Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 12

   అన్నారావు తెల్లబోయాడు.
    "నేనంటుంది పదో పదిహేనో రూపాయలు కావండీ...వేలు!" తేరుకుని మెల్లగా అన్నాడు.
    పరబ్రహ్మం అన్నారావు వంక క్షణంపాటు ఆశ్చర్యంగా చూసి తర్వాత ఘొల్లుమని నవ్వాడు.
    "భలే వాడివే!...పది పదిహేను వేలు ఇవ్వడానికి నువ్వేమైనా సూపర్ రైటర్ వా? లేకపోతే సుప్రీం రైటర్ వా?...ఇది నీకింకా మొదటి నవల! రైటర్ గా పాపులర్ కాకముందు నవల రెమ్యునరేషన్ ఇంకా తక్కువ ఇస్తారు వేరే పబ్లిషరయితే. నేను కాబట్టి నీకు వందరూపాయలు ఇస్తున్నా...అయినా నువ్వు ఆలోచించి చెప్పు.ఇదే నవలని నువ్వు చిత్తుకాగితాల వాడికేస్తే అంతకన్నా ఎక్కువొస్తుందా?...న్యాయం చెప్పు..."
    "రాదు సార్..."అన్నాడు అన్నారావు.
    "కాబట్టి నువ్విక మాట్లాడకు...ఇంద పది రూపాయలు ఎడ్వాన్సు తీస్కో. మిగతా తొంభై రూపాయలూ పుస్తకం రిలీజైనాక ఇస్తాను..."పది రూపాయలు అన్నారావుకి ఇచ్చాడు.
    ఇహ అసలు విషయం పబ్లిషర్ పరబ్రహ్మం దగ్గర కదపాలని నిశ్చయించుకున్నాడు అన్నారావు.
    "హి...హిహి..."పరబ్రహ్మం మొహంలో మొహం పెట్టి నవ్వాడు.
    నువ్వెంత  నవ్వినా నీకు అడ్వాన్సు గా పది రూపాయలు మించి ఇవ్వలేనబ్బాయ్!" కచ్చితంగా చెప్పాడు పరబ్రహ్మం.
    కిసుక్కున నవ్వాడు అన్నారావు.
    "అది కాద్సార్...మీరనవసరంగా కంగారు పడ్తున్నారు...నేను వేరే విషయం గురించి మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను..."
    "ఏమిటిది?..."
    "నా నవలకి వారపత్రికల్లో పబ్లిసిటీ ఇస్తారు కదూ త్వరలో రాబోతూందని?..."
    "భలేవాడివే...ఎందుకివ్వనూ?...పబ్లిసిటీ ఇవ్వకపోతే సేల్సు ఎలా జరుగుతాయనుకున్నావ్?..."కళ్లు ఎగరేశాడు పరబ్రహ్మం.
    అన్నారావు మెలికలు తిరుగుతూ "హి...హిహి"అన్నాడు.
    "ఆ నవ్వడం ఆపి నీ మనసులో ఉన్నదేంటో సందేహించకుండా చెప్పు..."
    "మరేమో! వేరే రచయితల పుస్తకాలు ప్రచురించేప్పుడు మీరు ఈతరం సూపర్ రచయత, ఈ యుగం పాప్లర్ రచయిత,ఈ శతాబ్దపు బద్దలుకొట్టే రచయిత అంటూ పబ్లిసిటీ ఇస్తారు కదా... నాకూడా పేరు ముందు అలాంటిదేదో తగిలించి పబ్లిసిటీ ఇవ్వండి సార్..."
    పరబ్రహ్మం ఆలోచనలో పడ్డాడు.
    "నిజమేనయ్యో...నువ్వు చెప్పినట్టు పబ్లిసిటీ ఇవ్వాల్సిందే!...ఏమని   ఇవ్వాలబ్బా!!!?"
    "ఈతరం మాగ్నిఫిషెంట్ రచయిత అని ఆల్రెడీ అప్పల్రాజుని అంటున్నారు... వేరే ఏదైనా ఆలోచించాలి!..."
    "ఈ యుగం వీర రచయిత అంటే ఎలాగుంటుంది సార్?..."
    "అబ్బే... వీర రచయిత కూడా ఉన్నాడు. పోనీ ఈ దశాబ్దపు ఘోర రచయిత అని అంటేనో?"
    "అలా అంటే నన్ను తిడ్తున్నట్టు ఉంటుందేమో కద్సార్?..."బుర్రగోక్కుంటూ అయోమయంగా అడిగాడు అన్నారావు.
    "అలా అంటావా?..."ఆలోచిస్తూ అన్నాడు పబ్లిషర్ పరబ్రహ్మం.
    అన్నారావు మరికాస్సేపు ఆలోచించి,?"ఆ...ఈ శతాబ్దపు శరవేగ రచయిత అంటే సార్?"
    అబ్బే...లాభం లేదోయ్...ఇప్పటికే ఈ శతాబ్దపు వాయువేగ రచయిత,బుల్లెట్ వేగ రచయిత,అతివేగ రచయిత,పరమవేగ రచయిత అని నలుగురు రచయితలున్నారు...
    ఇప్పుడు శరవేగ రచయిత అంటే అదే కోపలోకి వస్తుంది... అయినా ఇలాంటివి లాభం లేదయ్యా... మనకేమీ దొరికేలా లేవు...
    అందరూ అన్ని రకాలు పంచేస్కున్నారు!...పెదవి విరుస్తూ అన్నాడు పబ్లిషర్ పరబ్రహ్మం.
    "పోనీ కొతమంది రచయితల్లో ఆంధ్రా షిడ్నిషెడ్నన్,ఆంధ్రా హాడ్లీఛేజ్... అంటూ ఎవడిపేరైన నా పేరుకు ముందు తగిలించుకుంటేనో సార్?..." ఉత్సాహంగా అన్నాడు అన్నారావు.
    "బాగానే ఉంటుందనుకుంటా..."
    "అయితే నా నవలకి ఆంధ్రా ఆర్థర్ హైలీ అన్నారావు రచించిన...అంటూ పబ్లిసిటీ ఇవ్వండి సార్..."
    పరబ్రహ్మం తలని అడ్డంగా ఊపాడు.
    "అబ్బే!...ఆంధ్రా ఆర్థర్ హైలీ కూడా ఆల్రెడీ ఉన్నాడయ్యాబాబూ"
    "పోనీ తెలంగాణా ఆర్థర్ హైలీ అని పెట్టుకుంటేనో సార్?..."
    "అలా వద్దయ్యా...ప్రాంతీయతత్వాన్ని బలపరుస్తున్నావనుకుంటారు!..."
    ఇద్దరూ చాలాసేపు ఆలోచించారు.
    ఇద్దరికీ ఒక్క పాపులర్ ఇంగ్లీషు రచయిత పేరుకూడా తట్టలేదు. అప్పటికే అందరు రచయితలూ ఇంగ్లీషు రచయితల పేర్లు పంచేస్కున్నారు.
    "ఇప్పుడెలా సార్?..."దిగులుగా మొహం పెట్టాడు అన్నారావు.
    పరబ్రహ్మం కాస్సేపు ఆలోచించి ఇలా అన్నాడు."ఓ పనిచేస్తే బాగుంటుందోయ్...ఇతరుల్లా వాళ్లతో వీళ్ళతో పోల్చుకోకుండా అచ్చంగా తనకు తనే అయిన అన్నారావు రచించిన...అంటూ పబ్లిసిటీ ఇస్తే ఎలా ఉంటుంది?"
    "చాలా బాగుంటుంది సార్..."పొంగిపోతూ అన్నాడు అన్నారావు.
    "మరి అందరూ పబ్లిసిటీలో ఫోటోలు వేయించుకుంటారు కద్సార్...ఈ ప్రక్కకి చూస్తూ ఆ ప్రక్కకి చూస్తూ, గడ్డం క్రింద చెయ్యిపెట్టుకునీ... అట్టావేయించుకుంటే సార్?..."
    "బాగానే ఉంటుంది గానీ నువ్వే ఫోజులో వేయించుకుంటావ్?..."
    "సార్...ఇట్టా కళ్లు పైకిపెట్టి,పైకి చూస్తున్నట్టు ఫోటో వేయించుకుంటే సార్..."
    "వద్దు...నా నవల చదివిన వారు పైకి పోతారని చెప్తున్నట్టు ఉంటుంది ఆ ఫోజు!"
    "పోనీ క్రిందికి చూస్తూ ఫోజు పెడ్తేనో సార్?"
    "అదీ వద్దు...ఇలాంటి నవల రాసినందుకు నేను సిగ్గుపడ్తున్నా అని పాఠకుల్తో అంటున్నట్టు ఉంటుంది..."
    "మరెలా సార్...మిగతా ఫోజులు వేరే రచయితలు ఆల్రెడీ పెట్టేశారు... నేనేం ఫోజు పెట్టను సార్?..." దిగులుగా అడిగాడు అన్నారావు.
    "ఓ పని చేస్తే బాగుంటుంది...ఎవ్వరూ తీయించుకోని విధంగా వెనుకనుండి ఫోటో తీయించుకో..."
    అన్నారావు ఎగిరి గంతేశాడు. అతనికి ఆ ఆలోచన బాగా నచ్చింది.
    ఆ విధంగా అన్నారావు మొదటి నవల పుస్తకరూపంలో వచ్చింది. తర్వాత్తర్వాత అతను గొప్ప రచయితైపోయి ఆంధ్రా విలియం కౌన్ కిస్కో పేరుతో కథలు చాలారాశాడు.  
   
                               *  *  *

 Previous Page Next Page