"హిహిహి..."నవ్వాడు కోటేశ్వర్రావ్.
"ఏంటా ఇకిలింపు కారు సరిగ్గా నడపకుండా!"
"నేను సరిగ్గానే నడుపుతున్నా...రాత్రి పెద్ద వర్షం పడిందిగా...అందుకే కారిట్టా నడుస్తుంది."
"వర్షం పడ్డానికీ కారిలా నడవడానికీ ఏంటి సంబంధం?" అయోమయంగా చూస్తూ ప్రశ్నించింది కాంతామణి.
` "మరి వర్షం పడ్తే రోడ్లు గుంతలుపడిపోయి పాడై పోతాయ్ గా ...అందుకని!!"
"హవును కదూ?... ఆ విషయమే మర్చిపోయా..." అంటూ ఫక్కున నవ్వింది కాంతామణి.కారు అలా కొంతదూరం జజ్జనకిడి...జజ్జనకిడి...అని గంతులేస్తూ వెళ్లిన తర్వాత కొందరు వ్యక్తులు రోడ్డుకు అడ్డుపడి కారాపారు.
"ఏంటి సంగతి?" అన్నట్టు వాళ్లవంక చూశాడు కోటేశ్వర్రావు.
"రాత్రి బాగా వర్షం పడింది కదండీ...అందుకని ఆ ఎదురింటాయన ఈ దారిన పోయే అందరికీ స్వీట్సు పంచమని ఇచ్చారండీ" ఒక యువకుడు చెప్పి ఇద్దరికీ చెరొక స్వీటు ఇచ్చాడు.
"ఏం ఆయనేమైన రైతా?" అడిగాడు కోటేశ్వర్రావ్. ఆ ప్రశ్న వినగానే ఆ యువకుడు ఫక్కున నవ్వాడు.
"ఆయన ఈ రోడ్డు వేసిన ఇంజనీర్ సార్. రాత్రి వర్షానికి రోడ్లు కొట్టుకుపోయాయ్ గా ... మళ్ళీ ఈ రోడ్లు వెయ్యడానికి కాంట్రాక్టు ఆయనే సంపాదించి ఇలాంటి రోడ్లే మళ్లీ వేసి మళ్లీ బోల్డు సంపాదిస్తాడంట సార్... అందుకే ఆయన సంతోషం కొద్దీ ఇలా ఈ రోడ్డమ్మట వెళ్లే అందరికీ స్వీట్లు పంచుతున్నారు సార్... అది వినగానే ఇద్దరూ ముక్కున వేలేస్కుని నోట్లో స్వీటు పెట్టుకుని ముందుకు వెళ్లారు. కారు ఇంకొంతదూరం "గుర్రంలా" వెళ్లింది. మధ్యమధ్యలో ఎగిరిపడ్తూంది.
కొంతదూరం రాగానే రోడ్డుకి అడ్డంగా ఒక గుంపులో జనం రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడ్తూ నాట్యం చేస్తున్నారు.
"ఏంటయ్యా ఈ ఉత్సవం??" కారాపి ఆ గుంపులోని ఓ మనిషిని అడిగాడు కోటేశ్వర్రావు.
"రాత్రి వర్షం పడి రోడ్లు కొట్టుకుపోయాయ్ కదండీ... అందుకని పండగ చేస్కుంటున్నాం. మేం కూలీలం సార్"...కొట్టుకు పోయిన రోడ్లు వెయ్యడం, గుంతలు పడ్డ రోడ్లు మరమ్మత్తు చెయ్యడం మాకు చేతినిండా పని సార్...సంతోషంగా చెప్పాడు ఆ కూలివాడు.
"బాగుంది... చాలా బాగుంది..." అని కారుని ముందుకు పోనిచ్చాడు కోటేశ్వర్రావు. ఒక ఫర్లాంగు దూరం వెళ్లాక రోడ్డు పూర్తిగా మాయం అయిపోయింది.
"ఇక్కడి నుండి రోడ్డు రెండు కిలోమీటర్ల దాకా పూర్తిగా కొట్టుకుపోయిందండీ..." దారిపోయే దానయ్య కోటేశ్వర్రావుతో చెప్పాడు.
కారుని వెనక్కితిప్పి ఇంటికి గుర్రంలా పోనిచ్చాడు కోటేశ్వర్రావు.
కోటేశ్వర్రావ్ కారు దిగాడు. అతని వెనకాలే కాంతామణి కూడా కారుదిగింది. ఆమె చేతిలో ఒక పసిబిడ్డ!!
"ఇదేమిటి? ఇదెక్కడిదీ??..." ఆశ్చర్యంగా అడిగాడు కోటేశ్వర్రావ్.
"ఎక్కడిదేమిటంటే... వీడు మన బిడ్డే!ఈ దిక్కుమాలిన రోడ్ల పుణ్యమా అని ఆ కుదుపులకి నేను కార్లోనే కనేశాను..."సిగ్గుపడ్తూ చెప్పింది కాంతామణి.
"గుంతలుపడి కొట్టుకుపోయిన రోడ్లమీద కారు జాగ్రత్తగా నడుపుతూ ధ్యాసంతా మీరు రోడ్డుమీద ఉంచారు. అందుకే గమనించలేదు"
"యాహూ..."
మూడువేల రూపాయల ఆపరేషన్ ఖర్చు తప్పినందుకు సంతోషంతో అరిచాడు కోటేశ్వర్రావ్.
* * *
బిరుదులూ-పోజులూ
అన్నారావు మొట్టమొదటిసారిగా ఓ పత్రికలో సీరియల్ రాశాడు.ఆ సీరియల్ పూర్తికాగానే పబ్లిషర్ పరబ్రహ్మం తను దానిని నవలగా వేస్తానని అన్నారావుతో అన్నాడు.
అన్నారావు సంబరంగా "సర్రే!..."అంటూ కళ్లుమూస్కుని ఓ గెంతు గెంతాడు.
అంతే...
గట్టిగా ఎవరో "కేర్...బేర్..."అని కేకేశారు.
ఉలిక్కిపడిన అన్నారావు కళ్లు తెరిచినవాడు ఆ తర్వాత ఆశ్చర్యంతో నోరుతెరిచాడు.
"ఏంటీ?...నేనింత ఎత్తులో ఎలా ఉన్నాను??..."పైకే అన్నాడు స్వగతాన్ని.
"నువ్వు నా భుజాల మీద తగలబడ్డావ్...అందుకే అంత ఎత్తులో ఉన్నావ్!..."
అది పబ్లిషర్ పరబ్రహ్మం గొంతు.
అన్నారావు కంగారుగా తల వొంచి కిందికి చూశాడు. తన కాళ్ళ మధ్య పరబ్రహ్మం బట్టతలబుర్ర తళతళా మెరిసిపోతూ కనిపించింది.
అన్నారావు నాలుక కర్చుకుని అతని బుజాల మీదినుండి క్రిందకి దూకి చెంపలు వేస్కున్నాడు.
"ఏమయ్యా... నవల పుస్తకరూపంలో వస్తున్నందుకు ఎంత సంబరమైతే మటుకు అంత ఎత్తుకు ఎగరాలా?... పోనీ ఎగిర్తే ఎగిరావ్... నా భుజాల మీద పడేట్టు ఎగరాలా?...ఆయ్..."అన్నాడు పరబ్రహ్మం.
"సారీ అండీ...హిహి..."ఇబ్బంది పడ్తూ నవ్వాడు అన్నారావు.
"నీ సీరియల్ నవల ఎడిటర్ గారు వేస్తానని అన్నప్పుడు కూడా ఇలానే ఆయన భుజాల మీదికి ఎగిరావా?...
"అప్పుడు ఎగిర్తే భుజాల మీద పడ్లేదండి...సరిగ్గా నెత్తిమీద పడ్డాను... హాప్పుడేమో ఆయన మెడ విరిగి పాపం ట్రీట్ మెంట్ కూడా తీస్కున్నాదండీ..."
అర్రే పాపం!...నువ్వు చెప్తున్నది నిజమేనా?"
"అక్షరాలా నిజం అండీ...కావలిస్తే ఎడిటర్ గార్ని చూడండీ...ఆయనిప్పటికీ మెడ వంకరగా పెట్టి నడుస్తున్నాడు...హి...హి..."అన్నాడు అన్నారావు.
"చాల్లేవయ్యా వెధవ నవ్వూ నువ్వూను... నువ్వు నవలలు రాసి ఎడిటర్ మెడలు విరక్కొట్టి, పబ్లిషర్ల భుజాలు బద్దలుకొట్టేవాడిలా ఉన్నావే !... నీతో చాలా ప్రమాదమే సుమా..."కళ్ళు పెద్దవిచేసి అన్నారావు వంక భయంగా చూస్తూ అన్నాడు పబ్లిషర్ పరబ్రహ్మం.
అతను చేసిన కామెంట్ కి అన్నారావు సిగ్గుతో చితికిపోయాడు.
"అది కాద్సార్...ఇప్పుడు ఇలా నవలలు రాయడం నాకు కొత్తగనుక ఆ ఆనందంలో జంపింగ్ చేసి మీకు ఇబ్బంది కలిగిస్తున్నాగానీ... కొన్నాళ్లకి రసీరసీ అలవాటైన తర్వాత ఈ సంబరం ఉండదుకదండీ..." మెల్లగా నసుగుతూ అన్నాడు.
"అప్పుడేమో వర్సబెట్టి నవలలు రాస్తూరాస్తూ పాఠకుల మెదళ్లు తినేసి వాళ్లకి ఇబ్బంది కలగజేస్తానంటావ్?ఆ?... ఏం అంతేనా?" పరబ్రహ్మం అతనివంక చిలిపిగా చూస్తూ ప్రశ్నించాడు.
"ఏదో సార్...మీ ఆశీర్వాదం ఉండాలిగానీ... అంత ఎత్తుకు ఎదగకపోతానా?..." సిగ్గుపడ్తూ అన్నాడు అన్నారావు.
"సర్లేగానీ... నీ నవలకి రెమ్యునరేషన్ ఎంతిమ్మంటావ్?..." అడిగాడు పరబ్రహ్మం.
"ఏదో లెండి...పదో...పదిహేనో ఇస్తే సంతోషిస్తా...హి!"
"పదో పదిహేనో ఏం ఖర్మ...వందరూపాయలిస్తా...ఏం?" హుషారుగా అన్నారావు భుజం తడ్తూ అన్నాడు పరబ్రహ్మం.