Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 12

                                                   మెచ్చినా పద్యమే! నొచ్చినా పద్యమే

    మహా సుఖ రోగాలు అనుభవించిన వాళ్ళకు మామూలు భోజనం రుచించదు. అలాగే సామాన్యుడి తిండీ సహించదు. మహాకవి, విద్యాధికారి, కవి సార్వభౌమ బిరుదుకల శ్రీనాధుడు అలా తటస్థ పడినపుడు విసుక్కొన్నా - వేసటపడినా అందంగా ఉంటుందట. మధుర వాణి తిట్టినా కమ్మగానే ఉంటుందట మరి!

    అదేదో ఊరు ఏ ఊరైతేనేం అది పలనాడు మండలంలోని పల్లె అక్కడికి వెళ్ళాడు శ్రీనాధుడు. మహారాజ భోగాలు అనుభవించిన వాడికి ఆ ఊరు - ఆ నీరు - ఆ అన్నం - ఆ వనం....ఏవీ నచ్చలేదు. దాంతో మొత్తం ఆ సీమనే తిట్టేశాడు.

    అంగడి ఊరలేదు వరి అన్నము లేదు శుచిత్వమేమి లే
    దంగన లింపు గారు ప్రియమైన వనంబులు లేవు నీటికై
    భంగ పడంగ పాల్పడు కృపా పరులెవ్వరు లేరు దాతలె
    న్నంగను సున్న కాన పలనాటికి మాటికి పోవ నేటికిన్

    ఏదైనా ఊరు వెళ్ళితే ఆ ఊరందం నచ్చితే మళ్ళీ మళ్ళీ వెళతారు. అక్కడ జనమో, భోజనమో వనమో నచ్చాలి మరి! ఏదీ నచ్చక నచ్చేది ఏదో కొందామంటే దొరికే అంగడి లేక కడుపునిండా తింటానికి వరి అన్నం లేక ఏ అమ్మాయినైనా పలకరిద్దామంటే కంటికి ఇంపుగా ఎవ్వరూ కనబడక పాపం తాగేందుకు మంచి నీళ్ళు లేక ఎంత బాధ పడ్డాడో! అన్నిటికీ మించి బాధించింది దాత లేకపోవడం.

    అక్కడే కాదు! మరో సందర్భంలో కూడా పలనాటిని తిట్టాడాయన!

    రసికుడు పోవడు పల్నా
    డెసగంగా రంభయైన నేకుల్ వడకున్
    వసుదేశుడైన దున్నను
    కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్

    పిల్లనిచ్చినవాడో, పిల్లను తెచ్చుకున్నవాడో పల్నాడు వెళితే వెళతారట కానీ రసికుడైన వాడు మాత్రం పల్నాడు వెళ్ళడట! రసికుడికి కావాల్సింది మంచి వసతి, సతిని మరిపించే వారసతి! ఇంటి తిండిని మరిపించే పూట కూటంటి భోజనం! అవేవీ దొరకవట పల్నాడులో! అక్కడ తప్పి జారి రంభలాంటి పడుచు ఉంటే ఆమె ఏకులు వడుకుతుందట కాని రసికుడిని పలుకరించి పడుకరించదట! రాజో రాజులాంటి వాడో అయినా భూమి దున్నాల్సిందే! పండిన తృణమో పణమో ధాన్యమో బ్రతుకు తెరువుగా స్వీకరించాల్సిందే! ఒకవేళ పరమ సుకుమారుడు - కుమారుడు. మారుడు వెళ్ళితే అతనెంత వాడైన జొన్నకూడు కుడవాల్సిందే ఎంత కడుపు మండిందో కవిసార్వభౌముడికి పాపం!

    ఒకసారి ఏం జరిగిందో కానీ అంతటి మహాకవి కవిత్వమును నిరసించాడు. అదీ ఆడ పుట్టుకను అభినందించాడు.
   
    కవితల్ సెప్పిన పాడనేర్చిన వృధా కష్టంబె ఈ భోగపుం
    జవరాంద్రే కదా భాగ్యశాలినులు పుస్త్యంబేల పోపోచకా?
    సవరంగా సొగసిచ్చి మేల్ యువతి వేషంబిచ్చి పుట్టంతువే
    నెవరున్ మెచ్చి ధనంబులిచ్చెదరు కాదే పాపపు దైవమా!

   
    పాపం దైవాన్ని తిట్టుకున్నాడే తప్ప మరేమీ అనలేదు. అలాగే అదే సీమలో ఏదో ఊరు బహుశా పులిపాడు కావచ్చునేమో! అక్కడి కరణం ఈయన్ని పలకరించలేదు పన్నెత్తి. మొక్కలేదు చేయెత్తి, ఇవ్వలేదు చేచాచి! అక్కడి గ్రామాధిపతి ఊరి పెద్ద కాపు. అందరూ అందరే! అయినా మాన్యుల్ని పొగిడే కవి సామాన్యుల్ని పద్యంతో సన్మానించాలంటే ఏదో హెచ్చోలొచ్చో ఉండాలి కదా!
   
    ఊరు వ్యాఘ్రనగర మురగంబు కరణంబు
    కాపు కపివరుండు కసవు నేడు
    గుంపుగా గనిచట గురజాల సీమలో
    ఓ గులెల్ల కూడి రొక్కచోట

    ఆ ఊరు పులిపాడు! కరణం నాగయ్యగారు. ఊరి పెదకాపు హనుమంతయ్య, గ్రామాధికారి పుల్లయ్య! అందరూ అందరే! పెద్దమనుషులే!

    అయితే శ్రీనాధుడికి నచ్చింది పలనాటి సీమలోని దేశభక్తి! మాతృభూమి అంటే వారి కున్న గౌరవం! దాన్ని మనసారా పొగిడాడు మహానుభావుడు.

    వీరుడు దివ్య లింగముల విష్ణువు చెన్నుడు కల్లుపోతురా
    జారయ కాల భైరవుడు నంకమ శక్తియ అన్నపూర్ణయున్
    గేరేడి గంగాధర మణికర్ణికగా చెలంగునీ
    కారెమపూడి పట్టణము కాశి గదా పలనాటి వారికిన్

    యావద్భారతం కాశ్యాం మరణాన్ముక్తి; అని చచ్చేలోగా కాశీకి వెళ్ళిరావాలని తపించే ఆ రోజులలో కారేంపూడినే కాశీగా భావించిన పలనాటి ప్రజల భక్తి ప్రవత్తులు - వాళ్ళు వీరులకిచ్చే వెలలేని గౌరవం - ఎంతగానో నచ్చి కవిగారికితాబు నందుకుంది. కవిగారిని కాలం కబళించినా కమ్మని ఆయన పద్యాలింకా గుబాళిస్తూనే ఉన్నాయి.


                                                  ----*---
 

 Previous Page Next Page