నిజమేనన్నట్లు తల పంకించింది గోమతి.
సుండా జాతివారు కీర్తి, గోమతీ మంచి చెడ్డలు చూడటానికి కనిపెట్టి వుండటానికి ఇద్దరు మనుషులని నియమించారు. వాళ్ళపేర్లు బొబ్బూ బప్పూలు.
బొబ్బూ, బప్పూలు కీర్తి గోమతి తినటానికి అవేవో ఎండిపోయిన పళ్ళు, ఎండిన ఆకుల పొడి చల్లిన పచ్చి మాంసం, ఆకుదొన్నెలలో జావలాంటిది ఇచ్చారు. వాళ్ళూ అవే తెచ్చుకుని తినటానికి వీళ్ళ దగ్గరే కూర్చున్నారు.
"దాహం అవుతున్నది ఎలా? అడిగితే వీళ్ళకి అర్ధం కాదు కదా కమల్" అంది గోమతి.
"ముందు ఆ జావతాగు పల్చగా వుందిగా." అంది కీర్తి జావవున్న దొన్నెని నోటి దగ్గర వుంచుకుని.
గోమతి జావతాగింది. "ఉప్పగా పుల్లగా వుంది." అంది.
కీర్తి తాగింది. నిజమే జావా వుప్పుప్పగా పుల్లపుల్లగా వుంది.
వీళ్ళిద్దరినీ అదేపనిగా చూస్తూ బొబ్బూ, బప్పూలు పచ్చిమాంసమే పీక్కుతిని, పళ్ళు తిని జావతాగారు.
"గోమతీ, రామన్న లచ్చన్న అంటూ మనవైపు జాతకాలు చెప్పే కోయవాళ్ళు వస్తారు చూశావా! వాళ్ళవద్ద రకరకాల మూలికలు, ఆకులు వుంటాయి. కొన్ని చెట్ల ఆకులు ఖారంగా వుంటే మరికొన్ని ఆకులు పుల్లగా వుప్పగా వుంటాయి. వాళ్ళవద్ద చూశాను. వాళ్ళేం చెప్పారో తెలుసా? "మీలాగామాకు వస్తువులేంవుంటాయి అయ్యలారా! మాకు ప్రకృతి తల్లే అడివిచెట్ల ఆకుల్లో అన్ని రుచుల ఏర్పరిచింది. ఆకులు ఎండబెట్టి వుంచుకుంటాము. అవే వాడుతాము" అని కొన్నిరకాల ఆకులు తినటానికి ఇచ్చాడు. ఒకాకు మన పంచదార కన్నా తియ్యగా వుంది. ఇంకో ఆకు తింటే గొడ్డుకారం అలాంటి వాటితోనే ఇవి తయారు చేసివుంటారు" వివరంగా చెప్పింది కీర్తి.
పళ్ళు తిని మాంసం వదిలేశారు ఇద్దరూ.
బొబ్బూ, బప్పులు ఒకరి మొఖం ఒకరు చూసుకుని వాళ్ళ భాషలో ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత మరికొన్ని పళ్ళు జావ తెచ్చి ఇచ్చారు. మాంసం వారు తీసుకుని తిన్నారు.
అడవి జాతి వాళ్ళలో క్రూరులు, రాక్షసత్వం కలిగిన వారు, నరమాంస భక్షకులు, ఎన్నో రకాలుంటారు. వీళ్ళు అపకారం చేసే రకాలు కాదని కయ్యానికి కాలుదువ్వక తమని రక్షించుకోటానికి మాత్రమే జాగ్రత్తపడి ఆయుధాలు ఉపయోగిస్తారని కీర్తి గ్రహించింది.
ఆహారం తిన్న తరువాత వాళ్ళతోపాటు ఓ పక్కకి వెళ్ళారు. అక్కడ చిన్న చెరువుంది. దాని నిండా స్వచ్చంగా నీరుంది. నీరును చూస్తూనే కీర్తి గోమతి ముఖాలు వికసించాయి.
బొబ్బూ బప్పులు చేతులు పైకెత్తి నీతి దగ్గరకు వెళ్ళారు. ఆ పై కడుపునిండా నీరు త్రాగారు. కీర్తి గోమతి కూడా అలాగే చేశారు.
"గోమతి! వీళ్ళిలా చేతులు పైకి ఎత్తటంలో అర్ధం తెలుసా?" అంది కీర్తి చెరువు నుంచి తిరిగి వచ్చేటప్పుడు.
"నన్ను మరీ తెలివి తక్కువదాన్ని చేయవద్దు కమల్! మనం ఎలా పెద్దలకి దేముళ్ళకి భక్తి గౌరవాలతో నమస్కారం పెడతామో అలాగే వీరు గౌరవ సూచకంగా చేతులు పైకి ఎత్తుతారు" అంది గోమతి.
"గుడ్" అంటూ కీర్తి గోమతి బుగ్గపై చిటిక వేసింది.
గోమతి ముఖం అంతలోనే ఎర్రబడి వెంటనే నల్లబడింది.
తన వేషం గుర్తు కొచ్చిందికీర్తికి. "సారీ" అంది.
గోమతి మాట్లాడలేదు.
కీర్తి కాలుకి పసర్లు పూసి ఆకులు కప్పి కట్టారు.
ఆ సాయంత్రం లోపల కీర్తి, గోమతి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూసి చాలానే గ్రహించారు. "కొన్నాళ్ళు వారితో మంచిగా కల్సిపోక తప్పదు. ముందు కాలిగాయం నయం కావాలి అప్పుడే ఇక్కడి నుంచి తప్పించుకోటం చూడాలి. మార్గం తెలిస్తే కష్టమయినా వెళ్ళవచ్చు" అనుకున్నది కీర్తి.
"తామెక్కిన విమానం ప్రమాదానికి లోనయి, పేలిపోయింది. విమానాశ్రయం నుంచి సర్చ్ ప్లేన్ వెంటనే బైలుదేరే వుంటుంది. సరిగ్గా ఏ ప్రదేశంలో విమాన ప్రమాదం జరిగిందీ తెలియలేదా? విమానం దిగాతానిక్జి వీలులేని కీకారణ్య మయినా ప్రమాదం జరిగిన ప్లేస్ తెలిస్తే తప్పక దిగి గాలిస్తారు. సర్చ్ ప్లేన్ ఎందుకు రానట్లు! వచ్చి వెళ్ళిపోయిందా? వాళ్ళకి తప్పు సమాచారం అందిందా? అసలీ ప్రమాదంకూడా జరగాల్సి జరగలేదు. ఎవరో జరిపించారు. ఎందుకు? ఏమాసించి! ఈ విమానంలో బయలుదేరింది తను, తన వాళ్ళలో ఒకడైన ఆలీ అహమ్మదు తామిద్దరూ వెంటాడుతున్న ఇద్దరు అనుమానితులు, మిగిలిన తనవారు రూట్ మారారు. దుండగులు రూట్ మారారు. ఇదే విమానంలో దుండగులున్నట్లు తమకి గట్టిగా తెల్సు. ఇది దుండగులు వేసిన పధకం ప్రకారం ప్రమాదం అయితే వాళ్ళకి కూడా ప్రమాదమే కదా? తను వెన్నాడుతూ బైలు దేరింది వృద్దుల వేషంలో వున్న ఇద్దరిని. వాళ్ళు మరణించారో? బ్రతికి వున్నారో? దారి తెన్నూ లేకుండా కీర్తి ఆలోచనలు ఇలా సాగుతున్నాయి.
గోమతి మోకాళ్ళకి చేతులు బంధం వేసి కాళ్ళలో తలా దూర్చుకుని నెమ్మదిగా ఎక్కిళ్ళు పెడుతున్నది. తన వాళ్ళని తల్చుకుని తనున్న స్థితికి.
"ఏడుస్తున్నావా గోమతీ!" గోమతితలమీద చేయివేసి నిమురుతూ అడిగింది కీర్తి.
"ఇలాజరుగుతుందనుకోలేదు, మళ్ళీ మావాళ్ళను చూస్తానో లేదో నాకు చాలా భయంగా వుంది కమల్. ఈ మగవాళ్ళు నా వైపు అదో విధంగా చూస్తున్నారు" ఎక్కిళ్ళు పెడుతు చెప్పింది గోమతి.