ఆలోచిస్తుంటే సునందకు నిజంగానే ఏడుపు వచ్చింది.
ఎందుకు వీళ్ళంతా ఒక్కసారి కూడా ఆత్మవిమర్శ చేసుకోరు? వాళ్ళు చేసే ప్రతి పనీ మంచిదనే నమ్మకం నిజంగా వాళ్ళకు కలుగుతుందా?
సునంద తలతిప్పి చూసింది.
లలిత గురకపెట్టి నిద్రపోతూంది.
సునంద ఆశ్చర్యం వేసింది.
ఇంత జరిగాకకూడా ఎంత హాయిగా నిద్ర పోగలుగుతుందో?
కారణం....ఆలోచించరు. ఆలోచనంటే భయం. ఆత్మవిమర్శ అంటే మరీభయం! అందుకే వాళ్ళేం చేస్తున్నారో, ఎటువెళుతున్నారో వాళ్ళకే తెలియదు.
సునంద ఆలోచనల నుంచి నిద్రలోకి జారిపోయింది.
7
కాలేజీ బెల్ కొట్టారు. విద్యార్దులూ, విద్యార్ధినులూ బిలబిలలాడుతూ బయటికి వచ్చారు.
గ్రూపులు గ్రూపులుగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు కొందరు విద్యార్ధులు, విద్యార్ధినులమీద జోక్స్ విసురుతున్నారు. ఆ జోక్స్ కు కొందరు మెలికలు తిరిగిపోతూ నడుస్తున్నారు. కొందరు ధైర్యంగా, తమను కాదన్నట్టు హుందాగా వెళ్ళిపోతున్నారు. కొందరు వెకిలిగా నవ్వుతున్నారు.
సునంద రోజులాగే వంటరిగా బస్ స్టాండ్ కేసి నడక సాగించింది. సాధారణంగా సునందను ఎవరూ ఏడిపించరు. కొత్తలో కొందరు చౌకబారు జోక్స్ వేసినా ఎలాంటి రియాక్షనూ కన్పించకపోవడంవల్ల మానేశారు.
ఆరోజు సునందకు కొంచెం బెదురుగానేవుంది. రాత్రి జరిగిన సంఘటన వల్ల కొందరు విద్యార్ధులకు తన మీద చాలా కోపంగా వుందని అర్ధం చేసుకుంది. లలిత సునందతో మాట్లాడటంలేదు. రాత్రి సంఘటనలో వున్న విద్యార్థినిలు ఎవరూకూడా సునందవైపు కూడా చూడలేదు.
సునందకు పెద్దగా స్నేహితురాండ్రు లేరు. భారతితో కొంత చనువుగా వుంటుంది. సుమతి కూడా సునంద అంటే చాలా అభిమానంగా వుంటుంది. కాని వాళ్ళిద్దరూ ఆ ఊరి వాళ్ళే కావడం వల్ల హాస్టల్లో వుండరు. వారి ప్రవర్తన సునందకు ఎబ్బెట్టుగా వుండదు. సునందలాగే అతిసాధారణంగా కన్పిస్తారు. వెకిలితనం ఏ కోశానా కన్పించదు. అందుకే వాళ్ళంటే సునందకు ఇష్టం.
హాస్టల్లో చెప్పుకోతగ్గ స్నేహితురాండ్రు ఎవరూ లేరు. ఎప్పుడూ పుస్తకం పట్టుకొని కూర్చునే సునంద స్నేహంకోసం ప్రాకులాడే వాళ్ళెవరూ లేరు. సునందకు కల్పించుకొని మాట్లాడటం రాదు. కొత్తవాళ్ళతో ఎలా పరిచయం చేసుకోవాలో అసలే తెలియదు. పుస్తకాలే ఆమె స్నేహితులు.
కాలేజీనుంచి హాస్టలు మూడు మైళ్ల దూరంలో వుంది.
సునంద బస్ స్టాండ్ కు వచ్చేటప్పటికి కొందరు కుర్రాళ్లు నిల్చొని వున్నారు. వాళ్ళ పక్కనే పక్కగదిలో వుండే ఆడపిల్లలు కూడా వున్నారు. వాళ్లు రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించిన కుర్రాళ్ళనీ, వాళ్లు తనను ఏడ్పించటానికే ఆరోజు ఆ బస్ స్టాండ్ లో తనకంటే ముందొచ్చి నిలబడ్డారనీ, చూడగానే సునందకు అర్ధం అయింది.
బెదురు బెదురుగానే వుంది. కాని పైకి వీలైనంత గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకొని వాళ్ళకు దూరంగా వెళ్ళి నిలబడింది సునంద.
ఒక కుర్రాడు సకిలించాడు.
మరొకడు వెకిలిగా ఇకిలించాడు.
సుశీల పకపక నవ్వింది.
కమల కిసుక్కున నవ్వింది.
అవేవీ వినిపించుకోనట్టూ, చూడనట్టూ నిల్చుంది సునంద, మరోవైపు చూస్తూ.
"సావిత్రిని చూశావురా?"
"ఆఁ ! సత్యవంతుణ్ణి ఇంకా చూళ్ళేదు. ఏ అడవిలో కట్టెలు కొడుతున్నాడో పాపం."
"నీ మొహం! సావిత్రి కాదురా! సీత!"
"శివధనుస్సు విరిచేందుకు ఇంకా రాముడు రాలేదేంరా?'
"ఆధునిక సీతకోసం ముందు రావణాసురుడు రావాలిరా! పోనియ్ నువ్వు. కాసేపు రావణాసురుడివి కాకూడదూ? అప్పుడైనా రాముడు పరిగెత్తు కొస్తాడేమో?"
"బాబోయ్! ఒంటి ఊపిరివాణ్ణి! నేను భుజంమీద వేసుకుని మొయ్యగలనా?"
ఆడ గొంతులూ, మగ గొంతులూ గొల్లున నవ్వాయి.
సునంద సహనం కోల్పోయింది. కోపంగా తలతిప్పి చురచురా చూసింది.
"బాబోయ్! జాగ్రత్త రోయ్! భస్మం అయిపోయేలా వున్నాం!"
"మన భామలు మళ్ళీ మనల్ని బతికించికొంటారు లేరా!"
"లాభం లేదోయ్ మన భామలు పతివ్రతలు కాదుగా!"
"అయితే మనలో ఒకరు త్యాగం చెయ్యక తప్పదురా?"
"ఏం చెయ్యాలి?"
"పతివ్రతను చేసుకోవాలి. శేఖర్! నువ్వేరా ఆ ధైర్యం చెయ్యగల వాడివి."
"బాబోయ్ పతివ్రతను పెళ్లి చేసుకోవడమే? నా కొద్దు."
"బాబ్బాబు! మా కోసం నువ్వీ మాత్రం త్యాగం చెయ్యక తప్పదురా శేఖర్! ఇప్పుడు మనకు ఒక పతివ్రత చాలా అర్జంటుగా కావాలిరా? పతివ్రతలు తమ మహత్యంతో వండర్స్ చేసేస్తారురా? మన బాధలు కొన్నయినా తగ్గిపోతాయి."
"అసలు ఇన్నింటికీ పతివ్రతో కాదో, పతిలేకుండా ఎలా తెలుసుకోవడం?"
అందరూ మళ్ళీ గొల్లున నవ్వారు. రకరకాల వెకిలి మాటలు అంటూ మధ్య మధ్య సునందకేసి చూస్తున్నారు.
మగపిల్లల వెకిలిమాటల్ని ఆడపిల్లలు ఆనందంగా వింటూ కులాసాగా నవ్వుతున్నారు. సునందమీద కసి తీర్చుకుంటూ ఆనందిస్తున్నారు.
సునందకు పిస్టల్ తీసుకొని ఒక్కొక్కళ్ళనీ కాల్చివెయ్యాలని వుంది. తనకు అక్కడినుంచి, ఆ వెకిలి వాతావరణం నుంచి, దూరంగా పారిపోవాలని వుంది. అవమానంతో మనస్సు దహించుకుపోతూ వుంటే దుఃఖం పొర్లుకొస్తూ వుంది.
తల్లిదండ్రులు అష్టకష్టాలు పడి డబ్బు పంపిస్తూ వుంటే వీళ్ళు నేర్చుకుంటున్న విద్యా సంస్కారాలు ఇవా? డబ్బున్న బంగారు పిచ్చికల్ని చూసి మురిసి భ్రమసి, ఆ ఈకల్ని తగిలించుకోవాలని తాపత్రయం పడుతున్నారు. సామాన్య కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయిలూ, అబ్బాయిలు కూడా. ఆ అనుకరణలో ఎంతమంది ఆడపిల్లలు పెడమార్గాల పట్టిపోవడంలేదు? ఆ మధ్య ఏదో హోటల్ లో బ్రోతల్ యాక్ట్ కింద అరెస్టయిన వాళ్ళలో విద్యార్థినిలు కూడా వున్నారని ఏదో పేపర్లో చదివింది.
నల్లగా లావుగా వున్న ఒక కుర్రాడు సునంద ముందునుంచి వెళుతూ ఆమె కాళ్ళ దగ్గర్లో కర్చీపు పడేశాడు.
అది చూసి సునంద వెనక్కు జరిగి నిల్చుంది.
ముందుకుపోయిన కుర్రాడు వెనక్కు తిరిగివచ్చి, కిందపడివున్న కర్చీపు అందుకున్నాడు.
కొంచెం దూరంలోవున్న అమ్మాయిలూ, అబ్బాయిలూ కుతూహలంగా చూస్తున్నారు.
"మీదేనా?" కర్చీపు?" సునంద ముఖంలోకి పెట్టి ప్రశ్నించాడు ఆ కుర్రాడు.
"ఏయ్ మిస్టర్? ఏమిటిది? సిగ్గులేదూ ఇంతవెకిలిగా ప్రవర్తించడానికి?" కసురుకుంది సునంద.
సునంద మనస్సంతా జుగుప్సతో నిండిపోయింది. ఆ కుర్రాణ్ని ఆ చెంపా ఈ చెంపా వాయించాలని వుంది.
"ఎందుకు దేవీ అంత కోపం? ఇది మీదేనా అన్నాను. చెయ్యరాని అపరాధం ఏం చేశాను?" డ్రామాలో డైలాగ్ చెప్పినట్టు చెప్పాడు ఆ కుర్రాడు.
మళ్ళీ అందరూ గొల్లున నవ్వారు.
"ఛీ! ఛీ!" అనుకుంటూ సునంద దూరంగా జరిగి ఒక ముసలాయన పక్కన నిలబడింది.
"ఇక వచ్చేయ్ రా! పాపం బామ్మగారు తాతగారి పక్కగా వెళ్ళి నిలబడింది" ఒకడు మొదటి కుర్రాణ్ని కేకపెట్టాడు.
"పడుచువాళ్ళకంటే ముసలాళ్ళే ఎక్కువ డేంజర్ రా బ్రదర్!" అన్నాడు మొదటి కుర్రాడు సునంద ముఖంలోకి చూస్తూ.
సునంద ముఖం తిప్పుకొని నిల్చుంది.
ఆ వృద్ధుడు సునందనూ, కుర్రాళ్ళనూ మార్చి మార్చి చూశాడు. కుర్రాళ్ళను మందలించబోయి మళ్ళీ వాళ్ళను కదిలిస్తే ముళ్ళకంచెను కదిలించినట్టే అనుకొని మానేశాడు.
"ఛ! అవేం మాటలురా పతివ్రతను పట్టుకొని?"
"ఒరేయ్! పతివ్రత గురించి తర్వాత ఆలోచిద్దాం! పదండి బస్ వచ్చేసింది. మనభామలు అప్పుడే ఎక్కేస్తున్నారు."
కుర్రాళ్ళంతా ఆడపిల్లల వెనకే బస్ దగ్గరకు వెళ్ళారు.
"ఒరేయ్! మన పతివ్రత బస్ ఎక్కడంలేదురా!"
"ఆవిడకు బస్సెందుకురా! కళ్ళు మూసుకుంటే గదిలో వుండగలదు. పతివ్రతలు కావాలనుకొన్నది క్షణంలో జరిగిపోతుంది" బస్ దగ్గరకు వచ్చి నిల్చున్న సునందను చూస్తూ మళ్ళీ అన్నాడు ఒకడు.
సునంద ముఖం చిట్లించుకుంది.
"కోపం వస్తుందిరోయ్! జాగ్రత్త. అనసూయలా మనల్నందర్నీ పసివాళ్ళను చేసెయ్యగలదు."
"ఆఆ అద్భుతం! అంతకంటే కావాల్సిందేముంది? ఎంచక్కా వళ్ళో వేసుకొని....హాయి....అంటూ....వాక్యం పూర్తిచెయ్యకుండా ఆడపిల్లల వెనకే బస్ ఎక్కాడు ఆ కుర్రాడు.
ఆడపిల్లలంతా వెనకసీట్లో కూర్చున్నారు. విద్యార్ధులు వాళ్ళను రాచుకుంటూ వెనకే నిల్చున్నారు. కొందరు ఫుట్ బోత్ మీద నిల్చున్నారు.
కండక్టరు మొత్తుకున్నా ఒక్కడూ ముందుకు కదలడంలేదు.