ఆమెకు ఇంద్ర వైభవం, విశ్వామిత్రుడి తపో వైభవం కనుల ముందు కదలాడాయి. మహేంద్రుడు తన ముల్లోకాధిపత్యంతో, తన శక్తిసామర్ధ్యాలతో మునుముందుగా భూ ప్రదక్షిణం చేసి వస్తాడో, సృష్టికే ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్ర మహర్షి మున్ముందుగా వస్తాడో అని అనుకుంది.
అంతలో నారాయణ స్మరణం వినిపించింది.
'నారాయణ! నారాయణ!' అనుకుంటూ నారదుడు వచ్చాడు.
ఆ వెనుకనే గౌతమ మహర్షి వచ్చాడు. వచ్చీ రాగానే బ్రహ్మను స్థుతించే మంత్రాలు పఠిస్తూ బ్రహ్మ కనక పీఠం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆపై సరస్వతీ ఉపనిషత్తు పఠిస్తూ ప్రదక్షిణ చేశాక 'నమామి యమినీ నాధ రేఖాలంకృత కుంతలామ్' అని ఆయన చేసిన స్థవం శారదాదేవిని అలరించింది.
బ్రహ్మ బ్రహ్మానంద భరితుడయ్యాడు.
'ఏమి నారదా! గౌతమ మహర్షి మా సందర్శనానికి విచ్చేశాడేమీ?'
'పితామహా! వరుల వరులో చివర చేరినా, అందరికీ అగ్రభాగాన నిలిచినట్టు ముందుగా మీ సన్నిధికి చేరుకున్నాడు తండ్రీ!'
'ఏమిటేమిటీ?'
'అవును తండ్రీ! గౌతమ మహర్షి అహల్యా కరగ్రహణానికి విచ్చేశాడు!'
'ఏమంటున్నావ నారదా!'
అదే సమయంలో అహల్య గౌతముడిని చూసింది. గౌతముడు బ్రహ్మనే చూస్తున్నాడు.
'నేను భూలోకం వెళ్ళి ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ యధాలాపంగా వినిపించాను. నా మనసులో మరే ఉద్దేశ్యం లేదు. కేవలం ఇక్కడ జరిగిన అహల్య సృష్టి ఆమె సృష్టికోసం జరిగిన కల్లోలం. ఆపై అహల్య వివాహ విషయం. ఇంద్రుడి అభ్యర్ధన. తమరు ఏర్పరచిన నిబంధన చెప్పాను అంతే!'
'అంతేనా!'
'అంతే నాన్నగారూ! అంతకు మించి యింకేం చెప్పలేడు'
'మరి గౌతముల రాకకు కారణం?'
'చెప్పానుగా. పోటీపడి, పోటీలో ప్రధమంగా నిలిచి, పోటీలో గెలిచి, పందెం బహుమతిగా అహల్యణు స్వీకరించడానికి విచ్చేశారు.'
"అదెలాగ? మునుముందుగా అందరికంటే అతి వేగంగా బయలుదేరిన మహేంద్రుడిని, దిక్పాలురనూ, మరెందరో మునీంద్రులనూ వెనకబెట్టి తాను ఎలా మున్ముందు రాగలిగాడు? భూప్రదక్షిణం చేసినట్టు సాక్ష్యమెవరు?'
'నేనే తండ్రీ!'
'నారదా! ఇదంతా ఏదో నీ ప్రణాళికలో భాగంగా ఉంది. ఏదో కారణంగా నీవు కలహం పుట్టించవు కదా!'
'కళ్యాణం జరగవలసిన సమయంలో కలహమా తండ్రీ! అదేమీ లేదు. చెల్లాయికి తగిన వరుడు లభించాడనే సంతోషంతో నేను కల్పించుకుని చెప్పాను. అంతే! మరింకేం ఆలోచనా లేదు. ప్రత్యేక శ్రద్ధా లేదు!'
'నిజంగా గౌతములు భూప్రదక్షిణం చేశారా నారదా!' అడిగింది వీణాపాణి.
'నిజం! నిజం! నిజం! ముమ్మాటికీ నిజం! అయినా నేను అబద్ధం చెపుతానా? తల్లీ! ఎక్కడైనా నిజం చెప్పి- నిష్టూరమాడి- కలహబీజం వేస్తాడనే నిందిస్తారు కానీ అబద్ధాలాడి, లేనిపోని కబుర్లు చెప్పి కలహం సృష్టిస్తాడని ఎవరూ అనరు కదమ్మా!'
'ఔనౌను! అదీ నిజమే!' అన్నాడు సృష్టికర్త.
'అప్పుడెప్పుడో వెళ్ళిన వారు ఇంకా రాలేదు. ఈయన అప్పుడే తయారై వచ్చి, ఇప్పుడా మరెప్పుడూ పెళ్ళి అన్నట్లు నిలబడ్డాడు. ఏమిటిది నారదా?'
"ఏముంది తండ్రీ! సూక్ష్మంలో మోక్షం'
'అంటే?'
'అంటే-వింటానికీ వినోదంగానూ, ఔనంటానికి ఆనందంగానూ ఉంటుంది. గౌతముల ఆశ్రమంలో నేను వెళ్ళిన సమయానికి ఓ కపిల ఈనుతూ ఉంది. సగం ఈనిన ఆ కపిలకు మహర్షులు- న్యాయ ధర్మ సూత్రాలను నిర్మించిన గౌతములవారు ప్రదక్షిణం చేశారు. ఈనే గోవుకు ప్రదక్షిణం భూప్రదక్షిణా పుణ్యాన్ని ఇస్తుందని కదా శృతి! మరి మన నిబంధన భూప్రదక్షిణే కదా! అది నిర్వర్తించిన గౌతములవారు నియమం ప్రకారం అహల్యా పాణిగ్రహణకు అర్హులే కదా తండ్రీ!'
'ఔను! ధర్మం ప్రకారం, నియమం ప్రకారం, గౌతములు చేసింది ధర్మసమ్మతం! వారు వరపరీక్షలో నెగ్గినట్టే!'
గౌతములు చిరునవ్వు నవ్వారు.
'కన్యా వరయతే రూపం! మాతా విత్తం! పితాశ్రుతం అని కదా లోక లక్షణ. వేదవేదాంగ వేత్తయై, న్యాయ సూత్రాలను నిర్మించిన గౌతములు నా దృష్టిలో పరమ యోగ్యులు!'
'పితామహా! మీరు చెప్పిన ప్రకారం రూపహీనుడైనా, పండితుడు కాకపోయినా, ధనహీనుడైనా, ఎవరికీ నచ్చారు కదా! కానీ మనం చేసిన నిబంధన భూ ప్రదక్షిణే కానీ మరేమీ కాదు. పోటీలో పాల్గొనేవారూ పందితుడూ, రూపవంతుడూ, ధనవంతుడూ కూడా అయి ఉండాలని నిర్ణయించలేదు కదా!'
తలూపేడు పితామహుడు.