించి వెళ్ళు అంటే ఇంద్రుడు కాళ్ళా వేళ్ళా పడ్తాడు.

    బెట్టు తగ్గకుండా ఒప్ప ఒప్పనట్టు ఒప్పుకుంటుందా ఒప్పుల కుప్ప ఆమె నియమాలన్నింటికీ గతి లేక అంగీకరిస్తాడు ఇంద్రుడు.

    తరువాత ఇంద్రుడు మహేంద్రానందాన్ని అనుభవిస్తాడు. ఆపై తెల్లవార బోతుందని వెళ్ళలేక సెలవడిగితే అతన్ని విడవలేక విడవలేక అంటుంది.

    నమ్మిన దాన నా తనువు నమ్మిన దానను నీకు ఇంక నే
    నమ్మక చెల్ల! నన్ను విరహాగ్నికి బాల్పడ చేసి బోవుటల్
    సమ్మత మాయనా - విడువ జాలితివా! ఎటులై నిన్ను నే
    పొమ్మన జాల చాలినను బొందిని ప్రాణము లుండనేర్చునే

    అప్పుడు వీడ్కోలు సమయంలో గౌతముడు వచ్చి ఇంద్రుడ్నిఅహల్యనూ శపిస్తాడు. దాంతో కధ కంచికి వెళ్తుంది. ఈ మధురమైన అహల్యా సంక్రందన ప్రబంధాన్ని సర్వాంగ సుందరంగా ప్రతి పద్య రమణీయంగా చతుర సంభాషణమయంగా తీర్చింది సముఖం వేంకట కృష్ణప్ప నాయుడు.


                                                   ----*----

 Previous Page Next Page