Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 12


    "నేను మిల్క్ బేబీని కాను!" అన్నాడు రాజా బింకంగా.


    "అయితే కాఫీ తాగు!" అని స్టివార్డ్ వేపు తిరిగాడు కృష్ణాజీ. నాలుగు నాన్ కర్రీ, రెండు కాఫీ క్విక్!"


    కుర్చీలో చేరగిలబడి, కృష్ణాజీ వేపు పరీక్షగా చూశాడు రాజా.


    "మీ మాటేమిటో చెప్పండి" అన్నాడు.


    "మాటా? ఏం మాట?"


    నవ్వాడు రాజా.


    "ప్రతి మనిషికీ, ప్రతి పనికీ ఒక రేటు ఉంటుంది సార్! నన్నొదిలెయ్యడానికి మీరేం తీసుకుంటారు చెప్పండి."

    
    "షటప్!"


    "మొహమాట పడకండి! నా మామూలయితే పట్టుకున్నప్పుడల్లా వెయ్యి ఇస్తాను."


    కృష్ణాజీ పెదిమలు సరళరేఖలా బిగుసుకుపోయాయి.


    ది సర్వ్ ఆఫ్ దిస్ బ్రాట్....


    "పదిహేను వందల కంటే ఎక్కువయితే నాకు గిట్టుబాటు కాదు" అన్నాడు రాజా.


    ఇంక మెత్తమెత్తగా మాట్లాడి లాభం లేదని అర్థం అయ్యింది కృష్ణాజీకి.


    కరుగ్గా అన్నాడు -


    "ఇంకోసారి ఇట్లా వాగావంటే కీళ్ళూడదీస్తాను."


    చప్పున రాజా నోరు మూతబడింది.


    అంచనా వేస్తున్నట్లు చూశాడు కృష్ణాజీవేపు.


    తర్వాత నెమ్మదిగా అన్నాడు -


    "మీ సత్యనారాయణగారు నా ఫ్రెండే!"


    సత్యనారాయణగారంటే కృష్ణాజీ వాళ్ళ బాస్.


    ఆగ్రహాన్ని అణుచుకున్నాడు కృష్ణాజీ.


    "ఇది నీకు చివరి వార్నింగ్" అన్నాడు.


    తనకు తెలిసిన బ్రహ్మాస్త్రం కూడా పని చెయ్యకపోవడంతో డల్ గా అయిపొయింది రాజా మొహం.


    అయితే అదీ తాత్కాలికమే.


    రహస్యం చెబుతున్నట్లు ముందుకు వంగాడు రాజా చిన్న గొంతుతో అన్నాడు-


    "జాస్మిన్ తెలుసాండీ మీకు! ఆంగ్లో ఇండియన్ పోరి! చాలా హైక్లాస్! నా మనిషే" అన్నాడు అర్థవంతంగా.


    కృష్ణాజీ కళ్ళలో కనబడ్డ ఎర్రజీర రాజా నోరు మళ్ళీ మూత పడేటట్లు చేసింది.


    కానీ అతని నాలుక స్ప్రింగులాంటిది.


    కాసేపు తొక్కిపెట్టి ఉంచినా, పట్టు సడలించగానే మళ్ళీ పుంజుకుంటుంది.


    రాజాకి తెలుసు.


    ఏ రకమైన ప్రలోభానికీ కూడా లొంగని కొంతమంది కులగులకి మాత్రం గులాములై పోతారు.


    అందుకని ఒక పొడివేసి చూశాడు రాజా.


    "సార్! మీరు చౌదరీసా?"


    తన మనసులో వచ్చిన వయొలెంట్ రియాక్షన్ ని అతికష్టం మీద అణుచుకున్నాడు కృష్ణాజీ.


    రాజా అంటూనే ఉన్నాడు.


    "కాకపోతే మీరు రాజులయి ఉంటారండీ! మీ పర్సనాలిటీ అదీ చూసి అప్పుడే అనుకున్నా! క్షత్రియులంటే నాకు గొప్ప క్రేజ్ సార్!"


    కృష్ణాజీకి ఉవ్వెత్తున వచ్చిన కోపం అంత తొందరగానూ చప్పబడిపోయింది. కోపం స్థానంలో అదో రకమైన దిగులు చోటుచేసుకుంది.


    ఎంతగా డీజెనరేట్ అయిపోయింది ఈ జెనరేషను.


    తన చిన్నప్పుడయితే....


    అప్పటికింకా గాంధీగారి ఆదర్శాలూ, కందుకూరి, గురజాడ వంటి వారి సంస్కార భావాలూ ఇంకా జనం మనసులోనుంచి దూరం కాలేదు. ఈ లైసెన్స్ కోటా పర్మిట్ రాజ్యం తాలూకు దుష్టప్రభావం, ఓట్ల బ్యాంకుల రాజకీయాలూ అప్పటికింకా ఆదర్శాలని అవుటాఫ్ ఫేషన్ చెయ్యలేదు.


    అప్పట్లో ప్రతివాడికీ కూడా సొంత లాభం కొంత మానుకుని పదిమందికి పనికివచ్చే మంచి ఏదన్నా చెయ్యాలన్న తపన ఉండేది. కులం సంగతి మాట్లాడడం సభ్యత కాదనీ, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం లేదా కనీసం ప్రోత్సహించడం కర్తవ్యమనీ భావన ఉండేది.


    ఒక్క రెండు దశాబ్దాలలో ఎంత మార్పు.


    కులాలూ, మతాలూ అన్న భేద భావాలు రూపుమాపి, వసుధైక కుటుంబం అన్న దృక్పథం అలవరుచుకోవాలన్న ఆరాటం అడుగంటి పోయింది.


    కులాలూ, మతాలూ అంటూ కెలికి, కవ్వించి, పబ్బం గడుపుకోవడం చాలా మామూలయిపోయింది.


    నాయకులు ఈ విషవృక్షాన్ని పెంచి పెద్దచేశారు, ప్రోత్సహించారు.


    కులగజ్జి కాస్తా కాన్సరయ్యి కూర్చుంది ఇప్పుడు.


    ప్రజల మనసులు ఎంతగా పాడయిపోకపోతే, ఇవాళ ఈ పసివెధవ తన దగ్గర కులం గురించి మాట్లాడేటంత సాహసం చేస్తాడూ?


    ఛీ ఛీ ఛీ ఛీ!


    సీరియస్ గా ఉన్న కృష్ణాజీ మొహం చూసి, ఇంక మాట్లాడడానికి జంకాడు రాజా.

 Previous Page Next Page