అందరికీ ప్రాణాలు లేచివచ్చాయి.
అందమైన పాదాలు నన్ను పలకరించడం అదే తొలిసారి - చివరిసారి కూడా.
'మీరు చాలా రోజులు రాలేదు'
నేను గంతువేశాను. నా చెవులను నమ్మలేకపోయాను. ఖుర్షీద్ నన్నే చూస్తున్నాడు. పెదవిని కొరుకుతున్నాడు.
ఆనందంతో ఉక్కిరి బిక్కిరయి ఆనందోత్సవాలు జరపాలనుకున్నాను. ఖుర్షీద్ ను చూచి అన్నీ మరచాను.
'ఆరోగ్యం బాగాలేకుండింది. మీరు బావున్నారా?'
'బావుండడం! బావుండి చేసేదేముంది?' నిరాశగా నిట్టూర్చింది.
నాకు ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఏమేమో అందామనుకున్నాను. అటుచూస్తే తెర కనిపించింది. పాదాలు కదిలిపోయాయి. పిన్ని తలుపుచాటునుంచి అడుగుతూంది.
"మీకు షాహీజాదాగాని కనిపించాడా? నాలుగు రోజులయింది ఇంటికి రాక"
'అదేమిటి ఎక్కడికి వెళ్లినట్లు?' నేను ఆశ్చర్యం వ్యక్తపరచాను.
"దోస్తుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇంటిలో ఇబ్బంది అయితే వెళ్ళిపోతాడు. ఇహ మా కోడలు చస్తానని ఉరుకుతుంది." మెల్లగా గుసగుస చెపుతున్నట్లు 'ఇంటివాడు వెధవ బావికూడా తవ్వించాడు' అన్నది.
నాకు కంపరం పుట్టింది. పారిపోవడానికి ఈ ఇంటికి చాలా దోవలున్నాయనిపించింది.
సాయంకాలం ఆ పాదాలు దర్వాజా పక్కనుంచి కదులుతుంటే ఆరోగ్యాన్ని గురించి అడిగాను.
'నేను జబ్బుగా ఉన్నానని ఎవరు చెప్పారు?'
నేను దిమ్మర పోయాను. 'ఏదో అలాగే అనుకున్నాను.'
"అయితే అనుకోవటమే మీ పనా?"
ఆ రోజు భోజనం బావుంది. మినపప్పు' చేపలు వగైరా.
'ఇవ్వాళేమైన పండగా?' ఖుర్షీద్ ను అడిగాను.
'ఏంలేదు. మీరు వదిన ఆరోగ్యాన్ని గురించి అడిగారు. ఆమె మీకోసం వంట చేసింది' అని గబగబా బయటికి వెళ్ళిపోయాడు.
ఖుర్షీద్ తో నా స్నేహం నామమాత్రం అయిపోయింది. అతడు అంతగా మాట్లాడేవాడు కాడు. నేనుంటే లోనికి రావడం తక్కువ.
ఇవ్వాళ బాబాయిగారూ చాపమీంచి మాయం, పిన్నికూడా గడపమీద కూర్చొని నా ముద్దలు లెక్కించడంలేదు. గాజుల గలగలలు మాత్రం వినిపిస్తున్నాయి.
కొద్దిసేపట్లో ఖుర్షీద్ షాహిజాద్ ను లోనికి లాక్కొచ్చాడు, 'చెప్పు ఎక్కడికెళ్ళావు?' అడుగుతున్నాడు.
అతడు జవాబు చెప్పలేదు, వంటకాల వాసన చూసి ముక్కుపుటాలు ఎగరేశాడు, ప్లేట్లను చూస్తూ ఉండిపోయాడు.
'మళ్ళీ దొరికాడా ఆ దొంగవెధవ?'
'ఊరుకోండి...ఊరుకోండి' వదిన అక్కడితో ఆపించింది.
ఇంత మంచి వంటచేసినందుకు వదినకు కృతజ్ఞతలు చెప్పండి' అని పిన్నికి ట్రే వాపసు ఇచ్చేశాను. ఇంతలో తెర లేచింది. పెరటిలో మెరుపు మెరిసింది, ఆమె మురికి చీర కట్టుకుంది, నవ్వులు వలకపోస్తుండగా షాహీజాద్ ఫిలిం హీరోలా వచ్చి ఆమె నడుం మీద చేయివేసి 'ఇవ్వాళ వెలిగిపోతున్నావ్' అన్నాడు.
ఒక దివ్వె వెలుగుతున్నా బాబాయి ఇంట్లో చీకటి ఉంది, ఈ దీపాన్ని చేతపట్టుకొని వీరు దోవ ఏల వెదకరో?
భోజనం అంత చెడ్డగా ఏంలేదు, మరో నాలుగు నెలలు ఉందామనుకున్నాను.
మరుసటిరోజు గదిలో ఖుర్షీద్ వంటరిగా కనిపించాడు. ఏమీ పనిలేనట్లున్నాడు తీరిగ్గా ఉన్నాడు. ఇల్లు సాంతం నిశ్శబ్దంగా ఉంది. నా ప్రశ్నలన్నిటికీ అతని సమాధానం ఒక్కటే.
'పెద్దన్నయ్య వచ్చారు'
'వచ్చారా?' నామీద ఒక హంటర్ దెబ్బ పడ్డట్లయింది.
"తరువాత?"
"ఏమిటది?"
వాస్తవంగా ఏమిటిది? ఆలోచించాను అసలు ఏమిటి?
పెద్దన్న ఏమీ తేలేదు. అన్నీ అబద్ధాలే, ఉమ్మితో గోడమీది గీతలను చెడుపుతూ న పని సులభం చేశాడు. పెన్సిలుతో కొమ్ములున్న మాంత్రికుని బొమ్మ గీస్తున్నాడు.
నేను వదినను గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడామె ఏంచేస్తుందని.
'వదినకు చెప్పు....భోజనం....భోజనం....' ఎలా చెప్పాలో అర్థం కాలేదు.
'వదిన లేదు. చిన్నన్నతో రాత్రి లేచిపోయింది. పెద్దన్న పోలీసుకి రిపోర్టు ఇవ్వడానికి వెళ్ళాడు'
అతడు గోడమీద కార్టూనులు వేస్తున్నాడు.
నేను నిశ్చేష్టుణ్ణయి కూలబడ్డాను. కదిల్తే ఇల్లంతా కూల్తుందన్నట్లు కూర్చున్నాను. కనురెప్పలు చీల్చుకొని చూచినా ఏమీ కనిపించదు. పట్టపగలు అర్దరాత్రి ఎలా వచ్చింది?
మా ఇద్దరిమధ్య శతాబ్దాలు గడిచాయి. ఈలోగా ఎన్నో సిగరెట్లు కాల్చిపారేశాను. ఖుర్షీద్ బాల్యం యౌవనం దాటి డెబ్బయ్యేళ్ళ ముదివగ్గయి అంటున్నాడు.
'ఇహ మీరు మా ఇంటికి భోజనానికి రారు. వదిన వెళ్లిపోయిందిగా!'
పెన్సిల్ పారేసి తండ్రి దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. మోకాళ్ళలో తల ఇరికించుకుని అతని అస్తిత్వాన్ని దాచుకో చూస్తున్నాడు.