Previous Page Next Page 
ప్లే పేజి 12


    
    "ఈ కీ చెయిన్ నాకెవరిచ్చారో తెలుసా ఒకమ్మాయి.... ఆ హీరోహోండాని అక్కడెవరు పెట్టారో తెలుసా ఒకమ్మాయి.... రెండేళ్ళక్రితమే నీకు చెప్పాను ఏం చెప్పాను" సూటిగా సూర్యవంశీ కళ్ళలోకి చూస్తూ అడిగాడు జెలగబ్రహ్మం.
    
    "జ్ఞాపకంలేదు"
    
    "జ్ఞాపకం లేదంటే నేనూరుకుంటాననుకొన్నావా....మళ్ళీ చెప్తాను విను నా ఇంట్లో అద్దెకున్న నీ ఫ్లాట్ ఛాయలకి ఏ ఆడపిల్లా రాగూడదని, ఈ పరిసరాల్లో ఎక్కడా చీరలు, జాకెట్లు, లంగాలు ఇల్లాంటి ఎగిరే పదార్ధాలేవీ కనబడగూడదని కానీ ఆ రూల్స్ ని నువ్వు మరిచిపోతున్నావే....అవునా?" గంభీరంగా అడుగుతున్న అతని కోడిగుడ్డు ముఖాన్ని చూడగానే నవ్వొచ్చింది సూర్యవంశీకి.
    
    "అసలిప్పుడు ఏమైందండీ..."
    
    "ఏమైందని, అడుగుతావేంటయ్యా నీ రూమ్ కీస్ తీసుకుని, నీ బండిమీద టింగురంగాయని, ఓ అమ్మాయి వచ్చింది అవునా.... ఎవరా అమ్మాయి, ఆ అమ్మాయికీ నీకూ రిలేషన్ ఏంటీ ఎందుకొచ్చింది.... రేపు మళ్ళీ వస్తుందా వస్తే నేనూరుకోను అంతే... తీసుకో కీస్ మగవాడు ఆడపిల్లల్ని తన రూమ్ కి రప్పించుకోగూడదు. గుర్తుంచుకో అండర్ స్టాండ్"
    
    "అండర్ స్టాండ్ సర్... కానీ... మరి మీ అమ్మాయిలు నా రూమ్ కొస్తారు."
    
    జెలగబ్రహ్మం, సూర్యవంశీవేపు అయోమయంగా చూశాడు.
    
    "అంతేనయ్యా నీ రూమ్ కి, మా అమ్మాయిలే రావాలి....అంతే మరెవరూ రాగూడదు. గుర్తుంచుకో..." గబగబా చెప్పేసి, చకచకా మెట్లు దిగిపోయాడు జెలగబ్రహ్మం ఆయన బాధని అర్ధంచేసుకుని-
    
    ఆయన వెళుతున్నవేపు చూసి, నవ్వుకుంటూ పైకెక్కి డోర్ తెరుచుకొని లోనికి వెళ్ళాడు సూర్యవంశీ.
    
                                                 *    *    *    *
    
    చిన్న డ్రాయింగ్ రూమ్-ఎడ వేపు బెడ్ రూమ్-కుడిపక్క కిచెన్ వెనక బాత్ రూమ్...
    
    డ్రాయింగ్ రూమ్ లో అడుగుపెట్టిన సూర్యవంశీ ఒక్కక్షణం ఆశ్చర్యంగా నాలుగువేపులా చూసి విస్తుపోయాడు.
    
    ఎవరో పరాయివ్యక్తి రూమ్ లోకి వచ్చినట్టుగా ఉందతనికి చెల్లాచెదురుగా ఉండాల్సిన రూమ్ లోని వస్తువులు, నీటుగా సర్ది ఉన్నాయి. బుక్స్, పేపర్లు, దుస్తులు అన్నీ ఎక్కడ ఉండాల్సినవి అక్కడున్నాయి.
    
    చెత్తకుప్పలా ఉండే తన రూమ్ ని ఎవరు శుభ్రం చేసారు?
    
    సందేహంగా బెడ్ రూంలోకి నడిచాడు. కాట్ మీద బెడ్ షీట్, పిల్లోలు అందంగా అమర్చబడి ఉన్నాయి.
    
    పక్కనున్న టేబిల్ మీద రైటింగ్ పాడ్, టేబిల్ లైట్.... పెన్నులు టేబిల్ వాచ్ ఒక్కొక్క వస్తువువేపు, ఆశ్చర్యంగా చూస్తున్న సూర్యవంశీ చూపులు టేబిల్ మీదున్న టేప్ రికార్డర్ మీద పడ్డాయి.
    
    టేప్ రికార్డర్ ముందు, పేపర్ వెయిట్ కింద రెపరెపలాడుతూ ఓ తెల్ల కాగితం-
    
    ఆ కాగితాన్ని గబుక్కున చేతుల్లోకి తీసుకున్నాడు.
    
    ఆ కాగితమ్మీద గుండ్రటి అక్షరాలు.....
    
    "హల్లో ఫ్రెండ్స్ మనిషేకాదు. ఇల్లుకూడా అందంగా ఉండాలి. అందంగా ఉంచుకోవాలి నేనెవరో గుర్తుకొచ్చానా నన్ను మళ్ళీ చూడాలను కొంటున్నారు కదూ! నా పేరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ నా పేరు తెలుసుకోవడం చాలా ఈజీ మనిషి ఆలోచనల వెనక ఉండేది నేనే కనుక్కోండి చూద్దాం నన్ను మీరు చూడాలనుకుంటే రేపు సరిగ్గా అయిదు గంటలకి అబిడ్స్ పోస్టాఫీసుకు రండి మీరొస్తారని నాకు తెలుసు. సరిగ్గా అయిదు గంటలు ఏమాత్రం ఆలస్యం చేసినా నన్ను మీరు మిస్సవుతారు గుర్తుంచుకోండి. ఓకే.... సీయూ.... గుడ్ నైట్..."
    
    అందమైన,  ఆ చేతి వ్రాతను చూస్తూ, ఎంత సేపు గడిపాడో తెలీదు.
    
    కోలముఖం, పొడవాటి ముక్కు....ఆకుల్లాంటి కళ్ళు..... భుజాల మీద నుంచి గుండెల మీద పడుతున్న నీలపుకేశాలు.... మెడలో ముత్యాల దండ.....ఆరోగ్యంగా మెరుస్తున్న శరీరంలోంచి ఉబుకుతున్న అందాలు....
    
    రెస్టారెంట్లో మెరుపులా కన్పించిన, ఆ అమ్మాయి అతని కళ్ళముందు కదలాడుతోంది....
    
    ఆ హాంటింగ్ బ్యూటీ ఆలోచనలతో.....సూర్యవంశీ మనసంతా నిండిపోయింది.....నర నరంలో ప్రవహిస్తున్న మత్తు.
    
    వంటరితనం.... వంటరితనం.... హాన్లీనెస్.... ఆ హాన్లీనెస్ లోంచి, బయటకు ఉబుకుతున్న గతం చీకటి నీడలు...
    
    ప్రపంచానికి కనిపించే సూర్యవంశీ వేరు.... తనలో తను గంటల తరబడి, చీకట్లో మగ్గిపోయే సూర్యవంశీ వేరు...
    
    తన వంటరి ప్రపంచంలోకి, సూర్యవంశీ ఎవర్నీ అడుగు పెట్టనివ్వడు....
    
    ఏ జాలి స్పర్శనూ అతను దరిచేరనివ్వడు.
    
    గతమంతా బాధ.... కన్నీటి పుటలు.... వర్తమానం మీద వెగటు....రేపటిమీద కసి.... కసి.... కసి తనొక అనాధ.... తను ఎవరికి పుట్టాడో తన వాళ్ళెవరో తెలీదు.
    
    జీవితాన్ని ప్రేమించు... ప్రేమిస్తూ జీవించు.... జీవితం నిన్ను ప్రేమిస్తుంది.
    
    అలాంటి మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా.... పిచ్చివాడులా నవ్వు కుంటాడు సూర్యవంశి కసిగా నవ్వుకుంటాడు. అతడ్ని చదివించి, పెద్దచేసి, ఎస్.ఐ.జాబ్ ఇప్పించింది జగన్నాయకులుగారే - ఆ జాబ్ నచ్చలేదంటే ఓ పత్రికలో క్రైమ్ రిపోర్టర్ గా జాబ్ ఇప్పించిందీ జగన్నాయకులే అందుకే ఆయనకి తప్ప సూర్యవంశీ ఒంటరి ప్రపంచంలోకి ప్రవేశించే అధికారం మరెవరికీ ఇవ్వలేదు తను.
    
    రాత్రి టైమెంతయిందో తెలీదు.
    
    పవర్ ఎప్పుడు పోయిందో గుర్తుపట్టని స్థితిలో ఉన్నాడతను.
    
    అలా మత్తుగా గడిపే, ఎన్నో రాత్రులు లాగానే, అదొక రాత్రి.
    
    అతనికి తెలియకుండానే, అతని కళ్ళ మీదకు, నిద్ర నెమ్మదిగా పాక్కుంటూ వచ్చింది.
    
    అప్పటికి రాత్రి మూడు గంటలు దాటింది-అంత మత్తులోనూ, నిద్రలోనూ జగన్నాయకుల హత్యే అతన్ని కలవర పరుస్తోంది-తీవ్రమైన వేదనకు గురి చేస్తోంది.
    
                                                 *    *    *    *    *
    
    నాంపల్లి రైల్వేస్టేషన్.
    
    సమయం ఉదయం 5-40 నిమిషాలు- ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. చలికాలం కావడం వల్ల, ఫ్లాట్ ఫారంమ్మీద ఎక్కువ మంది ప్రయాణీకులు లేరు. అదే సమయంలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ స్పీకర్లోంచి ఓ ప్రకటన వెలువడింది.
    
    "వికారాబాద్ నుంచి వచ్చే, లోకల్ ట్రైన్, మరో అయిదు నిమిషాల్లో, నాలుగవ నెంబరు ఫ్లాట్ ఫారమ్మీద ఆ ప్రకటన ఏ మాత్రం సంచలనం సృష్టించలేదు.

 Previous Page Next Page