'బ్రహ్మ తన కరకమలాలతో నీ పదకమలాలు కడిగే అవసరం వచ్చిందయ్య గౌతమా! ఆ అదృష్టం నీవు దక్కించుకుంటే ఆనందించే వారిలో నేను ప్రధముడినవుతాను'
గౌతముడు వింతగా చూశాడు.
'దివ్యర్షీ! ఇది మరీ విచిత్రంగా ఉంది. సంతానమే లేని పరమేష్టికి స్త్రీ సంతానం ఎక్కడిది! ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అపూర్వ అవకాశం ఎక్కడిది! తమరంతా చిత్ర విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారు' అన్నాడు.
అంతలో గౌతమాశ్రమంలో గోశాలను పరిరక్షించే శిష్యుడొకడు పరుగు పరుగున వచ్చి 'గురువు గారూ! మన కపిలలో ఈనే లక్షణాలు మొదలయ్యాయి. అంభారవాలు దిక్కులదిరేలా చేస్తున్నది. నిలిచిన చోట కుదురుగా నిలవక తిరుగుతున్నది. మాయ విడవబోతున్నదని చెప్పాడు కాపరి' అన్నాడు.
గౌతమాశ్రమంలో గోసంపదకు కొదవే లేదు. ఎప్పుడూ ఏదో ఆవు చూపుతోనో పాడితోనో ఉంటూనే ఉంటుంది. కానీ కపిల చాల ఏండ్లుగా ఈనలేదు. ఇటీవలే అది ఈననై ఉంది.
గౌతముడు సంతోషించాడు.
నారదుడు ఆ మాటలు విని పరమానందం చెందాడు. 'గౌతమ మహర్షీ తక్షణం మనం కదిలి గోశాలకు చేరాలి. పద!' అని తొందరించాడు.
గౌతముడు మరేమీ అనకుండా కదిలాడు. శిష్యులూ అనుసరించారు. వారు అక్కడికి వెళ్ళేసరికి ఆవు సగం ఈనింది. ఆవు గర్భం నుండి దూడ శిరస్సు వెలికి వచ్చింది. శేష భాగం క్రమక్రమంగా వెలికి వస్తున్నది.
'ఊ! ఆలస్యం చేయకుండా తక్షణమే గోమాతకి ప్రదక్షిణం చేయవయ్య గౌతమా!' అని ఆదేశించాడు నారదుడు.
గౌతముడు ఆ గోమాతకు ముమ్మారూ ప్రదక్షిణించి గోపృష్టానికి నమస్కరించి తిరిగి నారదుడి సమీపానికి వచ్చి నిల్చున్నాడు. మరి రెండు ఘడియలకు గోవు తన బిడ్డకు జన్మనిచ్చింది. కోడె జన్మించింది. పశువుల కాపరినీ, గోశాల సందర్శకుడైన శిష్యుడినీ ఆవునూ, దూడనూ జాగ్రత్తగా చూసుకోమని దాని శరీరం శుభ్రం చేసి వేడి నీళ్లతో కడిగి మేత వేయమని ఆదేశించాడు గౌతముడు.
అక్కడ నుండి కదిలి తన కుటీరం చెంతకు వచ్చాడు. ఆయన వెంటనే నారదుడు వచ్చాడు. రసాల వృక్షం నీడలో కూర్చున్నారిద్దరూ! మామిడి చిగుళ్ళు వేస్తున్నది. పూత కొంత పిందెలుగా మారుతున్నది.
కొంత కాయలుగా మారుతున్నవి. మావి చివుళ్ళు వేసి కోయిల కుహూ కుహూ రాగం వినిపించసాగింది.
'శుభం!' అన్నాడు నారదుడు.
'ఏమిటీ మహర్షీ?' అన్నాడు గౌతముడు.
'కళ్యాణమస్తు!' మళ్ళీ అన్నాడు నారదుడు.
'తమరి అసంపూర్ణ విషయ విన్యాసంతో పూర్తిగా బోధపడక అంతరంగంలో ఆలోచనలు కదలాడుతున్నాయి! ఇకనైనా పూర్తిగా చెప్పండి'
'గౌతమా, ఇంద్రలోకంలో ప్రారంభమైన చిన్న సమస్య బ్రహ్మలోకం దాకా వచ్చింది. ఎవరు అందగత్తెలని ప్రశ్నించిన దేవేంద్రుడి ప్రశ్నకు అందరూ తామే అందగత్తెలమనే రీతిలో ప్రతిధ్వనించారు. వారి వారి అభిప్రాయాలు వెల్లడించిన బ్రహ్మర్షుల, మహర్షుల మధ్యా వాదోపవాదాలు చెలరేగాయి. దిక్పాలురూ తగాదాలో తలదూర్చారు.
సమస్యనైతే సృష్టించగలిగాడు కానీ దాన్ని పరిష్కరించలేకపోయాడు మహేంద్రుడు. అందర్నీ వెంట పెట్టుకుని బ్రహ్మ సన్నిధికి వచ్చాడు. విషయం విన్నవించాడు. అంతా విన్న సృష్టికర్త ఇన్ని యుగాలుగా తను సృష్టించిన సుందరీమణుల్లో లోపం లేని స్త్రీ లేదనీ. ఇప్పుడో కన్యను సృష్టిస్తాననీ ఓ యువతీని సృష్టించి 'అహల్య' అని నామకరణం కూడా చేశాడు.
ఆ కన్యామణిని చూసి ఆశ్చర్యపడ్డారంతా! ఇంద్రాది దిక్పాలకులూ, విశ్వామిత్రాది మహర్షులూ అంతా అర్ధించగా ఎవరికి కన్యాదానం చెయ్యాలో బ్రహ్మకు పాలుపోలేదు. నన్ను సంప్రదించాడు పితామహుడు.
వర పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణుడైన వరుడికిచ్చి పెళ్ళి చెయ్యమని సూచించాను. భూమండల ప్రదక్షిణా వర పరీక్షలో శుల్కంగా నిర్ణయించబడింది. ఎవరు ముందుగా భూ ప్రదక్షిణ పూర్తిచేసుకుని వస్తారో వారు అహల్యా పాణిగ్రహణ యోగ్యులు. ఎవరు ప్రప్రధములో వారే సృష్టికర్త అల్లుడవుతారు.
'నీవు ఈనుతున్న ఆవుకి ముమ్మారూ ప్రదక్షిణం చేశావు కనుక అది గో ప్రదక్షిణే అయినా భూ ప్రదక్షిణతో సమానం. నీవే మున్ముందుగా బ్రహ్మ నిర్ణయించిన పరీక్షలో ఉత్తీర్ణుడవయ్యావు. ఇది దైవసంకల్పం. బ్రహ్మ నిర్ణయం! నీకు అహల్యతో జీవితం ముడిపడి ఉంది. కనుక తక్షణం బ్రహ్మలోకం వెళదాం పద!'
గౌతముడి మనస్సు ఆనంద తరంగితమైంది. నారద గౌతములు బ్రహ్మ లోకానికి ప్రయాణమయ్యారు.
* * * *
సరస్వతి సృష్టికర్తను చూసి అన్నది 'లేక లేక పుట్టిన ఓ ఆడపిల్లకి- అదీ జగదేకసుందరికి తల్లిదండ్రులమయ్యాం! ఓ అచ్చటా ముచ్చటా లేదు. పుట్టడమే యవ్వనవతిగా పుట్టింది. పుట్టీ పుట్టగానే సమస్యను తెచ్చిపెట్టింది. అవునూ భూమండలంలో అందరూ అనుకుంటారు కదా! బ్రహ్మ ఏనాడో ముడి వేసి ఉంటారని. మరి మన అహల్యకు ఎవరితో ముడి పెట్టారు?'
చదువుల దేవి అడిగిన ప్రశ్నకు చిరునవ్వు నవ్వాడు సృష్టికర్త. అంతే కానీ సమాధానం చెప్పలేడు. అవును అది దేవరహస్యం మరి!
అహల్య ఇద్దర్నీ చూస్తూ ఉండిపోయింది.