Previous Page Next Page 
ఆక్రోశం పేజి 11


    "అంటే... నా ఎంపైర్, కొన్ని సంవత్సరాల్లో కూలిపోతుందనా మీ వుద్దేశ్యం?" మహంత ముఖం అకస్మాత్తుగా మారిపోయింది.

 

    మనిషి పతనానికి నాంది నెగిటివ్ యాటిట్యూడ్. అది ఎప్పుడు ఎలా మనిషిలో ప్రవేశిస్తుందో ఎవరికీ తెలీదు.

 

    ఏపిల్ పండులో కనబడకుండా దూరిన సూక్ష్మ క్రిమిలాంటిది నెగిటివ్ యాటిట్యూడ్. దానికి అసూయ విత్తనం.

 

    "కూలిపోతుందని నేను చెప్పలేను ఎందుకంటే నువ్వు చాలా తెలివయిన వాడివి. నీ కీర్తి రూపంలో మార్పు రావచ్చు" నిర్భయంగా అన్నాడు దేశ్ ముఖ్.

 

    మహంత ముఖం కందగడ్డలా మారిపోయింది.

 

    "మీ కళ్ళెదటే నేను పెరగడం... అతి తక్కువ టైమ్ లో ప్రపంచములో గొప్పవాళ్ళలో ఒకడ్ని కావడం మీకు జలసీ. ఐ నో దట్... మీరు వర్క్ ప్లానింగ్ ని నమ్ముతారు... దట్ వజ్ ట్రాష్... వర్క్, ప్లానింగ్ వున్న వ్యక్తి ఇంటలెక్చువల్ కావచ్చు... బిజినెస్ మేన్ కాలేడు. ప్రతి సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ వెనుక కాలం వుంది, లక్ వుంది... యూ మస్ట్ బిలీవ్ ఇట్" ఉద్వేగంగా అన్నాడు మహంత.

 

    "నో మైడియర్ మహంతా! వర్క్ ప్లానింగ్, ఎటర్నల్ మానిఫెస్ట్ ఫర్ వరల్డ్స్ సక్సస్ ఫుల్ పీపుల్... అదృష్టాన్ని నమ్ముకుని పరుగెత్తేవాడ్ని కాలం నమ్మదు. కాలం కత్తిలాంటిది... నీ వర్క్, నీ ప్లానింగ్ సక్రమంగా లేనినాడు ఆ కత్తి నీ మెడమీదే పడుతుంది" నిండిన రెండో పెగ్ ని సిప్ చేస్తున్నాడు దేశ్ ముఖ్.

 

    "అంటే..." గ్లాసులోని డ్రింక్ ని గబగబా తాగేస్తూ అన్నాడు మహంత.

 

    "నువ్వు క్రూయాల్ గా రియాక్ట్ కాకపోతే ఒక విషయం చెప్తాను. వింటావా?" సాధ్యమైనంత కూల్ గా అడిగాడు దేశ్ ముఖ్.

 

    "చెప్పండి."

 

    "నువ్వు కాలాన్ని, అదృష్టాన్నీ నమ్ముతున్నావు. నువ్వో అద్భుతమైన ఎంపైర్ ని బిల్డప్ చేసావు... కానీ ఆ ఎంపైర్ ని రేపు నీ కొడుకుకి యివ్వాలని నీ ప్రయత్నం... నీ అంత అదృష్టవంతుడు నీ కొడుకు కాకపోతే... అప్పుడు నీ సామ్రాజ్యం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా?"

 

    దేశ్ ముఖ్ ప్రశ్నకు బిత్తరపోయాడతను.

 

    వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.

 

    "సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వర్క్ లోంచి, ప్లానింగ్ లోంచి వస్తుంది తప్ప, లక్ లోంచి రాదు. ప్లానింగ్ ద్వారా, వర్క్ ద్వారా పదిరూపాయలు సంపాదించిన వ్యక్తి ఒక బిలియనీర్ కన్నా గొప్పవాడు. ఇంతెందుకు... నువ్వు నమ్మిన అదృష్టాన్ని నీ కొడుక్కి యివ్వగలవా చెప్పు? లక్ ఓ చెక్ కాదు గదా?" నవ్వాడు దేశ్ ముఖ్.

 

    "నా అదృష్టానికి నా తెలివితేటలు తోడయ్యాయి. నేను బిలియనీర్ ని అయ్యాను. మీకు తెలివితేటలున్నాయి అదృష్టం లేదు. అంటే మీకు కాలం కల్సిరాలేదు. నిజం చెప్పండి... మీరు బిజినెస్ జీనియస్. ఇవాళ నన్ను చూసి అసూయపడే పరిస్థితి మీకెందుకొచ్చింది? లేక ఆఫ్ లక్... మీకు కాలం, అదృష్టం కల్సిరాలేదు కాబట్టి."

 

    దేశ్ ముఖ్ అతని అజ్ఞానానికి మనసులోనే నవ్వుకున్నాడు.

 

    "నేను అదృష్టవంతుడ్ని... అందుకే ఎంతమంది శత్రువులు నన్ను ఎన్ని విధాలుగా బిజినెస్ లో అణగద్రొక్కాలనుకున్నా రాకెట్ లా నేను పైకి దూసుకుపోతున్నాను. రేపు నా అదృష్టాన్ని నా కొడుక్కి యిస్తాను. చూస్తుండండి... పవర్, మనీ ఈ మహంత స్వంతం. ఈ మహంత విశ్వవిజేత అయ్యే క్షణం అతి త్వరలో వుంది" విలక్షణంగా నవ్వాడతను.

 

    దేశ్ ముఖ్ మౌనంగా వుండిపోయాడు.

 

    "చూడండి దేశ్ ముఖ్ సాబ్! స్మాల్ బెట్! వర్క్, ప్లానింగ్స్ ని నమ్మే మీరు అదృష్టవంతుడ్నయిన నన్ను ఓడించగలరా... చెప్పండి... నా ఎంపైర్ ని కూలదోయగలరా? నన్ను నడివీధిలో అనామకుడిగా నిలబెట్టగలరా? టెల్... టెల్... టెల్ మి సర్... గట్స్ వుంటే బెట్ కట్టండి కమాన్" చాలా పౌరుషంగా అన్నాడతను.  

 

    గ్లాస్ టేబుల్ మీద పెట్టి కనురెప్పలెత్తి చూశాడు దేశ్ ముఖ.

 

    ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.

 

    ఒకే ఒక క్షణం ఆలోచనలోపడ్డాడు దేశ్ ముఖ. సిగార్ తీసి వెలిగించాడు. పొగను వూదుతూ.

 

    "నిన్ను నేను పడగొట్టలేను" నెమ్మదిగా అన్నాడు దేశ్ ముఖ్.

 

    "చూశారా... చూశారా... మీరే ఒప్పుకున్నారు" కుషీగా నవ్వుతూ అన్నాడతను.

 

    "పడగొట్టాల్సిన అవసరం లేదు" మళ్ళీ నెమ్మదిగా అన్నాడు దేశ్ ముఖ్.

 

    చటుక్కున అతని నవ్వు ఆగిపోయింది.

 

    "మరి..." మహంత భృకుటి ముడతపడింది.

 

    "పెద్ద బిల్డింగును పడగొట్టడానికి పెద్ద బాంబు అఖ్ఖర్లేదు... చిన్న గునపం చాలు" వ్యంగ్యంగా అన్నాడు దేశ్ ముఖ్.

 

    "అంటే?"

 

    "ఇంకా స్పష్టంగా చెప్పమంటావా... నీ ఎంపైర్ ని పడగొట్టడానికి నా తెలివితేటలే వుపయోగించాల్సిన అవసరం లేదు... రోడ్డుమీద పోయే ఒక అమ్మాయిని పిలిచి ట్రైనింగ్ యిస్తే చాలు... దట్సాల్" దేశ్ ముఖ్ నోటివెంట అనుకోకుండా వచ్చిందా మాట.

 

    ఆ మాటతో ప్రపంచాన్ని శాసిస్తున్నానుకున్న మహంత ముఖం వెలవెల బోయింది.

 

    కందగడ్డలా మారిపోయింది.

 

    అతని నరాల్లో రక్తం జరజర ప్రాకింది. హృదయం కోపంతో భగ్గున మండిపోయింది.

 

    ఇంకెవరైనా ఆ మాట అంటే-

 

    ఎలక్ట్రిక్ చెయిర్ కి ఆహుతయ్యేవాడు!

 

    కానీ ఎదురుగా వున్నవాడు దేశ్ ముఖ్!

 

    "యూ ఆర్ జోకింగ్... ఆర్యూ ఇన్ సల్టింగ్ మీ..." తనని తను కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నిస్తూ వ్యంగ్యంగా అన్నాడతను.

 

    "నాట్ జోకింగ్... డెడ్ లీ సీరియస్" ఇంకేదో చెప్పబోయాడు దేశ్ ముఖ్.

 

    చెప్పనివ్వలేదు అతను.

 

    అప్పటికే అతని నరాలు కణకణమంటున్నాయి. కోపంతో ఎర్రటి ముఖం మరింత ఎర్రగా అయిపోయింది.

 

    అతని పిడికిట్లోని జిన్ గ్లాసు ఎప్పుడు ముక్కలైపోయిందో... చప్పుడు చేయకుండా ముక్కలైంది.

 Previous Page Next Page