నిజమే!
రాజా కుడి చెయ్యి ఫ్రీగా వుంది!
బేడీలు వదులుగా మోటార్ సైకిల్ పక్కన వున్న హుక్కుకి వేళ్ళాడుతున్నాయి.
అంటే....
ఈ లిటిల్ గాంగ్ స్టర్ సంకెళ్ళని వదిలించుకున్నాడన్నమాట.
బ్లడీ ఫెలో!
తీవ్రంగా అన్నాడు కృష్ణాజీ.
"చాలా హుషారీ చూపిస్తున్నావు నువ్వు! ఆఁ! మంచిది కాదు" అని మళ్ళీ సంకెళ్ళు వేయబోయాడు.
మోటార్ సైకిల్ దిగి, దూరంగా జరిగాడు రాజా.
"భోజనం చేశాక ఒకేసారి వెయ్యండి సర్!"
"భోజనమా? ఎక్కడ?"
ఎదురుగా కనబడుతున్న బార్ అండ్ రెస్టారెంట్ ని చూపించాడు రాజా.
"ఇక్కడ ఫుడ్ బాగుంటుంది!" అన్నాడు.
"రాజసానికేమి తక్కువ కాదు!" అనుకున్నాడు కృష్ణాజీ.
పైకి మాత్రం "నా దగ్గర అంత డబ్బు లేదు" అన్నాడు.
"నా దగ్గర వుంది" అని జేబులో నుంచి వంద రూపాయల నోటు తీసి చూపించాడు రాజా.
"ఆ వంద రూపాయల నోటు దొంగ సొత్తు!" అన్నాడు కృష్ణాజీ.
"ఏది? ఇదా?" అన్నాడు రాజా, గుప్పిట మూసి, మళ్ళీ తెరుస్తూ.
ఆశ్చర్యం!
ఇప్పుడతని చేతిలో వంద రూపాయల నోటు లేదు.
పది రూపాయల నోట్లు పది వున్నాయి.
"ఓరి పిడుగా!" అనుకున్నాడు కృష్ణాజీ.
వీడికి ఇంద్రజాలం కూడా వచ్చా ఏమిటి?
"మీ పోలీసు వాళ్ళు ఎట్లాంటి పురుగుల అన్నం పెడతారో, నాకు తెలుసు! అందుకని వెళ్ళేముందే చివరిసారిగా మంచి భోజనం చేస్తే బెటరు" అన్నాడు రాజా.
"వీడికి పోలీసులంటే బొత్తిగా భయం లేదు" అనుకున్నాడు కృష్ణాజీ.
చట్టాలు చిల్లుల జల్లెడ లాంటివి! చట్టాలని రక్షించవలసిన పోలీసులేమో నేరస్థులకే చుట్టాల్లాగా ప్రవర్తిస్తుంటారు.
ఈ లెక్కన వీడు పోలీసులకి లంచాలు ఇవ్వడమో, తన 'సంపాదన'లో భాగం ఇవ్వడమో చేస్తూ పోలీసు డిపార్టుమెంటుకి సన్నిహితంగా ఉంటూ ఉండి వుండాలి.
లాకప్ మరణాలూ, లాఠీ దెబ్బలూ ఇవన్నీ నేరం చేసిన వాళ్ళకు కాదు కదా!
పోలీసులతో పేచీ పెట్టుకున్న వాళ్ళకే ఆ గతి పట్టేది!
మహా అయితే పన్నెండేళ్ళుంటాయి వీడికి.
అప్పుడే పోలీసు డిపార్టుమెంటు లొసుగులన్నీ కనిపెట్టాడన్నమాట!
గుడ్! గుడ్! గుడ్!
"రండి బాస్!" అన్నాడు రాజా! ఇంకాస్త చనువు పెంచుకుంటూ.
లోపలికి వెళ్ళారు ఇద్దరూ.
పోలీస్ ఆఫీసర్ అయిన తనని చూడగానే హోటల్ స్టాఫ్ ఎంత భయభక్తులు ప్రదర్శించారో అంతకు మించిన ఆదరం రాజా మీద చూపించినట్లు అనిపించింది కృష్ణాజీకి. వచ్చినప్పుడల్లా బాగా టిప్పు ఇస్తుంటాడేమో! అందుకే ఈ స్పెషల్ ట్రీట్ మెంటు అయి ఉంటుంది. పైగా పోలీసులతో కలిసి వస్తున్నందుకు అక్కడ ఎవరూ రాజావైపు సానుభూతిగా చూడలేదు.
వాళ్ళకిలాంటి సీన్లన్నీ అలావాటే అయినట్లున్నాయి.
కృష్ణాజీతో బాటు అభివాదాలు అందుకుంటూ దర్జాగా బార్ లోకి నడిచాడు రాజా.
కృష్ణాజీ కూర్చున్నాడు.
"ఒన్ మినిట్!" అంటూ టాయిలెట్ లోకి వెళ్ళి రెండు నిమిషాల తర్వాత వచ్చాడు రాజా.
హాంకీతో చెయ్యి తుడుచుకుంటూ కూర్చున్నాడు.
స్టివార్డ్ వచ్చి పక్కన వినయంగా నిలబడ్డాడు.
"ఏం తీసుకుంటారు?" అన్నాడు తను కృష్ణాజీకి సమవయస్కుడూ సమానమయిన ఫాయిలో ఉన్నవాడూ అయినట్లు గొంతు పెట్టి.
ఛుర్రుమన్నట్లయ్యింది కృష్ణాజీకి.
సో!
దిస్ ఫెలో ఈజ్ ట్రయింగ్ టూ కరప్ట్ మీ.
తక్కిన ఆఫీసర్లకు ఇట్లాగే పార్టీలు ఇస్తూ ఉంటాడా వీడు.
రాజా అన్నాడు -
"కమాన్ సార్! ఫుడ్ తర్వాత ఆర్డర్ ఇవ్వొచ్చు! డ్రింక్స్ ముందు చెప్పండి! విస్కీనా, వైనా?"
ఇంక టాలరేట్ చెయ్యదలుచుకోలేదు కృష్ణాజీ.
స్టీవార్డ్ తో అన్నాడు -
"నాలుగు నాన్, రెండు మిక్స్ డ్ వెజెటబుల్ కర్రీ. నాకు కాఫీ, వీడికి పాలు."
తనకోసం కృష్ణాజీ పాలు ఆర్డర్ చేసినందుకు స్టివార్డ్ దగ్గర తన ఇమేజ్ పోయిందేమో అని భయపడుతున్నట్లు స్టివార్డ్ వేపు ఓరగా చూశాడు రాజా.
స్టివార్డ్ వింతగా రాజావైపు చూస్తున్నాడు.