Previous Page Next Page 
ప్లే పేజి 11


    "ఏంది ఓయ్... ఎక్కడకు తప్పించుకుంటావ్.... చాల్లేపద.... మాంచి ప్రోగ్రామ్ పెట్టుకుందాం..." ఆ మాటల్లోని వ్యంగ్యానికి, అందరూ నిషాగా నవ్వారు- కొంతమంది బల్లలు చరిచారు-ఉయ్ మని విజిల్స్ వేసారు.
    
    "నేన్నీ బావనా.... ఉడ్ బీనా.... ఏంటిది నాన్సెన్స్..." ఆ అమ్మాయి ప్రవర్తన నిజంగా చికాగ్గా ఉంది సూర్యవంశీకి.
    
    "బావో...బంగారుబాతో...ముందు రావయ్యా....వస్తావా రావా.....వీడెవడండీ బాబూ....మంచి ప్రోగ్రామ్ చూపిస్తానన్నా రాడు...." ఆ మాటకి జనం మళ్ళీ నవ్వారు.... విజిల్స్....చప్పట్లు మామూలే.
    
    "చూడు బావా.... నేను విజిలేసాననుకో.... ఎవడో ఒకడు క్యూలో కొచ్చేస్తాడు.... నేను ప్రోగ్రామ్ చూపించేస్తాను.... తర్వాత నీ యిష్టం వస్తావా.....వెళ్ళిపోమంటావా" బాటిల్లోని మిగతా వైన్ ని గడగడా తాగేసి, లేచి నిలబడింది ఆ అమ్మాయి.
    
    సూర్యవంశీకి కోపం నసాళానికంటింది.
    
    "సీ.... మిస్.... నువ్వు తెలివైనదానివని అర్ధమైంది కానీ.... రాంగ్ ఎడ్రస్ కొచ్చావ్....నేనెవరో నీకు తెలీదు..... నిన్నూ, నిన్నిలా తయారు చేసిన నీ బాబుని పునాదుల్తో లేపేస్తాను...." ఆమెకు మాత్రమే వినబడేటట్టుగా కోపంగా అన్నాడు సూర్యవంశి...
    
    సూర్యవంశి వేపు, ఓరకంట చూసి-
    
    "దేఖ్ లేంగే చూద్దాం.....నువ్వే నా దగ్గరకొస్తావు.... చూడు...." సూర్యవంశీ చేతిని వదిలేసి, మేనేజర్ దగ్గరికి నడిచి వందరూపాయల నోటుతీసి, గిరవాటేసి, అందరివేపూ చూసి రంగు రంగుల తుఫాన్లా, ఆ బార్ అండ్ రెస్టారెంట్ మెయిన్ డోర్ దగ్గరకొచ్చి-
    
    కొంటెగా ఒకసారి చూసి పరుగు పరుగున వెనక్కొచ్చి-
    
    సూర్యవంశీ కుడిబుగ్గమీద, చప్పుడు చేస్తూ, గట్టిగా ముద్దుపెట్టి....
    
    వెనుతిరిగి చూడకుండా, పరుగు పరుగున వెళ్ళిపోయింది.
    
    ఒక్కక్షణం అంతా దిగ్భ్రాంతి.
    
    మెరుపు, మెరిసి ఆరిపోయినట్టుగా అయిపోయింది బార్ లోని వాతావరణం...అందరూ సూర్యవంశీవేపు వింతగా చూస్తూ, రకరకాల కామెంట్స్ చేయసాగారు.
    
    సూర్యవంశీకి కూడా అంతా వింతగా, అద్భుతంగా ఉంది.
    
    ఆ అమ్మాయి మరోచోట, మరో సందర్భంలో తటస్థపడితే.....
    
    ఆ అమ్మాయి సన్ననికళ్ళు, హస్కీ నవ్వు, గ్రేస్, ఎట్రాక్షన్...పదినిమిషాలసేపు మనిషి కాలేకపోయాడు సూర్యవంశీ.
    
    ఆ అమ్మాయి గడిపిన కొన్ని నిమిషాలూ....గోవాలో, ఐలెండ్ మధ్య, నీళ్ళలో ఏకాంతంగా కూర్చున్నట్లుగా ఉంది.
    
    వెన్నెలరాత్రిలో, తాజ్ మహల్ ని చూస్తున్నట్టుగా ఉంది.
    
    రంగు రంగుల, రకరకాల సువాసనల్ని పీలుస్తూ పువ్వుల రెక్కల మీద నడుస్తున్నట్టుగా ఉంది.
    
    అద్భుత వెన్నెల స్వప్నంలోంచి, జలతారు జలపాతం మీద నుంచి, భువిమీదకు జారిపోయినట్లుగా ఉంది సూర్యవంశీ పరిస్థితి.
    
    వరసగా ఎన్ని, పెగ్గులు తాగాడో తెలీదు.
    
    ఎక్కే నిషాకన్నా, తమాషాగా, మధురంగా ఉంది ఆ అమ్మాయి జ్ఞాపకం-
    
    రెండు గంటల తర్వాత-
    
    బార్ లోంచి బైటకొచ్చాడు సూర్యవంశి అతన్ని అనుసరించాడు యాదగిరి.
    
    హీరో హోండాని పార్క్ చేసిన చెట్టువేపు నడిచాడు.
    
    అక్కడ హీరోహోండాలేదు....గబగబా ఫేంటు జేబుల్ని వెతికాడు.....
    
    ఎక్కడా తాళాలు కన్పించలేదు.
    
    ఎంత తాగినా, ఎక్కడ తాగినా, ఆ కీ చెయిన్ ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు సూర్యవంశి.
    
    ఏమయింది కీ చెయిన్.... ఆ చెయిన్లోనే హీరో హోండా కీతోపాటు, తన ఫ్లాట్ తాళాలు కూడా ఉన్నాయి.
    
    హీరో హోండా కూడా మాయమైంది.
    
    తన తాళాలు కనిపించక పోవడానికి కారణం ఏమిటో, హీరోహోండా ఎందుకు మాయమైపోయిందో-
    
    అర్ధం కావడానికి, సూర్యవంశీకి అయిదు నిమిషాలు పట్టింది.
    
    ఆ అమ్మాయి అందమైన రూపం, కళ్ళముందు కదలాడింది.
    
                                                          *    *    *    *    *
    
    బాగ్ లింగంపల్లి చౌరస్తాలో ఆటో దిగాడు సూర్యవంశీ రోడ్డు పక్కనున్న వైన్ షాపువేపు నడిచాడు. సూర్యవంశీని దూరం నుంచి చూడగానే, వైన్ షాపులోని వ్యక్తి, ఆఫ్ బాటిల్ విస్కీబాటిల్ ని తీసి, పేపర్లో చుట్టి, నవ్వుతూ సూర్యవంశీకి అందించాడు.
    
    సూర్యవంశీ డబ్బు చెల్లించి, తను అద్దెకుండే ఇంటివేపు నడవడం ప్రారంభించాడు.
    
    మైన్ గేట్ తెరుచుకుని, తన ఫ్లాట్ వైపు వెళ్తున్న సూర్యవంశీ పార్కింగ్ ప్లేసులో తన వెహికల్ హీరోహోండా కనబడడంతో ఆశ్చర్యంగా దానివేపు చూశాడు.
    
    ఊరు శివార్లలోని బార్ లో కనిపించిన, ఆ అమ్మాయి చటుక్కున గుర్తుకొచ్చింది.
    
    ఆ అమ్మాయికి తన ఇల్లు ఎలా తెలుసు?
    
    ఆలోచిస్తూనే మెట్లెక్కుతున్న సూర్యవంశీ, తనెదురుగా వస్తున్న మనిషిని చూసి తలెత్తాడు.
    
    హౌస్ ఓనర్ పరబ్రహ్మం.
    
    ఆ సమయంలో పరబ్రహ్మం కనబడ్డంతో, మనసులోనే చిరాకు పడ్డాడు సూర్యవంశీ. పరబ్రహ్మానికి అతను పెట్టిన పేరు జెలగబ్రహ్మం-జెలగలా ఒక పట్టాన, అతను మనిషిని వదలడు. అందులోనూ ముఖ్యంగా సూర్యవంశిని. సూర్యవంశీ కనిపిస్తే అతను వదలక పోవడానికి, అతను ఆడపిలల్ల తండ్రి కావడమే ప్రధాన కారణము. ఎలాగోలా అతను నలుగురు కూతుళ్ళలో, రెండో కూతుర్ని సూర్యవంశికి అంట గట్టాలని అతని తాపత్రయం. అందుకే పరబ్రహ్మం నుంచి సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు సూర్యవంశీ.
    
    "చూడు వంశీ, మనిషెప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి.... ఎందుకో తెలుసా?..." ప్రశ్నిస్తున్న పరబ్రహ్మం వేపు చికాకును కప్పి పుచ్చుకుంటూ చూసాడతను.

    "జవాబు ఇప్పుడే చెప్పమంటారా రేపు చెప్పమంటారా...." ఆయన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.
    
    "ఇప్పుడే చెప్పవయ్యా బాబూ..."
    
    "నాకు తెలీదు..." ఆయన్ని తప్పించుకొని మెట్లెక్కుతూ అన్నాడు సూర్యవంశి.
    
    "తెలీదంటే నేనూరుకోనయ్యా పోనీ.... ఇవి తెలుసా?" జేబులోంచి కీ చెయిన్ ని తీసి, అతని కళ్ళముందు ఆడిస్తూ అడిగాడు.
    
    కీ చెయిన్ - తన కీ చెయిన్ ఈ జలగబ్రహ్మానికి ఎలావచ్చింది?

 Previous Page Next Page