ఒకసారి పేచీపడి విద్యార్ధుల చేతుల్లో దెబ్బతిన్న కండక్టరు అసహాయంగా చూస్తూ వుండిపోయాడు.
సునంద బస్ ఎక్కే ప్రయత్నం చెయ్యకుండా నిలబడిపోయింది.
ఆమె పక్కన అంతసేపూ నిలబడివున్న వృద్ధుడు. బస్ రాడ్ పట్టుకుంటూ కుర్రాళ్ళను లోపలకు వెళ్ళమని చెప్పాడు. కాని ఎవరూ అతని మాటల్ని లక్ష్యం చెయ్యలేదు.
బెల్ మోగింది. బస్ కదిలింది. రాడ్ పట్టుకొని ఒక కాలుమాత్రం ఫుట్ బోర్డుమీదపెట్టి, రెండోకాలు పెట్టటానికి చోటు వెతుక్కుంటున్న సమయంలో బస్ కదిలింది. వృద్ధుడు నిలదొక్కుకోలేక పోయాడు. కింద పడిపోయాడు.
వెళుతున్న బస్ లో ఫుట్ బోర్డుమీద వున్న కుర్రాళ్లు గొల్లుమన్నారు.
సునంద ఒక్క ఉదుటున ముందుకువచ్చి, ఆ వృద్దుణ్ణి లేవదీసింది.
"దెబ్బ తగిలిందా తాతయ్యా!" జాలిగా అడిగింది.
"లేదు! ఆ మందలో తప్పపుట్టావు తల్లీ! నిన్ను కన్నతల్లిదండ్రులు ధర్మాత్ములమ్మా!" ఆర్ద్ర కంఠంతో అన్నాడు ఆ వృద్దుడు.
సునందకు తండ్రి కళ్ళలో మెదిలాడు. కళ్ళలో గిర్రున నీరు తిరిగింది.
8
నడినెత్తిన సూర్యుడు నకనక లాడుతున్నాడు. పనిపాటలు చేసుకొనే జనం పొలాలు వెళ్ళారు. అడపా దడపా ఓ మనిషి బజార్లో కన్పిస్తున్నాడు.
కుక్కలు నాలుకలు బయటపెట్టి రొప్పుతూ నీడ వెతుక్కుంటున్నాయి.
ధర్మయ్య నెత్తిమీద పైపంచ వేసుకొని వీధిగుమ్మం దాటబోతున్నాడు.
"మళ్ళీ ఎక్కడికి! భోజనంచేసి పోక" అన్నది సరస్వతమ్మ వెనక నుంచి వచ్చి వసారాలో నిలబడి.
"అమ్మాయికి డబ్బు మనీయార్డరు చేసివస్తా. ఇప్పుడే వచ్చేస్తా అంటూ ధర్మయ్య రోడ్డుమీదకు వచ్చాడు.
"కాళ్ళకు చెప్పులుకూడా లేవు. తెగిపోయి ఎన్నాళ్ళయింది? కొత్తవి కుట్టించుకోమంటే వినిపించుకోరు?" గొణుక్కుంటూ సరస్వతమ్మ లోపలకు వెళ్లింది.
ధర్మయ్య సందు మలుపు తిరిగి ఆగిపోయాడు.
"ముదనష్టపు సచ్చినోడ? ఇందాకే కదరా డొక్కపగల గొట్టుకున్నావ్? అంతలోనే ఏమొచ్చింది మాయరోగం? అదేమంటే సవిత్తల్లి రాసి రంపాన పెడుతుంది అంటారు."
ధర్మయ్య ఆగి చూశాడు. నిండా పదేళ్ళు లేని రఘు కిక్కురు మనకుండా దెబ్బలు తింటూ నిల్చున్నాడు.
ధర్మయ్య కాళ్ళు ముందుకు సాగలేదు. దుఃఖాన్ని దిగమింగుకొంటూ నిల్చున్న పసివాణ్ణి చూస్తూ నిట్టూర్చాడు.
"కాంతమ్మా! ఎందుకు వాణ్ణి కొడుతున్నావ్?" రోడ్డుమీద నిల్చునే అడిగాడు ధర్మయ్య.
"చూడు బాబాయ్! మరీ కాల్చుకు తింటున్నాడు. పొద్దునే కంచం అన్నం మెక్కాడు. గొడ్లను పొలం తోలు కెళ్ళమంటే జ్వరం వచ్చిందన్నాడు. అసిడ్లే అని ఊరుకున్నాను. కాస్త పసిదాన్ని ఆడించమంటే కిందపడేశాడు" పితూరీ చెప్పింది కాంతమ్మ.
"వాడూ పసివెధవేగా! ఎత్తుకోలేక పోయాడేమో! పైగా జ్వరం వుందంటున్నావ్! తల్లిలేని పసివెధవ. వాణ్ని కొట్టకు" అన్నాడు ధర్మయ్య.
కాంతమ్మకు వళ్ళు మండిపోయింది.
"ఏంటి బాబాయ్! నువ్వుకూడా అంత అడ్డగోలుగా మాట్టాడ్తావ్? అందరూ నన్నాడిపోసుకొనేవాళ్ళే. అవున్లే! సవతి తల్లినిగా? ఎంతగా చూసినా.... ....అసలు ఇన్నిటికీ కట్టుకొన్నాడు మంచివాడైతే.... ...."
"ఎహే! వాగబాక!" కోటయ్య. కసురుకుంటూ ముందుకొచ్చి ధర్మయ్యను చూసి గతుక్కుమన్నాడు.
"ధర్మయ్యమామా! నువ్వా! ఎక్కడికీ ఇంతెండలో బయలుదేరావు?" మాటమారుస్తూ అన్నాడు కోటయ్య.
"పోస్టాఫీసు దాకా" పసివాడికేసి జాలిగా ఒక్కక్షణం చూసి ముందుకు కదిలాడు ధర్మయ్య.
కోటయ్య ఇంట్లో వుండగానే వాణ్ణి కాంతమ్మ కొడుతుంది. ఈ కోటయ్యే మొదటి పెళ్ళాన్ని కాల్చుకుతిన్నాడు. నిజంగా ఆ లక్ష్మి మహాలక్ష్మే. కలకలలాడుతూ వుండేది. ఎప్పుడూ నవ్వుతూ ప్రసన్నంగా వుండేది. భర్త చీటికీ మాటికీ కొట్టేవాడు. కిక్కురుమనకుండా భర్త దౌర్జన్యాన్ని భరించేది. ఇప్పుడు ఈ రెండో పెళ్ళాం కాంతమ్మ అంటే కోటయ్యకు చచ్చేంత భయం. పసివెధవని కాల్చుతింటూంది. వాణ్ణి స్కూలుకు పంపదు. గొడ్లను కాయిస్తున్నారు. కాంతమ్మ తన కొడుకుని మాత్రం స్కూల్లో వేసింది.
ఆలోచిస్తూ నడుస్తున్న ధర్మయ్య వెనకనుంచి కారువచ్చి, కొంత దూరంపోయి ఆగింది.
ధర్మయ్య ఎండకు చెయ్యి అడ్డం పెట్టుకొని, కారుదిగి తనకేసి నడుస్తున్న వ్యక్తిని పరకాయించి చూశాడు.
"నమస్కారమండీ!" దగ్గరకు వచ్చిన శేఖరం నమస్కరించాడు.
"నువ్వా బాబూ! బాగున్నావా? ఎక్కువగా పట్నంలోనే వుంటున్నట్లున్నావు ఈ మధ్య?" ఆప్యాయంగా పలుకరించాడు.
"అవునండీ! మొన్ననే వచ్చాను. మీ దగ్గరకు రావాలనుకున్నాను. కానీ తీరిక లేకపోయింది." తప్పుచేసినట్టు అన్నాడు శేఖరం.
"దానికేలేం బాబూ!" అన్నాడు ధర్మయ్య.
"ఎక్కడికి ఇంత ఎండలో వెళ్తున్నారు?"
"పోస్టాఫీసుదాకా! అమ్మాయికి డబ్బు పంపుదామని?"
"రండి! మిమ్మల్ని అక్కడ దింపుతాను.
"ఎందుకు బాబూ! ఎంత దూరం వుందని, ఈ కాస్త దూరానికి కారెందుకు?"
"మరీ ఎండగా వుంది. కాళ్ళకు చెప్పులైనా లేవు."
"నా కలవాటేలే! పల్లెటూరివాళ్ళకి ఎండేమిటి వానేమిటి? ఆఁ ఎక్కడికి ప్రయాణం?" అడిగాడు ధర్మయ్య.
"పట్నం వెళ్తున్నానండీ! మామయ్య అర్జెంటుగా రమ్మని కబురు చేశాడు. మిల్లు వ్యవహారాలేవో వున్నాయ్."
"అట్లాగా! మళ్ళెప్పుడొస్తున్నావ్ బాబూ?"
"నాకైతే వారం రోజుల్లోనే రావాలనివుంది. మరి ఆ వ్యవహారాలు పరిష్కారం కావడానికి ఎంతకాలం పడుతుందో! మీరు ఎండలో నిల్చున్నారు" అన్నాడు శేఖరం. తను ఎండలో నిల్చోలేక నీడకోసం వెదుక్కుంటూ.
ఆ సంగతి గ్రహించిన ధర్మయ్య ముసిముసిగా నవ్వాడు. రోడ్డు పక్కగావున్న వేపచెట్టు దగ్గరకు నడిచాడు. శేఖరం కూడా ధర్మయ్యను అనుసరించాడు. ఇద్దరూ చెట్టుకింద నిలబడ్డాడు.
"చూడు బాబూ! మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తావో? నువ్వెళ్ళేలోగా ఆ హరిజనవాడలో బావి తవ్వించే విషయం కాస్త చూసివెళ్తే బాగుంటుంది. ఈ సంవత్సరం ఎండలు మోపుగా వుండేట్టున్నాయ్. ఇప్పుడే ఎండలు మాడ్చేస్తున్నాయ్. ఇప్పుడే ఎండలు మాడ్చేస్తున్నాయ్. తాగే నీళ్ళుకూడా లేకపోతే గూడెం ప్రజలు అల్లాడిపోతారు. ప్రతి సంవత్సరం, వేసవికాలంలో నీళ్ళకోసం వాళ్ళు పడే అవస్థ చూస్తూనే వున్నాను."
"అదేమిటండీ? నీళ్ళకోసం బాధపడటం ఏమిటి? ఆ రచ్చబండ దగ్గరవున్న బావీ, తూర్పువీధి బావీ వేసవికాలంలో కూడా ఎండిపోవటగా? నీళ్లు బాగా ఉంటాయని విన్నాను" అన్నాడు శేఖరం.
ధర్మయ్య నిట్టూర్చాడు.
"అయితే వాళ్ళకేం లాభం? వాళ్ళను ఆ బావులకు రానిస్తారా?"
శేఖరం ఆశ్చర్యంగా ధర్మయ్య ముఖంలోకి చూశాడు.
"ఏం బాబూ! ఆశ్చర్యంగా వుందా? నీకింకా పల్లెటూళ్ళ గురించి పూర్తిగా తెలిసినట్టులేదు" అన్నాడు ధర్మయ్య.
"అంటే....ఇంకా....స్వాతంత్ర్యం వచ్చి పాతికేళ్ళు దాటినా హరిజనుల్ని అంటరానివాళ్ళుగానే చూస్తున్నారా? వాళ్ళు ఊళ్ళోవున్న బావుల్లో నీళ్లుకూడా వాడుకోని దుస్థితిలోనే వున్నారా?"
ధర్మయ్య విషాదంగా నవ్వాడు.
"అలా వాళ్ళను రానివ్వకపోవడం కాన్ స్టిట్యూషన్ ప్రకారం నేరం అవుతుంది."
"మనుషులు మారాలి బాబూ! మనుషులు మారనంతకాలం ఆ రూల్సూ....కాన్ స్టిట్యూషన్లూ....అన్నీ పుస్తకాల వరకే పరిమితం!"
"అది కాదండీ!....వాళ్ళు నీళ్ళకు వస్తే అడ్డగించే అధికారం ఎవరికీ లేదు."
"అది నిజమే! కాని వాళ్లు రారు! వీళ్ళు రానివ్వరు."
"వాళ్ళు ధైర్యం చెయ్యాలి. దౌర్జన్యాన్ని ఎదుర్కోవాలి. తిరగబడాలి. లేకపోతే మరో పాతికేళ్లయినా వాళ్ళు అక్కడే వుండిపోతారు." ఉద్రేకంగా అన్నాడు శేఖరం.
"తిరగబడితే బతకనిస్తారా బాబూ! బలహీనుడు, బలవంతునిమీద తిరగబడి బతగ్గలడా? అరికాలు కింద చీమను రాసినట్టు రాసేస్తారు" ఆవేదనగా అన్నాడు ధర్మయ్య.
"బలవంతులకంటే, బలహీనుల సంఖ్య ఎంత ఎక్కువో తెలిసిన విషయమే గదండీ."
"అయితే ఏం లాభం బాబూ?'
"ఏం? ఎందుకు లేదు? బలవంతమైన సర్పం చలిచీమలకు చిక్కిచావటం లేదూ? గడ్డిపోచలతో పేనిన తాడుకు మదపుటేనుగు లొంగిపోవడం లేదూ? మనం ఎవర్ని బలహీను లంటున్నామో వాళ్ళు నిజంగా బలహీనులు కారు. వాళ్లకు వాళ్ల బలం ఇంకా తెలియడంలేదు. అది తెలిసినరోజు బలవంతులుగా ఈ రోజు కన్పించే వాళ్ళంతా ఎంత బలహీనులో తెలుస్తుంది" ఉద్రేకంతో ఊగిపోతున్నాడు శేఖరం.