Previous Page Next Page 
మరీచిక పేజి 10


    జాన్ కు గానీ, మేరీకిగానీ ఆమె అరుపు విన్పించలేదు. వాళ్ళు పూర్తిగా ఇంద్రియ జ్ఞానాన్ని కోల్పోయి వున్నారు. రాళ్ళలో రాళ్ళలా, చెట్ల మధ్య చెట్లలా వున్నారు. శబరి జుట్టు పీక్కోసాగింది. అయ్యో! ఇది స్వర్గం కాదు! ఇది నరకం ఊఁహూ అదీ కాదు! మరేమిటిది? సుఖం, దుఃఖం, బాధా, ఆనందం అన్నీ కలిసి వున్నాయి. శబరికి కళ్ళముందున్న ప్రతి వస్తువూ తనకంటే చిన్నదిగా కన్పించసాగింది. తను సినిమాలో చూసిన ఆంజనేయుడిలా నిముషం, నిముషం పెరిగిపోతున్నట్టు అనిపించసాగింది ఆమెకు.

 

    అరే! తన కాళ్ళూ చేతులూ ఇంత పెద్దవిగా వున్నాయేం? తన పాదం ఎవరి పాదంలాగో గుర్తుకు రావడంలేదు. ఆఁ గుర్తొచ్చింది. తనుచిన్నప్పుడు మాయాబజార్ సినిమా చూసింది. అందులో సావిత్రి పాదం రంగారావు పాదంగా మారింది. అలాగే తన పాదాలు చిన్ని చిన్ని పాదాలు పెద్దగా రంగారావు పాదాలకంటే కూడా పెద్దగా అయిపోతున్నాయి. అదిగో ఆ చెట్టుకంటే తనే ఎత్తుగా వుంది. చెయ్యి చాపి చిటారు కొమ్మన వున్న ఆకుల్ని కొస్తే? శబరి లేచి చెట్టు దగ్గిరకు పరుగు తీసింది. శబరికి తను పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తున్నట్టుగా అన్పిస్తోంది. చెట్టుకిందకు వెళ్ళి చేయి చాపింది. చెట్టుకొమ్మ అందలేదు. చెట్టు మొదలుకు ఆనుకుని కూలబడింది. తను పడిపోతూ వుంది. రెండుగా విడిపోతూ వుంది. తననుంచి విడిపోయి దూరంగా నిల్చున్న రూపం కూడా తనదే. కాని అది చాలా పెద్దగా రాక్షసిలా వుంది. అది పెద్ద శబరి.

 

    రెండోది చిన్న శబరి, నాజూగ్గా వుంది. చిన్నగా వుంది. సన్నగా వుంది. చెట్టుకు చేరబడి వుంది. కళ్ళు మూసుకొని వున్నది. తనకు తనే దూరంగా నిల్చుని చూస్తూ వున్నది. అంటే తను చచ్చిపోయిందా? తను చచ్చిపోయింది. ఆ ఎదురుగా నిల్చున్నది తన ప్రేతం! అంత పెద్ద శరీరం ప్రేతానికే ఉంటుంది. తెల్లగా కన్పిస్తున్నది. అవును తను చచ్చిపోయింది, రెండున్నర గంటలవరకు దాదాపు శబరి మానసిక స్థితి ఇలాగే ఉన్నది. క్రమంగా మత్తు వదిలిపోతున్నది. కాని పూర్తిగా దాని ప్రభావం నుంచి బయటపడలేదు. మందు ప్రభావం తగ్గుతున్న కొద్దీ శబరిలో మెంటల్ డిప్రెషన్ ప్రారంభమయింది. శరీరంలో నీరసం ప్రవేశించింది. అలసటగా ఉన్నది. మెదడంతా ఖాళీగా బోలుగా ఉన్నట్టు అన్పించసాగింది. గుండెల్ని ఏదో దిగులు చుట్టెయ్యసాగింది. శబరి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది.


                                     7


    రుక్మిణి ముస్తాబైంది. తెల్ల బెనారస్ చీర కట్టుకొని రవ్వల నగలు పెట్టుకున్నది. ఆరోజు జస్టిస్ రంగనాధం గారింట్లో పార్టీ వున్నది. ఆ పార్టీకి ఆదిత్య కూడా వస్తున్నాడు. శబరి ఇంకా ఇల్లు చేరలేదు. రుక్మిణిని కూతురి మీద కోపంగా వున్నది. సుడిగాలిలా భర్త ఆఫీసు గదిలోకి దూసుకొని వచ్చింది.

 

    "అయ్యో! రాత! మీరింకా ఆ టేబులు ముందు అలాగే కూర్చున్నారా? అందుకే పుణ్యంకొద్దీ పురుషుడూ, రాతకొద్దీ బిడ్డలూ అంటారు. అది ఇంతవరకు రాలేదు. త్వరగా వచ్చెయ్యమణి కూడా చెప్పాను."

 

    "లేస్తున్నాను. అమ్మాయి ఇంకా రాలేదా!"

 

    "దాని పద్ధతి బొత్తిగా బాగాలేదు. డిన్నర్ కు వెళ్ళాలనీ త్వరగా రమ్మనీ చెప్పాను. ఇంతవరకు రాలేదు!"

 

    "అవునూ అడగాలనుకుంటూనే ఉన్నాను, అమ్మాయిలో ఏదో మార్పు వచ్చింది కదూ?"

 

    "డబ్బు లెక్క పెట్టుకోవడం తప్పించి మరోటి పట్టని నువ్వు కూడా గమనించావన్న మాట! ఫర్వాలేదు!" వ్యంగ్యంగా అన్నది రుక్మిణి.

 

    "అమ్మాయికి త్వరగా పెళ్ళి చేసెయ్యడం మంచిదేమో?" తనకు తనే చెప్పుకుంటున్నట్టు అన్నాడు రంగారావు.

 

    "నా తాపత్రయం అదేగా! ఆదిత్యను ఎలాగయినా మన అల్లుణ్ణి చేసుకోవాలని నానా అవస్థలూ పడుతున్నాను. కాని ఏం లాభం? దానికి బొత్తిగా నా మాటంటే లక్ష్యం లేకుండా పోయింది. నువ్వేమో పట్టించుకోవు!"

 

    "పంచాంగం చదవడం మొదలెట్టావూ?"

 

    "నీ కలాగే వుంటుంది. ఆ జ్యోతి స్నేహం పట్టి ఇది మరీ చెడిపోతూ వుంది. ఆ జ్యోతివన్నీ పిదప మాటలూ, పిదప బుద్ధులే!"

 

    "ఆ పిల్ల మంచిదేననుకుంటా."

 

    "చెప్పావులే! అయ్యోరాత! పద వెళదాం! బేరీ ఇకరాదు." విసుక్కుంది రుక్మిణి.

 

    రంగారావు రుక్మిణి వెనకే బుద్ధిగా కిందకు దిగాడు. కారు పోర్టికోలో వుంది. డ్రైవర్ తృళ్ళిపడి, చేతిలోని బీడీ విసిరిపారేసి, పరిగెత్తు కొచ్చి, అమ్మగారు నిల్చున్న వైపు  డోర్ తెరిచి తల వంచుకుని, నిల్చున్నాడు. గేటు లోపలకు వస్తున్న రిక్షాకేసి చూస్తూ నిల్చుండిపోయింది. రంగారావు గబగబ రిక్షా దగ్గిరకు వెళ్ళాడు. రిక్షా ఆపి రిక్షావాడు దిగాడు. రిక్షాలో జారిపోతున్నట్టు అస్తవ్యస్తంగా కూర్చుని వుంది శబరి. రంగారావు ఓ క్షణం నివ్వెరపోయి చూస్తూ నిల్చున్నాడు.

 

    "అమ్మాయిగార్ని దించండి!" అన్నాడు రిక్షావాడు.

 

    "దించాలా? ఎవర్నీ?" తడబడుతూ అన్నది శబరి.

 

    "అమ్మా శబరీ! ఏమిటమ్మా ఇది?" రంగారావు శబరిని రెండు చేతులతో పట్టుకొని దించబోయాడు.

 

    "ఎవరు నువ్వు? నన్ను స్వర్గంలో నుంచి ఎందుకు కిందకు లాగుతున్నావూ?"

 

    శబరి చూస్తూనే వుంది. కాని ఆ కళ్ళలో గుర్తింపులేదు. రెప్పలు బరువుగా బలవంతంగా పైకి ఎత్తుతూ వున్నది.

 

    "అయ్యో! తల్లీ ఏమయిందే? ఈ రూపం ఏమిటి? ఈ బట్టలు ఏమిటి? ఇంత మురిగ్గా వున్నావ్ పడిపోయావా?" రుక్మిణి దాదాపు ఏడుస్తున్నట్టే అన్నది. శబరిని దించడంలో రంగారావుకు తోడ్పడింది. డ్రైవర్ సుబ్బయ్యకు విషయం అర్థం అయింది. వళ్ళంతా చెమటలు పట్టసాగింది. అసలు సంగతి తెలిస్తే రంగారావు తన ప్రాణాలు తీస్తాడు.

 

    "ఎవరు మీరు? నన్నెందుకు కిందకు లాగుతున్నారు? నేను రాను నన్ను స్వర్గంలోనే ఉండనివ్వండి! నరకంలోకి లాగకండి!" శబరి పెనుగులాడసాగింది.

 

    రుక్మిణి శబరిని పట్టుకుని లోపలకు నడిపించుకుపోయింది.

 

    "ఎక్కడినుంచి ఎక్కించుకొచ్చావ్?" రంగారావు రిక్షావాడిని ప్రశ్నించాడు.

 

    "ఊరిబయట చెరువుదగ్గిర చెట్టుకింద పడివున్నారు. నేను అటునుంచి వస్తున్నాను. ఎవరోనని దిగి చూశాను. అమ్మాయిగారు."

 

    "మా అమ్మాయి అని నీకెలా తెలిసింది?" అనుమానంగా చూస్తూ అడిగాడు రంగారావు.

 

    "అమ్మాయిగార్ని కాలేజీనుంచి చాలాసార్లు తీసుకొచ్చాను. లేవదీసి రిక్షాలో వేసుకొచ్చాను. నా డబ్బు లిప్పించండి! వెళ్ళిపోతాను!"

 

    "అక్కడ ఇంకెవరూ లేరా!"

 

    "నాకెవరూ కన్పించలేదు.

 

    రంగారావు రిక్షావాడికి డబ్బులిచ్చి పంపించి వేశాడు. జ్యోతి ఇంటికి వెళ్ళిన శబరి చెరువు దగ్గరకు ఎలా చేరింది?

 

    "అయ్యో! ఇంకా అక్కడే నిలుచున్నారేం? డాక్టర్ని పిలిపించండి." రుక్మిణి దాదాపు ఏడుస్తూ అన్నది.

 

    "ఎలా వుంది." లోపలకు వస్తూ అడిగాడు.

 

    "అన్నీ పిచ్చి మాటలే! పిచ్చి చూపులే! నేను అనుకుంటూనే వున్నాను... మీకు అర్థం కాలేదు కాని... అయ్యో నా బిడ్డకు పిచ్చెక్కింది."

 

    "ఛ! ఏం మాటలు? అరవకు? ఎవరైనా వింటారు!" అన్నాడు రంగారావు ఫోన్ దగ్గిరగా వస్తూ. డాక్టర్ కు ఫోన్ చేశాడు. కుర్చీలో కూలబడిపోయాడు. రుక్మిణి కూతురు దగ్గరకు వెళ్ళింది. రంగారావు జ్యోతి తండ్రి రమణమూర్తికి ఫోన్ చేశాడు.

 

    "హల్లో! మా అమ్మాయి మీ ఇంటినుంచి ఎప్పుడు బయలుదేరింది?

 

    ..........

 

    "ఏమిటీ! మీ ఇంటికి రాలేదా? మా డ్రైవర్ మీ ఇంటి దగ్గర దించి వచ్చానన్నాడే?"

 

    ..........

 

    "మీ అమ్మాయి ఇంతవరకూ ఇంటికి రాలేదా?"

 

    "ఆ ఏం లేదు లెండి! వుంటాను!" రంగారావు ఫోన్ పెట్టేశాడు. ఆలోచనలో పడ్డాడు. డాక్టర్ వచ్చాడు. శబరిని పరీక్షించాడు. అప్పటికి శబరి మత్తునుంచి కొంతవరకు బయటపడింది. "ఏమైందమ్మా?" పరీక్ష చేస్తూ అడిగాడు డాక్టర్.

 

    "ఏం కాలేదు అంకుల్! కళ్ళు తిరిగి పడిపోయాను" ముద్దముద్దగా మాట్లాడింది శబరి.

 

    "జబ్బేమీ లేదు. వేడిపాలు తాగించండి. తెల్లవారేసరికి మన లోకంలోకి వచ్చేస్తుంది!" అన్నాడు డాక్టర్ రంగారావుతో.

 Previous Page Next Page